AADIVAVRAM - Others

నన్నయకు ముందు తెలుగు నుడి మేర ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్యానికి ఆదికవి నన్నయ అని, ఆయన అనువాదంగా రచించిన ‘మహాభారతము’ ఆదికావ్యమని మనం భావిస్తున్నాం. అయితే, నన్నయకు ముందు తెలుగు నుడి ఎంతవరకూ ఎదిగింది? అప్పటికి గ్రంథ రచన, కావ్యరచన జరగలేదా? అనే ప్రశ్నలుదయిస్తాయి. అప్పటికే తెలుగు భాష అభివృద్ధి చెందింది. కాని సమగ్ర కావ్యం మాత్రం తెలుగులో రచింపబడలేదు. ఎఱ్ఱాప్రగడ గారి మాటల్లో చెప్పాలంటే, అంతకుముందు ‘గాసట, బీసటే చదివి గాథలు త్రవ్వేవారు’ పండితులప్పటికి.
శక తేదీలతో చెప్పలేము కాని, నన్నయకుముందే తెలుగు భాష ప్రాచీనమైనది. అది మూల ద్రావిడ భాష నుండి విడివడినదే. కొండ, కొలామి, పైశాచీ భాషల ప్రభావం తెలుగు మీద వున్నది. గుణాఢ్యుడు ‘బృహత్క్థను’ పైశాచీ భాషలోనే వ్రాశాడంటారు. తెలుగు ఎదగకముందు, ఈ మూడు భాష భాషలే ఈ ప్రాంతంలో ప్రాకృత భాషలై వుండవచ్చును. ఇతర దక్షిణ దేశ భాషల, ముఖ్యంగా తమిళం యొక్క ప్రభావాన్ని, తెలుగుమీద కాదనలేం. అందుకే శబ్దార్థ లాలిత్యమైన ‘కుదుళ్ళు’తో తెలుగు నుడి ప్రభవించింది!
ప్రారంభంలో జనపథాల్లోని జన బాహుళ్యంలోనూ, నాగరిక జనంలోనూ తెలుగు పలుకుబడి ఒకలాగే వుండేది. అందరూ ‘అప్పటపు’ తెలుగునే (స్వచ్ఛమైన తెలుగును) మాట్లాడేవారు. పెర, పరభాషల కలగలుపు తక్కువ.
అయితే, అప్పటికి తెలుగులో వ్రాలు (లిఖితం) కాబడినవి తక్కువ. ప్రజలందరూ అప్పటపు తెలుగు నుడిలోనే మాట్లాడుకునేవారు. తమ సుఖ దుఃఖాలను, భావోద్రేకాలనూ పాటలుగా అల్లుకుని పాడుకునేవారు. కాని, ఇవేమీ కూడా వ్రాలు చేయబడలేదు. తెలుగు పొలవరలు (పండితులు) మాత్రమే భావాలను కొన్నింటిని వ్రాలు చేసి వుండవచ్చును.
శాతవాహనుల కాలం వరకూ తెలుగు నుడి ప్రయాణం ఇలాగే నడిచింది. అయితే ఆ తర్వాత సంస్కృత పద మేళవింపు తెలుగులోకి ఎక్కువ జరిగింది. ఎందుకంటే, అప్పటి పొలవరలు సంస్కృతానే్న ఎక్కువగా చదివేవారు. సంస్కృతంలోనే రచనలు చేసేవారు. రాజస్థానాల్లో ఇటువంటి పొలవరలే వుండేవారు. రాజులు వీరిని పోషించి ప్రోత్సహించేవారు. అప్పటపు తెలుగులో పుట్టిన పాటలకు, గాథలకూ రాజాదరణ లేకపోయింది. ఫలితంగా పొలవరలు మాట్లాడే, వ్రాలు చేసే తెలుగు నాగరికమైనదని, జనపథాల్లో రైతులు, కూలీలు, ఇతర వృత్తులవారూ మాట్లాడే తెలుగు అనాగరికమైనదని, ‘వికృతమైన’ తెలుగు అని వాడుక వచ్చింది.
అయితే, తెలుగు సాహిత్య నుడిగా ఎప్పటినుండి ఎదగడం మొదలైనదీ అనేది తెలుసుకోవలసిన విషయం. ఇందుకు మనకు శాసనాలే తప్ప గ్రంథాలు లభించలేదు. కడప పెనె్వంటము (జిల్లా, ప్రాంతము)లో లభించిన శాసనము తెలుగులో మొదటిదని ఇప్పటికి భావించబడుతోంది. ఇది గద్యశాసనం! రేనాటి చోళులు 6వ శతాబ్దంలో వేయించినది. క్రీ.శ. 8వ శతాబ్దం నుండి తెలుగులో పద్య శాసనాలు లభిస్తున్నవి. తెలుగులో మొదట ‘ద్విపద’ ప్రారంభమైనదని తెలుస్తున్నది. నాలుగు ద్విపదలు ఒక ‘తరువోజ’ కావడం పరిణామ వికాసం! 9వ శతాబ్దంలో గుణక విజయాదిత్యుని అద్దంకి శాసనంలో తరువోజ పద్యముంది. అందువలన అద్దంకి శాసనానికి ముందే తెలుగు జానపద వాఙ్మయంలో ద్విపద వుందని మనం భావించవచ్చును.
గుణక విజయాదిత్యుని కందుకూరి శాసనంలో ‘సీసము’ ‘ఆటవెలది’ పద్యాలున్నవి. విరియాల మల్లుని సానుబంధ శాసనంలో (క్రీ.శ.1005 సం.లో) ‘చంపకమాల’, ‘ఉత్పలమాల’లున్నవి. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో (10 శతాబ్దం) ‘మధ్యాక్కరలు’న్నవి. జినవల్లభుడు (పంపకవి తమ్ముడు) వేయించిన తెలుగు శాసనంలో ‘కంద’ పద్యములున్నవి. ఇవే తెలుగులో లభించిన మొదటి కంద పద్యాలుగా భావించబడుతున్నవి. యుద్దమల్లుని బెజవాడ శాసనానికిది ఇంచుమించుగా సమకాలీనమైనది.
జినవల్లభుడు ‘మహాభారతము’ కన్నడంలోకి అనువదించి రచించిన పంపకవికి తమ్ముడు. కన్నడ కవి తెలుగులో శాసనం వేయించడమా అంటే, అసలు పంపకవి తెలుగువాడేననే వాదముంది (ఈ వ్యాసంలో స్థలాభావంతో ఆ వివరాల్లోకి వెళ్లడంలేదు) తరువోజ, సీసము, ఆటలవెలది, మధ్యాక్కర దేశీయ చందస్సులు. అంటే తెలుగు చందస్సులు. చంపకమాల, ఉత్పలమాల, కందము సంస్కృత చందస్సులు.
‘నందమపూడి’, ‘మండ’ శాసనాలను నన్నయభట్టు రచించారు. ‘కోరుమిల్లి శాసన’కర్త భేతనభట్టు. విమలాదిత్యుని ‘రణస్థపూడి’ శాసనకర్త భీమనభట్టు. ‘పడకలూరు’ శాసనకర్త మాధవభట్టు. రెండవ అమ్మరాజు విజయాదిత్యుని ‘ఎలమర్రు’ శాసనకర్త పోతన భట్టు! ఎవరీ భట్టులు? మహాభారతం అవతాశికలో నన్నయ భట్టు తనను గురించి తాను, రాజ రాజ నరేంద్రుని ‘కుల బ్రాహ్మడను’ అని చెప్పిన విధంగా, ఈ భట్టులందరూ చాళుక్య రాజ వంశానికి వంశపారంపర్యంగా వస్తున్న కుల బ్రాహ్మణులా? అయితే నన్నయభట్టుకు వీరేమవుతారు? ఇది మరింత వెతుకులాట (పరిశోధన) వలన తెలియవచ్చును.
ఈ నేపథ్య సమాచారంవలన మనకు తెలిసేదేమిటంటే, నన్నయకు ముందు తెలుగు వృద్ధి చెందిన భాష! గద్యముంది. చందోబద్ధమైన పద్యం పరిణామం చెందింది. వ్యాకరణము, చందస్సు ఏర్పడ్డాయి. అయితే సమగ్రమైన కావ్యరచన జరగలేదు. తెలుగులో మొదటి సమగ్ర కావ్యం ఆంధ్ర మహాభారతం! అయితే కొందరు అంతకుముందే కావ్యరచన జరిగి వుంటుందని అంటున్నారు. జరిగి వుంటే అవి ఏవి? ఎక్కడ లభించలేదు. ఊహలో మాత్రమే చెబుతున్నారు. నన్నయకు ముందు ‘గాసట బీసటే చదివి గాథలు తవ్వుచు తెనుంగువారు’ అని ఎఱ్ఱాప్రగడ అన్నమాటలను మనం ప్రమాణంగా తీసుకొనవచ్చును. ఎందుకంటే, ఎఱ్ఱన నన్నయకు దగ్గర కాలంవారు. భారతమును ఆంధ్రీకరించిన కవిత్రయములో ఒకరు! నన్నయకుముందు ఏవైనా కావ్యాలు రచింపబడి వుంటే, ఆయనకు తెలుస్తుంది. అందుకే ఆయనలా అన్నారు.
సమగ్ర పరిశోధన జరపకుండా, ఊహించి చరిత్ర గురించేదీ చెప్పకూడదు. ‘చరిత్ర’ అంటే నిజనిర్థారణతో చెప్పిన ‘మనిషికథ’. Hi-story!
*

-మనె్న సత్యనారాయణ 9989076150