AADIVAVRAM - Others

రామాయణం..56 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తర్వాత లక్ష్మణుడు శుభకరమైన, ప్రియమైన తన అన్నయ్య ఆజ్ఞతో సుయజ్ఞుడి ఇంటికి వెంటనే వెళ్లాడు. అగ్నిగృహంలోని ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా చెప్పాడు.
‘ఓ స్నేహితుడా! ఇతరులు ఎవరూ చేయలేని పనిని చేస్తున్న రాముడ్ని ఇంటికి వచ్చి చూడు’
వేదవేత్తయిన సుయజ్ఞుడు సంధ్యవార్చి లక్ష్మణుడితో కలిసి లక్ష్మికి నిలయమై, అందంగా ఉన్న రాముడి ఇంట్లోకి ప్రవేశించాడు.
సీతతో కలిసి రాముడు అతనికి నమస్కరించి, హోమం తర్వాత అగ్నికి ప్రదక్షిణం చేసినట్లుగా అతనికి ప్రదక్షిణం చేశాడు.
శ్రేష్ఠమైన బంగారు కుండలాలు, బంగారు సూత్రాల మణులు, కేయూరాలు, వలయాలు, అనేక రత్నాలు రాముడు సుయజ్ఞుడికి దానం చేసి సీత చెప్పమన్న మాటలని చెప్పాడు.
‘సౌమ్యుడైన ఓ మిత్రుడా! ఇప్పుడు సీత నీ భార్య కోసం హారం, బంగారు సూత్రం, వడ్డాణ్ణం ఇస్తోంది. అడవికి వెళ్లే సీత నీ భార్య కోసం అంగదాలు, విచిత్రాలు, సుందరాలు ఐన నగలని నీకు ఇస్తోంది. వీటిని తీసుకెళ్లు. శ్రేష్ఠమైన అనేక రత్నాలతో అలంకరించబడ్డ తన మంచాన్ని కూడా నీకు ఇవ్వాలని అనుకుంటోంది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా! నాకు నా మేనమామ ఇచ్చిన శత్రుభయం అనే ఏనుగుని, ఇంకా వెయ్యి ఏనుగులని నీకు ఇస్తున్నాను’
సుయజ్ఞుడు రాముడు చెప్పిన విధంగా వాటన్నిటినీ తీసుకుని సీతా, రామ, లక్ష్మణుడికి మంచి జరగాలని ఆశీర్వదించాడు.
ప్రియంగా మాట్లాడే రాముడు తొందరపాటు లేకుండా, బ్రహ్మ దేవేంద్రుడితో మాట్లాడినట్లుగా తనకి ఇష్టమైన తమ్ముడు లక్ష్మణుడితో ఇలా చెప్పాడు.
‘లక్ష్మణా! బ్రాహ్మణోత్తములైన అగస్త్యుడ్ని ఆహ్వానించి, పొలం మీద వర్షం కురిసినట్లుగా అతని మీద రత్నాలని వర్షించి పూజించు. అతనికి బంగారం, వెండి, అమూల్యమైన మణులు ఇచ్చి ఆనందింపజేయి. లక్ష్మణా! తైత్తిరీయుల గురువు, అనుకూలుడు, వేదవేత్త అయిన ఏ పండితుడు శ్రద్ధతో కౌసల్యకి ఆశీర్వచనాలు పలుకుతూ సేవ చేస్తాడో అతనికి సంతోషం కలిగేంత వరకు వాహనాలు, దాసీజనం, పట్టువస్త్రాలు ఇప్పించు. మన తండ్రిగారి మంత్రి చిత్రరథుడు చాలాకాలంగా మనింట్లో ఉన్నాడు. అతనికి అమూల్యమైన రత్నవస్త్రాలు, ధనం, చిన్న ఆడ పశువులు, వెయ్యి ఆవులు ఇచ్చి సంతోషపెట్టు. కఠకలాపశాఖలకి చెందిన, పలాస దండాన్ని ధరించిన ఎంతోమంది బ్రహ్మచారులు రోజూ వేదాధ్యయనం మీదే మనసు ఉండటంతో ఇంకే పనులూ చేయరు. వారు సోమరులు. వారు మధురమైన పదార్థాలని తినాలని కోరుకుంటారు. పూజ్యులు కూడా వారిని గౌరవిస్తారు. అలాంటి ఈ బ్రహ్మచారులకి రత్నాలతో నిండిన ఎనభై వాహనాలని, పనె్నండు వందల ఎద్దులని, నెయ్యి, పెరుగు మొదలైన వాటి కోసం వెయ్యి ఆవులను ఇప్పించు. మేఖలలని ధరించిన బ్రహ్మచారులు చాలామంది కౌసల్య ఆశ్రయంలో ఉన్నారు. వారందరికీ ఒక్కొక్కరికీ వెయ్యి ఆవులు. ఇప్పించు. నేను ఇచ్చే ఈ దక్షిణలని చూసి మా అమ్మ కౌసల్య ఆనందించేలా ఆ బ్రాహ్మణులు అందర్నీ అన్ని విధాలా సంతోషపెట్టు.’
రాముడు చెప్పినట్లుగా పురుష శ్రేష్ఠుడైన లక్ష్మణుడు ఆ ధనాన్నంతా కుబేరుడిలా స్వయంగా బ్రాహ్మణ శ్రేష్ఠులకి ఇచ్చాడు. తర్వాత రాముడు దుఃఖంతో నిలబడ్డ సేవకులు అందరికీ జీవనోపాధిగా అత్యధిక ధనాన్ని ఇచ్చి ఇలా చెప్పాడు.
‘నేను తిరిగి వచ్చేంతవరకు ఇళ్లు ఖాళీ కాకుండా లక్ష్మణుడి ఇంటిని, నా ఇంటిని కూడా కాపలా కాయండి’
బాధపడే దాసదాసీలని ఇలా ఆజ్ఞాపించి, కోశాధికారిని డబ్బుని తీసుకురమ్మని ఆదేశించాడు. చూడటానికి చాలా అందంగా ఉన్న రాముడి ధనరాశిని సేవకులు తీసుకువచ్చారు. రాముడు, లక్ష్మణుడు ఆ ధనాన్నంతా బ్రాహ్మణులు, బాలురు, వృద్ధులు, దీనులకి ఇప్పించారు. ఆ ప్రాంతంలో పసిమి రంగులో ఉండే త్రిజటుడు అనే పేద బ్రాహ్మణుడు జీవిస్తున్నాడు. అతను రోజూ చిన్న గొడ్డలి, గునపం, నాగళ్లని ఉపయోగిస్తూ అడవిలో తవ్వుకుంటూ జీవిస్తున్నాడు. దరిద్రంతో బాధపడుతున్న అతని పడుచు భార్య తన చిన్న కొడుకులని చూపించి ముసలివాడైన ఆ బ్రాహ్మణు భర్తతో ఇలా చెప్పింది.
‘నా మాట విని ఆ చిన్న గొడ్డలి, గునపాలని దూరంగా పారేసి వెళ్లి ధర్మాత్ముడైన రాముడి దర్శనం చేసుకుంటే నీకు ఏదైనా దొరుకుతుంది కదా?’
త్రిజటుడు భార్య మాట విని, పూర్తిగా చిరిగిపోయి కప్పుకోడానికి పనికి రాని ఉత్తరీయాన్ని కప్పుకుని రాముడి ఇంటికి చేరుకున్నాడు. త్రిజటుడు ఆ జనం మధ్య బ్రహ్మ తేజస్సుతో భృగు మహర్షిలా, ఆంగీరసుడిలా కనిపించాడు. ఐదవ వాకిలి దాకా ఆయన్ని ఎవరూ అడ్డుపెట్టలేదు. త్రిజటుడు రాముడి దగ్గరకి వెళ్లి అడిగాడు.
‘మహా కీర్తివంతుడైన ఓ రామా! నేను డబ్బు లేనివాడిని. చాలా మంది పిల్లలు కలవాడిని. రోజూ అడవిలో తవ్వుకుంటూ జీవిస్తున్నాను. నన్ను కూడా ఓ కంట చూడు’
రాముడు పరిహాసంగా ఆయనతో చెప్పాడు.
‘నేను ఇంతవరకు వెయ్యి ఆవులని ఒక్కరికే దానం చేయలేదు. నీ చేతిలోని కర్రని ఎంత దూరం విసిరితే అంతవరకు ఉన్న ఆవులన్నిటినీ నీకు ఇస్తాను’
ఆ మాటలకి త్రిజటుడు సంతోషంగా చిరిగిన ఉత్తరీయాన్ని నడుముకి బిగించి తన బలాన్నంతా ఉపయోగించి ఆ కర్రని తిప్పి వేగంగా విసిరేసాడు. అది సరయు నది దాటి కొన్ని వేల ఆవులున్న ఆవుల మందలోని ఓ ఆంబోతు దగ్గర పడింది. ధర్మాత్ముడైన రాముడు త్రిజటుడ్ని కౌగిలించుకుని సరయు తీరం దాకా వ్యాపించిన ఆ ఆవులని అతనికి ఇచ్చి గోపాలకులతో వాటిని అతని ఆశ్రమానికి పంపాడు. అప్పుడు రాముడు త్రిజటుడ్ని బతిమాలుతూ ఇలా చెప్పాడు.
‘కేవలం పరిహాసం కోసమే ఇలా చేసాను. కోపించకు. నీ తేజస్సుని (బలాన్ని) ఎవరూ అధిగమించలేరు. దాన్ని చూడాలనే కోరికతో నేనీ పని చేయమని కోరాను. ఇంకేమైనా కోరికలు ఉంటే కోరుకో. నేను నిజం చెప్తున్నాను. ఇంతే కోరుకోవాలనే నియమం లేదు. నా ధనమంతా బ్రాహ్మణుల కోసమే సంపాదించాను. ఈ ధనాన్ని మీకు ఇవ్వడం నాకు ఇష్టం. పైగా అది నన్ను కీర్తివంతుడ్ని చేస్తుంది.’
త్రిజటుడు భార్యతో కలిసి ఆ ఆవులతో సంతోషంగా వెళ్తూ, బదులుగా రాముడికి కీర్తి, బలం, ఆనందం కలిగించే ఆశీర్వవచనాలని పలికాడు. ఆ మాటల ప్రభావంతో తన బలంతో ధర్మంగా తను సంపాదించిన ధనాన్ని రాముడు వెంటనే ఆనందంగా మిత్రులకి ఇచ్చాడు.
ఆ సమయంలో అక్కడ ఉన్న బ్రాహ్మణులలో కాని, మిత్రుల్లో కాని, సేవకుల్లో కాని, దరిద్రుల్లో కాని, భిక్షకుల్లో కాని దానం, సన్మానం, గౌరవాలలో తృప్తి చెందని వాడు ఒక్కడూ లేడు. (అయోధ్య కాండ సర్గ 32)
ఆశే్లష వెంట ఆ రోజు వచ్చి ఆ హరికథని విన్న వాడి తల్లి శారదాంబ ఇంటికి తిరిగి వెళ్తూ దారిలో చెప్పింది.
‘ఇవాళ హరిదాసు ఐదు తప్పులు చెప్పాడ్రా. ఇంటికెళ్లాక అయోధ్య కాండలోని ముప్పై రెండో సర్గ తీసి చూడు’
ఆవిడ ఆ తప్పుల్ని దారిలో చెప్పింది. మీరు చెప్పగలరా?
*
మీకో ప్రశ్న
*
పరశురాముడి అసలు పేరేమిటి?
ఆ పేరెందుకు వచ్చింది?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ రాముడి మీద వ్యవహారిక భాషలో రాసిన పుస్తకం పేరేమిటి?
-వ్యావహారిక భాషా రామాయణం
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.కౌసల్య వెయ్యి గ్రామాలకి అధిపతి. వందకి కాదు.
2.లక్ష్మణుడు గునపాన్ని, చిన్న గంపని కూడా తీసుకుని వెంట వస్తానని చెప్పాడు. కాని హరిదాసు కేవలం ధనుర్బాణాల గురించే చెప్పాడు.
3.యజ్ఞానికి వచ్చి ఆయుధాలని ఇచ్చింది వరుండు. హరిదాసు తప్పుగా ఇంద్రుడు అని చెప్పాడు.
4.అక్షయమైన బాణాలు గల అంబుల పొదిని కూడా వరుణుడు ఇచ్చాడు. హరిదాసు ఇది చెప్పలేదు.
5.వశిష్ఠుడు కొడుకైన సుయజ్ఞుడ్ని తీసుకురా అని రాముడు చెప్పాడు. వశిష్ఠుడి కొడుకు అని హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి