Others

చిక్కడు - దొరకడు(ఫ్లాష్‌బ్యాక్@50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ తాలూకా కొత్త నిమ్మకూరుకు చెందిన ధాన్యం వ్యాపారి కుదరవల్లి నరసయ్య, వీరి కుమారుడు కుదరవల్లి సీతారామస్వామి. కొంతకాలం ధాన్యం వ్యాపారం, కొంతకాలం బస్ కండక్టర్‌గా పనిచేశారు. 1967లో వీరి స్నేహితులు పొట్లూరి వెంకట నారాయణరావుతో కలిసి లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘చిక్కడు- దొరకడు. ఆ తరువాత పొట్లూరి వెంకట నారాయణ వీడిపోయినా, ‘కదలడు-వదలడు’, ‘రైతేరాజు’, ‘నా పేరే భగవాన్’, ‘ముగ్గురూ ముగ్గురే’ చిత్రాలు- ఆపైన ‘మామా అల్లుళ్ళ సవాల్’ కైకాల సత్యనారాయణ సమర్పణలో నిర్మించారు. ఈ చిత్రం 21-12-1967న విడుదలైంది.
మంత్రాలు, మాయలు, జంతువులతో విన్యాసాలు, దెయ్యాలు, భూతాలతో కూడిన పలు విజయవంతమైన జానపద చిత్రాల నిర్దేశకునిగా, నిర్మాతగా, జానపద బ్రహ్మగా వాసిగాంచిన బి.విఠలాచార్య ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం నిర్వహించారు.
ఈ చిత్రానికి రచన వేటూరి, కళ బి.నాగరాజన్, స్టంట్స్ శివయ్య, ఫొటోగ్రఫీ హెచ్.ఎస్.వేణు, ఎడిటింగ్ ఎస్.గోవిందస్వామి, సంగీతం టి.వి.రాజు, నృత్యం చిన్ని, సంపత్, పాటలు వీటూరి, నారాయణరెడ్డి. చిత్రంలో టైటిల్స్ వెరైటీగా రూపొందించడమేకాక స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా చూపినవారు కె.ఎస్.మణి, కో-డైరెక్టర్ వైకుంఠం రామస్వామి, బి.వి.శ్రీనివాస్, నిర్మాతలు పొట్లూరి వెంకట నారాయణ, కుదరవల్లి సీతారామస్వామి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- బి.విఠలాచార్య.
3వ రాజ వంశాలకు చెందిన కథ. మాళవరాజ్య ప్రభువు మిక్కిలినేని, భార్య సునందాదేవి (మోహన) సంతానం లేక విచారిస్తుంటారు. వారికి జటానంద స్వామి (వడ్లమాని విశ్వనాథ) సంతాన కామేశ్వరి ప్రసాదంగా రెండు మామిడిపండ్లనిచ్చి, వాటిని భుజిస్తే మహారాణి సంతానవతి అవుతుందని చెబుతాడు. వాటిని భుజించిన మహారాణి ఇద్దరు కవల పిల్లల్ని కంటుంది. మహారాజు బావమరిది త్యాగరాజు, తన కుమారుడు ప్రచండుడికి రాజ్యం లభించాలని ఆ పిల్లల్ని హతమార్చమని భటులను నియమిస్తాడు. వారు ఆ పిల్లల్ని చంపక అడవిలో విడి విడిగా వదిలివేస్తారు. దొంగల నాయకునికి దొరికిన బిడ్డ చిక్కన్న దొర (ఎన్‌టిఆర్) నాయకునిగా ఎదుగుతాడు. ధనవంతులను దోచి, పేదలకు పంచుతుంటాడు. ఛాయాదేవి దంపతులకు దొరికిన బిడ్డ అన్ని విద్యలు నేర్చి, దిలీప్ చక్రవర్తి పేరిట ధనం లేకపోయినా యుక్తితో పొరుగు రాజు స్నేహం సంపాదించి సత్రాలు నిర్మించి పేరు తెచ్చుకుంటాడు. దొరకడుగా మరో పేరుతో (కాంతారావు) పిలవబడుతుంటాడు. పుష్పగిరి రాజ్యంలో మంజరి (విజయలలిత) అనే వేశ్య ఎందరినో ఇబ్బంది పెడుతుందని తెలుసుకున్న చిక్కడు ఆమెను మోసగించి ధనం కొల్లగొడతాడు. ఆ దేశ మహారాణి ప్రియంవదదేవి (జయలలిత) మారువేషంలో అతన్ని కలుసుకొని అతని మంచితనం గ్రహించి ఇష్టపడుతుంది. అదేవిధంగా దిలీపుడు పాంచల రాజకుమారి పద్మావతి (కృష్ణకుమారి)ని అనుకోకుండా కలుసుకొని, ఆమెను ప్రేమించి, ఆమె ప్రేమ పొందుతాడు. మాళవ రాజ్య ప్రతినిధిగా ఉన్న ప్రచండుడు (సత్యనారాయణ) తండ్రి సలహాతో భువనేశ్వరి ఆలయంలో గల నిధికోసం పాంచాల, పుష్పగిరి రాజ్యాలలో వున్న హారాల కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ విషయం గ్రహించిన చిక్కడు, దొరకడు వారి ప్రేయసిలతో కలిసి హారాల కోసం ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటారు. చివరికి మూడు హారాలను సంపాదించిన చిక్కడు, దొరకుడు నిధిని కైవసం చేసుకునే సమయానికి ప్రచండుడు సైన్యంతో అడ్డుపడగా, వానిని, వాని తండ్రిని అంతం చేయటం, నిధికి కాపలాగా వున్న యోగి ద్వారా, ఈ వంశాలకు చెందిన పెద్దలే ఈ నిధిని దాచారని, దాని వారసులకే అది లభించిందని తెలియజేయడం, నిజ తల్లిదండ్రులను కలుసుకొని, రాకుమారులిరువురూ రాకుమార్తెలను వివాహం చేసుకోవడంతో చిత్రం సుఖాంతంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఇంకా బాలకృష్ణ, మీనాకుమారి, మోదుకూరి సత్యం, జగ్గారావు నటించారు. చిక్కడు-దొరకడు చక్కని అలరించే సన్నివేశాల కూర్పుతో ఆహ్లాదభరితంగా రూపుదిద్దుకుంది. చిక్కడు నాయకునిగా నెగ్గటానికి ముళ్ల గదలు వేలాడుతూ తిరుగుతుండడం వాటిమధ్య నుంచి వంగకుండా, తమాషాగా వెళ్ళడం, నువ్వులు చేత్తో పిండి నూనె తీయటం, తాటిచెట్టును ఒక్క వేటుతో నరకటం, మహారాణి ప్రియంవద హారాన్ని తెలివిగా కాజేయటం, పద్మావతి సైగలతో తన గురించి చెప్పటం, తెరలమధ్య ఆమె ఉనికి దొరకడు గుర్తించటం, చిక్కడు, దొరకడు హారాలను తెలివిగా దాచటం, దాన్ని మరొకరు తస్కరించటం, రాజసభలో రెండుసార్లు హారాలను చేజిక్కించుకోవటం, వారిరువురి కత్తియుద్ధంలో తొలుత ఎన్‌టిఆర్ చేతిపై ‘చి’ అక్షరం, కాంతారావు ‘దొ’ అక్షరం ఎన్‌టిఆర్ వ్రాయటంతో మొదలై చిక్కడు-దొరకడు అని వారు పేర్లు వ్రాయటం తమాషాగాను, చివర్లో నిధి కోసం వినాయకుడు, హనుమంతుడు, గరుత్మంతుడు విగ్రహాలు, భువనేశ్వరి విగ్రహంపై సత్యనారాయణతో ఫైట్ ఎంతో థ్రిల్లింగ్‌గా, అర్థవంతంగా సన్నివేశాలను విఠలాచార్య రూపొందించి చిత్రీకరించారు. సన్నివేశానుగుణమైన అర్థవంతమైన సంభాషణలతోపాటు కొన్ని తమాషా పదాలు ‘జంబాల బాతూ పెట్టవే గుడ్డు’, ఊరిపేరు మూతినాకుడుపాలెం, హీరో పేరు ‘దాని మొగుడు’ వంటివి జతగూర్చారు వీటూరి.
సమర్థవంతులైన నటీనటులు ఎన్‌టిఆర్, జయలలిత, కాంతారావు, కృష్ణకుమారి, సత్యనారాయణ ఎంతో ఈజ్‌తో తమ పాత్రలను పోషించి మెప్పించారు. ఎన్‌టిఆర్ తనదైన ప్రత్యేక జానపద స్టయల్‌ను ఈ చిత్రంలోనూ అలరించేలా హుషారుగా ప్రదర్శించగా, వారికి ధీటుగా జయలలిత అంతే ప్రతిభను నటనలో, నృత్యాలలో ముఖ్యంగా నాగిని నృత్యంలో ఆనందింపజేయటం మెచ్చుకోతగ్గది. చక్కని ఫొటోగ్రఫీ, అందమైన సెట్టింగ్స్, రాజభవనాలు, ఉద్యానవనాలలో విడిగా చిత్రీకరించిన గీతాలు, నృత్యాలు, సంగీతం ఈ చిత్రాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాయి.
చిత్ర గీతాలు- నకిలీ మహారాణి ముందు గీతం జయలలిత, ఎన్‌టిఆర్, కాంతారావులపై చిత్రీకరణ ‘అందాలన్నీ నీవే ఆనందాలన్నీ’ (పి.సుశీల, బి.వసంత, ఘంటసాల, రఘురాం- రచన సి.నారె), జయలలితపై వీధిలో నృత్యగీతం, ప్రజలు, ఎన్‌టిఆర్‌లపై చిత్రీకరణ ‘ఓ లచ్చి ఇనరయ్యో ఓ లమీ’ గానం (పి.సుశీల, రచన సినారె), కాంతారావు, కృష్ణకుమారిలపై తొలుత పద్యం కాంతారావుపై మొదలై ముగిశాక పాట ‘విరిసిన ఇంద్రచాపమో పద్యం పాట పగటి పూట చంద్రబింబం’ (పి.సుశీల- సినారె) జయలలిత, మీనాకుమారి బృందంపై జలక్రీడల గీతం ‘ఇంతలో ఏదో జరిగింది వింతగా’ (పి.సుశీల -సినారె), కృష్ణకుమారి చెలులపై గీతం ‘కనె్నపిల్ల అనగానే అందరికీ అలుసే’ (పి.సుశీల, వీటూరి), ఎన్‌టిఆర్, జయలలితల గీతం హుషారుగా సాగుతుంది. ‘దోర నిమ్మపండులాగా ఊరించే దొరసాని’ (ఘంటసాల, పి.సుశీల, రచన-సినారె), విజయలలిత, ఎనటిఆర్‌లపై గీతం ‘ఇదిగో నేనున్నాను ఎదురుగా’ (పి.సుశీల, రచన-సినారె), చిత్ర ప్రారంభంలో మోహనపై చిత్రీకరించిన ప్రార్థన పద్యం ‘అమ్మా ఆశ్రీత కల్పవల్లి’ (పి.సుశీల రచన వీటూరి) ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ ఆలపించిన పోటీగా సాగే గీతం, ఎన్‌టిఆర్, కాంతారావులపై చిత్రీకరణ ‘ఔరా వీరాధివీరా ఔరౌరా’ (రచన సినారె) అలరించేలా సాగుతుంది.
‘చిక్కడు-దొరకడు’ చిత్రం చక్కని సన్నివేశాల కూర్పుతో, సంగీత, నృత్య అలరింపులతో మేటి నటీనటుల కాంబినేషన్ దానికి తగ్గ నటనతో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ప్రేక్షకాదరణ పొంది, ఆర్థిక విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని 1977 దర్శక నిర్మాత ఎల్.వి.ప్రసాద్ తమ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హిందీలో ‘జయ్ విజయ్’గా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కె.బి.పాఠక్ డైలాగులు, పాటలు మజ్రు సుల్తాన్‌పురి వ్రాశారు. సంగీతం రాజేష్ రోషన్ సమక్చూరు. జితేంద్ర, రీనారాయ్, బిందియాగోస్వామి, ప్రేమ్‌కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. 1977 జనవరి 1న విడుదలైంది.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి