Others

వర్మ పబ్లిసిటీ స్టంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ ప్రముఖులపై చలన చిత్రాలు నాటకాలు నిర్మించటం తరచు జరుగుతూ ఉంటాయి. అవి సకారాత్మకంగానూ నకారాత్మకంగానూ కూడా ఉండవచ్చు. భగత్‌సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారిమీద వచ్చిన చిత్రాలు సకారాత్మకాలు. అలాకాక వ్యంగ్య చిత్రాలు కొన్ని వచ్చా యి. ఇందిరాగాంధీ జీవితం మీద హిందీలో రెండు మూడు చిత్రాలు వచ్చాయి. తెలుగులో మహమ్మద్ బిన్ తుగ్లక్ చిత్రం వచ్చింది. మండలాధీశుడు అనే చిత్రం ఎన్‌టిఆర్ జీవితానికి సంబంధించినదే. ఇందులో వెటకారం ఉంది. ఈ చిత్రం విడుదల అయిన తరువాత చిత్ర రచయిత కొండముది శ్రీరామచంద్రమూర్తి ఇంటిపై దాడి జరిగింది. తమిళంలో ఎంజిఆర్, కరుణానిధి రాజకీయ జీవితాలను చిత్రీకరించే ‘ఇద్దరు’ అనే చిత్రం వచ్చింది.
ఇప్పుడీ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే రాంగోపాల్‌వర్మ అనే దర్శకుడు ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్’ అనే చిత్రాన్ని నిర్మించాలని తలపెట్టాడు. రాకేశ్‌రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్వహిస్తున్నాడు. ఈయన వై.ఎస్.ఆర్ పార్టీకి చెందినవాడు కావటంతో ఈ వార్త ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకోవటం ద్వారా ఇది రాజకీయ ప్రాధాన్యా న్ని కూడా సంతరించుకుంది. ఎన్.టి.రామారావు గొప్ప నటుడు మాత్రమే కాదు ప్రముఖ రాజకీయవేత్త కూడా. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని నిర్మూలించి తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని అధికారంలోకి తెచ్చినవాడు. ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అనే నినాదంతో ఆయన ఘనవిజయం సాధించారు. తర్వాత వచ్చిన మండలాధీశుడు చిత్రం రామారావుగారిమీద సెటైర్.
ఇప్పుడు రాంగోపాల్ వర్మ తీయాలనుకుంటున్న చిత్రం కూడా అలాంటిదేనా? ప్రీ ప్రొడక్షన్ పబ్లిసిటీని ఈయన సాధించాడు. ఐతే అ ది సమాజంలోకి నకారాత్మకంగా వెళ్లింది. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి దేవతల స్థానంలో రామారావు చిత్రపటాలు చాలామంది ఇళ్లల్లో ఉన్నాయి. అలా ప్రజల చేత ఆరాధించబడే వ్యక్తిని ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే ధోరణిలో చిత్రాలు నిర్మిస్తే ప్రజలు తిరగబడతారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తుంది. థియేటర్ల రక్షణకు పోలీసులను ఉపయోగింపవలసి వస్తుంది.
ఇంతకూ సినిమా కథ ఏమిటి? ఎన్‌టిఆర్ రాజకీయ రంగ ప్రవేశం, ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరా వు కుట్రతో పదవిని కోల్పోవటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవటం- ఎన్టీఆర్ తర్వాతి కాలంలో శ్రీమతి లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవటం. దీనివలన ఎన్‌టిఆర్ కుటుంబంలో కలతలు రావటం, తర్వాత ఎన్టీఆర్ మరణం. ఆపైన లక్ష్మీ పార్వతి సింహం గుర్తుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికలలో ఓడిపోవటం- ఇదంతా ఒక సినిమా కథ కావచ్చు.
ఎన్‌టిఆర్ మొదటి భార్య శ్రీమతి బసవతారకం ఆస్తులకు లక్ష్మీ పార్వతి వారసురాలు కావటం ఆయ న కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ గొడవలన్నీ ఇప్పుడెందుకు? పాతికేళ్ల నాటి పాత పురాణాలు ఇవ్వాళ తెరకెక్కించవలసిన అవసరం ఓ దర్శకునికి ఎందుకు వచ్చింది? అంటే ఇందులో రాజకీయ ప్రేరణ ఉన్నదనేది విశే్లషకుల భావన. రాంగోపాల్ వర్మ ఏం చేసినా ఒక సంచలనమే. హైదరాబాద్‌లో ఈమధ్య కొందరు సినీ ప్రముఖులు నిషిద్ధ మాదకద్రవ్యాలు సేవించిన కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అప్పుడీయన చట్టాన్ని కాక సినీ ప్రముఖులను సమర్థించాడు. ఫిలిం పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే ‘మా’ సంస్థ క్షమాపణ చెప్పింది. ‘‘అలా క్షమాపణ చెప్పటం అంటే నేరాన్ని అంగీకరించటమే’’ అన్నాడు వర్మ. ఈయన తెలుగువాడు కాబట్టి వంగవీటి మోహనరంగామీద, నందమూరి తారక రామారావుమీద చిత్రాలు నిర్మించే జన్మ సిద్ధ అధికారం ఉన్నదని భావించటం పొరపాటు.
తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్మ చిత్ర నిర్మాణాన్ని విమర్శించాడు. అప్పుడు వర్మ మాట్లాడుతూ- కావాలంటే చంద్రమోహన్‌రెడ్డి తన చిత్రంలో హీరో వేషం వేయవచ్చునని వెటకారం చేశాడు. ‘‘అలాగే వేస్తాను కానీ లక్ష్మీ పార్వతి హీరోయిన్ వేషం వేయకూడదు’’ అంటూ చంద్రమోహన్‌రెడ్డి చురక అంటించాడు (12-10-2017). ఇదంతా జనానికి కించిత్ వినోదంగా ప్రహసనంలాగా కన్పించినప్పటికీ దీని వెనుక మనం గమనించవలసిన వౌలికాంశం ఏమంటే చిత్ర నిర్మాణాన్ని ఇలా అశ్లీల స్థాయికి ఎందుకు దించుతున్నారు? సినిమా తీయడానికి ఇతివృత్తాలు లేవా? శాతవాహనుల కాకతీయుల విజయనగర రాజుల వంటి ఎన్నో స్వర్ణయుగాలున్నాయి. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మీద, టంగుటూరు ప్రకాశం పంతులుగారిమీద, అమరజీవి పొట్టి శ్రీరాములుమీద చలన చిత్రాలు నిర్మించవచ్చు. అంతేకాని ఈ లక్ష్మీస్ ఎన్‌టిఆర్ ఏమిటి?! ఇందులో దర్శకునికి నిజాయితీ లేదని అనిపిస్తున్నది.
ఆమాటకొస్తే ఈయన కె.విశ్వనాథ్, బాపు, శాంతారాంల వంటి కళాత్మక చిత్రాలు నిర్మించే దర్శకుడు కూడా కాదు. కేవలం సెనే్సషన్‌వల్ల పబ్బం గడుపుకోవాలనే ధోరణి ప్రమాదకరమైనది. మనం జీవితంలో చేయడానికి ఎన్నో మంచి పనులున్నాయి. ఒకవేళ అవి చేతకాకపోతే ఊరకుండవచ్చు. చెడ్డ పనులు చేయకపోవటం కూడా మంచి పని కిందికే వస్తుంది.
భారతదేశ చరిత్రలో నరేంద్ర మోదీ యుగం మొదలయింది. ఇప్పుడు నాదెండ్ల భాస్కరరావు తరాన్ని ప్రజలు మరచిపోయారు. హిందీలో ఇందూ సర్కార్ అంటూ 1975 నాటి ఎమర్జెన్సీని గుర్తుచేసే ఒక చిత్రం వచ్చింది. బహుశా వర్మకు ఈ చిత్రం ప్రేరణ ఇచ్చి ఉండవచ్చు. ఒకవేళ మనం ఈ చిత్రాన్ని ఆమోదిస్తే ఆ తర్వాత ‘జయాస్ శోభన్’ అనే మరో చిత్రం నిర్మిస్తాడు. ఇది అవాంఛనీయం. ప్రజలకు మానసిక వికాసం కలిగించే చిత్రాలు రావాలి కాని జనాలను రెచ్చగొట్టే చిత్రాలు నిర్మించకూడదు.
వర్మ వండి వార్చే ఈ కషాయం వికటిస్తుంది. ఆంగ్లంలో దీనిని బూమరాంగ్ అంటారు. లక్ష్మీ పార్వతి మీద నాకు గౌరవం ఉంది. ఇటీవల చారిత్రక నవలలు వ్రాసి మా పరంపరలోకి చేరింది. ఆమె ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించకూడదు.
16-10-2017 నాడు పత్రికా విలేఖరులతో అనంతపురం ఎంఎల్‌ఏ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ- ‘‘వర్మ ఒక సైకో. అతడు ఎన్‌టిఆర్‌ను దుర్మార్గంగా చిత్రిస్తూ సినిమా తీస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది’’ అని హెచ్చరించారు.
వర్మకు శిష్యతుల్యుడైన ఒక దర్శకుడున్నాడు. ఆయన పేరు తేజ (లోగడ ‘శివ’ చిత్రం ఫేం). ఈయన ఎన్‌టిఆర్ జీవితంలో ప్రథమభాగం అంటే పుట్టినప్పటినుండి ముఖ్యమంత్రి అయినంతవరకు ఉన్న కథను తెరకెక్కిస్తున్నాడు. అందులో ప్రకాశ్‌రాజ్‌ను ఎన్‌టిఆర్ పాత్ర వేయవలసిందిగా కోరటం, తర్వాత విరమించుకోవటం జరిగింది. ఈ చిత్రానికి ఎన్‌టిఆర్ కుమారుడు బాలకృష్ణ నిర్మాత. బ్రహ్మ-తేజ అనే బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరుగవచ్చు. ఇది కూడా 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వస్తున్నదే అని వేరే చెప్పనక్కరలేదు. ఇది వర్మ చిత్రానికి ‘పోటీ’ అని అర్థం అవుతూనే వుంది.
‘‘నా చిత్ర నిర్మాణం విషయంలో నేను బహిరంగ చర్చకు సిద్ధం, రండి’’ అని వర్మ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై సవాలు విసిరాడు. ‘‘నేను కాదు సరికదా మా పాలేరు కూడా రాడు’’ అని చంద్రమోహన్‌రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చాడు.
ఈ మొత్తం వ్యవహారం చూస్తే వర్మ చేస్తున్నది ‘ప్రీపబ్లిసిటీ స్టంట్’ అని అర్థం అవుతున్నది.
తెలుగుదేశం పార్టీకి చెందిన అనిత అనే ఎంఎల్‌ఏ మొన్న మాట్లాడుతూ- ఎన్‌టిఆర్, చంద్రబాబులను కించపరిచేవిధంగా చిత్ర నిర్మాణం చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఇలా వివాదం రోజురోజుకూ రాజుకుంటున్నది.
13-10-2017 నాడు బ్రదర్ అనిల్‌తో వర్మ సమావేశంలోని ఆంతర్యం ఏమిటి అంటే ఈ చిత్ర నిర్మాణం వెనుక రాజకీయ మత ప్రయోజనాలున్నాయని అంటున్నారు.
ఎన్‌టిఆర్‌ను ‘తక్కువ’ చేసి చూపిస్తే వర్మ ఇంటిముందు సత్యాగ్రహం చేస్తాను అని నటి వాణి విశ్వనాధ్ ప్రకటించింది. ‘నాకు ఇల్లే లేదు’ అంటూ వర్మ ఓ చమత్కారం విసిరాడు. ఇల్లు లేకుంటే మరి బొంబాయిలో ఎక్కడ ఉంటున్నాడు- అరేబియా సముద్రంలోనా?

ప్రొ. ముదిగొండ శివప్రసాద్