Others

గుణసుందరి కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాత దర్శకులు కె.వి.రెడ్డి నిర్మాణ దశలో వున్న వాహిని స్టూడియోకు ‘వేమన’ చిత్రం తీయాలని వచ్చారు. కానీ స్టూడియోకు మొట్టమొదటి సినిమా ‘బాక్సాఫీస్’ హిట్ కావాలి. అందుకోసం ఏం చెయ్యాలి? అని ఆలోచించారు. పింగళి నాగేంద్రరావును రచయితగా తీసుకున్నారు. ఆయన మంచి రచయిత. షేక్స్‌పియర్ రాసిన ‘కింగ్‌లియర్’లోని ప్రధానాంశం తీసుకొని దానికి మార్పులు చేర్పులు చేసి అద్భుతంగా రాశారాయన. కె.వి.రెడ్డి, పింగళి నాగేంద్ర, కె.కామేశ్వరరావులు కలిసి ‘గుణసుందరి కథ’కు స్క్రిప్టు తయారుచేశారు. హీరోగా హాస్యనటుడు శివరావుని, ఉగ్రసేన మహారాజుగా గోవిందరాజుల సుబ్బారావుని, హీరోయిన్‌గా శ్రీరంజనిని ఎంపిక చేయడం జరిగింది. పాత్రలనే ప్రధానంగా పెట్టుకొని, ఆ పాత్రకు తగ్గ నటీనటుల్ని ఎన్నుకున్నటువంటి చిత్రం ‘గుణసుందరి కథ’. అది కె.వి.రెడ్డిగారి స్కూలు, చివరకు అలాగే చేశారాయన. కె.వి.రెడ్డికి, సినిమాకు సంబంధించిన అన్ని శాఖలతో అవగాహన ఉన్నది. కె.వి.రెడ్డి డ్రాయింగ్ పరీక్ష కూడా పాసయ్యారు. ఆర్ట్ డైరెక్టర్‌కు వివరంగా చెప్పాల్సి వచ్చినపుడు, సెట్ ఎలా వుండాలి అని ఆయనే డ్రాయింగ్ వేసి చూపించేవారు. కె.వి.రెడ్డిఒక మాట అనేవారు. ‘మనం తీస్తున్నది నిరక్షరాస్యులకు, కనుక బొమ్మ బాగా కనిపించాలి, శబ్దం బాగా వినిపించాలి’ అని.
ఇక పింగళి నాగేంద్రరావు పాత్ర రూపకల్పనలోను, ఊతపదములు సృష్టించడలోను అందెవేసిన చేయి. ఆయన పెద్దల్లుడికి, చిన్నల్లుడికి ఈ చిత్రంలో పెట్టిన పేర్లు ‘హారమతి, కాలమతి అలాగే దైవాదీనం’.
ఈ చిత్రానికి అవుట్‌డోర్ షూటింగ్ మద్రాసు నుంచి 60 మైళ్ల దూరంలో వున్న ‘తడ’ గ్రామంలో జరిగింది. దైవాదీనం, హారమతి, కాలమతి ‘మణి’ని తీసుకురావడానికి వెళ్లినపుడు అక్కడ వాళ్ల సాహస కృత్యాలతో ఒక పాట కూర్చబడింది. ‘‘ఏం చేస్తావురా అన్నయ్యా, నువ్వేం చేస్తావురా తమ్మయ్యా, పులి వస్తే నువ్వేం చేస్తావు’’ అనే పాట. ఆ అడవిలో కింద మకాం వేసి కొండపైనున్న కోనేరువద్ద షూటింగ్ పెట్టారు. 40 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతం ఇప్పుడున్నంత అభివృద్ధిలో లేదు.
అయితే ‘గుణసుందరి కథ’ చిత్ర కథనంలో చక్రపాణికి ఓ అంశం నచ్చలేదు. అప్పటికి ఇంకా ‘విజయా’ సంస్థ ఏర్పడి ఉండలేదు. ఆయన కూడా కథా చర్చలలో పాల్గొనేవారు. ఈ చిత్రంలో శివరావు ఒక రాజకుమారుడు. ఏదో శాపం వలన కుంటి, గుడ్డివాడిగా కనిపిస్తాడు. ఈ పాత్ర రాజకుమారుడని ముందే తెలియపరచి కథ నడపడం ఒక పద్ధతి. అలా ముందే చెపితే జనం ఇంక బాగా ఆదరిస్తారని అన్నారు చక్రపాణి. కానీ కె.వి.రెడ్డి అంగీకరించలేదు. ‘రాజకుమారుడు’ అని ముందే చెబితే సస్పెన్స్ ఉండదు, ఆ పాత్రపై జాలి ఉండదు, హీరోయిన్ మీద సానుభూతి ఉండదు. అయ్యో కుంటి, గుడ్డివాడికి ఇస్తున్నారే అని. చివరికి అతడు ఫలానా అని చెబితేనే రక్తికడుతుంది అన్నారాయన.
