AADIVAVRAM - Others

సంప్రదాయ సంక్రాంతి.. ఆనందాల పూదొంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతినాడు తెలుగువారి గృహాలకు కన్నుల పండువుగా వస్తుంది పౌష్యలక్ష్మి సంక్రాంతి సుందరి. కొత్త వంటలు, కొత్త అల్లుళ్లు, సరికొత్త బట్టలు అంతా నూతనత్వంతో వెల్లివిరుస్తుంది.
సంక్రాంతి అంటే ఉత్తమమైన వెలుగని అర్థం. ఇది సూర్యునికి సంబంధించిన పండుగ. మనం భారతీయులం, సూర్యోపాసకులం. సూర్యభగవానుని విష్ణురూపునిగా భావించి పూజిస్తాము. దినకరుడు ద్వాదశ రాశుల్లోకి ‘మకరరాశి’లో ప్రవేశించి, ఉత్తరాభిముఖంగా తన యాత్రను ఆరు నెలల పాటు కొనసాగిస్తాడు. అందుకే దీనికి ‘మకర సంక్రాంతి’ అని కూడా పేరు.
సూర్యుడు మకర రేఖ నుండి కర్కాటక రేఖ వైపు మళ్లగానే దిన ప్రయాణం హెచ్చుతుంది. ఎముకల్ని కొరికే చలి ప్రతాపం తగ్గుతుంది.
సంక్రాంతి నుండే ‘ఉత్తరాయణ పుణ్యకాలం’ ప్రారంభమవుతుంది. స్వర్గద్వారాలు తెరచుకుంటాయంటారు. ఈ మహత్తర పుణ్యకాలం కోసమే నాడు భీష్ముడు అంపశయ్యపై శయనించి నిరీక్షించాడు.
ఈ పండుగలో ఆవుపేడతో చేసే గొబ్బెమ్మకు, గోవులకు, పంటలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గొబ్బెమ్మను దేవతగా పూజిస్తారు.
గొబ్బి దేవత
పూర్వం ఒక ఆవుల మందలో రకరకాల ఆవులుండేవి. తెల్లావులు, కర్రావులు, ఎర్రావులు, చుక్కలవి, మచ్చలవి ఇలా ఎన్నో చూడముచ్చటగా ఉండేవి. ఇవన్నీ ఒకటిగా మేస్తూ ఉంటే, వంకరటింకర కొమ్ములు, నల్లని రంగు, ఒక కాలుసొట్ట, గూని లాంటి అవలక్షణాలు గల ఒకే ఒక్క ఆవు మాత్రం ఆ జట్టులో చేరక వెలివేసినట్లుగా దూరంగా మేస్తూ ఉండేది. దీనిది వికార స్వభావం. దాని పేరు ‘సౌగంధి’. ఎప్పుడూ ఎండు పొదుగుతో గిద్దెడు పాలయినా ఇవ్వని సౌగంధి పట్ల యజమానికి విసుగు పుట్టి, ఆ సొట్టావుని మేపడం దండగని సంతలో అమ్మి రమ్మంటాడు. అది అర్థం చేసుకున్న సౌగంధి, అతడన్న మాటలకి కన్నీరు కారుస్తుంది. అంతలో ఓ చిన్నారి బాలుడు మంద దగ్గరికి వచ్చి ‘రంగురంగుల ఆవుల్లారా, లేగలుకన్న తల్లుల్లారా’ అంటూ పాడుతూ, కాసిని పాలిచ్చి తన ఆకలిని తీర్చమని అడుగగా, మందలోని ఆవులన్నీ ‘మా దగ్గరి పాలు మా లేగలకూ, యజమానికే చాలీచాలకుండా ఉంటే, దానాలూ, ధర్మాలూ కూడానా?’ అంటూ ఆ పిల్లవాణ్ణి పొమ్మనడమే కాకుండా కుమ్మడానికి సిద్ధమయ్యాయి. వాటికి ఆ బాలుడు ముష్టివాడిలాగా కనిపించగా, సౌగంధి మాత్రం ఆ పిల్లవాడు బాలగోపాలుడని పసిగట్టింది. ఎండిన పొదుగు తల్లి ప్రేమతో నిండి పాలు వచ్చేసి, ఆ బాలుడికి కడుపునిండా పాలిస్తుంది. ఆ బాలుడు ఆ ఆవుని నిమిరి, గంగడోలు దువ్వగానే, వికృత రూపంలో వట్టిపోయిన ఆవు, బంగారు వనె్నతో చక్కని గంగిగోవుగా మారిపోతుంది. యజమానితోపాటు ఇంటిల్లిపాది దీన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ వార్త ఊరంతా పాకుతుంది. కడవలు కడవలుగా పాలు నిండినా, పొదుపులో పాలు ఏ మాత్రం తరిగిపోలేదు. దీన్ని చూసిన యజమాని ‘ఇది మహారాజుల దగ్గర ఉండవలసినది, దీనికి మంచి వెల వస్తుందని, ప్రభువుల వారి అనుగ్రహం సంపాదించ చూస్తాడు. ఇది తెలుసుకున్న సౌగంధి, ఆ గోపాలునే్న నమ్ముకొని, చివరకు అతనిలో ఐక్యం అవుతుంది. అది ఉండేచోట బంగారు వనె్న పూలమొక్క వెలిసింది. ఆ పుష్పమే కృష్ణునికి ప్రియమైన పవిత్ర ‘గొబ్బిపువ్వు’. ఇలా సౌగంధి పుట్టుక వల్ల, గోవు జాతికంతటికీ శాశ్వత గౌరవం కలిగింది. సౌగంధి తన అవతారం చాలించి కూడా, బాలికల చేత ‘గొబ్బి దేవత’గా ప్రతి ఏడాది పూజలందుకుంటూనే ఉంది. సంక్రాంతి వెళ్లిన మూడవ రోజు సౌగంధి పుట్టినరోజు. ఆ రోజు ఆవు జాతికంతటికీ పూజలు చేస్తారు. అదే పశువుల పండుగ. దీనినే దక్షిణాదిన మాట్టు పొంగల్ అంటారు. రైతులకు, పశువులు లేకుంటే వ్యవసాయం సాగదు. పశువులకు స్నానం చేయించి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజలు చేస్తారు.
పశువుల పండుగ
పశువుల పండుగనాడు రైతులు కోడెలను అలంకరిస్తారు. సరిగంచు దుప్పటి కప్పిన, మిలమిల మెరిసె కోడెకి కట్టిన గజ్జెలు ఘల్లుఘల్లు మంటుంటాయి. కోడె కుడివైపు కొమ్ము కొసలో, డబ్బు సంచి కట్టి ఉంటుంది. ఆ కోడెను లొంగదీసుకుని, దాని కొమ్ములకున్న డబ్బు సంచిని సంపాదించమని పోటీ పెడతారు. ఈ పండుగను జనం మిద్దెలు, మేడలు ఎక్కి వీధికిరువైపులా ఉండి వీక్షిస్తుంటారు. సాహసవంతులైన రైతు యువకులు, దాని కొమ్ములు వంచి, డబ్బు తెచ్చిన వారిని వీరులుగా భావిస్తారు.
ఇక సంక్రాంతి వస్తుందంటే కోళ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు కూడా జరుపుకుంటుంటారు.
బెంగాల్‌లో సంక్రాంతిని జల క్రీడోత్సవంగా జరుపుకునేవారు.
అలహాబాద్ ప్రాంతాలలో ‘మేలా’ ఉత్సవాలు జరుగుతాయి.
మహారాష్టల్రో ఇది స్ర్తిల పండుగ. వారు జట్లు జట్లుగా ప్రతి గుమ్మంలోకి వెళ్లి ఒకరినొకరు అభినందించుకుంటారు. పూర్వం బొంబాయిలో మాత్రం పిల్లలు గాలిపటాలు ఎగురవేసేవారట. తమిళనాడులో ‘పొంగల్ పొంగల్ పాలు పొంగల్’ అంటూ పాలు పొంగిస్తుంటారు. పాలు పొంగినట్లు తమ సంపదలు పెరిగిపోవాలని ఆశిస్తారు. అక్కడ ‘చెరుకు’ పంట ఎక్కువ కనుక చెరుకు గడలను సూర్యభగవానునికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
రైతుల పండుగ
రైతులు ఏడాది పొడుగునా శ్రమించి పండించిన పంటను ఇంటికి తీసుకువెళతారు. మరో ఏడాది వరకు చాలినంత ధాన్యం చేకూరగానే ఆ ఆనందంతో పంటల్లో ధాన్యలక్ష్మిని, కామధేనువు లాంటి గోవులను పూజిస్తారు. పట్టణాల నుండి చాలామంది పల్లెలకు వెళ్లి సంక్రాంతి శోభను తిలకించి తన్మయులౌతారు. పల్లెసీమలో ప్రతి ఇంటిని అలంకరిస్తారు. గోడకు వెల్లవేసి, ఎర్ర మట్టితో పట్టెలు పెడతారు. ఇంటి ముంగిళ్లలో పెద్దపెద్ద ముగ్గులు వేస్తారు. పాత మట్టి పాత్రలను పారవేసి కొత్తవి కొనుక్కుంటారు.
ముగ్గుల పండుగ
స్ర్తిలకు సంక్రాంతి పండుగ అంటే ‘ముగ్గుల పండుగ’. ప్రతి గృహం ముందు భాగాన్ని శుభ్రం చేసి, గృహిణులు అందంగా రంగురంగుల రంగవల్లికలు పెడతారు. ఆ ముగ్గుల మధ్య గొబ్బిళ్లు పెట్టి, గొబ్బి పాటలు పాడతారు. తర్వాత ఆ గొబ్బి ముద్దలను గోడలపై పిడకలుగా చేసి, ఎండబెట్టి, ఆ పిడకల మంటతోనే సంక్రాంతి రోజున ఇంటి ముంగిట కొత్త గురిగిలో పొంగళి వండుతారు. పాలపొంగళిలో బెల్లం కలుపుతారు. కొత్తగా పెళ్లయిన దంపతులు ఆ పొంగళి కుండను దించుకుంటారు. ఆ యేడు పండిన ఆకుకూరలు, కాయగూరలను కూడా పొంగళి చుట్టూ పెడతారు. పిల్లలకి ఇది పతంగుల పండుగ. పిల్లలు గాలిపటాలను ఉత్సాహంగా ఎగురవేస్తారు.
ఈ పండుగకు, నువ్వుల లడ్లు, పల్లీల లడ్లు ప్రత్యేకంగా, తప్పనిసరిగా తయారుచేస్తారు. రైతు పండించే అన్ని కూరగాయలు, ఆకుకూరలు కలిపి వండే ‘కలెగూర’ను ప్రత్యేకించి వండుతారు.
ఇది మూడు రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ.
భోగి మొదటిరోజు. రేగుపళ్లని భోగిపళ్లంటారు. సూర్యునికి ప్రతీకలైన రేగు పళ్లని నాణాలతో కలిపి, సూర్యుని అనుగ్రహం కలగాలని పిల్లలపై పోస్తారు. తెల్లవారగానే భోగిమంటలు వేసి చలిని పారదోలుతారు. రెండవ రోజు సంక్రాంతి. ఈ రోజు తలపై అక్షయ పాత్రతో, అలంకరించిన రంగురంగుల బట్టలతో, చిడతలు కొడుతూ, పాటలు పాడుతూ వీధుల్లో హరిదాసులు కన్పిస్తుంటారు. ప్రతి ఇంటి ముందు రంగవల్లికలల్లి, పాలు పొంగిస్తారు స్ర్తిలు. ఇంటిలోని ప్రతి గడపపై ఇరువైపులా చిట్టిగొబ్బెమ్మల నుంచి, పండించిన నవధాన్యాలను, చెరుకు ముక్కలు, జీడిపళ్లు కలిపి వేస్తారు. కనుమరోజు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. పశువుల పందాలను నిర్వహిస్తారు. మినుములతో చేసిన గారెలు తింటారు. కనుమ మరుసటి రోజును ముక్కనుమ అంటారు. ఆ రోజు ముక్కను అనగా మాంసాహారాన్ని వండుకు తింటారు. పెద్దల పండుగని, పల్లెల పండుగని, రైతుల పండుగని, పతంగుల పండుగని సంప్రదాయాలు, ఆచారాలు పాటింపజేసే సంక్రాంతికి పలురకాల పేర్లు ఉన్నాయి.

రెడ్డిశెట్టి అనూరాధ