AADIVAVRAM - Others

రామాయణం.. 54 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముడి మాటలు విన్న సీత కన్నీళ్లు కారుస్తూ మెల్లగా ఇలా చెప్పింది.
‘అడవుల్లో నివాసం విషయంలో నువ్వు చెప్పిన సమస్యల వెనక నీ ప్రేమ అనేది ఉంటే అవి నాకు మంచివే అవుతాయి. రామా! సింహాలు, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు, పక్షులు, చమరీ మృగాలు మొదలైన వన్య మృగాలన్నీ పూర్వం ఎప్పుడూ నిన్ను చూసి ఉండకపోవడంతో అవి నిన్ను చూడగానే పారిపోతాయి. భయాన్ని కలిగించే వాటిని చూసి భయపడని వారు ఎవరు? పెద్దల ఆజ్ఞ ప్రకారం నేను నీ వెంట అడవికి వస్తాను. నీకు దూరమైతే నేను ఇక్కడే ప్రాణాలు విడుస్తాను. దేవతల రాజైన ఇంద్రుడు కూడా నేను నీ దగ్గర ఉన్నంత దాకా తన తేజస్సుతో నన్ను బాధించలేడు. భర్త లేని స్ర్తి జీవించలేదు అనే ధర్మాన్ని నువ్వే నాకు బోధించావు కదా? తెలివిగల రామా! ఇంకో విషయం.
‘గతంలో నేను మా పుట్టింట్లో ఉన్నప్పుడు నేను తప్పక వనవాసం చేయాల్సి ఉంటుందని బ్రాహ్మణులు చెప్పగా విన్నాను. ప్రియా! అలాంటి వనవాసం కోసం నాకు అనుమతి ఇవ్వు. నేను ఇప్పుడు నీతో అడవికి వస్తాను. ఇంకో విధంగా జరగడానికి వీల్లేదు. నేను ఆ బ్రాహ్మణుడి మాటని నిలబెట్టడానికి నీతో వస్తాను. అతని జోస్యం నిజమయ్యే సమయం వచ్చింది కనుక ఆ బ్రాహ్మణుడి మాటలు నిజం అవుగాక! వీరుడా! వనవాసంలో అనేక విధాలైన దుఃఖాలు కలుగుతాయని నాకు తెలుసు. కాని ధైర్యం లేని మగవారికి మాత్రమే ఆ దుఃఖాలు కలుగుతాయి. నేను మా నాన్న గారింట్లో కన్యగా ఉన్నప్పుడు మంచి ప్రవర్తన గల ఓ సన్యాసిని నాకు వనవాసం సంభవిస్తుందని మా అమ్మతో చెప్పడం విన్నాను. ఓ ప్రభూ! నిన్ను నేను చాలాకాలం సేవించి నీ అనుగ్రహం పొందాను కదా? నీతో కలిసే వనంలో జీవించాలనే నా కోరికని తీర్చు! రామా! నీకు క్షేమం అవుగాక! నేను నీ వనవాసం కోసం వేచి ఉన్నాను.
