AADIVAVRAM - Others

బహుళార్థ సాధకాలు కాకతీయ యుగ దేవళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిలేని ఊరు నీరులేని ఏరు
గుడిలేని వాడ దయ్యాల మేడ
గుళ్ళు-గోపురాలు, శిలలు-శిల్పాలు ఒక స్వర్ణ యుగాన్ని అనుభవించిన సువర్ణ్భూమి త్రిలింగ భూమి. ఈ తెలుగునాడు మొత్తాన్ని కళల కాణాచిగా, కాంచన కాశ్యపీ ఖండంగా ప్రపంచానికి ఆవిష్కరించి చూపిన కమనీయ కాలం కాకతీయ యుగం.
కాకతీయుల ఏలుబడి కాలంలో కట్టిన కోవెలలు పలు ప్రజాహితార్థక, ఇహపరసాధక కేంద్ర స్థానాలుగా తెలుగునాట ఆంగ్లేయ పాలన వచ్చే వరకూ - అంటే సుమారు ఆరువందల సంవత్సరాల వరకూ కూడా - చక్కగా, ‘చిక్కగా’ విరాజిల్లాయి. అవి అనేకానేక సాంస్కృతిక కార్యకలాపాలకు, వివిధ వృత్తుల వారి శ్రేయోదాయక ప్రయోజనాలకు, జనసామాన్య ఆనందోత్సాహ కల్పనలకు, ధీమాన్య వర్గ మేధో వికాస పరిణతి సాధనలకు ప్రముఖ కారకాలు, ఇతోధిక ప్రోద్బలకాలు అయినాయి.
అంతేకాదు. ఆనాటి గుడుల రాళ్లు, ఆ శాసనాలు కేవలం మతాచార - సంప్రదాయ - ఆగమశాస్త్ర సంబంధ అంశాలపరంగానే కాకుండా సామాజిక - రాజకీయ చారిత్రకాంశాలు మనకు చెప్పటానికి కూడా చెరగని, చెదరని సాక్ష్యాలుగా నేడు మనకు అవి విస్తృత, అనన్య సామాన్య వాఙ్మయసేవ చేస్తున్నాయి.
ఆ దేవాలయాలు పదిమంది రాకపోకల కూడళ్లు కావటం వల్లనే ఆ గుళ్లున్న గ్రామాలు తరువాత తరువాత పట్టణాలుగా, గొప్ప వాణిజ్య కేంద్రాలుగా, ఆర్థిక పురోగతి కీలకస్థానాలుగా రూపోన్నతి పొందాయి. ఉదాహరణకు కాకతీయుల కోటలోని స్వయంభూ దేవుని ఆలయం, హనుమకొండ వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం, వరంగల్ పాంచాలరాయ, కాకతి, ఏకవీర , కొండమీది పద్మాక్షి ఆలయం, ప్రసన్న కేశవాలయం, చేరువలోని ములుగు తాలూకా రామప్పగుడి మొదలైన దేవళాలవల్ల వరంగల్లు, కాళేశ్వరాలయం దగ్గరలోని కరీంనగర్, నల్లగొండ (పానగల్లు), కొలనుపాక (ఆలేరు), అలంపూర్, శ్రీశైలం, పాలకొల్లు, భీమవరం, విజయవాడ, మహానంది - ఇలా లెక్కకు మిక్కిలిగా చెప్పవచ్చు.
ఆ రోజుల్లో - ముఖ్యంగా కాకతీయుల కాలంలో - దాదాపు ప్రతి ప్రసిద్ధ దేవాలయము ఒక మండలేశ్వరుడో, ఒక సంస్థానాధీశుడో తనకు తానుగా నడుపుకునే ఒక అధికార మండలంగా ఉండి, పది రకాల వృత్తుల వారికి పలు రకాల పనులు కల్పించి, ‘కూడు-గూడు-గుడ్డ’ అనే త్రివిధ ప్రాథమిక అవసరాలకు లోటు లేకుండా చేస్తూ జనజీవన ప్రదాతగా నిట్టనిలువుగా ఆకాశంలోకి గాలి గోపురపు తల ఎత్తుకొని గర్వంగా, హుందాగా చూస్తూ ఉండేది. ఇప్పటికీ కొన్ని దేవాలయాలు ఆనాటి ప్రజాసేవా శోభకు ఆనవాళ్ళు. అంతేకాదు అవి ఎప్పటికీ బాటసారులకు, త్రోవ తప్పిన వాళ్ళకు, చీకటిపడి గమ్యం చేరని వాళ్ళకు కొండగుర్తులుగా, మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి.
కాకతీయ రాజులు దాదాపు ప్రతి ముఖ్య దేవస్థానాన్ని (దేవాలయ నిర్వహణ మండలిని) ఎనిమిది విభాగాలుగా రూపొందించారు (ఎస్టాబ్లిష్ చేశారు). అవి: (1) భూస్వామిగా (2) యజమానిగా (3) సరుకులు, సేవల వినియోగదారుగా (4) బ్యాంక్‌గా (5) పాఠశాలగా (6) వైద్యశాలగా (7) వస్తు ప్రదర్శనశాలగా (8) రంగస్థలంగా.
ఇలా సంస్కృతి, నాగరికత, జీవనోపాధి పరికల్పన, ధర్మభావ పూర్వక మానవీయత అనే నాలుగు అంశాలకు సమప్రాధాన్యం ఇస్తూ, ఆ నాలుగింటికీ సమగ్ర కేంద్ర బిందువులుగా రూపొందిన ఆనాటి భారతీయ దేవస్థానాల వంటివి మానవ నాగరికతా వికాస చరిత్రలో మరోచోట లేవు అంటారు కె.ఎన్.శాస్ర్తీ ‘ది చోళాన్’ అనే గ్రంథంలో.
దేవాలయ భూస్వామి.. దేవాలయమే భూస్వామి. రాజులు, సామంతులు, శ్రీమంతులు తమకిష్టమైన ఏదో ఒక దేవాలయానికి గ్రామాలు, మాన్యాలు దానం చేసేవారు. క్రీ.శ. 1313 నాటి ప్రతాపరుద్రుని శాసనం ప్రకారం శ్రీశైల మల్లికార్జున స్వామి గుడికి డెబ్బై గ్రామాలుండేవి. ఆ గ్రామాలకు ‘దేవ వృత్తులు’ అని పేరు పెట్టారు కాకతీయులు. ప్రతాపరుద్రుడు ప్రాంతీయ భేదాలకు అతీతంగా పాండ్య రాజ్యంలోని శ్రీరంగ దేవాలయానికి ప్రకాశం జిల్లాలోని సలకలవీడు గ్రామాన్ని దానం చేశాడు. ఆనాటి రాజుల దైవభక్తి ఎలా ఉండేదంటే దేవాలయ భూములపై నామ మాత్రపు పన్ను తీసుకునేవారు. దేవాలయ భూములను కౌలుకు తీసుకొని ఎందరో రైతులు జీవనోపాధి సమకూర్చుకునేవారు.
యజమాని.. గుడి నిర్వహణ ఆచార బద్ధంగా, ఆగమశాస్త్రానుసారంగా, సమయపాలనా, సమన్వితంగా, నిర్దుష్టంగా, సక్రమంగా జరగటానికి, జరిపించటానికి, నాలుగు రకాల విధులతో కూడిన ఉద్యోగుల మండలి ఒకటి ఉండేది. ఆ మండలే సమష్టిగా ఆ గుడికి యజమాని. ఆ మండలి యొక్క యాజమాన్యంలో పనిచేసే నిర్వాహకులు నాలుగు రకాలు. వారు (1) స్థాన పతులు - లేక - స్థానాచార్యులు (2) మానులు (3) సానులు (4) నిబంధకాండ్రు - లేక - కరణ కర్మకులు (క్రీ.శ. 1135 నాటి వెలనాటి గొంకరాజు సాతులూరు శాసనం ప్రకారం).
స్థానపతుల పదవిలో ఉన్నవాళ్ళు కొందరు పూజారి పని కూడా చేసేవాళ్లు స్థానపతిగా వేరే మరొకరు లేనప్పుడు. స్థానపతి దేవాలయ ఆచార, సంప్రదాయ, ధర్మశాస్త్ర మార్గ బోధకుడుగా ఉండేవాడు.
మానులుగా పురుషులే ఉండేవారు. ‘మానులు’ అనేది మాన్య శబ్ద్భవం. వీరు పూజారికి, స్థానపతికి కార్యనిర్వహణలో కావలసిన సమయ సందర్భావసర సహాయ కార్యసహకారాలు అందిస్తూ ఉండేవారు.
