Others

ఈ పాటలు పాఠాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్ర సాధనకు ముందొచ్చిన తెలుగు సినిమాలు తక్కువ. అయినా వాటిలో దేశభక్తి గీతాల రాశి ఎక్కువ. స్వాతంత్య్ర నేపథ్యం పూర్తి కథాంశంగా తెలుగులో వచ్చిన చిత్రం ‘మనదేశం’ ఒక్కటేనేమో. అందులో స్వాతంత్య్ర సాధన కోసం ఊరేగింపుగా వెళ్లే గీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. తరువాత సాంఘిక చిత్రాల కథా వస్తువుతో సినిమాలు ఎక్కువయ్యాయి. అయినా నిర్మాతల అభిరుచి మేరకు సాతంత్రోద్యమ నేతలు, సంఘ సంస్కర్తలు, దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే గీతాలను పొందుపర్చేవారు. తరువాత సైనికుల గొప్పదనాన్ని, దేశ ప్రగతిని చాటే గీతాలు సినిమాల్లో చోటుచేసుకున్నాయి. అనంతర పరిణామాల్లో స్వతంత్య్ర ఫలాలకు భంగం కలిగించిన పరిస్థితులు, వీరుల పేరు చెప్పుకుని అధికారం అందుకున్నా.. వారి బోధలను పట్టంచుకోని నేటి నేతల్ని హెచ్చరిస్తూ ఆలోచనాత్మక గీతాలొచ్చాయి. 1980ల తరువాత దాదాపుగా దేశ భక్తి, ప్రబోధాత్మక గీతం కరవైపోయింది. అడపాదడపా ఒకట్రెండ్ చిత్రాల్లో వినా, ఆ ఒరవడినే పరిశ్రమ వెనక్కి నెట్టేసింది. 1970వ దశకం వరకూ సినిమాల్లోని దేశభక్తి, ప్రబోధ గీతాలను ఆకాశవాణి కేంద్రాలు ఆగస్టు 15, జనవరి 26తోపాటు అవకాశం ఉన్నంతవరకు తరచూ ప్రసారం చేసేవి. ఆ గీతాలు ప్రేక్షక హృదిలో నిలిచి వీరుల త్యాగాలను స్మరించుకునేవాళ్లం. క్రమేపీ ఆకాశవాణి ప్రసారాలను టీవీ వినోద చానళ్లు ఆక్రమించటంతో ఇక్కడా దేశభక్తి, ప్రభోదాత్మక గీతాలకు చోటులేకుండా పోయింది. దేశభక్తిని గుర్తు చేసుకుందాం అంటూ ఉద్యమాలు చేపట్టాల్సిన దుస్థితికి వచ్చేశాం. ఇది అత్యంత బాధాకరం. వినేకొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపించే, చైతన్య ఊపిరులూదే కొన్ని గీతాలను ఇక్కడ స్మరించుకుందాం.
దేశభక్తి అనగానే -ప్రేక్షకుల మదిలో ఠక్కున గుర్తుకొచ్చే గీతం -్భరత మాతకు జేజేలు/ బంగరు భూమికి జేజేలు’. 1972లో ఎన్టీఆర్, అంజలి ప్రధాన పాత్రలతో వచ్చిన ‘బడిపంతులు’ చిత్రం కోసం ఆత్రేయ రాసిన గీతమిది. -త్రివేణి సంగమ పవిత్ర భూమి/ నాల్గు వేదములు పుట్టిన భూమి/ గీతామృతమును పంచిన భూమి/ పంచశీల బోధించిన భూమి.. సహజీవనము సమభావనమూ సమతా వాదము వేదముగా/ ప్రజా క్షేమము ప్రగతి మార్గమూ లక్ష్యములైన విలక్షణ భూమి’ అంటూ దేశ ఔన్నత్యాన్ని ఆత్రేయ కలం అద్భుతంగా ఆవిష్కరించింది.
1969లో విడుదలైన ‘సిపాయి చిన్నయ్య’ చిత్రం కోసం ఆరుద్ర రచించిన -నా జన్మ భూమి ఎంత అందమైన దేశము/ నా ఇల్లు అందులోనా కమ్మని ప్రదేశమూ’ పాటను గుర్తు చేసుకోవాలి. ‘నడిచే దారిలో నవ్వే పువ్వులు/ శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు/ పచ్చనీ పంటలు వెచ్చనీ జంటలు/ చల్లనీ జీవితం -ఇదే నవభారతం’ అంటూ దేశ సౌభాగ్యాన్ని ప్రభోదాత్మకంగా వెల్లడించారు.
1973లో రామకృష్ణ హీరోగా వచ్చిన ‘నేనూ నా దేశం’ చిత్రం కోసం అంకిశ్రీ రాసిన గీతాన్ని గుర్తు చేసుకోవాలి. -నేనూ నా దేశం/ పవిత్ర భారత దేశం’ అంటూ సాగే పాటలో జాతినేతల గొప్పదనాన్ని చక్కగా వివరించారు. -‘అశోకుడేలిన ధర్మప్రదేశం/ బుద్ధుడు వెలిసిన శాంతిదేశం/ కులమత భేదం మాపిన త్యాగి/ అమర బాపూజీ పుట్టిన దేశం’ అంటూ వెనుక బృందంచే ‘వందేమాతరం’ వినిపించటం ఓ అద్భుతం.
1964లో ఎన్టీఆర్, దేవిక ప్రధాన పాత్రలతో వచ్చిన ‘దేశద్రోహులు’ చిత్రంలో మల్లాది రామకృష్ణశాస్ర్తీ, ఆరుద్ర సంయుక్తంగా రచించిన గీతాన్ని ఎప్పటికీ మరువలేం. -‘నవ స్వతంత్ర భారతం/ మహామహుల త్యాగఫలం/ మాన ధనుల శౌర్యఫలం/ నవ స్వతంత్ర భారతం’ అన్న పల్లవితో వినిపించే పాట నిలువెల్లా దేశభక్తిని రగిలిస్తుంది.
1974లో కృష్ణ నిర్మించి నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా కోసం మహాకవి శ్రీశ్రీ చైతన్య ఊపిరులూదే గీతాన్ని అందించారు. -‘తెలుగు వీర లేవరా/ దీక్షబూని సాగరా/ దేశమాత స్వేచ్ఛకోరి/ తిరుగుబాటు చేయరా’ అన్న పిలుపు తొలిసారి జాతీయ స్థాయి ఉత్తమ గీతమైంది. తెలుగువాడైన అల్లూరి భావజాలాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది శ్రీశ్రీ కలం. ఇదే చిత్రంలో ఆరుద్ర రచించిన -‘కదిలింది విప్లవాగ్ని ఈరోజు/ ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు’ అంటూ ప్రారంభమైన గీతం పోరాటయోధులు ఝాన్సీరాణి, కనె్నగంటి హనుమంతులను గుర్తు చేస్తుంది. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని కళ్లకు కడుతుంది.
1993లో చాలాకాలం తరువాత ఎన్టీఆర్ నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రం కోసం జాలాది రాసిన ‘జన్మభూమి నా దేశం నమో నమామి’ గీతం మన చెవుల్లో ఎప్పటికీ రింగుమంటూనే ఉంటుంది. స్వాతంత్య్ర సమరయోధుల శౌర్యాన్ని చాటిచెప్పిన గీతమిది.
అక్కినేని, జమున నటించిన ‘దొంగరాముడు’ సినిమా కోసం జూనియర్ సముద్రాల అందించిన గీతం -‘్భలే తాత మన బాపూజీ/ బాలల తాత బాపూజీ’. జాతిపిత గాంధీపై వచ్చిన గీతమిది.
1971లో విజయనిర్మల, శోభన్‌బాబు, రోజారమణి నటించిన ‘విచిత్ర దాంపత్యం’ చిత్రం కోసం సి నారాయణరెడ్డి రాసిన ‘పండిత నెహ్రూ పుట్టిన రోజు/ బాలలందరికీ పుట్టినరోజు, మమతా సమతా పుట్టిన రోజు’ అంటూ బాలలను అలరించే రీతిలో వారి గొప్పదనాన్ని చాటిచెప్పే రీతిలో సాగే పాటనూ ప్రస్తావించుకోవాలి. 1968లో అక్కినేని నిర్మించి నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘సుడిగుండాలు’లో శ్రీశ్రీ -‘వినరా సోదర భారత యోధుల విజయగాథ నేడు’ అంటూ బుర్ర కథ రూపంలో నృత్య రూపకాన్ని అందించారు. దురదృష్టం ఏంటంటే ఈ పాట రికార్డుగా పెద్దగా అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులకు చేరువ కాలేదు. నిజానికి కళ్లముందు స్వాతంత్య్ర ఉద్యమంలోని ఘట్టాలను ఆవిష్కరించే గొప్ప గీతమిది.
స్వాతంత్య్ర సాధన ఒక ఎత్తు. దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. దేశ ప్రజల క్షేమం కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపుగాసే సైనికులను కీర్తిస్తూనూ పాటలొచ్చాయి. 1970లో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన జై జవాన్ చిత్రం కోసం శ్రీశ్రీ రచించిన -‘వీర భారతీయ పౌరులారా/ దేశమాత పిలుపు వినగలేరా’ అనే గీతం జాతీయ సమైక్యతను, దేశభక్తిని రగిల్చింది. అలాగే ఎన్టీఆర్ సైనికుడిగా కనిపించే ‘రాముని మించిన రాముడు’ చిత్రం కోసం సినారె రాసిన ‘ఎవరిదీ ఈ విజయం/ అందరిదీ ఈ విజయం/ దేశరక్షణకు ప్రాణాలొడ్డిన వీరులదే ఈ విజయం’ అన్న పాటలో సైనికుల త్యాగనిరతి కనిపిస్తుంది.
1982లో వచ్చిన బొబ్బిలిపులి చిత్రంలో దాసరి నారాయణరావు రచించిన ‘జననీ జన్మభూమిశ్చ’ అన్న పాట కూడా దేశం కోసం మనం అన్న ఆలోచన రగిలిస్తుంది. దేశ పురోభివృద్ధికి తోడ్పడే అంశాలతోనూ కొందరు దేశభక్తి గీతాలు అందించారు. 1964లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంగా వచ్చిన ‘రాముడు భీముడు’ చిత్రంలో శ్రీశ్రీ రచించిన -‘ఉందిలే మంచి కాలం ముందు ముందున/ అందరూ సుఖపడాలి నందనందానా’ అంటూ సాగే గీతం ఆలోచింప చేస్తుంది. ఇదే చిత్రంలో -‘దేశమ్ము మారిందోయ్/ కాలమ్ముమారిందోయ్’ అంటూ పౌరులంతా దేశ పురోభివృద్ధికి పాటుపడాలని పిలుపునిస్తుంది.
త్యాగధనుల ఆశయాలు సాధించబడ్డాయా? అనే ఆలోచన పౌరుల్లో మొదలైంది. దాన్నీ గుర్తుచేస్తూ కొన్ని ప్రబోధాత్మక గీతాలొచ్చాయి. 1971లో అక్కినేని నటించిన పవిత్రబంధం చిత్రం కోసం ఆరుద్ర రచించిన ‘గాంధీ పుట్టిన దేశమా ఇది/ నెహ్రు కోరిన సంఘమా ఇది/ సామ్యవాదం రామరాజ్యం/ సంభవించే కాలమా?’ అంటూ నిరుద్యోగ యువకుడు ప్రశ్నించే ధోరణిని చూపించారు. 1961లో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన వెలుగునీడలు చిత్రంలో దేశ పరిస్థితి? పౌరుల కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ -‘పాడవోయి భారతీయుడా/ ఆడి పాడవోయి విజయగీతిక’ పాటను ప్రభోదాత్మకంగా వినిపించారు. ‘సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం/ సకల జనుల సౌభాగ్యమే నీలక్ష్యం/ ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే/ లోకానికి మన భారతదేశం / అందించునులే శుభ సందేశం’ అని ముగిసే గీతం నేటికీ సజీవం, ఆలోచనాత్మకం.
ఒకప్పుడు సినిమాల్లో నిర్మాతలు, దర్శకులు దేశభక్తి గీతాలను ఏదో రూపంలో అందించేవారు. అవి పదేపదే ప్రసారమై ప్రేక్షకుల్లో ఆలోచనలు రేకెత్తించి దాదాపు కంఠతా వచ్చేవి. చాలాకాలం వరకు విద్యాలయాల్లో వాటిని నృత్య రూపకాలుగానూ ప్రదర్శించేవారు. ఈ తరానికి ఈ పాటలు అందే అవకాశం ఉన్నా, వినే తీరికా ఒపికా లేదని చెప్పడానికి సంకోచం అక్కర్లేదు. కనీసం -ఈ పాటల్ని విద్యార్థుల పాఠ్యాంశాలుగా చేర్చితేనైనా భావి భారత పౌరులుగా వారి కర్తవ్యాలను గుర్తు చేయగలిగిన వాళ్లం అవుతాం. ప్రేక్షకులను ఆలోచింపచేసేలా గీతాలను రాసిన రచయితలు, స్పూర్తిదాయకంగా స్వరపర్చిన సంగీత దర్శకులు, ప్రేరణాత్మకంగా గానం చేసిన గాయకులు, అభినయంతో వాటిని మనకు చేరువ చేసిన నటులు -ఎంతైనా అభినందనీయులు.

-ఎస్ సర్వేశ్వర శాస్ర్తీ