ఇదే చిత్రాన్ని 1955లో ‘విజయా’ సంస్థ వారు చక్రపాణి, నాగిరెడ్డి తమిళంలో తీశారు. ఆ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. తెలుగు ‘గుణసుందరి కథ’నే తమిళ ‘గుణసుందరి కథ’లో అనుసరించారు. కాని ఒక్క మార్పు తప్ప తమిళ చిత్రంలో అతడు రాజకుమారుడు అని ముందే చెపుతారు. ఈ విషయంలో చక్రపాణికి, కె.వి.రెడ్డికి అభిప్రాయభేదం వచ్చింది. తెలుగులో శ్రీరంజని పోషించిన పాత్ర తమిళంలో సావిత్రి చేశారు. గోవిందరాజుల సుబ్బారావుగారి పాత్ర ఎస్.వి.రంగారావు, శివరావు పోషించిన పాత్రను మాధవన్ అనే తమిళ నటుడు పోషించారు. కానీ ఈ చిత్రం తెలుగు ‘గుణసుందరి కథ’ అంతటి విజయం సాధించలేకపోయింది. ‘గుణసుందరి కథ’ 1949 సంవత్సరం, నవంబర్ 29న విడుదలైంది.
కథా సంగ్రహం: ఉగ్రసేన మహారాజుకు రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి అని ముగ్గురు కుమార్తెలు. కథాపరంగా పెద్దకుమార్తెలిద్దరూ ‘తండ్రే సర్వస్వం’ అని, చిన్న కుమార్తె ‘్భర్తే సర్వస్వం’ అంటారు. దీనికి ఆగ్రహించిన మహారాజు తన కుమార్తె అయిన గుణసుందరికి ఒక అష్టావక్రుణ్ణి తెచ్చి ఆమెకు పెళ్లి జరిపిస్తారు. అతడే దైవాదీనం (కస్తూరి శివరావు). శాపవశాత్తు ఆ రూపం పొందిన రాజకుమారుడు (ఈ పాత్రను వల్లభ జోస్యుల శివరాం పోషించారు). విధివశాత్తు మహారాజుకు ‘రాచపుండు’ వస్తుంది. మహేంద్రమణిని తాకిస్తే ఆ రాచపుండు నయవౌతుంది అని వైద్యులు తెలియజేయగా, ఆ మణి కొరకు అల్లుళ్లు ముగ్గురూ బయలుదేరుతారు. దైవాదీనం తన తెలివితేటలతో మణిని తేగా, దానిని పెద్దల్లుళ్లు తస్కరిస్తారు. శాపవశాత్తు దైవాదీనం ఎలుగుబంటిగా మారతాడు. శివానుగ్రహం వలన దైవాదీనం శాపవిముక్తి పొందుతాడు.
ఓగిరాల రామచంద్రరావు సమకూర్చిన సంగీతం, ముఖ్యంగా లీల పాడిన భక్తిపాటలు ‘శ్రీ తులసి, జయ తులసి జయము నీయవే’, దైవాదీనము పాడిన ‘ఓహోరి బ్రహ్మదేవుడా’ పాట, శాంతకుమారి, మాలతి పాడిన చల్లని దొరవేరా చంద్రమామ, ‘కళకళ ఆ కోకిలేమో’ పాట పాపులర్ అయ్యాయి.
నటవర్గం: గోవిందరాజుల సుబ్బారావు, శివరావు, రేలంగి, శివరాం, కాళ్ళకూరి సదాశివరావు, శాంతకుమారి, మాలతి, శ్రీరంజని(జూనియర్), టి.జి.కమలాదేవి, హేమలత, కనకం, లక్ష్మీరాజ్యం (జూనియర్).
సాంకేతిక వర్గం: రచయిత:పింగళి నాగేంద్రరావు, స్క్రీన్‌ప్లే: కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, సంగీతం: ఓగిరాల రామచంద్రరావు, ఫొటోగ్రఫీ: మార్కస్ బార్‌ట్లి, నిర్మాత, దర్శకత్వం: కె.వి.రెడ్డి.

-ఎ.సి.పుల్లారెడ్డి