ఈ వారం స్పెషల్

ఉద్దానంలో సికెడి ప్రాణాలు తోడేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన సముద్రతీరం..
చుట్టూ నిలువెత్తు కొబ్బరి తోటలు..
మధ్యమధ్యలో జీడిమామిడి వనాలు..
అక్కడక్కడ మొగలిపూల పరిమళాలు..
పనస,మామిడి తోపుల మధ్య..ఇసుకతినె్నలు..
ఇదంతా ఓ ఉద్యానవనం... ప్రకృతి సోయగాల మధ్య
అందంగా కనిపిస్తున్న ఆ ఉద్యానవనమే ‘ఉద్దానం’గా చెబుతారు..
అందమైన ఆ లోకంలో ఇప్పుడు విషాదం తెరకమ్మేసింది..
ప్రపంచంలో నాలుగైదు చోట్ల మాత్రమే సవాలు విసురుతున్న అరుదైన కిడ్నీ వ్యాధి ఈ ఉద్యానవనంలో ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. గ్రామాలకు గ్రామాల్లో కుటుంబాలకు కుటుంబాలు దీని బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే మృతుల సంఖ్య వేలల్లో ఉంది. రెండు దశాబ్దాల విషాదం ఇది. ఈ వ్యాధికి ఇదీ కారణమని తేల్చలేని స్థితి. వైద్యులు, సర్వేలు, పరీక్షలు, పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నా...అసలు కారణం అర్థం కావడం లేదు. ఓ అంచనా ప్రకారం ఉద్దానంలో గడచిన రెండు దశాబ్దాలలో ఇలా మరణించినవారి సంఖ్య 20వేలు. వందకు పైగా గ్రామాల్లో ఈ విషాదం ఇల్లుకట్టుకుంది. కాకపోతే ఇప్పుడు ఆ సమస్య తీవ్రతను ప్రభుత్వాలు అర్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటే భావి తరాలకు మాత్రం కాస్త ప్రయోజనం దక్కుతుంది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శ్రీలంక, ఒకటిరెండు ఆఫ్రికా దేశాల్లోను, మనదేశంలోని మహారాష్ట్ర, ఒడిశా, గోవా, ఏపీలోని ఉద్దానంలో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆనవాళ్లు కనిపించాయి. అయితే ప్రపంచంలో ఎక్కడా లేనంత తీవ్రత ఉద్దానంలో కనిపిస్తోంది. అదే విషాదం నింపుతోంది.
తొలిసారి బయటపడిన నిజం
అది 2004వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజికవర్గంలోని కవిటి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల మైదానంలో భారీ వైద్యశిబిరం నిర్వహించిన వేళ. మూత్రపిండాల వైద్య నిపుణుడు రవిరాజ్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అప్పుడు బయటపడింది అసలు విషయం. సగటున వారానికి ఇద్దరు చొప్పున మరణించడానికి మూత్రపిండాల వ్యాధే కారణమని. స్థానికంగా పేర్కొనే పునకవ్యాధి అసలు కారణం కాదని. ఆ శిబిరం.. తరువాత మరికొన్ని శిబిరాలు.. ఇలా పరీక్షలు నిర్వహించి కిడ్నీ రోగులను గుర్తించారు. అలా గుర్తించినవారిలో 99 శాతం మంది ఇప్పటికే మరణించారు.
వేలసంఖ్యలో బాధితులు
ఇప్పటివరకు పలు సందర్భాలలో ప్రభుత్వం నిర్వహించిన వైద్య శిబిరాలలో 96,396 మందికి పరీక్షలు జరిపారు. 15 వేలమందిని కిడ్నీ రోగులుగా గుర్తించారు. వీరిలో 9000 మంది మృత్యుముఖంలో ఉంటే అందులో 45 శాతం రోగులు కవిటి మండలానికి చెందిన బాధితులుగా ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది. 2007, 2008లలో ఢిల్లీ వైద్య బృందాలు, నిమ్స్ వైద్యనిపుణులు సర్వేలు నిర్వహించారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో అమెరికాకు చెందిన కిడ్నీ వ్యాధి నిర్థారణ బృందం వచ్చింది. 42 అంశాలపై 98 నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించింది. సంచివైద్యులు, తాగునీరు, పంటపొలాల్లో వాడే అత్యంత విషపూరితమైన పురుగు మందులు కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి కారణమని ఆ నివేదికల్లో పేర్కొన్నారు.
సిలికాన్ ధాతువులే కారణమా?
హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి 2009లో వచ్చిన నెఫ్రాలజీ ప్రొఫెసర్లు మాత్రం ఇక్కడి ప్రజలు వాడే ఆహారం, నీటిలో సిలికాన్ ధాతువులు అధికంగా ఉన్నాయన్న విషయాన్ని పసిగట్టారు. అయినా ఉద్దానంలోని ప్రజల ప్రాణాలు తీస్తున్న కిడ్నీ వ్యాధికి ఇదీ కారణమని ఇప్పటికీ ఎవరూ తేల్చలేకపోయారు. ఇక్కడ కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో, కచ్చితంగా ఫలానా కారణమని ఎవరూ నిర్ధారించలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం తేలిపోయింది. అనుకున్నదానికన్నా తీవ్రస్థాయిలో కిడ్నీవ్యాధి బాధితులు ఉన్నారని. క్రానిక్ కిడ్నీ డిసీజ్ లక్షణాలు ప్రమాదకరంగా, ప్రపంచంలో ఎక్కడా లేనంత స్థాయిలో ఉన్నాయని తేలిపోయింది.
పవన్ రాకతో మార్పు
ప్రభుత్వాలు ఉద్దానంపై ఉదాసీన వైఖరినే అవలంబించాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సమస్యపై దృష్టిపెట్టాక అటు ప్రభుత్వంలోను, ఇటు రాజకీయంగాను కదలిక వచ్చింది. పవన్‌కల్యాణ్ ఉద్దానం కిడ్నీ రోగులను
ఆదుకునేందుకు పర్యటించిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలికలు ప్రారంభమయ్యాయి. డయాలసిస్ సెంటర్లు తెరుచుకున్నాయి. రోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం రూ. 2,500 పింఛన్, బస్సుపాస్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంతవరకు మృత్యువుతో పోరాటం చేస్తున్న కిడ్నీ రోగులను కాపాడేముందు ఏ స్థాయిలో వ్యాధి ఉంది, ఎంతమంది రోగులు ఉన్నారన్నది తేల్చే సర్వేలు, పరీక్షలు చేయడంలో ఎనలేని జాప్యం జరిగింది. చివరకు డయాలసిస్, ఇతర పరీక్షలు నిర్వహించేందుకు కొన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక నిపుణుల సారధ్యంలో చికిత్స సౌకర్యం కల్పించింది.
పెళ్లిసంబంధాలకు ఆటంకం
ఒకవైపు మూత్రపిండాల వ్యాధి ప్రాణాలు తోడేస్తూంటే సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కిడ్నీ వ్యాధి ఎక్కువగా ఉన్న బొరివంక చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారి పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదరడం గగనమవుతోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నవారిలో మగ, ఆడపిల్లలను పెళ్లిచేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య.
ఇదీ మార్పు
పవన్ కల్యాణ్ పర్యటించిన తరువాత ప్రభుత్వం తరపున, అటు పవన్ పార్టీ తరపున వైద్యబృందాలు ఉద్దానంలో పర్యటించాయి. ముఖ్యంగా బొరివంక ప్రాంతంలో హార్వర్డ్ వైద్య బృందం పర్యటించింది. వ్యాధిపీడిత ప్రాంతాలకు సమీపంలోని పలాస, సోంపేట ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పలాస, వజ్రపుకొత్తూరు, సోంపేట మండలాల్లో ఆర్.వో.ఆర్. ప్లాంట్ల నిర్మించారు. ఈ నెలలో కొన్నింటిని ప్రారంభించనున్నారు. ఇవన్నీ వేగంగా అమరుతున్నా.. ఆ కేంద్రాలకు వెళ్లి వైద్యసేవలు పొందేలోగానే ఒకరి తరువాత ఒకరు కిడ్నీ రోగులు అలా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
నిరాశానిస్పృహలతో..
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పీడిస్తున్న కిడ్నీ వ్యాధి తీవ్రత ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. అయినా ఈ వ్యాధి నియంత్రణకు ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. వేలాదిమంది ఇప్పటికే క్రానికల్ కిడ్నీ డిసీజ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కుటుంబాలు వీధినపడ్డాయి. ఎందరో పిల్లలు అనాధలయ్యారు. సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయారు. మరికొందరు ఆస్తిపాస్తులను అమ్ముకుని గ్రామాలు వదులుతున్నారు.
ఇంటింటి సర్వే ఏదీ?
ఉద్దానం సమస్యపై పవన్ పర్యటన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమస్యపై దృష్టి సారించారు. బాధితులను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని రాజాంలో జన్మభూమి బహిరంగ సభలో భరోసా ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది జనవరి 19వ తేదీన ఆ ప్రాంతంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్దానంలోని ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలలో 114 గ్రామాలలో సర్వేకు ఆదేశించారు. తొలుత ఆరు బృందాలతో సర్వేకు నిర్ణయించారు. అయితే కాలయాపన జరిగే ప్రమాదం ఉందని భావించి బృందాల సంఖ్యను 15కు పెంచారు. ఏప్రిల్ 15వ తేదీనాటికి సర్వే పూర్తి చేసారు. అయితే ముందు ప్రకటించినట్లు ప్రతీ ఇంటికి వెళ్ళి రక్త శాంపిల్స్ తీసుకోలేదు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ఆ ప్రాంతంలో తన సిబ్బందితో కొద్దిరోజులు మకాం వేసారు. చివరకు క్షేత్రస్థాయికి వెళ్ళే సరికి ఒకే చోట వైద్య బృందం మకాం వేసి అక్కడకు వచ్చేవారికి రక్తపరీక్షలు నిర్వహించి సర్వేను ముగించారు. ఇలా ఆ ప్రాంతంలో లక్షమంది వరకూ ఈ పరీక్షలు చేసారు. అంటే దాదాపు 60 శాతం వరకు ఈ రక్తపరీక్షలను చేయగలిగారు. ఇంకా మిగిలిన 40 శాతం మందికి పరీక్షించడం సాధ్యపడలేదు. దీంతో సర్వేలోనే ప్రభుత్వ వైఫల్యం కన్పించింది.

ప్రభుత్వ చర్యలు ఇవీ
బాధితులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. సోంపేట, పలాస, పాలకొండ, టెక్కలితోపాటు శ్రీకాకుళం రిమ్స్‌లో డయాలసిస్ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్క సోంపేట మినహా మిగతా కేంద్రాలన్నీ కవిటి, బొరివంకలకు దూరంగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్న కిడ్నీ రోగుల పరిస్థితి దృష్ట్యా అంత దూరం ప్రయాణం సాధ్యం కాదు. అందువల్ల ఉద్దానంలోనే డయాలసిస్ చేసుకునేలా అధునాతనమైన వసతులతో డయాలసిస్ సెంటర్‌ను సోంపేటలో ఏర్పాటు చేసింది. కాని, అక్కడ కిడ్నీ రోగులతో వచ్చే సహాయకులకు మాత్రం ఉండే అవకాశం లేకుండా చేయడంతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్దానంలో జనవరి 17 నుంచి ఏప్రిల్ 15 వరకూ లక్షమందికి రక్తపరీక్షలు నిర్వహించారు. మొదట అందరికీ పరీక్షలు నిర్వహించాలని భావించినా చివరకు 30 సంవత్సరాలు పైబడినవారికే పరీక్షలు జరిపారు. పేదరికంతో బాధపడుతున్న ఇక్కడి కిడ్నీ రోగులు మందులు, పరీక్షలకు అయ్యే ఖర్చును భరించే స్థితిలో లేరు. ప్రభుత్వ చేస్తామన్న ఫించన్ సహాయం ఇంకా కార్యరూపంలోకి రాలేదు. అంతోఇంతో స్థోమత ఉన్నవారు దూరంగా ఉన్న వైజాగ్ లేదా ఒడిశాలోని బరంపురం వెళ్లాల్సి వస్తోంది. అది వారికి వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఈ స్థితిలో ప్రభుత్వం నుంచి సహాయం, ఇతర సేవలు త్వరితగతిన అందితేనే ప్రయోజనం కలుగుతుంది.
రోగం.. తీవ్రత
మూత్రపిండాల వ్యాధి తీవ్రత అంచనా వేయడానికి సీరం క్రియాటినైన్ పరీక్షలు నిర్వహిస్తారు. నిర్ణీత పరిమాణంగల రక్తంలో 1.2కన్నా క్రియాటినైన్ తక్కువగా ఉంటే కిడ్నీలు సురక్షితంగా ఉన్నట్టు లెక్క. కానీ ఉద్దానం ప్రాంతంలోని రోగులకు తాజాగా నిర్వహించిన వైద్యపరీక్షల్లో ఆ పరిమాణం 1.2 నుంచి 4 శాతం, కొందరికి అంతకు మించి ఉన్నట్లు తేలింది. దీనినిబట్టి పరిస్థితి ఎంత
తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో 18 శాతం నుంచి 30 శాతం వరకూ నమోదువుతున్నాయి. సీరం క్రియాటినైన్ పరిమాణం 5గా నమోదైన వారు 500 మందికిపైగా ఉన్నట్టు తాజా సర్వేలో తేలింది. వారిలో కిడ్నీలు ఇప్పటికే 80 శాతం పైన దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా తేలింది. ఇలాంటి వారిని తక్షణమే డయాలసిస్ కేంద్రాలకు తరలించాలని వైద్యులు భావిస్తున్నారు. సీరం క్రియాటినైన్ 3 కంటే తక్కువగా ఉన్న వారిని సోంపేట, పలాస, హరిపురం, కవిటి తదితర సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఇలా చేయాలి..
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అలాగే, కేంద్రం ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) బృందాన్ని వేసింది. ఈ రెండు కమిటీలు పర్యటించి స్పష్టమైన నివేదికలు అందజేశాయి. ఉద్దానం ప్రాంతంలో పరిస్థితులపై సుదీర్ఘమైన ప్రయోగాలు జరగాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. సీకెడీ (క్రానిక్ కిడ్నీ డిసీజ్) వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు పకడ్బందీగా నిర్వహించాలని, అక్కడ కిడ్నీ జబ్బులను నియంత్రించేందుకు వైద్యులు తదితర సిబ్బందిని బాగా పెంచాలని, కిడ్నీ వ్యాధులకు కారణమైన పర్యావరణ కారకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచనలు వచ్చాయి. అయితే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోను తాజాగా కిడ్నీ వ్యాధి బాధితులు ఎక్కువగా ఉన్నారన్న వార్త ఆందోళనకు కారణమైంది. ఆమదాలవలస, ఫరీదుపేట, చిలకపాలెం, పాలకొండ తదితర ప్రాంతాల్లోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండడంపై తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు అనుబంధంగా పరిశోధన కేంద్రాన్ని శ్రీకాకుళంలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (రిమ్స్)లో ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే విశాఖలో ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ విషయం
* ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఒక ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధులు సగటున ఏడు శాతం ఉంటే చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో ఇది 28 నుంచి 30 శాతం వరకూ ఉన్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి.
* ప్రపంచంలో కిడ్నీ వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్న నాలుగు ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటి. అంతర్జాతీయ వైద్య సదస్సులు ఈ అంశాన్ని గుర్తించాయి.
* ఇటీవల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన కిడ్నీ వ్యాధికి సంబంధించిన సీరం క్రియాటినిన్ స్థాయి పరీక్షలు పరిశీలిస్తే వైద్య నిపుణులే బెంబేలెత్తిపోతున్నారు. మందస మండలం లింబుగాంలో 33.8 శాతం, వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లిలో 20 శాతం, కంచిలి మండలం మఖరాంపురంలో 18.8 శాతం, ఇచ్చాపురం మండలం బూర్జపాడులో 8 శాతం, కవిటి మండలంలో నర్తుపుట్టుగలో 14 శాతం మంది ఈ వ్యాధులతో బాధపడుతున్న అంశాన్ని గుర్తించారు. ఉద్దానంలోని ఆరు మండలాల పరిధిలో 13 గ్రామాల్లో పరీక్షలు నిర్వహించగా ఆయా గ్రామాల్లో సగటున 14.8 శాతం మంది రోగులున్నారు. గీతం, ఎ.ఎం.సి సంస్థల అధ్యయనాలు దీనిని స్పష్టం చేశాయి.
* ఉద్దానంలోకిడ్నీ రోగాలతో మరణించిన వారి సంఖ్య 20 వేల పైమాటే.
* మరో 30వేలమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
* జిల్లాలో రిమ్స్, టెక్కలి, సోంపేటలలో మొత్తం 40 వరకూ డయాలసిస్ యూనిట్లు ఉన్నాయి. అవే జిల్లాకు ఆధారం.
* వజ్రపుకొత్తూరు, కంచిలి, మందస, సోంపేట, ఇచ్చాపురం, కవిటి, పలాస, నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, పొందూరు మండలాల్లో కిడ్నీవ్యాధి తీవ్రత ఎక్కువ.
* కిడ్నీ వ్యాధి తీవ్రతను గమనించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవిరాజ్ చొరవతో అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ, ఆంధ్రా మెడికల్ కళాశాల, గీతం యూనివర్సిటీ బృందాలు 2010లో పరిశోధనలు చేసి ‘ఉద్దానం నెఫ్రోపతి’ పేరిట ఒక నివేదిక ప్రభుత్వానికి అందజేశాయి. ఉద్దానంలో 28 శాతం ప్రజలు కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న అంశాన్ని గుర్తించారు. ఆరు మండలాల పరిధి 129 గ్రామాల్లో భూగర్భ జలాలు, రక్త నమూనాలు, మట్టి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరాన్ని సూచించారు.
* న్యూయార్క్ యూనివర్శిటీ బృందం, స్టోనీగ్రూప్ సంస్థలు కొంతమేర మాత్రమే పరిశోధనలు చేశారు. నిధుల కొరతతో 2011 తర్వాత ఇప్పటి వరకూ ఎటువంటి పరిశోధన జరగలేదు. తాజాగా సర్వే, పరీక్షలు నిర్వహించారు. విడతల్లో పరిశోధన నిర్వహించాల్సి ఉందని, దానికిగాను రూ. కోటి అవసరమని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇప్పటి వరకూ కదలిక లేదు.
* 2014లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఏడు సంస్థలు నిర్వహించిన పరిశోధనలు నిధుల కొరతతో అర్థంతరంగా నిలిచాయి. వీరి పరిశోధనల్లో నీటిలో సిలికాన్ సమస్య ఒక కారణంగా భావిస్తున్నా..అదీ ఖరారు కాలేదు.

ప్రత్యేక సేవలు అందిస్తున్నాం
ఉద్దానంలో 13 మండలాలకు చెందిన 176 గ్రామాల్లో కిడ్నీ బాధితులకు రక్తపరీక్షలు నిర్వహించడం జరిగింది. వీరిలో 13000 మంది రోగపీడితులుగా గుర్తించి వారికి ప్రత్యేక వైద్యసేవలు అందించేందుకు నిరంతరం వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. ఇటీవలే సోంపేటలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించడంతో పలాస, టెక్కలి, పాలకొండ, శ్రీకాకుళం డయాలసిస్ కేంద్రాల్లో కిడ్నీ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తూ, వారిలో రక్తహీనతకు తగిన మందులు ఆయా ప్రాంతాల్లో గల పి.హెచ్.ల నుంచి ఉచితంగా ఇస్తున్నాం.
- డాక్టర్ సనపల తిరుపతిరావు, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి.

ఉద్దానం అంటే...
పూలు, పండ్ల తోటలు, అక్కడక్కడ చక్కని పచ్చిక, ఇసుక తినె్నలు, సముద్రతీరం, ఎర్రని నేల ఒకవైపు.. లోయల్లాంటి దారులు, మెలితిరిగి వెళ్లే రహదారులు, తెల్లని ఇసుక మరోవైపు ఉన్న ప్రాంతం ఉద్యానవనంలా ఉంటుంది. కోనసీమ తరహా పచ్చదనం లేకపోయినా అందం మాత్రం దానికి సరిజోడుగానే ఉంటుంది. కొబ్బరి తోటల మధ్య చిన్నచిన్నపల్లెలు కొలువుదీరి ఉంటాయి. కొబ్బరికాయలు దించడం, పీచు తీయడం, తాళ్లు అల్లడం ప్రధాన వృత్తిగా పేదలు జీవిస్తారు. మంచినీటి సౌకర్యం తక్కువే. దుంపలు, చేపలు, వరి ప్రధాన ఆహారం. సుద్ద ఎక్కువగా ఉండే నీటిలో లవణాలు తక్కువే. బలహీనమైన ఎముకలు, రక్తహీనత అక్కడ ఎక్కువగా పీడించే వ్యాధులు. శ్రీకాకుళం జిల్లాలోని పనె్నండు మండలాలలతో ఉండే టెక్కలి డివిజన్‌లోని దాదాపు ఎనిమిది మండలాలను ఉద్దానంగా పిలుస్తారు. ముఖ్యంగా పలాస, వజ్రపుకొత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు. ఇందులో ఎక్కువ గ్రామాలు ఇప్పుడు కిడ్నీ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రధాన రహదారికి కవిటి మండలం సుదూరంగా ఉండటం వల్ల అక్కడి బాధితులకు ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఆ నాలుగు చోట్ల..
శరీరంలోని వృధా, విషపదార్థాలను వడకట్టి బయటకు పంపేసే కిడ్నీలు మనిషి మనుగడకు కీలకం. అలా వడపోసే కిడ్నీలు దెబ్బతిన్నదీ లేనిదీ తెలిపే పరీక్షలు ఉన్నాయి. మూత్రంలో ఎర్రరక్తకణాలు, రక్తంలో క్రియాటినైన్ పరిమాణాన్ని బట్టి కిడ్నీ పనితీరును అంచనావేస్తారు. గొమెర్యులర్ ఫిల్టర్ రేట్ (జిఎఫ్‌ఆర్), అల్బిమనురియా రేట్, క్రియాటినైన్ రేట్‌నుబట్టి కిడ్నీ వ్యాధి తీవ్రత తెలుస్తుంది. జిఎఫ్‌ఆర్ 90, క్రియాటినైన్ 1.2 ఉంటే సాధారణం. అంతకుమించితే సికెడి ఉన్నట్లే. ఉద్దానంలో ఉన్నత తీవ్రత మరెక్కడా లేదని హార్వర్డ్ వైద్య పరిశోధక బృందం తేల్చేసింది. మహారాష్టల్రోని బుల్‌ధానా-అంకోలా-అమరావతి ఉప్పునీటి ప్రాంతంలో ఖర్‌పాన్‌పట్ట వద్ద ఉద్దానం మాదిరిగానే సమస్య ఉంది. గోవాలోని దక్షిణ కొంకణ్‌లోను, ఒడిశాలోని కటక్ జిల్లా నర్సింగపూర్‌లోను ఇదేతరహా సమస్య ఉంది. ఇక్కడ ఒక్క ఏడాదిలో 75 మంది కిడ్నీవ్యాధితో మరణించారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే నిర్ణీత పరిమాణం కన్నా రక్తం, మూత్రంలో విషతుల్య పదార్థాలు ఎక్కువగా రావడం. అంటే కిడ్నీ వడపోత సరిగాలేక ఎర్ర రక్తకణాలుకూడా బయటకు వస్తాయి. వడపోత లేక రక్తంలోకి విషపదార్థాలు చేరిపోతాయి. కిడ్నీలు ఎక్కువగా దెబ్బతిని పనిచేసే సామర్థ్యం తగ్గిపోవడాన్ని సికెడిగా చెప్పొచ్చు. ఐదు దశల్లో ఇది తీవ్రమై కిడ్నీలు విఫలమవడం జరుగుతుంది.
*ఉద్దానంలో వేలాది మంది మృత్యువాత పడ్డారు. మరికొంతమంది ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు.
కుటుంబాలు సర్వనాశనమైపోయాయి. కిడ్నీ రోగం ఉందన్న భయంతో పెళ్లిసంబంధాలకు సొంతవారూ సిద్ధపడటం లేదు. ఆర్థికంగా చితికిపోయాం. ప్రభుత్వం ఆదుకోకపోతే మా పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకోవల్సిందే.
-అందాల సంగయ్య,
పెద్దలోహరిబంద, సోంపేట.
డయాలసిస్ చేయించుకునే రోగులకు సహాయంగా వచ్చేవారిని అనుమతించాలి. వారికి డయాలసిస్ సెంటర్ల వద్ద వసతి కల్పించాలి. డయాలసిస్ చేయించుకోవాల్సిన రోగులకు నెలవారీ పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి. ఉద్దానంలో రీసెర్చ్ సెంటర్ నెలకొల్పి వ్యాధి మూలాలను కనుగొని, అరికట్టే చర్యలు, ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టాలి.
- అత్తి వాసు,
కపాసుకుద్ది, కవిటి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల మందులను ఉచితంగా అందించాలి. అత్యాధునిక మెడికల్ లేబ్‌లను అవసరం. నెలవారీ పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఫలితాలు అందజేయాలి. వ్యాధిసోకిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పింఛన్ ఇవ్వాలి. అనాధలైన పిల్లలను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి వైద్యులు, సిబ్బందిని నియమించాలి.
- బత్తిన కృష్ణవేణి, జగతి,
కవిటి మండలం

లొద్దిగూడ..గడగడ
తెలంగాణలోని లొద్దిగూడలో కూడా క్రానిక్ కిడ్ని డిసీజ్ పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల గిరిజనులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కలుషితమైన నీటిని సేవించడం వల్లనో...మోతాదుకు మించిన నొప్పి నివారణ మందులు వేసుకోవడం కారణం చేతనో సిర్పూర్, లింగాపూర్, గాదిగుడ మండలాల్లోని పలు గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు మూత్ర పిండాల వ్యాధి బారిన పడి మృత్యువాతపడుతున్నారు. ప్రధానంగా కుమరం భీం జిల్లా లింగాపూర్ మండలంలోని లొద్దిగూడ గ్రామంలో ఈసమస్య మరింత తీవ్రంగా ఉంది. ఈ గ్రామంలోని ఏ కుటుంబాన్ని కదిలించినా కిడ్నీ మహమ్మారి మిగిల్చిన విషాదం గుండెను కుదిపేస్తుంది. రెండు దశాబ్దాలలో మూత్ర పిండాల వ్యాధి లక్షణాలతో ఏకంగా 60మందికి పైగా మృత్యువాత పడగా, వీరంతా కాళ్లు, మొహం వాపులు, తీవ్రమైన వెన్నునొప్పి బాధతోనే మంచానపడ్డట్లు గ్రామస్థుల పేర్కొన్నారు. గడచిన ఏడాదిలో ఎనిమిది మంది మరణించారు. ఏ వ్యాధిసోకినా సరైన వైద్య పరీక్షలంటూ చేయించుకోలేని ఇక్కడి గిరిజనులకు ఆర్‌ఎంపిల మోటు వైద్యమే దిక్కవుతోంది. దీనికి తోడు ఏ కాలంలోనైనా బోర్ బావి నీటినే సేవించాల్సిన దుస్థితి. ఇక్కడి నీటిలో సుద్ద శాతం అధికంగా ఉంది. అందువల్లే వీరంతా వ్యాధులపాలవుతున్నారు. 1993 నుండి అడపా దడపా సంభవిస్తున్న మరణాలు, 2010 తరువాత ఒక్క సారిగా పెరిగాయి. కుటుంబాలకు కుటుంబాలే మృత్యువాతన పడుతుండడంతో భయాందోళనలు చెందిన గ్రామస్థులు మూఢనమ్మకాలతో మకాంను మరోచోటికి మార్చారు. అయినప్పటికి ఈతరహా మరణాలు ఎంతమాత్రం తగ్గలేదు. అయినప్పటికి ఇక్కడి గిరిజనులను ఆదుకోవడంలో ప్రజాప్రతినిధులు, ఐటిడిఏ అధికారులు పెద్దగా స్పందించిన దాఖళాలు లేవనే చెప్పవచ్చు.
ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
కాళ్లు, చేతులవాపులు, విపరీతమైన నడుము నొప్పి లక్షణాలతో జాదవ్ మరుంబాయి అనే మహిళ కుటుంబంలోని ఐదుగురు మృత్యువాతన పడ్డారు. ఈమె భర్త జాదవ్ లక్ష్మ 2010లో కిడ్నీ వ్యాధి లక్షణాలతో మరణించగా, పెద్ద కొడుకు జాదవ్ బాబూరావు2011, చిన్నకొడుకు జాదవ్ గణేష్ 2012లో, రెండో కొడుకు జాదవ్ బాబూలాల్ 2013లో మరణించారు. ఈ కుటుంబంలో జీవించి ఉన్న ఒకే ఒక్క వృద్ధురాలైన జాదవ్ మరుంబాయి తీవ్ర అస్వస్థతతో మంచానికే పరిమితమయ్యారు. ఈమె రెండు కిడ్నీలు పాడైపోయి మృత్యువుతో పోరాడుతోంది. మరో కుటుంబానికి చెందిన సుభాష్ రాథోడ్, గోపాల్ రాథోడ్, ఓంకార్ రాథోడ్, ఆడె అమర్ సింగ్, ఆడె ప్రేంసింగ్, దూలాజీలు గత ఐదేళ్లలో మూత్ర పిండాల వ్యాధి లక్షణాలతో బాధపడుతూ మరణించారని గ్రామస్థులు తెలిపారు. ఈ ఏడాది కాలంలోనే ఖండూ రాథోడ్, దేవ్‌రావు, చవాన్ మీరాబాయి, ఆడె నీలాబాయి, ఓంకార్, దూలాజీ, చవాన్ బద్దు, రాథోడ్ నవితలు మృతి చెందడం గ్రామస్థులను మరింత భయాందోళనలోకి నెట్టింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతపై ఆందోళన పెల్లుబికిన నేపథ్యంలో లొద్దిగూడ సమస్య వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఈవారంలో ‘నిమ్స్’ నెఫ్రాలజిస్ట్, ఒఎస్‌డి గంగాధర్ నేతృత్వంలో ‘నిమ్స్’ నుండి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణులు సందీప్, రాంచందర్, అభిషేక్, వెంకటరాజు, డాక్టర్ విజేష్, ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రాథోడ్‌తోపాటు, కుమరం భీం జిల్లా డిఎంహెచ్ ఓ సుబ్బారాయుడు, ఊట్నూర్ అడిషనల్ డిఎంహెచ్‌ఓ కొమురం బాలు, ఆదిలాబాద్ రిమ్స్ వైద్య బృందం ప్రొఫెసర్ తానాజీ, ప్రణయ్, విషాలి, శే్వత లొద్దిగుడ గ్రామంలో కిడ్నీ లక్షణాలతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించారు. వ్యాధి గ్రస్థుల నుండి రక్తనమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అలాగే గ్రామస్థులు సేవిస్తున్న బోర్ బావి నీటి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం సేకరించారు. మొత్తం 47 మందిలో 19 మంది కిడ్నీ రోగులని తేలింది.

చస్తున్నా పట్టించుకోరు
ఒకే రకమైన వ్యాధితో రెండు దశాబ్దాలకు పైగా గ్రామంలో ఒక్కొక్కరూ చస్తూ ఉంటే ఏ ఒక్కరు పట్టించుకున్న దాఖలాలు లేవు. 1993లో వందకు పైగా కుటుంబాలు నివసించే ఊరిలో ఇప్పుడు కేవలం 47 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. ఇదే వ్యాధి లక్షణాలతో ఇప్పటి వరకు 60 మందికి పైగా మరణించారు. అయినప్పటికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏనాడు పట్టించుకోలేదు. అన్ని కాలాల్లోనూ బోర్‌నీటినే తాగుతున్నాము. సరైన వైద్యం అందడం లేదు.
గ్రామ పటేల్ మంగూలాల్... లొద్దిగూడ

కారణాలు ఇప్పుడే చెప్పలేం
లొద్దిగుడ గ్రామంలో సంభవిస్తున్న మరణాలకు కారణాలను ఇప్పుడే చెప్పలేము. లొద్దిగుడ, గాదిగుడ లోని కూనికాకలోనూ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాము. మూత్రపిండాల వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి నుండి రక్తనమూనాలు సేకరించడంతోపాటు, ఇప్పటి వరకు 52మందికి స్కానింగ్ చేశాము. అయితే పూర్తి రిపోర్టులు అందాకే వీరి అనారోగ్యానికి కారణాలు ఏమనేది తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతి చిన్న రోగానికి ఆర్‌ఎంపిలు ఇచ్చే జెంటమైసిన్, డైక్లోఫిన్ సోడియం లాంటి నొప్పినివారణ మందుల ప్రభావం కిడ్నీలపై చూపే అవకాశం ఉంది. లేదా నీటిలో అధికంగా ఉన్న సుద్దతోనూ ఇలాంటి తరహా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారి కోసం ప్రత్యేక వైద్యం అందిస్తాము.
గంగాధర్, నిమ్స్ ఓఎస్‌డి ప్రొఫెసర్
*బొరివంక.. నెలవంక
ఉద్దానంలో ఎక్కువమంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రాంతాలలో బొరివంక చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ వచ్చి వెళ్లిన తరువాత అందరి దృష్టి బొరివంకపై పడింది. కవిటి నుంచి సోంపేట వెళ్లే మార్గంలో ఉన్న ఈ గ్రామ జనాభా 23వేలు. ఇక్కడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిథిలోని ముత్యాలపేట, బి.గొణపపుట్టుగ, జగతి, వరక, బెజ్జిపుట్టుగ, కుసుంపురం, పెద్దబల్లిపుట్టుగ వంటి గ్రామాల్లో 3229 మందికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు తాజా పరీక్షల్లో తేలింది. 1.3కన్నా ఎక్కువ సీరం క్రియాటినైన్ ఉన్నవారిని రోగులుగా గుర్తించారు. తీరంలోని మత్స్యకార గ్రామాలు, జాతీయ రహదారికి అవతలివైపు ఉన్నవారితో పోలిస్తే బొరివంక చుట్టుపక్కల వారే ఎక్కువగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. హార్వర్డ్ బృందం కూడా ఇదే తేల్చింది. కిడ్నీ వ్యాధుల పరిశోధక కేంద్రాన్ని ఇక్కడే నెలకొల్పి, మూడేళ్లపాటు క్రమపద్ధతిలో పరీక్షలు నిర్వహించి పరిశీలిస్తే తప్ప సమస్యకు అసలు కారణం తెలీదన్నది వారి మాట. ఉద్దానంలో కవిటి మండలం తరువాత వజ్రపుకొత్తూరులో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. పవన్ వచ్చిన తరువాత ప్రభుత్వం స్పందించిందని, అంతోఇంతో సహాయం అందుతోందని స్థానికుల విశ్వాసం. పవన్ పోరాటం కొనసాగిస్తేనే తదుపరి ప్రయోజనాలు త్వరితగతిన అందుతాయన్నది వారి మాట. ప్రస్తుతం రాజకీయ నాయకులు, వైద్యసిబ్బంది, వైద్య నిపుణులు, పరిశోధక బృందాలు బొరివంకకు వచ్చివెళుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి బొరివంకపై పడింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోని కిడ్నీ వ్యాధి పీడితులకు బొరివంక ఓ నెలవంకలా కనిపిస్తోంది.

-ఉరిటి శ్రీనివాస్ (శ్రీకాకుళం) -ఇన్‌పుట్:ఎల్.దీనబంధు (కవిటి), వి.గిరీశ్‌కుమార్ (ఆసిఫాబాద్)