AADIVAVRAM - Others

ప్రచురణ రంగానికి ఊపిరి పుస్తక మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడలో 29 సంవత్సరాలుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవం ఈ నెల 12వ తేదీతో ముగిసింది. అయితే ప్రతీ ఏటా జనవరి నెలలో జరుగుతున్న విజయవాడ బుక్ ఫెస్టివల్ పాఠకులకు, పుస్తక ప్రియులకు ఎంతవరకూ ఉపయోగపడుతుందని ఆలోచిస్తే ఈ క్రింది విషయాలను ఒక్కసారి తరచి చూసుకోక తప్పదు.
1960 నుంచి 1990 వరకూ ప్రచురణ రంగానికి స్వర్ణకాలమే అని చెప్పుకోవాలి. ఆ మూడు దశాబ్దాలలో తెలుగు నేల మీద పత్రికలకు ఎంతో ఆదరణ వుండేది. ఎన్నో వారపత్రికలు, పక్ష పత్రికలు, మాస పత్రికలు పుట్టుకొచ్చాయి. ఎంతో ప్రజాదరణని పొందాయి.
ఆ కారణంగా ఎంతోమంది కొత్త రచయిత(త్రు)లు పుట్టుకొచ్చారు. తమలోని భావాలను, ఆలోచనలను కథల రూపంలోనూ, కవితలుగానూ ఆవిష్కరించి పాఠకులలో నూతన ఆలోచనా సరళిని కొంగ్రొత్త దృక్పథాలకి తెరలేపారు.
ఆలోచింపజేసే అద్భుత నవలలతోపాటు, పారవశ్యంలో ముంచి తేల్చే ప్రేమకి సంబంధించిన నవలలు, సమకాలిక సమస్యలతో కూడిన సాహిత్యంతో పాపులర్ నవలలు విస్తృతంగా వెలువరించడంతో పాఠకుల్లో పఠనాసక్తిని విపరీతంగా పెంచి పుస్తక ప్రియులను తయారుచేశాయి.
మచిలీపట్నంలో ఎం.శేషాచలం అండ్ కంపెనీ వారు ప్రాచీన ప్రబంధాలను, వ్యాఖ్యానాలను ప్రముఖులతో రాయించి ఎమెస్కో పాకెట్ బుక్స్‌గా ప్రచురించారు. ఇంటింటా గ్రంథాలయం అనే పథకం ద్వారా ఇంటింటికి గ్రంథాలను చేర్చేందుకు కృషి చేసింది.
అప్పటికే ఆంధ్ర దేశంలోని దాదాపుగా ప్రతీ పట్టణంలోనూ, చాలా గ్రామాల్లోనూ రెంటెడ్ బుక్‌స్టాల్స్ విరివిగా ఏర్పడటం జరిగింది. వాటి కారణంగా నవలయినా, మరేదైనా ప్రతీ పాఠకుడికి అందుబాటులో వుండటంతో ప్రతీ ఇంట్లోనూ పుస్తక ప్రియులు ఏర్పడ్డారు.
కొవ్వలి, జంపన వంటి రచయితలు రాసే నవలలు దొంగతనంగా చదివే స్థాయి నుంచి రచయిత్రులు రాసే నవలలు నట్టింట్లోకి రావడం ప్రారంభమయింది. అంతవరకూ ఆంధ్ర భాషావర్ధిని గ్రంథమాల, ఆంధ్ర ప్రచారిణి గ్రంథమాల, అద్దేపల్లి లక్ష్మణ స్వామి గారి సరస్వతి గ్రంథ మండలి, ఆంధ్ర గ్రంథమాల, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, ఆంధ్ర బుక్ డిపో, బాలసరస్వతి బుక్ డిపో, రాయలు అండ్ కో, ఆదర్శ గ్రంథ మండలి, విజయవాడ, విశ్వ సాహిత్యమాల, ఆంధ్ర సారస్వత్ పరిషత్, దేశ కవితా మండలి, త్రివేణీ పబ్లిషర్స్, కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్ (కాళహస్తి), తమ్మారావు అండ్ సన్స్, గొల్లపూడి వీరాస్వామి (రాజమండ్రి), బి.వి. అండ్ సన్స్ (కాకినాడ), సాహితి పబ్లికేషన్స్ (విజయవాడ), నవయుగ పబ్లిషింగ్ హౌస్ (గుంటూరు), ప్రేమ్‌చంద్ పబ్లికేషన్స్, ప్రగతి ప్రచురణాలయం, ప్రజాశక్తి ప్రచురణాలయం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, దాచేపల్లి కృష్ణయ్య అండ్ సన్స్ (సికిందరాబాద్), నవోదయా పబ్లిషర్స్ వారు వివిధ రకాల సాహిత్యాన్ని ప్రచురించారు.
1990 నుంచి పుస్తక ప్రచురణ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. లెటర్ ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి ముద్రణ సాంకేతికతను అందిపుచ్చుకుని ఆఫ్‌సెట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ కాలంనాటికి తెలుగు వాకిళ్లలో అడుగుపెట్టిన టెలివిజన్లు మెల్లగా పుంజుకుని, ఛానళ్లు వ్యాప్తి చెంది పుస్తక ప్రియులను తమ వైపు లాక్కున్నాయి.
క్రమంగా పుస్తక ప్రియులు అయిన వారిలో ఎక్కువమంది స్ర్తిలు టీవీలో వస్తున్న సీరియల్స్‌కి అతుక్కుపోయి, పుస్తకాలను పక్కన పెట్టడం ప్రారంభించారు. అది ఎంతగా అంటే నవలలు రాసే రచయిత(త్రు)లు, ప్రచురించే ప్రచురణ కర్తలు వేరే దారిని వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.
అప్పటి నుంచే వారు నవలా సాహిత్యాన్ని వదిలి నాన్‌ఫిక్షన్‌లోకి కాలు పెట్టారు. వ్యక్తిత్వ వికాసం, వంటలు, వాస్తు, ఇంగ్లీష్ నేర్చుకునేందుకు అవసరమైన చిన్నచిన్న పుస్తకాలు, స్పీకింగ్ కోర్సులు, ధ్యానం, ఒత్తిడి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోవడం ఎలా? విజయం సాధించడం ఎలా? మనిషిలో నిబిడీకృతమైన శక్తులు, మనస్సు, యోగా, వైద్యం, ఆయుర్వేదం, హోమియోపతి వైద్యం వగైరా పుస్తకాలను ప్రచురించడం ప్రారంభించారు.
తొలి రోజుల్లో ఆ పుస్తకాలు విపరీతంగా అమ్ముడుపోయినా, దాదాపుగా ప్రచురణ కర్తలు అందరూ అవే విషయాల మీద ప్రచురణలు చేపట్టడంతో క్రమంగా వాటికి కూడా ఆదరణ తగ్గుతున్నట్లనిపిస్తోంది. పాఠకులు పుస్తకాల కోసం షాపులకు వెళ్లినా వారికి కావలసిన రచనలు అక్కడ లభించక పోవడం కూడా చాలా సందర్భాలలో వారికి నిరుత్సాహం కలిగిస్తోంది.
టెలివిజన్ ఛానళ్ల వలన సినిమాలకే ఆదరణ తగ్గుతుంటే, నేటి యువతరం కంప్యూటర్లకీ, ఇంటర్‌నెట్లకి ప్రాధాన్యత ఇస్తూ పుస్తకాలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ప్రచురణ రంగం కుదేలవుతోంది. దానికి తోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించక పోవడం ఇంకా దురదృష్టకరం.
ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పుస్తకం అయినా ఇక్కడ దొరుకుతుందన్న నమ్మకం పుస్తక మహోత్సవాలు కల్పిస్తున్నాయి. ప్రతీ సంవత్సరం జనవరి నెలలో జరిగే విజయవాడ పుస్తక మహోత్సవాల కోసం జనం ఎదురుచూస్తారు. చూస్తూంటారు. వచ్చి తమకు కావలసిన పుస్తకాన్ని చేజిక్కించుకుని ఎనలేని ఆనందాన్ని పొందుతూ పుస్తక ప్రపంచాన్ని బతికిస్తున్నారు.
పుస్తక ప్రియులకు, పుస్తక విక్రేతలకు, ప్రచురణ కర్తలకు ఇలాంటి పుస్తక మహోత్సవాల అవసరం ఎంతయినా ఉంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ పుస్తక మహోత్సవాలను ప్రోత్సహిస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి.
*
చిత్రం..హైదరాబాద్ పుస్తక మహోత్సవంలో అంపశయ్య నవీన్

-ఎన్.ఎస్.నాగిరెడ్డి