AADIVAVRAM - Others

రామాయణం..57 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిదాసు ఆ రోజు కథని ఇలా మొదలెట్టాడు.
‘అయ్యా. ఇవాళ మీకు అయోధ్య కాండలోని 34వ సర్గ చెప్తాను. సీతారామ లక్ష్మణులు బ్రాహ్మణులకి అధిక ధనాన్ని దానం చేసి, దశరథుడి దగ్గరికి బయలుదేరారు. రామలక్ష్మణుడు ధరించిన ఆయుధాలకి సీత పూల మాలలు కట్టింది. అలంకరించబడ్డ ఆ ఆయుధాలు మెరుస్తూ చూడ్డానికి భయం కలిగించేవిగా ఉన్నాయి. అలంకరించుకున్న జనులంతా ప్రాసాదాలు, ధనికుల ఇళ్లు ఎక్కి సంతోషం లేకుండా వాళ్లని చూశారు. లెక్కలేనంత మంది ప్రజలతో నిండిన వీధులు నడవడానికి శక్యం కాకుండా ఉన్నాయి. అందువల్ల విచారించే ప్రజలు ప్రాసాదాలని ఎక్కి రాముడ్ని చూడసాగారు. గొడుగు లేకుండా నడిచి వెళ్లే రాముడ్ని చూసి ప్రజలంతా విచారమైన మనస్సుతో ఇలా చెప్పుకున్నారు.
‘రాముడు ఎక్కడికి వెళ్లినా వెంట చతురంగ సైన్యం వెళ్లేది. అలాంటి రాముడు ఈ రోజు ఒంటరిగా నడుస్తూంటే, సీతా లక్ష్మణులు మాత్రమే అతని వెంట వెళ్తున్నారు’
‘ఈ రాముడు ఐశ్వర్యాన్ని అనుభవించిన వాడు. కోరికలు గల వారి కోరికలను తీర్చేవాడు. ధర్మం మీద ఉన్న గౌరవంతో తండ్రి మాటని అబద్ధం చేయకూడదని కోరుతున్నాడు.’
‘పూర్వం సీతని ఆకాశంలో సంచరించే వారు కూడా చూడలేక పోయేవారు. అలాంటిది ఈ రోజు రాజవీధుల్లోని ప్రజలంతా చూస్తున్నారు’
‘సీత శరీరానికి ఎర్రటి గంధం, అంగరాగాల్ని పూసుకోడానికి అలవాటు పడింది. అలాంటి సీత దేహ ఛాయని వర్షం, వేడి, చలి మొదలైనవి తొందరగా తగ్గిస్తాయి’
‘సందేహం లేదు. రాజు ఇప్పుడు ఏ భూతమో ఆవహించినట్లు మాట్లాడుతున్నాడు. ఇష్టమైన కొడుకుని ఏ రాజైనా ఊరు నించి వెళ్లగొడతాడా?’
‘గుణాల్లేని కొడుకుని కూడా దేశం నించి వెళ్లగొట్టరు. ఇక మంచి చరిత్రతో ప్రజలందర్నీ ఆకర్షించిన కొడుకు విషయంలో చెప్పాలా?’
‘అందువల్ల అలాంటి రాముడికి అపకారం జరగడం వల్ల ప్రజలంతా గ్రీష్మ ఋతువులో నీరు ఎండిపోవడం వల్ల బాధ పడే జల జంతువుల్లా గొప్ప బాధని అనుభవిస్తున్నారు. ఈ లోకం అంతటికీ ప్రభువైన రాముడికి కష్టం కలగడంతో, ఫల పుష్పాలతో నిండిన వృక్షాన్ని మొదలు నరికినట్లుగా ఈ లోకమంతా కష్టాల పాలవుతోంది’
‘రాముడు ధర్మమే సారంగా కలవాడు, గొప్ప తేజస్సు కలవాడు. ఇతనే మనుషులకి మొదలు. ఇతర జనులంతా ఆ చెట్టు మొదలుతో సంబంధం కల పువ్వులు, పళ్లు, ఆకులు, కొమ్మలు.’
‘అందువల్ల మనం కూడా భార్యాబంధువులతో కలిసి లక్ష్మణుడిలా రాముడు ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి రాముడ్ని అనుసరిస్తూ వెంటనే బయలుదేరి వెళ్దాం. తోటలు, పొలాలు, ఇళ్లని విడిచి రాముడితో సుఖదుఃఖాలు పంచుకుంటూ ధర్మాత్ముడైన రాముడి వెంట వెళ్దాం.’
‘మనం విడిచి వెళ్లిన ఈ నగరంలోని ఇళ్లన్నీ కరువు కాటకాల పాలబడినట్లు పాడుబడి పోతాయి. నిధులన్నీ తవ్వేస్తారు. వాకిళ్లు చెడిపోతాయి. ధనధాన్యాలు, ఇతర సంపదలన్నీ నశిస్తాయి. ఇళ్లన్నీ దుమ్ము పడిపోతాయి. దేవతలు వీటిని విడిచి వెళ్లిపోతారు. ఎలుకలు కన్నాల్లోంచి బయటకి వచ్చి స్వేచ్ఛగా అటు, ఇటు పరిగెత్తుతూంటాయి. నీరు కాని, పొగ కాని కనపడదు. వీటిని తుడిచేవాళ్లు కూడా ఉండరు. వీటిలో బలి కర్మలు, యజ్ఞాలు, మంత్రపఠనం, జప హోమాలు జరగవు. అక్కడక్కడా బద్దలైన కుండలు పడి ఉంటాయి.’
‘రాముడు అడవికి వెళ్తున్నాడు కాబట్టి ఆ అడవే నగరం అగుగాక! మనం విడిచే ఈ నగరమే అడవి అగు గాక!’
‘మనల్ని చూసి భయపడి కోరలు గల పాముల్లాంటివన్నీ పుట్టలని విడిచి వెళ్లుగాక! మృగాలు, పక్షులు పర్వతాలని విడిచిపోవుగాక! ఏనుగులు, సింహాలు అడవిని వదిలి వెళ్లిపోవుగాక! అవన్నీ మనం ఉండే అడవిని వదిలి, మనం విడిచిన అయోధ్యా నగరానికి చేరుగాక!’
‘కొడుకు, బంధువులతో కలిసి కైకేయి క్రూర మృగాలతోను, పక్షులతోను, మాంసపు తునకలని తినే జంతువులతో నిండిన దేశాన్ని పొంది పరిపాలించుగాక! మనందరం రాముడితో కలిసి అడవిలో సుఖంగా నివసిద్దాం’
ప్రజలంతా ఈ విధంగా పలికే మాటలని రాముడు విన్నాడు. అవి విన్నా అతనికి విచారం ఏమీ కలగలేదు. ధర్మాత్ముడు, ఏనుగులా నడిచేవాడు ఐన రాముడు దూరం నించి కైలాస శిఖరంలా కనపడే తండ్రి ఇంటిని చేరుకున్నాడు. వినయవంతులైన, వీర పురుషులు గల ఆ రాజగృహంలోకి ప్రవేశించి సమీపంలో విచారంగా వున్న సుమంత్రుణ్ణి రాముడు చూసాడు. అక్కడ ఉన్న ప్రజలంతా విచారిస్తున్నారు. కాని రాముడు ఎలాంటి విచారం లేకుండా, పైగా నవ్వుతున్నట్లు కనపడుతూ తండ్రి ఆదేశాన్ని అనుసరించే నిశ్చయంతో తండ్రిని చూడటానికి వచ్చాడు. మహాత్ముడు, ధైర్యవంతుడు, ధర్మం మీద ప్రేమ గలవాడు, దశరథ కుమారుడైన రాముడు తండ్రి ఆదేశంతో అడవికి వెళ్లడానికి నిర్ణయించుకుని, విచారించే సుమంత్రుడ్ని చూసి ‘నేను వచ్చినట్లు రాజుకి చెప్పు’ అని చెప్పాడు. (అయోధ్య కాండ సర్గ 33)
ఆశే్లషకి హరిదాసు చెప్పిన నాలుగు తప్పులని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకపోయింది. కారణం అతను హరికథకి వచ్చే ముందే 33వ సర్గని చదివి రావడంతో అవి తెలిసాయి.
మీరా నాలుగు తప్పులని కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
పరశురాముడికి నేడు పూజార్చనలు జరిగే ప్రదేశం ఏది?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
పరశురాముడి అసలు పేరేమిటి? ఆ పేరెందుకు వచ్చింది?
రామభద్రుడు. అతను శివుడి కోసం తపస్సు చేస్తే మెచ్చిన శివుడు పరశువు అనే గండ్రగొడ్డలిని ప్రసాదించడంతో పరశురాముడు అయ్యాడు.
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.ఆ ఏనుగు పేరు శత్రుంజయం. శత్రుభయం కాదు.
2.అగస్త్యుడితోపాటు కౌశికుడ్ని కూడా ఆహ్వానించమని రాముడు చెప్పాడు. కౌశికుడి పేరుని హరిదాసు చెప్పడం విస్మరించాడు.
3.చిత్రరథుడు సారథి కూడా. హరిదాసు అది చెప్పలేదు.
4.బ్రహ్మచారులకి ధాన్యాన్ని మోసే వెయ్యి ఎద్దులని, భూమిని దున్నడానికి రెండువందల ఎద్దులని ఇవ్వమని రాముడు చెప్పాడు. ఆ పనె్నండు వందల ఎద్దుల వివరాలని హరిదాసు చెప్పలేదు.
5.త్రిజటుడు గర్గ వంశంలో పుట్టాడని వాల్మీకి చెప్పాడు. హరిదాసు ఇది చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి