AADIVAVRAM - Others

పైలెట్ అయిన ఆటోడ్రైవర్ (లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దృఢతర దీక్ష, పట్టుదల, కష్టపడే నైజం ఉంటే కలలను సాకారం చేసుకోవడం ఏమంత కష్టం కాదు. వీటన్నింటికీ కొంచెం అదృష్టం తోడైతే ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ఎవరికైనా సాధ్యమే. సరిగ్గా దీనినే చేసి చూపించాడు నాగ్‌పూర్‌కి చెందిన శ్రీకాంత్ పంత్‌వానే. అతి సాధారణమైన సెక్యూరిటీ గార్డ్ కొడుకైన శ్రీకాంత్‌కి చిన్నతనం నుండి విమానాలంటే ఇష్టం. ఎంత ఇష్టమంటే తాను ఎప్పటికైనా విమానాలు నడపాలని కలలు కంటుండేవాడు. అయితే విమానాలు నడపడం కాదు కదా... కనీసం విమానం చూసేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఎంట్రన్స్ టిక్కెట్ కొనుక్కునే స్థోమత కూడా అతనికి లేదు. పదవ తరగతి పూర్తయినా ఇక పైకి చదివించే స్థోమత తండ్రికి లేకపోవడంతో కుటుంబాన్ని ఆదుకోవడానికి అతను పార్శిల్‌బాయ్‌గా మారాల్సి వచ్చింది. తండ్రి సంపాదించే కొద్దిపాటి మొత్తం ఇంటి అవసరాలకు సరిపోకపోవడంతో అతను పార్శిల్‌బాయ్ ఉద్యోగం వదిలేసి ఆటో నడపడం మొదలుపెట్టాడు.
పైలెట్ కావాలనుకున్న శ్రీకాంత్ దుర్భర పరిస్థితుల వల్ల ఆటో నడపాల్సి వచ్చింది. అయినప్పటికీ అతను అధైర్యపడలేదు. అతనిలోని ఆశ చావలేదు. ఆటో నడుపుతూ, ఖాళీ ఉన్నప్పుడు రివ్వున ఆకాశంలో ఎగురుతూ వెళ్లే విమానాలను ఆశగా చూస్తుండేవాడు.
అలా రోజులు గడుస్తుండగా ఒకసారి అతనికి ఎయిర్‌పోర్టు సవారీకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఎయిర్‌పోర్ట్ బయట టీ అమ్మే వ్యక్తితో మాట కలిసింది. శ్రీకాంత్ ఆసక్తి గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి పైలెట్ కావాలంటే ఏం చేయాలో చెప్పాడు. మంచి ఉత్తీర్ణతా శాతంతో ఇంటర్ పూర్తయిన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కి దరఖాస్తు చేసుకుంటే పైలెట్ శిక్షణకు సీటు వస్తుందని తెలుసుకున్నాడు. అంతే... అతని ఉత్సాహం కదం తొక్కింది. ఒకపక్క ఆటో నడుపుతూనే స్నేహితుల ద్వారా పుస్తకాలు సేకరించాడు. ఆ సమయంలో అతను ఎంత కష్టపడ్డాడంటే తిండి, నిద్రని కూడా ఖాతరు చేయలేదు. పగలల్లా ఆటో నడిపి ఆ వచ్చిన డబ్బుని ఇంట్లో ఇచ్చి, రాత్రిళ్లు పట్టువదలని విక్రమార్కుడిలా చదివేవాడు. చివరికి ఇంటర్ మంచి శాతంతో పాసై పైలెట్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి మధ్యప్రదేశ్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి పైలెట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కి ఆహ్వానం అందింది. కష్టమే అయినా ఇంట్లో వారి సహకారంతో ఆ కోర్సులో చేరాడు. సరిగ్గా అప్పుడే అతనికి మరో సమస్య ఎదురయింది. పైలెట్ కావాలంటే తొలుత ఇంగ్లీషు బాగా రావాలి. దీనిని కూడా అతను కష్టంతో అధిగమించాడు. స్నేహితుల సహకారం, గంటలకి గంటలు అధ్యయనం ద్వారా ఆంగ్ల భాషపై కూడా పట్టు సాధించాడు. చివరికి పైలెట్ పరీక్షలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణుడై కమర్షియల్ పైలెట్ లైసెన్స్‌ను సంపాదించాడు. అయితే పైలెట్ శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగం రాదు కాబట్టి నాగ్‌పూర్‌లోనే ఒక ప్రైవేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. అలా రోజులు గడుస్తుండగా ఇటీవల అతనికి ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సంస్థ నుండి పిలుపొచ్చింది. శ్రీకాంత్ కల సాకారమయ్యే రోజు రానే వచ్చింది. అతన్ని ఫస్ట్ ఆఫీసర్ (సెకండ్ పైలెట్ లేదా కోపైలెట్‌గా) ఎంపిక చేశారు. ఈ విధంగా ఆటో నడిపిన ఒక యువకుడు తాను కలలు కన్న విమానాన్ని నడిపే స్థాయికి చేరుకోవడం ద్వారా చిత్తశుద్ధితో కష్టపడితే సాధ్యం కానిదేదీ లేదని నేటి తరానికి స్పష్టంగా చాటి చెప్పాడు.

- దుర్గాప్రసాద్ సర్కార్