‘పరాక్రమంతో కూడిన ఆచరణంటే నాకు చాలా ఇష్టం. నీకు వనవాస సమయం వచ్చింది కాబట్టి నన్ను కూడా నీతో తీసుకెళ్లు. పవిత్ర మనసుగల ఓ రామా! భర్తవైన నీ వెంట ప్రేమగా అడవికి వచ్చి నేను పాప రహితురాలిని అవుతాను. నా భర్తే నాకు దైవం. మరణించాక కూడా నేను నీతోనే కలిసి ఉంటాను. ధర్మానుసారంగా తల్లిదండ్రులు ఏ స్ర్తిని ఎవరికి నీళ్లు విడిచి దానం చేస్తారో ఆ స్ర్తి మరణానంతరం కూడా అతనికే చెంది, అతనితోనే కలిసి ఉంటుంది అని కీర్తివంతులైన బ్రాహ్మణులు వేదవాక్యంగా చెప్తూంటారు కదా? మంచి నడవడిక గల నేను నీ దాన్ని. పతివ్రతని. సుఖదుఃఖాలని సమానంగా చూడగలదాన్ని. నీ సుఖమే నా సుఖం అని, నీ దుఃఖమే నా దుఃఖమని భావిస్తాను. అలాంటి నన్ను నీతో కూడా తీసుకెళ్లు. దుఃఖించే నన్ను అరణ్యానికి తీసుకుని వెళ్లకపోతే నేను ప్రాణాలని విడుస్తాను’
ఇలా సీత తనని కూడా అడవికి తీసుకు వెళ్లమని ఎంత బతిమాలినా రాముడు నిర్మానుష్య అరణ్యానికి ఆమెని తీసుకెళ్లడానికి అంగీకరించలేదు. రాముడి మాటలు విన్న సీత విచారంతో నేల తడిసేలా ఏడ్చింది. బుద్ధిమంతుడైన రాముడు ఎర్రటి పెదవులు గల ఏడ్చే సీతని అడవికి వచ్చే ఆలోచనని విరమింప చేసే ప్రయత్నం చేస్తూ ఓదార్చాడు. (రామాయణం అయోధ్య కాండ సర్గ -29)
వనవాసానికి రావద్దని చెప్తూ రాముడు ఓదారుస్తూంటే జనకుడి కూతురైన సీత బాగా విచారంతో, విశాలమైన ఛాతీగల రాముడు ప్రేమతో తన కోరికని మన్నించడం లేదు కదా అనే కోపంతో రాముడ్ని ఇలా నిందించింది.
‘రామా! నువ్వు మగ శరీరంలో ఉన్న ఆడదానివి. అలాంటి నిన్ను విదేహ దేశ రాజు, మిథిలాధీశుడు ఐన మా నాన్న ఏమనుకుని అల్లుడిగా చేసుకున్నాడో తెలీదు. నిజానికి నువ్వు నన్ను అడవికి తీసుకెళ్లకపోతే అందుకు కారణం నువ్వు పరాక్రమంలేని వాడివి అవడం కాదు. లోకంలో ఎవరైనా రాముడిలో పరాక్రమం, తేజస్సు లేదని తెలీక అంటే అది ‘ప్రకాశించే సూర్యుడిలో తేజస్సు లేదు’ అన్నంత అబద్ధం. అందువల్ల నువ్వు నన్ను తీసుకెళ్లక పోవడానికి కారణం పరాక్రమం లేకపోవడం కాదు. ఇంకేదైనా కారణం ఉండి ఉండచ్చు. గతి లేని నన్ను ఇలా వదిలేసి వెళ్లాలని అనుకుంటున్నావు కదా? మరి నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నీ భయానికి కారణం ఏమిటి? సావిత్రి సత్యవంతుడ్ని అనుసరించినట్లు నేను సదా నీ వెంటే ఉంటానని తెలుసుకో. దోషాల్లేని రామా! నేను కులానికి కళంకం తెచ్చే సామాన్య స్ర్తిని కాను. నువ్వు తప్ప మరెవ్వరినీ ఊహల్లో కూడా చూడను. నీతో అడవికి వస్తాను. నేను నీ భార్యని. భర్తే దైవం అని నమ్మినదాన్ని. యవ్వనంలోకి కొత్తగా వచ్చిన దాన్ని. చాలా కాలం నీతో కాపురం చేసినదాన్ని. అలాంటి నన్ను నాటకాల్లో వేషాలు వేసి జీవించే నటుడు తన భార్యని స్వయంగా ఇతరులకి ఇచ్చినట్లు ఇతరులకి ఇచ్చేద్దామని అనుకుంటున్నావు. నువ్వు ఎవరి మంచి కోసం మాట్లాడుతున్నావో, ఎవర్ని దృష్టిలో ఉంచుకుని నన్ను నీతో రావద్దని అడ్డు పెడుతున్నావో వాళ్లకి నువ్వు సదా విధేయుడివి కావచ్చు. కాని నన్ను వాళ్లకి విధేయతగా ఉండమనడం సబబు కాదు. అన్నీ తెలిసిన నువ్వు నన్ను తీసుకెళ్లకుండా అడవికి బయలుదేరడం సబబు కాదు. నాకు తపస్సైనా, అరణ్యమైనా, స్వర్గమైనా నీతోనే. నీ సాన్నిధ్యం లేకపోతే నాకేమీ నచ్చదు’
సీత ఇంకా ఇలా చెప్పసాగింది. (అయోధ్యకాండ సర్గ -30లో 10 శ్లోకాల దాకా)
హరిదాసు ఇలా ముగించాడు.
‘రాముడు ఏం చేసాడు? సీతని అడవికి తీసుకెళ్లడానికి సరే అన్నాడా? లేదా? అనేది 31వ సర్గలో రేపు తెలుసుకుందాం’
ఆశే్లష హరికథ విని బయటకి వస్తూండగా ఆయ చెప్పిన కథలో ఐదు తప్పులు ఉన్నాయి అని కొందరు అనుకుంటూ వెళ్లడం విన్నాడు. అది నిజం కూడా.
ఆ ఐదు తప్పులని మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
‘రామాయణ కల్పవృక్షం’ అనే పుస్తకాన్ని
తెలుగులో రాసిన కవి ఎవరు?
*
గత వారం
‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
రామాయణంలో ఎందరు గురువులు ఉన్నారు?
గురువులు ఐదు రకాలు. వీరంతా రామాయణంలో కనిపిస్తారు. ఉపాధ్యాయ స్థాయికి చెందిన దశరథుడు సూచక గురువు. అధ్యాపక స్థాయికి చెందిన సుమంత్రుడు వాచక గురువు. ఆచార్య స్థాయికి చెందిన విశ్వామిత్రుడు బోధక గురువు. ఆశ్రమ స్థాయికి చెందిన వశిష్ఠుడు పరమ గురువు. అనాగరిక స్థాయికి చెందిన రావణబ్రహ్మ నిషిద్ధ గురువు.
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.పధ్నాలుగు సంవత్సరాలు విచారంతో అని సీత చెప్పింది. పనె్నండు సంవత్సరాలు తప్పు.
2.సువర్చల సూర్యుడ్ని అనుసరించినట్లుగా అని చెప్పాలి. కాని హరిదాసు కాత్యాయని సూర్యుడ్ని అనుసరించినట్లుగా అని తప్పు చెప్పాడు.
3.వాల్మీకి తల్లి, తండ్రి, గురువులు మూడు లోకాలు అని చెప్పాడు. కాని హరిదాసు గురువు సంగతి చెప్పలేదు. గురువు మూడో లోకం.
4.నిన్ను కూడా దండకారణ్యానికి తీసుకెళ్లాలనే ఉత్సాహం నాకు లేదు అని రాముడు చెప్పాడు. కాని ‘ఉంది’ అని హరిదాసు తప్పుగా చెప్పాడు.
5.నీ సేవకులకి ఇవ్వు. ఇంకా మిగిలిన వాటిని బ్రాహ్మణులకి ఇవ్వు అని రాముడు చెప్పాడు. కాని హరిదాసు ముందు బ్రాహ్మణులకి, తర్వాత సేవకులకి ఇవ్వమని చెప్పినట్లుగా అటుదిటు చెప్పాడు.
6.30వ సర్గ 47వ శ్లోకంతో ముగుస్తుంది. హరిదాసు ‘30వ సర్గలో మిగిలింది రేపు చెప్పుకుందాం’ అని చెప్పడం తప్పు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి