AADIVAVRAM - Others

హరిదాసులు - శ్రీహరి ధ్యాసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి ఉద్యమం వలన దక్షిణ భారతంలో వచ్చిన గొప్ప కళాసంపద హరిదాస గానం. ఇది ఇంచుమించుగా విజయనగర రాజుల కాలం నుండి ప్రచారాన్ని పొందింది.
ఆళ్వార్లు, నాయనార్లు భక్తి సంప్రదాయానికి పునాదులు వేశారు. శ్రీరామానుజులు సర్వసమానత్వం ప్రాతిపదికగా భక్తిమతాన్ని ప్రబోధించారు.
శ్రీవైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన పన్నిద్దరాళ్వార్లలో శ్రీ తిరుప్పాణి ఆళ్వార్ ఈ హరిదాస వర్గానికి చెందినవారే.
శ్రీమధ్వాచార్యుల వారు ప్రతిష్ఠించిన హరిభక్తి సంప్రదాయాన్ని దేశమంతా వ్యాపింపజేయటానికి హరిదాసులు బయలుదేరారు.. హరికి దాసులు = హరిదాసులు.
13వ శతాబ్దానికి చెందిన ప్రథమాంధ్ర వచన సంకీర్తనాచార్యుడైన శ్రీ కాంత కృష్ణమాచార్యుల వారు కూడా హరిదాస వర్గాన్ని చేరదీసి... సింహగిరి నరహరిపై వారు సంకీర్తనం చేసిన చాతుర్లక్ష గ్రంథాన్ని వారిచేత ప్రచారం చేయించినట్టు కూడా వారి కొన్ని వచనాల వలన తెలుస్తోంది.
‘విష్ణు భక్తిలేని విద్వాంసుని కంటె హరికీర్తనము చేయు నతండె కులజుండు;/ శ్వపచుండైన నేమి? ఏ వర్ణంబైననేమి? ద్విజుని కంటె నతడె కులజుండు!/ దృష్టింజూడగా విద్వజ్జన దివ్యభూషణము సింహగిరిం దలంచిన యాతండె కులజుండు!/ సంధ్యాది నిత్యకర్మానుష్ఠానంబులు తప్పక నడిపిననేమి?/ చతుర్వేద షట్‌శాస్తమ్రులు చదివిననేమి? శతక్రతువు లాచరించిననేమి?/ సకల ధర్మంబులు సేసిననేమి? మా సింహగిరి నరహరిదాసులకు దాసులైనంగాని లేదు గతి!/ స్వామీ! సింహగిరి నరహరీ! నమోనమో దయానిధీ!’
కన్నడ దేశంలో కూడా హరిదాస తత్త్వాన్ని సంప్రదాయాన్ని అనుసరించి సంకీర్తనం చేసిన వారు చాలామందే ఉన్నారు.
శ్రీహరినామ సంకీర్తనం చేస్తూ, భక్తితత్త్వాన్ని జనసామాన్యానికి అందించే మహాభక్తులు వీరు.
కలియుగంలో యజ్ఞయాగాదులు, జపతపాదులు చేయనక్కరలేదు. కేవలం హరిదాసు సంకీర్తనంతో ముక్తిని సాధించవచ్చును అని పురాణాలు చెబుతున్నాయి. దానిని అనుసరించి, హరిదాస సంప్రదాయం ఏర్పడింది.
శ్రీమద్భాగవతరం నవవిధ భక్తుల్ని తెలిపింది...
‘శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం,/ అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్!’ ఇందులో కీర్తనం అనేది ఒకటి, పురందరదాసు త్యాగయ్యలు కూడా ఈ సంప్రదాయానికి చేయూతనిచ్చేరు.
హరినామాలను, హరిగుణాలను, హరి లీలలను పాడుతూంటారు - హరిదాసులు.
హరినామ సంకీర్తనం చేస్తూ గ్రామంలో ఊంఛ వృత్తితో జీవనం సాగించే సంప్రదాయం. వీరు చేయిచాపి ఎవరినీ అడగరు. ఇచ్చినది మాత్రమే తీసుకొంటారు. అది కూడా చేత తాకరు. వారు మీటే ఏకతార దండె చాపుతారు. ఆ దండెపై ఉంచిన దాన్ని స్వీకరిస్తారు. ఈ విధానాన్ని రాయల వారు తమ ఆముక్తమాల్యదలో ప్రస్తావిస్తారు. అలానే కృష్ణమాచార్య సంకీర్తనంలో కూడా దీని ప్రస్తావన ఉన్నది.
సాధారణంగా ఆంధ్ర దేశంలో హరిదాసులు సాతాని జియ్యర్లు. వీరు ఊర్థ్వపుండ్రాలు ధరించి, తలపైన అక్షయ పాత్రను ధరించి, ఏకతార మీటుతూ చిటితాళమలు వేస్తూ... కృష్ణ లీలలు పాడుతూంటారు. కాళ్లకు గజ్జలు ధరిస్తారు. చిందులేసి వారు పాడుతూంటే, విన్నవారి ఎదలలో భక్తి రసం పరవళ్లు తొక్కుతుంది.
హరిదాసులు పెద్ద పండుగకి వస్తారు. అంటే, ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం. మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొని భక్తుల మొరలాలకించే సమయం! అంతేకాక, భోగి.. సంక్రాంతి.. కనమ.. ఈ మూడు పండుగలూ కలిసి రావడం వలన దీనిని పెద్ద పండుగ అంటారు.
నెలగంట పెట్టినది మొదలు అంటే.. ధనుస్సంక్రమణం ప్రారంభం నుండి మకర సంక్రాంతి వరకు - ధనుర్మాసం. ఈ ధనుర్మాసం నెల రోజులూ హరిదాసు కీర్తనలు వినిపిస్తూంటాయి. తెల్లవారుజామునే ఇంటింటికీ తిరుగుతూ హరినామ సంకీర్తనం చేస్తూంటారు.
అక్షయ పాత్ర తలపైని ధరించిని మొదలు క్రిందికి దింపేవరకు హరిదాసు ఎవరితోనూ మాట్లాడడు. కేవలం సంకీర్తనం చేయడమే! జనం అల్లంత దూరాన హరిదాసు పాట వినగానే పళ్లెం నిండుగా బియ్యాన్ని తెచ్చి వేస్తారు. ఎంతో ఆదరంతో ఆనందంతో ఈ బియ్యాన్ని అర్పిస్తారు.
ఇలా నెలంతా ఊరిలో సంకీర్తనలు చేసిన దాసు, భోగినాడు, సంక్రాంతినాడు - సేకరించిన రసవర్గమంతా సంతర్పణం చేస్తాడు. ఆ సంతర్పణం కోసం ఊరి వారంతా భారీగా రసవర్గాన్ని సమకూరుస్తారు. హరిదాసుకి వస్త్రాదులు ఇస్తారు. దక్షిణలూ ఇస్తారు. ఆయన నుండి ఆశీస్సులు అందుకొంటారు. ఇలా, హరిదాసులు మాత్రమే కాక, గంగిరెద్దుల వాళ్లూ వస్తారు. ఎద్దునాడించి, వినోదాన్ని కలిగిస్తారు.
ఇదంతా ఆంధ్రదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం...
తెలుగు ప్రజానీకాన్ని ఏకం చేసే గొప్ప పండుగ.
పెద్ద పండుగ - సంక్రాంతి.

ఎస్.టి.పి.వేణుగోపాలస్వామి