సానులుగా స్ర్తిలే ఉండేవారు. సానులు ‘స్వామిని’ శబ్ద్భావం. సానులు అంటే వేశ్యలు కాదు. దేవాలయంలో స్వామివారి దైనందిన అర్చన కార్యక్రమాంతంలో ‘రంగ మండపం’ వేదిక మీద నాట్యం చేసేవారు. వీరందరూ సల్లక్షణమైన గృహిణీమణులు. దాతల దానాలే వీరి జీవనాధారాలు. భగవత్పూజాసమయ షోడశోపచారాలలో కావ్యాలాప, వాద్య గాత్ర, సంగీత, నృత్యాలు కూడా ఉంటాయి. ఆ సందర్భంలో వీరు నిశ్చలమైన మనస్సుతో తాండవమాడేవారు.
నాగార్జున సాగరంలో మునిగిపోయిన ఏలేశ్వరంలో క్రీ.శ. 1271 నాటి ఒక శాసనం మంకిసెట్టి అనే వ్యక్తి తన ఇద్దరు మనుమరాళ్లను ఏలేశ్వర స్వామికి సానులుగా అర్పించినట్టు తెలియజేస్తోంది (ఏలేశ్వర ఎక్స్‌కవేషన్స్ బుక్ పేజ్-63).
ఇక నిబంధకాండ్రు అనే ఉద్యోగి వర్గంలోని వాళ్లు ఎవరంటే వంటవాళ్లు, నీళ్లు మోసే వాళ్లు, ఊడ్చేవాళ్లు, శంఖమూదేవాళ్లు, తాపీ పనివాళ్లు, కాపలాదార్లు మొదలైనవాళ్లు. వీళ్ళలోనే నట్టువుడు అనే నాట్యకారుడు గూడా ఒకడుండేవాడు.
‘రంగ భోగం’ అనే రసాత్మక సాంస్కృతిక కార్యక్రమానికి ఉపయోగించే ‘రంగ మండపం’ ప్రసిద్ధ దేవాలయాలన్నిటిలోనూ ప్రత్యేకంగా ఒకటి ఉండేది. ఆ వేదిక మీద వివిధ రకాల వాద్యగాళ్లు దాదాపు 20 మంది ఉండేవాళ్లు. అంతమంది శ్రమపడి జానపదులకు ఆనందోత్సాహాలు అందించేవాళ్లు.
స్థాన పతి - పూజారి, మానులు, సానులు, నిబంధకాండ్రు - మొత్తం అందరూ కలిపి వందల కొద్దీ ఉండేవాళ్లు. వాళ్ళందరికి జీతాలో, వృత్తులో (అంటే సేద్యపు భూములో) ఏవో కొన్ని ఏర్పాటయ్యుండేవి. ఇంత కార్యనిర్వాహక మండలి జనంతోపాటుగా దేవాలయం మీద ఆధారపడి ఎన్నో రకాల వస్తు వర్తకదారులు, బయటి పురోహితులు, యాచకులు గణనీయ సంఖ్యలో బ్రతికేవాళ్లు. ఇలా లోపలి, బయటి వ్యావృత్తుల వాళ్లు, వాళ్ల కుటుంబ జనులు అంతా కలిపితే కొన్ని వేల మందికి అంటే దాదాపుగా ఒక ఊరంత జనానికి పొట్టగడిచేది.
సేవల, సరుకుల వినియోగదారుగా దేవాలయం
ప్రజలు దైవభక్తితో యథాశక్తిగా దేవాలయాలకు ధాన్యమో, పండ్లో, బెల్లమో, ఆవులో, ఎద్దులో, గొర్రెలో, నర్తకీమణులనో సమర్పించుకునే వారు. ఇలా ఈ ఆవులు, ఎద్దులు మొదలైన వాటి సమర్పణకు వేములవాడ రాజేశ్వరాలయం నేటికీ నిలచి ఉన్న ఒక ఆచారపు ఉదాహరణ. వీటన్నిటి యొక్క వినియోగదారు దేవళమే. వినియోగిత వస్తు ద్రవ్యమంతా చివరకు మళ్లీ గ్రామస్థులకే. రోజూ ప్రసాదాలు పంచేదీ ఆలయ సేవకులకు, పేదలకే. దాక్షారామ భీమేశ్వరుడికి వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు, ఆవులు దానాలుగా వస్తుండేవి అని ఆ గుడి గోడల శాసనాలు తెలియజేస్తున్నాయి.
విద్యా సంస్థగా దేవాలయం
ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం దాతలు, రాజులు, దేవాలయాలకు విరాళాలిచ్చే వాళ్లు. వాటితో దేవాలయాలు పాఠశాలలు నడిపేవి. దీనికి ఉదాహరణ శ్రీశైల దేవస్థానం, గుంటూరు జిల్లా మల్కాపురం గుడి.
వైద్యశాలగా దేవళం
కొన్ని దేవళాల యాజమాన్యాలు వైద్యశాలలు కూడా నడుపుతూ శారీరక బాధార్తులను, జరారుజార్తులను ఆదుకునేవి. ఈ పని ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తూనే ఉన్నది విద్యాలయాలతోపాటుగా.
పురావస్తు ప్రదర్శన శాలగా.. అనుమకొండ, పాలంపేట, పిల్లలమర్రి, ఘనపురం, పానగల్లు, వరంగల్లు, రామప్పగుడి మొదలైనవన్నీ కాకతీయ కళావైభవ ప్రదర్శనశాలలే.
రంగ మండపం.. ప్రతి ప్రసిద్ధ దేవాలయంలోను ఒక ‘రంగ మండపం’ నిర్మించేవాళ్ళు ఆనాటి ఏలికలు గాని, వదాన్యులు గాని, కళాపోషకులుగాని, పర్వదినాల వేడుకలు, ఉత్సవాలు, సంగీత, కావ్యగాన, నాటక, హరికథాదులు, సాంస్కృతిక సమ్మేళనాలు, తాత్త్విక సభలు, ఆధ్యాత్మిక చర్చలు, సాహిత్య గోష్ఠులు - అన్నిటికీ ఆ రోజుల్లో సానుకూల వాతావరణ స్థలం దేవాలయ ‘రంగ మండప’మే.
కమ్యూనిటీ హాలుగా దేవళం.. సాధారణంగా గ్రామసభలు, గ్రామ సమస్యా పరిష్కార సమావేశాలు - అన్నీ దేవాలయంలోనే జరిగేవి ఆ శతాబ్దాలలో, పాలకులు, అధికార వర్గాల వాళ్లు కూడా జనతను దేవాలయాలలోనే కలిసే వాళ్లు. అప్పుడు పాలకులకు - పాలితులకు మధ్య జరిగిన ఒప్పందాలను, నిర్ణయాలను గుడిగోడలపై శిలాక్షరాలుగా చెక్కించేవాళ్లు. కొన్నికొన్ని సందర్భాలలో ప్రమాణాలు, ప్రతిజ్ఞలు కూడా కోవెల కుడ్యాలమీదనే చెక్కించుకునే వాళ్లు. ఎందుకంటే గుడి అనేది ఎప్పుడూ జనం రాకపోకలతో సందడిగానే ఉంటుంది కాబట్టి, ఆ రాతి రాతలను ఎవరైనా మార్చటానికి వీలుపడదు కనుకను.
గ్రామీణుల పెళ్లిళ్లు కూడా చాలా వరకు గుళ్లలోనే జరిగేవి పవిత్ర స్థలం అనే భావనతో.
ఇక రామప్పగుడి, వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం వంటి వాటిలోని కళాత్మకపు విలువలు, అప్పటి అసాధారణ శిల్పుల, కార్మికుల నైపుణ్యాలు, పనితనాలు, వాటి నిర్మాణార్థ సుదీర్ఘ కాలపరిణామాలు, పలు వృత్తుల వారి జీవనోపాధులు, జీతాలు, రాబడులు, వర్తకుల వాణిజ్యాలు, దేవుడి మాన్యాలను సాగుచేసే రైతుల బ్రతుకు తెరువుల వెసులుబాట్లు, విద్యావంతులకు సమర్హ సముచిత పురోగతి సావకాశాలు మొదలైన వాటికన్నిటికి ఆధార కేంద్రాలు అప్పటి దేవస్థానాలే.
సారాంశం ఏమిటంటే కాకతీయుల కాలంలో దేవళాలు ఆముష్మిక ఫలార్థక ప్రధాన ఆధార కేంద్రాలే కాదు - సామాజిక వృత్తుల వారి ఐహిక శ్రేయోమార్గ లక్ష్యసాధనాలు కూడా. కాకతీయ సామ్రాజ్య సాంస్కృతికపు విలువలకు నాటి దేవాలయాలు నేటికీ మణి దర్పణాలు.
గుడి కొఱకు కొందఱున్నను
గుడి కట్టి సకల జనులును కోరెడి మేళ్ళన్
గడియించి పెట్టు దీక్షన్
గడిదేఱిన కాకతీయ! కైమోడ్పులివే.
*
చిత్రం..రామప్ప గుడి

శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290