Others

అవయవ దానంపై అవగాహన ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ హాదానాల్లో ‘అవయవ దానం’ కూడా ఒకటి. ఇటీవలి కాలంలో అవయవ దానం చేసే వారి సంఖ్య పెరుగుతున్నా, మన దేశంలో ఈ విషయమై అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు చెబుతున్నారు. మరణానికి చేరువలో ఉన్న వ్యక్తుల (రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో ‘బ్రెయిన్ డెడ్’ అయినవారు) నుంచి అవయవాలు సేకరించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం ఉంది. చనిపోయినవారిని ఎలాగూ బతికించలేము గనుక వారిలోని ఆరోగ్యకర అవయవాలు- అనారోగ్యంతో ఉన్న ఇతరులకు ఆరోగ్యాల్ని చేకూరుస్తాయి. ఇది చెప్పడానికి బాగున్నా, అవయవ దానం చేసేందుకు చైతన్యం ఇంకా పెరగాలి. మంచి దృష్టితో ఆలోచిస్తే ‘పరోపకారం ఇదం శరీరం’ అన్నట్టుగా ఉంటుంది. అవయవ మార్పిడి అవసరమైన వ్యక్తుల కన్నా- అవయవ దాతలు చాలా తక్కువ సంఖ్యలో మన దేశంలో ఉన్నారు. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలో 70 శాతం వరకూ ప్రజలు అవయవ దానానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. స్పెయిన్‌లో 2011 నాటికి ప్రతి 10 లక్షల జనాభాకు 35 మంది అవయవ దాతలున్నారని తేలింది. అవయవ దానం పట్ల ఐరోపా దేశాల్లో ఉన్నంత అవగాహన ఆసియా దేశాలలో లేదు. ప్రపంచ జనాభాలో ఆసియన్ల సంఖ్య 60 శాతం వుంటే, అవయవ దానాల్లో ఆసియా వాటా 4 శాతం మాత్రమే. భారతదేశంలో 2012లో 196 మంది దాతల నుంచి 530 అవయవాలను సేకరించారు. 2012లో భారత్‌లో ప్రతి 10 లక్షలమందికి అవయవదాన రేటు కేవలం 01.6 మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
రహదారి ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి ఇక బతకరనుకునే వారికి కొన్ని పరీక్షలు జరిపి బ్రెయిన్ డెత్‌గా నిర్థారించిన తరువాత వారి నుంచి అవయవాలను సేకరిస్తారు. ఇందుకు మన దేశంలో అయితే సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులు అంగీకారం అవసరం. ఇక, రెండు మూత్రపిండాలూ పనిచేయని రోగికి రక్తమార్పిడి (డయాలసిస్) చేస్తుండాలి. అతను సాధారణ జీవితం గడపాలంటే అవయవ మార్పిడే పరిష్కారం. మనిషి ఒక మూత్ర పిండంతోనూ బతకవచ్చు. బాగా కావలసిన వారు, సమీప బంధువులు ఇలాంటి సమస్యతో బాధపడితే అవయవ దాతల నుంచి మూత్రపిండం సేకరించి ఆరోగ్యవంతులుగా చేయవచ్చు. మృత్యువు ఒడిలో ఉన్న వ్యక్తికి చెం దిన మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, క్లోమగ్రంధి, కళ్ళు, ఎముక మజ్జ, చర్మం వంటివి వేరొకరికి అమర్చవచ్చు. క్లోమం, చర్మం, ఎముక మజ్జ వంటివి మార్పిడి చేయడానికి ఎంతో నైపుణ్యం గల వైద్యులు అవసరం. ఇలాంటి చికిత్సలు పరిమితంగా జరుగుతున్నాయి. ‘బ్రెయిన్ డెడ్’ అయిన వ్యక్తినుంచి 10 అవయవాలు తీసి ఒకేసారి శస్త్ర చికిత్సలు చేయగల ప్రభుత్వాసుపత్రులు తక్కువగా ఉన్నాయి. అవయవ దానానికి అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెంచాలి.
1990 వరకు రక్తదానంపై ప్రజలలో అనేక అపోహలుండేవి. ప్ర భుత్వం, స్వచ్ఛంద సంస్థల కృషివల్ల రక్తదాన ఉద్యమం ఎంతగానో ఊపందుకుంది. ఎందరి ప్రాణాలనో నిలబడుతోంది. అలాగే అవయవ దానంపైనా చైతన్యం పెరగాలి. స్పెయిన్‌లో ‘బ్రెయిడ్ డెడ్’ అయినవారి నుంచి అవయవాలు సేకరించడానికి సంబంధిత కుటుంబీకుల అవసరం ఉండదు. అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. సింగపూర్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో అవయవ దానం ఆశాజనకంగా ఉంది. చైనాలో అయితే అవయవాలు కావలసిన వారికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించారు. ‘సేవ్ లైఫ్ టాట్ ఓఆర్‌జి’ పేరిట చైనాలో ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో స్వచ్ఛందంగా పేరు నమోదు చేసుకోవచ్చు. 2012లో అమెరికాలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో 10.9 కోట్లమంది అవయవ దాతలు నమోదయ్యారు. బ్రిటన్‌లో 2 కోట్లమంది వరకు నమోదయ్యారు. మన దేశంలో 2013 మే నెలలో అప్పటి యుపిఎ ప్రభుత్వం- ‘జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ’ను ఏర్పాటు చేయాలని భావించింది. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం దిల్లీలోని సప్థర్‌జంగ్ ఆసుపత్రిలో ఈ సంస్థను ఏర్పాటుచేసింది. దేశంలోనే ఇది మొదటిదని, దిల్లీలోని 24 అవయవ సేకరణ, మార్పిడి కేంద్రాలతో దీనిని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తామని కేంద్రం ప్రకటించింది. దిల్లీలో మరో నాలుగు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటుచేస్తానని ప్రభుత్వం ప్రకటించింది. తాము ప్రవేశపెట్టిన ‘సర్వజన ఆరోగ్య బీమా పథకం’లో అవయవ మార్పిడికి అవకాశం ఉందని, దీనికి తగినన్ని నిధులు కేటాయించనున్నట్లు మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడు ప్రభుత్వం అవయవ దానంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ ప్రాంతీయ అవయవ మార్పిడి సమన్వయ కేంద్రంగా తమిళనాడు పనిచేస్తోంది. సిటిఎ (కెడేవర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అథారిటీ)ను ఏర్పాటుచేసింది. మృతదేహాల నుంచి సకాలంలో అవయవాలు తీసి అవసరమైన వారికి మార్పిడి చేయడం ఇందులో ప్రధానాంశం. ఓ అంచనా ప్రకారం అవయవ మార్పిడిలో తమిళనాడు భారత్‌లోనే అగ్రగామిగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ, పంజాబులున్నాయి.
దేశవ్యాప్తంగా అధిక జనాభాతోపాటు రోడ్డుప్రమాదాలు పెరిగిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క 2013 సంవత్సరంలోనే 31,228మంది చనిపోయారు. ఇందులో సుమారు 800-900 మందిదాకా వెంటిలేటర్‌పై చికిత్స పొంది కొద్దిరోజుల తర్వాత చనిపోయారని అంచనా. ‘జీవన్‌దాన్’ రికార్డుల ప్రకారం 2013 జనవరి నుంచి ఆగస్టు 2014 వరకు మొత్తం 297 (మూత్రపిండాలు-123, కాలేయం - 60, గుండె-2, గుండె కవాటాలు - 62, కళ్లు-47, ఊపిరితిత్తులు - 3) అవయవ మార్పిడి శస్తచ్రికిత్సలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత జీవన్‌దాన్ శాఖను విజయవాడలో ఏర్పాటుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 81వేలమంది డయాలసిస్‌పై కాలం వెళ్ళబుచ్చుతున్నారు. దీర్ఘరోగాలు పెరిగి జీవనం దుర్భరమవుతుంది. అవయవదాన అవసరాలు పెరుగుతున్నాయి. కాని తగినంతగా చైతన్యం లేక అవసరమైన వారందరికీ అవయవాలు సమకూరలేకపోతున్నాయి. ‘బ్రెయిన్ డెడ్’ కేసుల్లో కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా సకాలంలో అవయవాలను సేకరించేందుకు నిబంధనలను సవరించాలి. ‘మరణానంతరం అవయవ దానాని’కి అభ్యంతరం లేదని ముందుగానే కొందరు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. నేత్రదానానికి సంసిద్ధత వ్యక్తం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, అవయవ దాతలు చనిపోయేముందు వరకు ఆరోగ్యవంతులై ఉండాలి. అంటే ఎయిడ్స్, ఇన్‌ఫెక్షన్లు, ఇతర వ్యాధులతో బాధపడేవారు అవయవ దానానికి పనికిరారు. అలాగే బాగా వయసు మీరి అవయవ సామర్థ్యం తగ్గినవాళ్లు ఇందుకు అనర్హులేనని చెప్పాలి.

-లోకనాధం సత్యానందం