AADIVAVRAM - Others

పల్లెకాంతి... సాహితీ సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. పండుగ వైభవ ప్రాభవాలన్నీ పల్లెల్లోనే వెల్లివిరుస్తాయి. గ్రామ జీవన ఆత్మీయ మానవీయ బంధాలన్నింటినీ దృశ్యమానం చేసే కనుల పండుగ మనసు నిండుగ సంక్రాంతి పండుగ. ఆరుగాలం శ్రమిస్తూ భూమిని నమ్ముకుని ఉన్న నేలకే బ్రతుకు ముడుపు గట్టిన రైతులకు పంటలు చేతికొచ్చే కాలం. కనుకనే ధాన్యలక్ష్మి రూపేణా నట్టింటికి నడిచొచ్చే సౌభాగ్యలక్ష్మి ఆ పౌష్యలక్ష్మిని ఆహ్వానిస్తూ జరుపుకునే సంబురమే నిజానికి సంక్రాంతి. అందుకే అచ్చమైన జానపదుల వేడుకగా, పల్లీయుల ఉల్లాలను రంజిల్లచేసే పండుగగా సంక్రాంతికి ‘పెద్ద పండుగ’ అనే వ్యవహారం కూడా ఉంది.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలం ఇది. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్’ అని సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ముదిమి వయసు మీరిన వారయినా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే కాలధర్మం చెందినా పుణ్యలోక ప్రాప్తి సంభవిస్తుందని సంభావిస్తారు. సంక్రాంతి రోజు పితరులకు తర్పణాలు వదలడం కూడా ఉంది. అంతేకాదు వ్యవసాయాధారిత జీవనులు పంటలు పండేందుకు తమకు తోడై బ్రతుకుతున్న పాలేళ్లు, జీతగాళ్లకు కూడా తమ ధనధాన్యాల నుండి, ఆర్జించిన ధనం నుండి, వస్తూత్పత్తి నుండి దానం చేయడం - కుటుంబంలో ఒకరిగా సమిష్టి జీవన ఆత్మీయబంధాన్ని ప్రకటిస్తారు.
‘లా కేత్వమీయ నేరరు’ అన్నట్లు లేదనకుండా తమ శక్తిమేరకు ఇలా దానశీలతను, ఔదార్యాన్నీ వెలారుస్తారు. కనుకనే సంక్రాంతి రోజులైన ధనుర్మాసమంతా హరిదాసులు, జంగమదేవరులు, బుడబుక్కల వాళ్లు, గంగిరెద్దుల వారు, ఒగ్గు కథకులు, విప్రవినోదులు, పగటి వేషగాళ్లు ఒకరేమిటి ఎందరెందరో సంచార జీవనులు, కళాకారులు వచ్చి గృహస్థుల నుండి తృణమో పణమో పొంది ఆనందంగా ఆశీర్వదించి వెడుతూంటారు.
పల్లె శోభాయమానంగా ప్రకృతి అందాలతో కానవచ్చే కాలం సంక్రాంతి.
కొసరి నూరిన పచ్చి పసుపు పుంత మొగాన
గుమ్మడి పూ దుమారమ్ము నద్ది
కండరేగడి నార పండి కన్పండువై
పొలయు మిర్యపు పండు బొట్టు పెట్టి
వలిపమ్ము నొకనొక్క వాసి హెచ్చినట్టి
నుసమంచు తెలిచీర నూలుగొల్పి
బంతిపువ్వులకు చేమంతి నెయ్యము గూర్చి
కబరీ భరమ్ము చక్కన గుదిర్చి

పంట కళ్లాల మున్ బరాబరులు సేయ
గూడు గట్టిన తెలిమబ్బు గొడుగు నీడ
కదలివచ్చెను భాగ్యాల కడలివోలె
మకర సంక్రాంతి లక్ష్మి హేమంత వీధి
అంటారు కవి తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తిగారు.
శుభ సంక్రాంతి నవోదయ వేళ ఆ చిరుచలి నవ యువతనే కాదు ముసలి జంటలనయినా ‘ఏకాకీ నరమేత’ అనిపిస్తుందంటాడు దాశరథి.
మంటలు వేసిన యంతనె
మన చలి పరుగెత్తేనా
జంటలలో దొరుకు వేడి
మంటలలో లేదోరుూ! అంటాడు ‘సంక్రాంతి రాత్రి’లో.
మంచు ముసుగు వేసి పొంచి చూచెడి తూర్పు
పడతి మొగము నుండి పొడచినాడు
బాలభాస్కరుండు, పచ్చని సంక్రాంతి
శుభ ముహూర్తము నందు, నభము నందు
కొద్దిగా గిలిగింతలు గొలుపు చలినె
పులకరింపగ జేసెడి ప్రొద్దు పొడుపు
ఉల్లమున మల్లెపువ్వులు చల్లునపుడె
కొసరి గోరింట ముళ్లను గ్రుచ్చసాగె
అంత చలిలోనూ ఈ రోజుల్లో ముంగిట ముగ్గులు ముదిమలు వేస్తూంటారు. భోగిమంటలు మాలిన్యాలను క్షాళన చేస్తూంటాయి.
ఒక్కవైపు జాలి, ఒకవైపు చలిగాలి
ఒకవైపు మ్రుగ్గు, ఒకట సిగ్గు
నాల్గువైపులందు నాల్గు నిర్బంధాలు
కదలలేక వెలది కంపమందె
శుభ సంక్రాంతి నవోదయ
ముభయుల హృదయాల వెల్గుటుయ్యెల లూపెన్
నభము, ధరతాల మొకటై
అభయమ్మిడె నుభయులకు మహానందముగా
అంటూ జంటలు కనుల పండుగగా, మంగళకరముగా, మహదానంద సుందరంగా దరిచేరే వలపు పంటల కాలం కూడా సంక్రాంతి అంటాడు దాశరథి.
పంట ఇంట నుండు పబ్బంబునాటికి, పిండివంట కొరకు చింతలేదు కనుకనే కొత్త అల్లుళ్లకు అత్తింటి మర్యాదల మహద్వైభవ కాలమూ ఇదే. పట్నం ఉద్యోగమే కాదు, అమెరికా ఉద్యోగం అయినా సంక్రాంతి పండుగకు సౌంత పల్లెకు చేరాలనే ఆరాటం. అందుకే నేటికీ తెలుగువారి జీవితాలలో తరగలెత్తుతూనే ఉంటోంది.
పైడి పంటలతోడ ప్రభవించె భూమాత
పాడిపంటల తోడ భాసిల్లె గోమాత
అత్తవారింట అర్ధాంగి వలపు పంట
విందులతోడ ఆనందించె జామాత
పరికిణీ పాదాలపైన చిందులు త్రొక్క
అక్క వేసిన మ్రొగ్గు త్రొక్కకుండగ నడిచి
హరిదాసు తల మీది అక్షయపాత్రలో
దోసెడు బియ్యమ్ము పోసె ముద్దుల చెల్లి
ఎండనక వాననక ఏడాది కష్టపడి
పండించుకున్న క్రొంబసిడి ధాన్యపురాశి
పంటకళ్లము నుండి ఇంట చేరినదన్న
సంతృప్తి మెరసె కర్షకుల కన్గొనలందు
-అన్న కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తీగారు సమానత్వానికీ, సామ్యవాదానికీ ప్రజాస్వామ్య జీవన సంవిధానానికీ బొమ్మలకొలువు ప్రతీకాత్మక సందేశంలా సాక్షాత్కరింపజేశారు.
పులిప్రక్క మేక, ఏన్గుల మధ్య కుందేలు
పూరిల్లు - మేడ, మోటారు - ఎద్దులబండి
రాజు - బంటును, సామరస్యంబు సమకూర్చ
కనులవిందయ్యె సంక్రాంతి బొమ్మల కొలువు
-అంటూ స్వర్ణక్రాంతిని పొడగట్టించారు.
సంక్రాంతి పల్లె శోభను డా.సి.నారాయణరెడ్డి తమ కావ్యంలోని ‘హేమంత ఖండం’లో స్వీయ జీవన ఘటనలతో అనుభూతి రమ్యం చేస్తారు. సంక్రాంతి రోజుల ప్రకృతి శోభను ప్రస్తావిస్తూ
జనపద రంగమ్ములందు
సస్యరమణి ఆకుపచ్చ
చేలమ్ముల బదులు పసుపు
చీరలు ధరియింపసాగె
పెరడులోను తీగనిండ విరిసిన గుమ్మడిపూవులు
కన్పించెను క్షేత్రలక్ష్మికై బంగరు గినె్నలవలె
అచ్చటచ్చట పండిపోయినట్టి మిరప పండ్లు కనం
బడెను నీరు దిగని మేలి పగడమ్ము గుత్తులట్లు
పొంగారిన ముద్దబంతి పూలనుగన తోచెనాకు
మించుభయముతో రూపము మార్చుకున్న తామరలని
కోతలన్ని ముగిసెను, వరికుప్పల నూర్పిళ్లయ్యెను
కాపుల కాపురములు సంక్రాంతికి శిబిరములయ్యెను
నేడే సంక్రాంతి ఊరివాడలన్ని గంగిరెద్దుల
కొమరాడెడు చిందులతో ‘కూచిపూడు’లై పోయెను అంటారు.
ఆబాలగోపాలం ఆనందంగా పరవళించే పర్వం సంక్రాంతి. పల్లెల్లో తెలుగు లోగిళ్లు రంగవల్లులతో మెరిసిపోతూంటాయి, తెలతెల వారకముందే భోగిమంటల కోలాహలం. పండుగ పూటా అభ్యంగన స్నానాలు. సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్లు పోసే వేడుక. అలాగే భోగిరోజు కొత్తగాజులు వేయించుకోవడం, గాజుల వ్యాపారికి కొత్తవడ్లను ఇవ్వడం ఒక ఆచారం. సంక్రాంతి బొమ్మల కొలువులు, పేరంటాలు, బియ్యం పప్పులు, కూరలు నిండిన అయిదు మట్టి కుండలపై మూతలు పెట్టి నువ్వు ఉండలుంచి పరిచితులకు పంచిపెట్టడం కొన్నిచోట్ల ఆచారం. అయితే, ఒడిబియ్యం పెట్టడం మరికొన్ని చోట్ల ఆచారం. సంక్రాంతి రోజుల్లో తిలాదానం విశిష్టమని భావిస్తారు. అలాగే పెరుగును దానం చేయడమూ దధివ్రతం పేర మహాభారత కాలం నాటి నుంచీ వుందట. అలాగే తమ జీవనానికి నోరు, వాయి లేకపోయినా శ్రమించి సహకరించే పశువులను కొలవడం కూడా మూడు రోజుల పండుగ చివరి రోజు కనుమ పండుగగా ప్రసిద్ధం. వ్యవసాయ పరికరాలను కూడా ఈ సందర్భంగా పూజించడమనే ఆనవాయితీ ఉంది. పొలాల్లో పొంగళ్లు, కోడిపందేలు, ఎద్దుల ఊరేగింపులు, గ్రామదేవతకు నైవేద్యాలు పశువుల పండుగ సందర్భంగా రివాజయిన సంబురాల సంక్రాంతి కాంతియే!
అనేక వృత్తుల వారు, జానపద కళాకారులు కనువిందు చేసే గ్రామీణ వైభవం పల్లెల్లో సంక్రాంతినాడే సాక్షాత్కరిస్తుంది. జంగమదేవర, సాతానిజియ్యరు, గంగిరెద్దుల వారు, మాసాబత్తినివారు, నూనెగుడ్డలవారు, కాటికాపర్లు, కొమ్మదాసర్లు, తత్త్వాలుపాడే బైరాగులు, గోసాయిలు, దీవెనలు ఇచ్చే పకీర్లు, పిట్టలదొరలు, చెంచుదొరలు ఇలా సంక్రాంతి వేళ పల్లెలు జన జీవన వైవిధ్యాన్నంతా రాశిపోయే కాలం. కమ్మరి, కుమ్మరి వంట వృత్తుల వారికి ఆత్మీయంగా మిరిసి చెల్లింపులు ఇచ్చుకునే కాలం కూడా ఇదే. సంక్రాంతినాటి పల్లీయ ప్రకృతిని పింగళి కాటూరి, దువ్వూరి, కవికొండల, బాపిరాజు, తుమ్మల వంటి కవులు తమ రచనలలో దృశ్యమానం చేశారు. పల్లెల నుండి పట్నాలకు వలసపోయే దౌర్భాగం ఎవరికీ దాపరించకూడదనే ఆర్తి ఒకప్పుడు మిళితంగా ఉండేది. కొనకళ్ల వెంకటరత్నం ‘బంగారి మామ పాటల’ నాటికీ ఆ స్థితిని చిత్రించాడు.
ఈన మోపై వున్న పైరులు
ఏటి మునకల పాలుజేసి
కొంపగోడూ విడిచి పట్టెడు
కూటికై ఊరేగవలెరా

ఒళ్లు పెంచిన గడ్డమీదే
ఒరిగిపొయ్యే రాతలేదో
ఊరుగానీ ఊరిలో చితి
పేర్చుకొమ్మని నొసటి వ్రాలో
అన్న అర్తి గీతం రాశాడు. పల్లె సంక్రాంతి వైభవాలు మందగించి సామ్రాజ్యవాదపు పల్లకీ బోరుూలమవుతున్న విషాదం ఏనాడో గుర్తించినట్లుగా రెంటాల గోపాలకృష్ణ ‘పల్లకీ బోరుూల పాట’లో చీకటి తప్పు చేయడానికి పొరుగూరు వెడుతున్న పెద్దమనిషి పల్లకీని మోసే బోరుూల విషాద గీతిక రాశాడు.
రాళ్లైనా మోయచ్చు
రథమైనా లాగచ్చు
గుండెలేనీ మనిషి
కూర్చున్న పల్లాకి
రంపాలతో కోసి
నట్టూగ ఉండాది’
(సర్పయాగం కవితాసంపుటిలోని ‘పల్లకీ మోరుూలు’ కవితలో)
ఎంత ఆధునికతను సంతరించుకున్నా, సాంకేతికాభివృద్ధి జరిగినా మానవ జీవనంలోని మధుర పార్శ్వాలను కోల్పోకూడదు. స్టీవ్‌జాబ్స్ ‘కనెక్టింగ్ ది డాట్స్’ చదివే పరిజ్ఞానం లేకున్న తెలుగు పడతి
చుక్కల ముగ్గులతో చక్కని చక్కగా గీతలను కలుపుతూ ఇంటి ముంగిలినే కాదు అంతర్జాల వేదికనయినా కళాత్మకం చేస్తూనే ఉంది.
ఆవుపేడ తెచ్చి అయినిళ్లు అలికి
గోవుపేడ తెచ్చి గోపురాలు అలికి
ముత్యాలు చెడగొట్టి ముగ్గులేయించి
పగడాలు చెడగొట్టి పట్టిలేయించి
అంటూ ముగ్గుల ప్రాధాన్యపు మురిపాల పల్లె గీతాలు బతికే వున్నాయి. సంతోషం, సంబరం, సుహృద్భావం, స్వాగతం, సమిష్టి జీవనం ఈ విలువలన్నింటికీ ప్రతీక సంక్రాంతి పర్వం.
సంకురాత్రి పండుగొచ్చె సిద్ధేశ్వరా
తల్లిపిల్ల చల్లగాను సిద్ధేశ్వరా
సాంబమూర్తి కరుణకల్గి సిద్ధేశ్వరా
కలకాలం వర్థిల్లు సిద్ధేశ్వరా
ఏడాదికొక్కసారి సిద్ధేశ్వరా
వాడావాడ కొత్త నుండి సిద్ధేశ్వరా
అంటూ శంఖం ఊదుతూ గంటవాయిస్తూ ఒకనాడు సంక్రాంతి వేళ కనబడే జంగమదేవర యే కాదు, ఇవాళ అనేక సంచార జీవన కృత్తులవారు మాత్రమేనా కులవృత్తుల వారూ స్థానచలనమో, స్థానభ్రంశమో చెందుతూనే ఉన్నారు. పల్లెలే ప్రకృతికి పట్టుగొమ్మలై, శాంతి, సౌఖ్యాలతో పచ్చదనపు పరిశుభ్రాలతో విరాజిల్లే స్థితి ‘నగరీకరణం’ పేర క్రమేపీ మటుమాయమయ్యే దౌర్భాగ్యం ఆవరించకుండా మన సహజ సంపదలను, మానవ వనరులను, మనుషుల మధ్య ప్రేమాభివందనాలను ఆత్మీయతలను మానవీయతను పరిరక్షించుకోవలసింది మనమే. పండుగలను దండగలనుకోకుండా మన ఆచార వ్యవహారాలను సంస్కృతీ సంప్రదాయాలను, మహోన్నత మానవీయ విలువలను నిలుపుకొని మనగలగడం మన చేతుల్లోనే ఉంది.
పోయిన సంక్రాంతినాడు
పొగ చూరిన ఇల్లు నేడు
కాంతి స్నానమ్ములాడె
కాలమెంత విలువైనది (ఋతుచక్రం- సినారె)
అని భవిష్యద్యానం చేసుకునే బంగరు సంక్రాంతులే మున్ముందు సిగ్గులు చిలికేలా తెలుగు వెలుగులు తేజరిల్లేలా ముందడుగు వేద్దాం. ఆ విధంగా ముందుకు పోదాం. *

-సుధామ