AADIVAVRAM - Others

కనువిప్పు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదొక చక్కని పచ్చిక మైదానం. బాగా దట్టంగా పెరిగిన పచ్చగడ్డిని ఒకపక్క గుర్రం, మరోపక్క ఒక గొర్రె తనివితీరా మేస్తూ ఉన్నాయి. కడుపు నిండిన గుర్రం ఇటూ అటూ దృష్టి సారించింది. దూరంగా తన మానాన తాను పచ్చిక మేస్తూన్న గొర్రె కనపడింది. గుర్రం ఒకసారి తనవైపు తాను చూసుకుంది. ఆహా!! సృష్టికర్త నన్ను ఎంత అందంగా, దృఢంగా సృష్టించాడు. తన నిడుపాటి తోక చాలు తనెంత అందమైనదో చెప్పడానికి. మరి నా వేగం ముందు ఏ జంతువూ పనికిరాదు. గర్వం తలకెక్కిన గుర్రానికి గొర్రె ఆకారం, దాని తోక చూసి నవ్వు వచ్చింది. గొర్రెని ఒక ఆట పట్టించాలని గుర్రం అటువైపు కదిలింది.
‘ఏం మిత్రమా! నీ పొట్టి తోకా, బొచ్చు శరీరానికి, మేసిన గడ్డి చాలలేదా? ఇంకా అలా మేస్తూనే ఉన్నావు? మేసింది చాలు గాని ఒక్కసారి నన్ను చూడు. నా బలమైన నిగనిగలాడే దేహం, అందమైన పొడవాటి తోక చూసి నేనెలా ఉన్నానో చెప్పు’ అంటూ గొర్రెని ఎద్దేవా చేసింది గుర్రం.
‘చాలా బాగున్నావు మిత్రమా! భగవంతుడు ప్రతి ప్రాణిని సృష్టించినపుడు వాటి శరీరాకృతులు ఎలా ఉండాలో, ఎలా ఉంటే వాటి జీవన సరళి సులభంగా ఉంటుందో ముందే ఊహించి ఉంటాడు. మాట వరసకి నాకు నీ అంత పొడుగైన తోక ఉంటే దాని బరువుతో, పొడుగుతో నాకు చాలా ఇబ్బంది అయ్యేది. కాని, నీకా పొడుగు తోక ఎంతో అవసరం. దాంతో నీ పొడుగాటి శరీరంపై ఈగలు, దోమల్ని తోలుకోవచ్చు. నీకు నాలా పొట్టి తోకే ఉందనుకుందాం! అప్పుడు నీ పరిస్థితేంటి?’ అని బదులిచ్చింది గొర్రె.
‘నా వేగం ద్వారా మనుషులకి ఉపయోగపడుతున్నాను కదా. మరి నీ వల్ల మనుషులకేం ఉపయోగం?’ అని గొర్రెని మరోసారి ఎగతాళి చేసింది గుర్రం.
దానికి గొర్రె ఇలా బదులిచ్చింది. ‘ఎముకలు కొరికే చలి నుంచి కాపాడుకోవడానికి మరి మనుషులు నా ఉన్నితో చేసిన దుస్తులు ధరిస్తున్నారు కదా! ఇది కాదా మానవులకు నా ద్వారా ఉపయోగం’
గొర్రె ఇంకా ఇలా అంది. ‘మిత్రమా! నీ సంగతి నా సంగతి సరే.. మనకన్నా ఎన్నో కోట్ల రెట్లు చిన్నదిగా ఉన్న చీమను చూడు. వాటి జీవన ప్రమాణం చిన్నదే కావచ్చు. ఆకారం చిన్నదే కావచ్చు. కాని ఎంతో నిబద్ధత, కష్టించి పనిచేసే స్వభావం, ఐకమత్య భావన, సంఘటిత కృషి, రేపటి వర్ష ఋతువు కోసం నేడు దాచుకునే పొదుపరితనం, అవరోధాలను అధిగమించే ఆత్మవిశ్వాసం ఇన్ని మహత్తర గుణాలు ఆ అల్ప ప్రాణికి ఉన్నాయి. ఆ చీమల ముందు నువ్వూ నేనే కాదు, సకల జీవరాసులలోకెల్లా అతి తెలివైన మనిషి కూడా బలాదూర్. కానీ దోస్త్! ఇన్ని అద్భుత గుణాలున్న చీమ ఎప్పుడూ గర్వించదు సుమా!’
గుర్రం తన అహంకారానికి పశ్చాత్తాపం చెందుతూ తన యజమాని ఇంటి వైపు సాగింది. గొర్రె కూడా తన మందతో కలియడానికి అక్కడి నుంచి నిష్క్రమించింది.

-నేరళ్ల వెంకటరావు