AADIVAVRAM - Others

రామాయణం..53 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీత రాముడితో తను చెప్పేది ఇలా కొనసాగించింది.
‘నీ వెనకే వచ్చేప్పుడు దారిలో నాకేమీ శ్రమ ఉండదు. విహారాలలో, పడకలో ఏ విధంగా శ్రమ లేకుండా ఉంటానో అలాగే బాటలో కూడా శ్రమ లేకుండా ఉండగలను. నీతో ప్రయాణించేప్పుడు దారిలో ఉన్న దర్భలు, రెల్లు, శరాలు, ఇషీకలు (ఓ రకం గడ్డి) ముళ్ల చెట్లు నాకు దూదిలా, జింక చర్మంలా మృదువుగా ఉంటాయి. రామా! పెనుగాలికి ఎగిరి నన్ను కప్పివేసే పుప్పొడిని అత్యుత్తమమైన చందనంగా భావిస్తాను. అడవిలో నివసిస్తూ అడవి మధ్యలో పచ్చిక మీద పడుకునేప్పుడు కలిగే సుఖం కంటే, చిత్రమైన కంబళ్లు కప్పిన మంచాల మీద ఎక్కువ సుఖం కలుగుతుందా? నువ్వు స్వయంగా తీసుకువచ్చి ఇచ్చే ఆకైనా, దుంపైనా, పండైనా, కొంచెం తెచ్చినా, ఎక్కువ తెచ్చినా అవి అమృతంతో సమానం. అడవుల్లో ఆయా ఋతువుల్లో లభించే పూలు, పళ్లని అనుభవిస్తూ తల్లితండ్రుల మీద కాని, ఇంటి మీద కాని బెంగ పెట్టుకోను. అందువల్ల అడవిలో నా వల్ల ఏవో కష్టాలు వస్తాయని అనుకోవద్దు. నా మూలంగా నీకేం విచారం కలగదు. నీకు పోషించడానికి భారం కాను. నాకు నీతో ఉండటమే స్వర్గం. నువ్వు లేకపోతే అది నరకం. రామా! ఇది గ్రహించి నాతో కలిసి గొప్ప ఆనందాన్ని పొందు. నీతో అడవికి వెళ్లాలని దృఢ నిశ్చయంతో ఉన్న నన్ను తీసుకు వెళ్లకపోతే విషం తాగుతాను. శత్రువులకి మాత్రం లొంగను. నువ్వు నన్ను విడిచిపోతే నేను విచారంతో కొంత కాలం తర్వాతైనా ప్రాణాలు వదలాల్సిందే. అందుకే ఇప్పుడే పోవడం మంచిది. ఈ దుఃఖాన్ని ఒక్క క్షణమైనా సహించలేను. ఇక పనె్నండు సంవత్సరాలు విచారంతో గడపలేనని వేరే చెప్పాలా?’
శోకంలో మునిగిన సీత జాలి కలిగేట్లుగా భర్తని కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్చింది. విషం పూసిన బాణాలతో కొట్టబడ్డ ఆడ ఏనుగులా అనేక మాటల చేత బాధింపబడ్డ సీత చాలాసేపటి దాకా ఆపి ఉంచిన కన్నీటిని అగ్నిలో అరణి వేసినట్లుగా బయటకి వదిలింది. దుఃఖం వల్ల కలిగిన ఆమె స్వచ్ఛమైన కన్నీరు రెండు పద్మాల నించి నీరు స్రవించినట్లుగా కారింది. విశాలమైన కళ్లు, నిర్మలమైన చంద్రుడి పోలిన కాంతి గల ఆమె కన్నీటి మొహం నీటి నించి పెరిగి వేసిన పద్మంలా వాడిపోయింది.
అప్పుడు రాముడు దుఃఖంతో మూర్ఛ చెందినట్లున్న సీతని రెండు చేతులతో ఆలింగనం చేసుకుని ఓదారుస్తూ ఇలా చెప్పాడు.
‘ఓ దేవీ! నువ్వు విచారిస్తూంటే స్వర్గం లభించినా దాన్ని ఇష్టపడను. బ్రహ్మ దేవుడికిలా నాకు ఎవరి నించి ఏ మాత్రం భయం లేదు. శుభకరమైన ముఖం గల ఓ సీతా! నిన్ను రక్షించగల సమర్థుడ్ని ఐనా కూడా, నీ ఉద్దేశం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా నిన్ను అరణ్యానికి తీసుకెళ్లడానికి నేను ఇష్టపడలేదు. సీతా! నాతో వనవాసం చేయడానికే బ్రహ్మ నిన్ను సృష్టించినట్లుంది. అందుచేత అభిమానవంతుడ్ని కీర్తి ఎలా వదలదో అలా నిన్ను నేను విడిచిపెట్టను. మను ధర్మానికి పూర్వమే సత్పురుషులంతా తండ్రి మాట వినడం ఆచరించారు. కాత్యాయని సూర్యుడ్ని అనుసరించినట్లుగా నేను ఇప్పుడు ఆ ధర్మానే్న అనుసరిస్తాను. సీతా! సత్యంతో నిండిన మా నాన్న వాగ్దానం నన్ను అడవికి పంపిస్తోంది. నేను తప్పక అడవికి వెళ్లాలి. సంతానం తల్లికి కాని, తండ్రికి ఆని లొంగి ఉండటమే ధర్మం. అందువల్ల నా ధర్మాన్ని నేను అతిక్రమించి బతకడానికి ఇష్టపడను. తల్లి, తండ్రి, గురువు మనకి అందుబాటులో ఉన్న వాళ్లు. అలాంటి వారిని కాదని మనకి అందుబాటులో లేని దైవాన్ని ఆరాధించడం ఎందుకు? సీతా! తల్లి, తండ్రి రెండు లోకాలు. వీరితో సమానమైన వారు ఎవ్వరూ ఈ భూలోకంలో లేరు. అందుచేత వారికి సేవ చేయాలి. తండ్రి చేసే సేవ ఏ విధంగా బలాన్ని ఇస్తుందో అంత బలాన్ని సత్యం కాని, దానం కాని, మానం కాని, అధిక దక్షిణతో కూడిన యజ్ఞాలు కాని ఇవ్వలేవు. తండ్రి మాటని వినడం వల్ల స్వర్గం కాని, ధనధాన్యాలు కాని, విద్యలు కాని, కొడుకులు కాని, సుఖాలు కాని ఏవైనా లభిస్తాయి. అసలు లభించనిదే ఉండదు. తల్లిదండ్రుల సేవని చేసిన మహాత్ములు దేవ లోకం, గంధర్వ లోకం, గోలోకం, బ్రహ్మ లోకం లాంటి పుణ్యలోకాలని పొందుతారు. సత్య, ధర్మ మార్గాలని అనుసరించే మా నాన్న ననె్నలా ఆజ్ఞాపిస్తే ఆ విధంగానే ప్రవర్తించాలన్నది నా కోరిక. ఇదే సనాతన ధర్మం కదా? సీతా! నిన్ను కూడా దండకారణ్యానికి నా వెంట తీసుకెళ్లాలనే ఉత్సాహం నాకు ఉంది. కాని నువ్వు నాతో అరణ్యానికి రావడానికి నిశ్చయించుకున్నానని చెప్పావు. మత్తెక్కే కళ్లు గలదానా! పొందికైన శరీరం గల నిన్ను నాతో రావడానికి అనుమతిస్తున్నాను. నాకు సహధర్మచారిణిగా ఉండు. సీతా! నీ వంశానికి అన్ని విధాలుగా తగిన మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు. వెంటనే వనవాసానికి తగిన పనులన్నీ మొదలుపెట్టు. నువ్వు లేకపోతే స్వర్గం కూడా నాకు ఇష్టం లేదు. ఆలస్యం చేయకుండా బ్రాహ్మణులకి రత్నాలు, భిక్షకులకి భోజనం త్వరగా ఇవ్వు. మంచి విలువ గల అలంకారాలు, బట్టలు, అందమైన ఆటవస్తువులు, నా మంచాలు మొదలైన వస్తువులు అన్నిటినీ బ్రాహ్మణులకి ఇవ్వు. ఇంకా మిగిలిన వాటిని నీ సేవకులకి ఇవ్వు’
తను కూడా అరణ్యానికి రావడానికి రాముడు అనుమతి ఇవ్వడంతో సీతాదేవి చాలా సంతోషించి వెంటనే దానాలని చేయడం మొదలుపెట్టింది. కీర్తివంతురాలు, పవిత్రమైన మనసు గలది ఐన సీత భర్త మాట విని సంతోషించి, నిండు మనసుతో రత్నాలని, ధనాన్ని ధర్మాత్ములకి దానం చేయడం ప్రారంభించింది. అయోధ్య కాండలో సర్గ -30లోని 11వ శ్లోకం నించి 47వ చివరి శ్లోకం దాకా చెప్పాను. ఈ సర్గలో మిగిలింది రేపు చెప్పుకుందాం’ హరిదాసు ఆ రోజుకి తన కథని ముగిస్తూ చెప్పాడు. (అయోధ్యకాండ సర్గ-30లో 11వ శ్లోకం నించి 47వ చివరి శ్లోకం దాకా)
కథ పూర్తయ్యాక హరిదాసు చెప్పిన ఆ రోజు కథలో 6 తప్పులు ఉన్నాయి అని ఐదుగురు లేచి ఆయనకి ఆ ఆరు తప్పులని చెప్పడం ఆశే్లష విన్నాడు. ఆయన వెంటనే ఆ సర్గ తెరచి చూసి అది నిజమేనని ఒప్పుకున్నాడు. వాటిని మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
రామాయణంలో ఎందరు
గురువులు ఉన్నారు?
*
గత వారం
‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
శ్రీ సత్యసాయిబాబా రాముడి మీద రాసిన పుస్తకం పేరేమిటి?
రామకథా
రసవాహిని
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.మళ్లీ హరిదాసు లక్ష్మణుడు రాముడి వెంట వచ్చాడని చెప్పాడు. కాని వాల్మీకి ఈ రెండు సర్గల్లో ఎక్కడా అది రాయలేదు.
2.రాముడి వనవాసం గురించి సీతకి రాముడి ద్వారానే తెలిసింది. కాని ‘నాకు సమాచారం వేగుల ద్వారా అందింది’ అని సీత చెప్పినట్లుగా హరిదాసు చెప్పాడు.
3.నీ మాటని విననందుకు నీకు కలిగే ఈర్ష్యని, కోపాన్ని ‘తాగగా మిగిలిన నీళ్లని వదిలేసినట్లుగా’ వదిలేసి నన్ను కూడా తీసుకెళ్లు’ అని సీత వాడిన ఉపమానాన్ని హరిదాసు చెప్పలేదు.
4.‘నువ్వు పక్కన ఉంటే ఎక్కడైనా సరే నాకు భయం లేదు’ అని సీత చెప్పిన ముఖ్యమైన మాటల్ని హరిదాసు చెప్పలేదు.
5.ఇలా నీ సాంగత్యంలో ‘లక్ష’ సంవత్సరాలైనా అని వాల్మీకి రాశాడు. హరిదాసు దాన్ని ‘వంద’గా మార్చి చెప్పాడు.
6.అడవి ఎందుకు దుఃఖకరమో రాముడు 17 అంశాలని ఉదాహరణలుగా చెప్పాడు. కాని హరిదాసు తప్పుగా అవి 18గా చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి