Others

సినిమాల్లో చరిత్ర వక్రీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎం.ఏ విద్యార్థులకు ‘్భరతములో వనచర వృత్తాంతము’ అనే పాఠం ఉండేది. దూర విద్యాకేంద్రం వారి పేపర్లు దిద్దుతున్నప్పుడు ఒక విద్యార్థి ఇలా వ్రాశాడు. ‘‘నేను సుల్తాన్ బజార్ వెళ్లాను. చాయ్ తాగాను’’ ద్రౌపది; ‘‘ఆబిడ్స్ వెళ్ళాను- సినిమా చూశాను’’ భీముడు; ‘‘నాంపల్లి వెళ్ళాను- పల్లీలు తిన్నాను’’ ధర్మరాజు- ఇలా రెండు పేజీల సమాధానం ఉంది. ఇందులో సుల్తాన్ బజార్ వెళ్లాను అనే వాక్యం అస్పష్టంగా వ్రాశాడు. ద్రౌపది అనే మాటను పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాశాడు. అంటే అతడు భారతములోని వనచర వృత్తాంతము వ్రాస్తున్నాడని భ్రమింపజేసే ప్రయత్నం చేశాడని అర్థం.
కొన్ని సంవత్సరాల క్రితం లల్లాదేవి అనే రచయిత ఒక చారిత్రక నవల వ్రాశాడు. అందులో దేవీ నాగానీక ఇతివృత్తం ఉంది. ఈమె శాతవాహన రాజ వంశానికి చెందిన రాణి. అయితే లల్లాదేవి ఏదో రాక్షసుల కథ వ్రాసి నాగానీక పేరును వాడుకున్నాడు. ఒకసారి ఆయన కలిసినప్పుడు ‘మీరు దేవీ నాగానీక గురించి ఏ చారిత్రక ఆధారాలు సేకరించారు?’ అని ప్రశ్నించాను. అతడు నవ్వి, నేను వ్రాసింది ఫాంటసీ అని జవాబు చెప్పాడు. మరి నాగానీక పేరు ఎందుకు వాడుకున్నట్లు? చాలా బాధ కలిగింది. వెంటనే దేవీ నాగానీక చరిత్రను సేకరించి ఒక నవల వ్రాసి ఒక వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించాను. ఈమె మహారథత్రణకయిరుని కాలానికి చెందిన రాణి.
మనం చరిత్ర చెప్పదలచుకుంటే ఆధారాలతో సప్రమాణంగా చెప్పాలి. లేకుంటే ఫాంటసీ వ్రాసుకోవచ్చు. దొరికితే దొంగలు అనే సినిమా వచ్చింది. అందులో జీపు ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటుంది. అది ఆబ్‌సెండ్‌మైండ్ ప్రొఫెసర్ అనే ఇంగ్లీషు సినిమాకు భావానువాదం. అలాగే ఆదిత్య 369 అనే సినిమా వచ్చింది. సోమాలియా స్పేస్‌షిప్ వచ్చింది. గ్రహంతరవాసులతో మాట్లాడే కథ ఇందులో ఫాంటసీ. వాటిని చారిత్రక సత్యాలు అని అనరు.
ఇటీవల బాహుబలి అనే సినిమా వచ్చింది. ఇది ఒక ఫాంటసీ. బాగా డబ్బులు రావటంతో ద్వితీయభాగం కూడా తీశారు. వేల కోట్లు సంపాదించింది. పాకిస్తాన్ దురాక్రమణ సందర్భంగా మే 2017లో భారత జవాన్లు మరణించారు. లెఫ్టినెంట్ ఉమర్ హఫీజ్ అనే యువకుణ్ణి పట్టుకొనిపోతూ కాల్చి చంపారు. వారికి జాతి శ్రద్ధాంజలి సమర్పిస్తున్న సమయంలో బాహుబలి సక్సెస్‌మీట్ పెట్టి షాంపైన్ విందులు అందించారు. ఇదీ మన వర్తమాన చిత్రసీమ చరిత్ర. ‘నేను సుల్తానుబజారు పోయాను చాయ్ తాగాను- ద్రౌపది’ అనే వాక్యం ఉన్నట్లు ఈ ఫాంటసీలో చారిత్రక ఐతిహాసిక వ్యక్తుల పేర్లు అక్కడక్కడా వచ్చేటట్లు నిర్మాతలు శ్రద్ధ తీసుకున్నారు.
కాలకేయులు: వీరు కశ్యప ప్రజాపతికి కాలక వలన పుట్టిన రాక్షసులు. వీరి ప్రసక్తి పురాణాలలోను, భారతములోనూ వస్తుంది. ఈ సినిమాలో కాలకేయులు అనే రాజులు ఉన్నట్లు చూపించారు. ఇలాం టి రాజవంశం లేదు. అంటే చరిత్రను వంచించటమే.
అవంతిక: ఈమె అగ్నిమిత్రుని భార్య- ఈమెకు సినిమాకు ఎట్టి సంబంధమూ లేదు.
భల్లాలరాజు: ఇతడు మధ్యయుగాలలో ద్వారసముద్రాన్ని పాలించిన ప్రభువు. ఈ ప్రాంతం కర్ణాటకలో వుంది. ఇందులో ఈ పేరును వాడుకున్నారు.
బిజ్జలదేవుడు: ఇతడు క్రీ.శ.12వ శతాబ్దానికి చెంది న కాలచూరి వంశస్థుడైన రాజు. జైనమతస్థుడు. ఈయన పశ్చిమ చాళుక్యుల చేతిలో హతుడైనాడు.
శివగామి: ఈమె తమిళనాడు ప్రాంతానికి చెందిన దేవత. తమిళులు ‘క’ అనే అక్షరాన్ని ‘గ’అంటూ పలుకుతారు.
మాహిష్మతి: ఈ నగరం ప్రసక్తి భారతంలోని సభాపర్వంలో రాజసూయయాగం సందర్భంలో వస్తుంది. ప్రాచీన భారత భూగోళం ప్రకారం అవంతి పక్కన మాహిష్మతి ఉంది. అంటే ఇది మధ్యభారతదేశంలో ఉంది.
కట్టప్ప: ఇది రాయలసీమ ప్రాంతానికి చెందిన పేరు. ‘అప్ప’ అంటే తండ్రి అని అర్థం. కర్ణాటక ప్రాంతంలో కూడా బసవలింగప్ప, రాచప్ప వంటి పేర్లు వుంటాయి.
కాబట్టి సారాంశం ఏమంటే, ఏవేవో పేర్లు చరిత్ర నుండి పురాణాలనుండి తీసుకొని ఒక కట్టుకథను అల్లారు. దానికి చారిత్రక భ్రాంతిని కల్పించారు. కట్టుకథలకు మాహిష్మతి అయితేనేమిటి? ప్రాగ్జ్యోతిషపురం అయితేనేమిటి? కాలకేయులు అనే రాజవంశీయులు చరిత్రలో ఎక్కడా లేరు. ఉన్నట్లు చూపిస్తే దానిని ఫౌలసీ అంటారు.
కుక్కలకుంట దేశాన్ని నక్కల ప్రభువు పాలించాడు. అతని భార్య జాంబూకవతి అని కథ వ్రాసుకుంటే ఎవరికీ అభ్యంతరం వుండదు. అంతేగాని మాహిష్మతి, శివగామి, బిజ్జలదేవుడు వంటి చారిత్రక నామాలు ఉపయోగించి జనాలను మోసం చేయటం తగునా?
డబ్బు సంపాదించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. డాన్ అనే సాంఘిక హిందీ చిత్రం వచ్చింది. అందులో హీరో ద్విపాత్రాభినయం ఉంది. సర్దార్ పాపారాయుడు వంటి తెలుగు చిత్రాల్లోనూ ద్విపాత్రాభినయం పెట్టి విజయాలు సాధించారు. గంగ మంగ వంటి చిత్రాలల్లో హీరోయిన్ ద్విపాత్రాభినయం ఉంది. ఇవన్నీ సరదాగా చూసి ఆనందించవచ్చు. ఇష్టం లేకపోతే మానేయవచ్చు. కానీ ఫాంటసీలు నిర్మించి వాటిని ఐతిహాసిక చారిత్రక చిత్రాలంటూ భ్రమింపజేయడం తగదు. ‘బాహుబలి’ చిత్రానికి నంది పురస్కారం (15-11-2017) ప్రకటించారు.
ఇంతకూ నిజమైన బాహుబలి ఎవరు? 1950 దశకంలో నాటి ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూ తన ఛాంబర్‌లో ‘దో ఆంఖే బారా హాథ్’ అనే చిత్రాన్ని చూశాడు. అది శాంతారాం నిర్మించిన బ్లాక్ అండ్ వైట్ చిత్రం. దీనికి జాతీయ స్థాయిలో స్వర్ణకమలం వచ్చింది. ఇదిగో ఈ రెండు కళ్ళ పనె్నండు చేతుల వీరుడే నిజమైన బాహుబలి. ప్రజలకు సంస్కారాన్ని నేర్పేవి చిత్రాలు. సంహారాన్ని నేర్పేవి కావు. విపరీతమైన పబ్లిసిటీతో జనాలను మోసగించి ప్రజల జేబులకు చిల్లిపొడవటం దుర్మార్గం, దోపిడీ!
వింధ్యావాసిని పదవ తరగతి ఫస్టుక్లాసులో పాసయింది. నీకేమి గిఫ్టు కావాలి? అని అడిగాను. నాకు బాహుబలిని చూపించు అని అడిగింది.
‘అదేమిటి?’ అని అడిగాను ఆశ్చర్యంగా.
‘ఔను! కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చూడాలి’ అన్నది ఈ పాప. నేను నిర్ఘాంతపోయాను. అంటే పబ్లిసిటీ ప్రభావం ఏ స్థాయికి చేరిందో దీన్నిబట్టి అర్థం అవుతున్నది.
స్వచ్ఛ్భారత్ అనేది ఒక మంచి భావన. దీనినే ఆంధ్రప్రదేశ్‌లో జన్మభూమి పేరుతో కొంతకాలం నిర్వహించారు. అందుకు చాలా పబ్లిసిటీ ఇచ్చారు. మీరిద్దరు మీకిద్దరు అంటూ కుటుంబ నియంత్రణ ప్రచారం రేడియో, టీవీల ద్వారా విపరీతంగా చేశా రు. ఇవి సాంఘిక సంస్కరణలు. వాటికి ప్రచారం అవసరమే. అయితే అమెరికాలో ఒక కంపెనీ ‘స్వంత పళ్లకన్నా కట్టుడు పళ్లు మంచివి’ అని ప్రచారం చేసి ఉన్న పళ్లు ఊడగొట్టి డబ్బు సంపాదించుకొన్నారు. దీనిని మోసం, దుర్మార్గం అంటారు.
తెలుగులో చాలా చారిత్రక చిత్రాలు వచ్చాయి. అందులో కొన్ని కల్పనలు లేకపోలేదు. పోతన శ్రీనాథుడు బావ- బావమరుదులేనా అనేది వివాదాంశం. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో భారత్‌పైకి వచ్చిన గ్రీకు రాజులెవరు? వాసిష్ఠి కాలంలో వచ్చిన శత్రురాజు రుద్రధాముడు శకవంశస్థుడు (జునాగడ్ శాసనం) తెనాలి రామకృష్ణుడు ఢిల్లీ పాదుషాను కలిసినట్లు చూపటం అసత్యం. శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసు కళ్లు పీకించాడు అనడానికి చారిత్రకాధారాలు లేవు. అల్లూరి సీతారామరాజు రూథర్‌ఫర్డ్‌ను కలుసుకోలేదు. ఇలా ఆయా చిత్రాల్లో చరిత్ర వక్రీకరించబడినా దానివల్ల ప్రధాన కథాంశానికి భంగం కలగలేదు. హీరోకు అవనతి కలగదు. అంటే చారిత్రక చిత్రాలల్లో కల్పనలు ఉండవచ్చు కానీ కల్పిత కథను చారిత్రకం అని భ్రమింపజేయకూడదు. ఇదిగో బాహుబలి చిత్రంలో జరిగింది ఈ భ్రాంతి. టెన్‌కమాండ్‌మెంట్స్ అనే ఇంగ్లీషు చిత్రాన్ని సిసిల్‌బి డెమెల్లో అనే పాశ్చాత్యుడు తీశాడు. ఇది బైబిలుమీద ఆధారపడిన కథ. తెలుగులో చాణక్య అనే టీవీ సీరియల్ వచ్చింది. ఇందుకు వారు చాలా రీసెర్చి చేశారు. మరి తెలుగు చిత్రాలల్లో అలాంటి పరిశోధన ఎందుకు కన్పడటంలేదు? బాజీరావు మస్తానీ సినిమాలో పీష్వాలు భంగు తాగి డాన్సు చేసినట్లు చూపించారు. చిత్తూరు రాణి పద్మిని అల్లాఉద్దీన్‌ఖిల్జీతో డ్యూయెట్లు పాడుతుందా? ఇలలో కాదు కలలో అని ఒక సమర్థన.
విశ్వనాథవారి ఏకవీరలో కుట్టాన్ సేతుపతి వీరభూపతి అంబా సముద్రము, రాబర్ట్ డొనొబిలే వంటి పేర్లు ఉన్నంత మాత్రాన అది చారిత్రక నవల కాజాలదు. జోధా అక్బర్, మొగల్-ఎ-ఆజం వంటి చిత్రాల్లో అక్బరును అవతార పురుషునిగా చిత్రించారు. ఇటీవల టెక్నాలజీ పెరగటంతో నటనకు ప్రాధాన్యం తగ్గి గ్రాఫిక్స్‌తో సమ్మోహితులను చేస్తున్నారు. నటీనటులు పిండిబొమ్మల్లా నిలబడితే చాలు. అయినా అంజలి, సావిత్రి, ఏఎన్నార్, ఎన్టీఆర్‌లను చూసిన కళ్లతో ఈ కొయ్యబొమ్మలను చూడ టం బాధాకరమే. ఐనా నిర్మాతలు బలవంతంగా సమాజం మీదికి ఈ ముఖాలను రుద్దుతున్నారు.
రేపు బాహుబలికి ఆస్కారు అవార్డు ఇవ్వాలనే ప్రచారం మొదలుపెట్టవచ్చు. రాజవౌళికి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఇవ్వాలని అడగవచ్చు. మనకు ఎవరిమీదా శత్రుత్వం ఉండదు. కాని ఆర్థికంగా నష్టపోయి రుద్రమదేవి నిర్మించిన గుణశేఖర్ యోగ్యుడా? ఫాంటసీ నిర్మించిన బాహుబలి టీం గొప్పదా? కాస్త స్థిమితంగా కూర్చొని ఆలోచించండి.
వింధ్యవాసి, భువనేశ్వరి, షోడశి, అఖిల, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అని ప్రశ్నిస్తుంటే వింతగా ఉంటుంది. ఐతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమెరికాకు వెళ్లి అక్కడ తెలుగువారితో మీరు ఒక్కొక్కరు బాహుబలి కావాలి అంటుంటే ఔరా..! అని నివ్వెరపోవలసి వస్తుంది.
సరిహద్దులలో వందలాదిమంది జవాన్లు అమరులౌతున్నారు. మంచుకొండలలో కాపలా కాస్తూ మృత్యువును కౌగిలించుకుంటున్నారు. జనాన్ని భ్రాంతికి గురిచేసి సంపాదించిన ఈ డబ్బులో సగమైనా వారి కుటుంబాలకు ఇస్తే పాప పరిహారం జరుగుతుంది. వెలగపూడి రాజధాని నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చి తెలుగు భక్తి నిరూపించుకోవాలి. తెలుగులో సినీ విజ్ఞాన విశారదలున్నారు. వారు చక్కగా సినీ సమీక్షలు వ్రాసి పాఠకులను మెప్పించగలరు. అది నా పని కాదు. ఐనా ఈ చిత్రం మీద బాహుబలి-1, బాహుబలి-2 అన్నట్లు రెండు భాగాల విమర్శలు వ్రాయటం ఎందుకు జరిగింది? అంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.200 ఖరీదైన చిత్రాన్ని వెయ్యి రూపాయలు పెట్టి బ్లాకులో కొని సుకుటుంబంగా సినిమా చూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ చిత్రాన్ని ఉదాహరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికాలో తెలుగువారిని ‘ఒక్కొక్కరూ ఒక్కొక్క బాహుబలి కావాలి’ అంటూ ప్రబోధించారు. ఈ రకం హిస్టీరియా లోగడ చూశామా? పోనీ ఇదేమైనా అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోసు జీవిత చరిత్రయా? జాతికి ఇది ఇచ్చే స్ఫూర్తి ఏమిటి? లోగడ తెలుగులో చిరంజీవి సినిమా ఖైదీ 150- 150 కోట్లు వసూలు చేసింది. హిందీలో అమీర్‌ఖాన్ పికె 750 కోట్లు కలెక్షన్లు పొందింది. ఆ విధంగా చూసినపుడు ఒక తెలుగు సినిమా 1500 కోట్లు సంపాదించిందని సంబరపడిపోతున్నారు. ఇది ఏ విధంగా పురోగమనమో జాతిని ప్రేమించే విశే్లషకులు చెప్పాలి. ఇపుడు బాహుబలి యూనిట్‌వారు తమపై వచ్చే విమర్శలను లెక్కచేయకుండా ప్రపంచంలోని వివిధ దేశాలలో డబ్ చేసి విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు. అది పచ్చి వ్యాపారం!
ప్రముఖ చలనచిత్ర విమర్శకుడు కొంపల్లి గౌరీశంకర్ మాట్లాడుతూ- ‘కలలలో విహరింపజేసేదే చిత్రం. నిత్య జీవితం చూడాలంటే కిటికీ తలుపు తీస్తే చాలు. రోడ్డుమీద తాగుబోతులు, రేవులు, గుడిసెలు కన్పడుతూనే వుంటాయి’ అన్నాడు. ఈ వాక్యా న్ని సామాజిక స్పృహ అంటూ తపనపడేవారు తీవ్రంగా ఆలోచింపవలసి ఉంటుంది.
దేశ పౌరునికి కావలసింది విద్య- వైద్యం- ఉద్యోగం- కూడు- గూడు. అంతేకాని కబాలీలు, బాహుబలులు కాదు! దీనిని పాలకులు గుర్తించటం మంచిది.
లోగడ ఎం.ఎస్.రెడ్డి భాగమతి-ప్రతాపరుద్రుడు అనే రెండు చారిత్రకాలకు స్క్రిప్టు తయారుచేసుకొని నాకు వినిపించాడు. ‘్భగమతికి కందుకూరి రుద్రకవికి సంబంధం ఏమిటి’? అని ప్రశ్నించాను. ‘నీవు సినిమా స్క్రిప్టు వినేటప్పుడు చరిత్రను మరిచిపోవాలి’ అన్నాడు.
ఔను. అందుకే మన చారిత్రక చిత్రాల్లో చరిత్ర ఉండదు. ఉంటే వక్రీభవించి ఉంటుంది.
‘బాహుబలి’ కట్టుకథకు రచయితకు నూరు కోట్లు పారితోషికం ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల భోగట్టా. ఇది నిజమేనా??
దంగల్ 1500 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ నిర్ణయించుకుంది. ఇది దేనిని తెలియజేస్తుంది?
మరో అంశం- రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలని తమిళనాడులో ఆందోళనలు మొదలైనాయి. అంటే భారతదేశాన్ని సినిమా నటులు పాలించే యుగం మొదలయిందని అర్థం.
సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావతి’ చారిత్రక చిత్రం వివాదాలల్లో చిక్కుకున్న ఈ సందర్భంలో చారిత్రక ప్రామాణ్యం - చిత్ర నిర్మాణం అనే అంశంపై ప్రత్యేక చర్చ అవసరం అనిపిస్తున్నది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్