AADIVAVRAM - Others

మూడు రోజుల వేడుక... మురిపాల వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ సంస్కృతికి సంబంధించిన గొప్ప పండుగ సంక్రాంతి. దీనిని పెద్ద పండుగ అంటారు. జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు వచ్చే హిందూ పండుగలలో అతి పెద్ద పండుగ ఇది. కొన్ని చోట్ల నాలుగు రోజులు - భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ - అను నాలుగు పండుగలు జరుపుకుంటారు. కొందరు మూడు రోజులే అంటే - భోగి, సంక్రాంతి, కనుమ - పండుగలే జరుపుకుంటారు. స్వగ్రామం నుండి పొరుగూళ్లు వెళ్లే వాళ్లు కనుమ పండుగనాడు ప్రయాణం చేయరు. కారణం కనుమనాడు కాకైనా కదలదు అనే నుడి వలన. ముక్కనుమ నాడో, తరువాత రోజో ప్రయాణం చేస్తారు.
సంవత్సరం పొడుగున వచ్చే తెలుగు పండుగలు చాంద్రమానం ప్రకారం వస్తుంటే సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం వస్తుంది. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం వలన దీనిని మకర సంక్రమణమని, మకర సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతినాడు దక్షిణాయనం ముగింపు జరిగి ఉత్తరాయణం ప్రారంభవౌతుంది. ఇది ఆరు నెలలుండే పుణ్యకాలం. ఈ కాలంలో చనిపోయిన వారు స్వర్గానికి వెళతారని ఒక నమ్మిక. దీనికి అనుగుణంగా శాస్త్రాలు కూడా ఆ విధంగా చెబుతున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో దక్షిణాయన కాలంలో నేలకొరిగిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై నుండి ఏకాదశి రోజున (అష్టమి దినమున) ప్రాణాలను విడిచిపెట్టాడు. తండ్రి శంతన మహారాజు భీష్మునకు స్వచ్ఛంద మరణం ప్రసాదించాడు. అందువలన ఆయన ఏకాదశి రోజున ప్రాణాలను విడిచిపెట్టాడు.
ఈ సంక్రాంతి పండుగ హేమంత ఋతువులో పుష్యమాస ప్రారంభంలో వస్తుంది. పాడిపంటలతో ముడిపడిన పండుగ సంక్రాంతి. అన్నదాతలైన రైతులకు ఇది ప్రధానమైన పండుగ. పొలాల్లో కష్టపడి పంటలు పండించి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకొని ఆనందంతో రైతులు, ఇతరులు జరుపుకొనే పండుగ అవడం వల్ల దీనికి ఎంతో ప్రాముఖ్యం వచ్చింది. ఈనాడు ఈ పండుగ అంతర్జాతీయ స్థాయిలో జరుపుకొంటున్నారు. ఇది కుటుంబంలోనున్న వారి నందరినీ ఒకచోటుకు చేర్చేది, ఒక్కటిగా చేసేది. ఇది పెద్ద పండుగ అనే విశిష్టతను దక్కించుకున్నది. సంక్రాంతి అంటే వెలుగుతో కూడుకొన్న పండుగ. ఈ పండుగ ఆబాలగోపాలానికి, పాడిపశువులకు, వ్యవసాయానికి ఉపయోగించే జీవాలకు ఈ పండుగ ఆనందాన్ని చేకూర్తుంది. ప్రధానంగా ఇది గ్రామాలలో నున్నవారు అత్యంత ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటారు.
భోగి పండుగ, తదితర పండుగలు చలికాలంలో వచ్చే పండుగలు కనుక భోగినాడు తెల్లవారుఝాముననే పెద్దఎత్తున మంటలు వేసుకుంటారు. పాతకర్ర సామానంతా ఈ మంటలలో వేస్తారు. పాత సామానునంతా కాల్చడం - పాతను వదిలి, క్రొత్త దానిని ఆహ్వానించడం అనీ, తాత్త్విక భావాలను ప్రోత్సహించడం అనీ చెబుతారు. కొందరు మంటల దగ్గర బిందెలు, కాగులు పెట్టి నీళ్లు కాచుకొని ఆ నీళ్లతో ఉదయమే అభ్యంగన స్నానాలు చేస్తారు. పెద్దలు, పిన్నలు, స్ర్తిలు, పురుషులు నూతన వస్త్రాలు ధరిస్తారు.
స్ర్తిలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, రంగవల్లులు పెడతారు. చిత్రవిచిత్రమైన ముగ్గులు పెడతారు. ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. కనె్నపిల్లలు ఆ గొబ్బెమ్మలకు పసుపు కుంకుమలతో బొట్లు పెడతారు. ఆ తరువాత ఆడపిల్లలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. గొబ్బెమ్మలతో బంతి, చామంతి, గుమ్మడి, బీర, పొట్ల మొదలైన పూలను, రేగుపండ్లను పెడతారు. తమ కోరికలు నెరవేర్చుమని గొబ్బెమ్మలను కోరుతారు. పిల్లలు కొత్త జీవితం ఇవ్వమని కోరడం వలన కనె్నపిల్లలకు మనసుకు నచ్చిన వారితో వివాహం జరుగుతుందనే నమ్మకం తరతరాల నుండి వస్తున్నది.
బాలురు భోగి పండుగ నాటి నుం గాలిపటాలు ఎగురవేస్తుంటారు. కొన్నిచోట్ల పెద్దవారు కూడా గాలిపటాలు ఎగురవేస్తారు.
భోగి పండుగ రోజున స్ర్తిలు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ముతె్తైదువులను బొమ్మల కొలువులకు రావలసినదిగా ఆహ్వానిస్తారు. వచ్చిన ముతె్తైదువులకు తాంబూలాలిచ్చి పంపుతారు. ఈ బొమ్మల కొలువులో సాధారణంగా బొమ్మలు లక్ష్మీ సమేతుడైన నారాయణుడు, బ్రహ్మదేవుడు, సరస్వతి, పార్వతీ పరమేశ్వరులు, దశావతారాలు, ఇతర దేవతా విగ్రహాలు, రావణునితో శ్రీరాముని యుద్ధం, హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొని వచ్చే ప్రతిమ, శ్రీకృష్ణుని లీలా విశేషాలు, పల్లె ప్రజల జీవన విశేషాలు ప్రతిబింబించే వస్తువులు, బొమ్మలు, పశువులు, పక్షులు, వృక్షాలు, జంతువులు, కీటకాలు, సంగీత సాధనాలు, నృత్యానికి సంబంధించిన బొమ్మలు, రామాయణ, మహాభారత, భాగవతాలకు సంబంధించిన బొమ్మలు మొదలైనవి ఉంటాయి.
ఐదు సంవత్సరాల బాలబాలికలకు నానమ్మలు, అమ్మమ్మలు భోగిపండ్లు, చిల్లర నాణెలు, చెరుకు ముక్కలు తలపై పోస్తారు. ఆ సందర్భంలో ముతె్తైదువులకు పసుపు, కుంకుమ, అరటి పండ్లు, తాంబూలాలిచ్చి సాగనంపుతారు. ఇది భోగిపండుగ నాడు చేసే ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి.
భోగినాడు చేసే కార్యక్రమాలలో గోదాదేవి కళ్యాణం ఒకటి. మార్గశిర మాసంలో ప్రారంభమయ్యే 30 రోజులు వ్రతం - పాశురాల పఠనం భోగి రోజున అంతవౌతుంది. ఈ రోజున గోదాదేవి రంగనాథుల వివాహం ఘనంగా జరుగుతుంది.
నూతనంగా పెండ్లైన కుమార్తె, అల్లుడు ఈ సంక్రాంతి పండుగకు వస్తారు. వారు ఉభయులు నూతన వస్త్రాలు ధరించి ఆనందంతో ఉంటారు. వారు తినడానికి అమ్మాయి తల్లిదండ్రులు - అరిసెలు, సకినాలు, నేతిగారెలు, కారప్పూస, నువ్వుల ఉండలు, సున్నుండలు, కజ్జికాయలు, అమృత జిలేబీలు, పల్లీల ఉండలు మొదలైనవి తయారుచేస్తారు. మరదళ్లు బావలను సరదాగా మాటలతో ఉడికిస్తారు. ఆటపట్టిస్తారు.
ఈ నాలుగు రోజుల్లో గ్రామాలలో పెద్దఎత్తున కోడిపందాల ఆటలు జరుగుతాయి. ప్రత్యేకించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలలో పలు గ్రామాలలో జరుగుతాయి. వేలల్లో, లక్షల్లో డబ్బు కోడిపందాలపై కాస్తారు.
ఇటీవల సుప్రీంకోర్టు కోడిపందాలు ఆడవచ్చునని తీర్పు ఇవ్వడం వలన ఆటగాళ్లకు మంచి మద్దతు లభించింది. కొన్నిచోట్ల పొట్టేళ్ల పందాలు, ఎడ్ల పందాలు కూడా జరుగుతాయి.
పొంగలిని సూర్యదేవునికి నివేదించడం భోగినాడు భక్తులు చేసే కార్యక్రమాలలో ఒకటి. కొత్తబెల్లం, కొత్త బియ్యం, పాలు, నెయ్యి కలిపి కొత్త కుండలో పొంగలిని తయారుచేస్తారు. దానిని సూర్యదేవునకు నివేదిస్తారు.
ఈ కాలంలో బంతి పువ్వులు, చామంతి పువ్వులు అధికంగా పూస్తాయి. ఎక్కడ చూచినా అవే కనిపిస్తాయి. కనకాంబరాలు, గులాబీలు, మల్లెలు తక్కువగా దొరుకుతాయి. గొబ్బెళ్లలో చామంతి, బంతి పువ్వులు పెడతారు.
ఈ కాలంలో గంగిరెద్దుల వారు ప్రతి గ్రామం తిరుగుతారు. గంగిరెద్దులను రంగురంగుల వస్త్రాలతో అలంకరించి గ్రామాలలో ప్రతీ ఇంటికి వెళ్లి ‘అయ్యవారికీ దణ్ణం పెట్టు, అమ్మవారికి దణ్ణంపెట్టు’ అంటూ గృహస్థుల నుండి బియ్యం, తినుబండారాలు, బట్టలు పుచ్చుకుంటారు. గంగిరెద్దులు చేసే విన్యాసాలు వీక్షకులకు ఆనందాన్ని కలుగజేస్తాయి. సన్నాయి ఊదుతూ డూడూ బసవన్న అని గంగిరెద్దుల వాళ్లు గ్రామాలలో తిరుగుతూంటారు.
హరిలో రంగ హరీ.. అంటూ హరిదాసు కీర్తనలు పాడుతూ హరిదాసులు తలపై గుమ్మడికాయ ఆకారంలో కుదురుపై అక్షయ పాత్ర పెట్టుకొని, గృహస్థులిచ్చే బియ్యం, డబ్బులు, తీపి పదార్థాలు స్వీకరిస్తారు.
బుడబుక్కలోళ్లు.. తెల్లని ధోవతి, చొక్కా ధరించి, దాని మీద నల్లటి కోటు వేసుకుని, ఎర్రని బొట్టు పెట్టుకొని ఇంటి యజమానుల భవిష్యత్తును పాటల రూపంలో చెబుతూ ఇల్లిల్లూ తిరుగుతారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు’ అంటూ ఆశీర్వదిస్తూ గృహస్థులిచ్చే బియ్యం, డబ్బు స్వీకరిస్తారు.
సంక్రాంతి రోజున ఉదయానే లేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పితృదేవతలకు పూజలు సల్పుతారు. నైవేద్యాలు చెల్లిస్తారు. పితృదేవతలకు క్షీరాన్నము, పులిహోర, గారెలు, కూరలు, నూతన వస్త్రాలు, సున్నుండలు, మిఠాయి ఉండలు మొదలైనవి పెట్టి నమస్కరించి స్వీకరించవలసిందిగా కోరుతారు. పెద్దల ఆశీస్సులు పొందగలుగుతారు. సంక్రాంతి నాడు పంటలిచ్చిన సూర్యుభగవానుని, పాడిని రక్షించిన విష్ణుమూర్తిని, ధాన్యరూపంలో ఇంటికి తరలి వచ్చిన లక్ష్మీదేవిని పూజిస్తారు. మకర సంక్రాంతికి అధిపతి శనీశ్వరుడు. దోష నివారణకు శనికి నువ్వులు దానం చేస్తారు. శివాలయాలలో నువ్వుల నూనెతో దీపం పెట్టి ఆయనకు ఆవునెయ్యితో అభిషేకం చేయిస్తూంటారు.
బ్రాహ్మణులకు ధాన్యం, కూరగాయలు, పండ్లు దానం చేస్తారు. సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ దానం చేయడం వలన మనోభీష్టం నెరవేరుతుంది. పాడి వృద్ధి చెందుతుంది. సంక్రాంతి - పాడి పంటల పండుగ, కొత్త పంటలు ఇంటికి చేరడం ఆనందాన్ని కలిగిస్తాయి. సంక్రాంతికి పుట్టినిల్లు పల్లెటూళ్లే. సంపదలు, సంబరాలు ఈ పండుగ కాలంలో పెనవేసుకు పోతాయి.
సంక్రాంతి రోజున పరమశివుని నెయ్యితో అభిషేకించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ధాన్యం, పెరుగు, నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు దానం చేయడం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి.
సంక్రాంతి రోజున చాలా గ్రామాలలో రైతులు ఎద్దుల బళ్లల్లో ఊరేగుతారు. మూడవ రోజు పండుగ కనుమ. ఈ రోజు పాడిపశువులను, దునే్న పశువులను అలంకరిస్తారు. పసుపు, కుంకుమ పశువుల ముఖాలపై పూసి మెడలో గంటలతో నున్న పటకాలను కడతారు. పూజలు సలుపుతారు. పశువులకు భక్ష్యాలను తినిపిస్తారు. క్రొత్త్ధాన్యాలతో వంటలు చేస్తారు. ఈ రోజున గ్రామ దేవతలకు అన్నం, కూరలు, మాంసాహారము సమర్పిస్తారు.
ముక్కనుమ నాలుగవ రోజు పండుగ. దీనిని కూడా కొందరు జరుపుకుంటారు. ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ నాలుగు పండుగలు ప్రజలలో ముఖ్యంగా గ్రామీణ ప్రజలలో సుఖ సంతోషాలను నింపుతుంది. ఈ రోజులో సమృద్ధిగా గృహాలకు చేరే పాడిపంటలు ఈ సుఖ సంతోషాలకు దోహదపడతాయి.

రాపాక ఏకాంబరాచార్యులు 9440494752