AADIVAVRAM - Others

ముప్పయి ఏళ్ల ముచ్చట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం అంతటా ప్రతి ఏటా కొత్త సంవత్సరం.. కుల, మత, ప్రాంత వర్గ దేశ సరిహద్దు ఎల్లలు లేకుండా అందరికీ వస్తుంది. అయితే విజయవాడ నగర వాసులకు మాత్రం ఈ కొత్త సంవత్సరం ఏకంగా పుస్తకాల పండుగనే తన వెంట తీసుకువస్తుంది. ఒకటిరెండేళ్లు కాదు.. గడచిన 29 సంవత్సరాలుగా విజయవాడ పుస్తక మహోత్సవం నగర ప్రజల జీవితాల్లో మమేకమైంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం నిర్ణీత సమయాల్లో కలుసుకోవడానికి ఈ వేదిక ఒక తీపి గుర్తుగా నిలుస్తుంది. ఏది ఏమైనా ఆరంభంలో ఎనె్నన్నో ఆటు పోట్లు ఎదురైనా నిర్వాహకులు వ్యయప్రయాసలకు గురి అయినప్పటికీ నిర్ణీత తేదీల్లో ఈ పుస్తకాల సంబరాలను నిర్వహించడం వల్ల లక్షలాది మంది పుస్తక ప్రియులు మరోసారి తాము కూడా పుస్తక ప్రియులమేనంటూ ఆచరణాత్మకంగా ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది విజయవాడ స్వరాజ్యమైదానంలో 300 స్టాల్స్‌లో 2కోట్ల విలువైన పుస్తకాలు అమ్ముడు పోయాయి. లక్షలాది రూపాయల విలువైన ఆర్డర్‌లు వచ్చాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం... ఎన్‌టిఆర్ ట్రస్ట్ కలిసి ఈ పుస్తకోత్సవానికి దాదాపు 50 లక్షలు ఆర్ధిక సహాయం అందించినప్పటికీ సౌకర్యాలు గతంకంటే మెరుగుపడకపోగా పబ్లిషర్‌లు, పుస్తక విక్రేతలు, రచయితలు, పుస్తక ప్రియులు అసౌకర్యాలతో ఎన్నో ఇబ్బందులకు గురి ఆయ్యారు. ఇందుకు కారణాలు కోకొల్లలు. గతంతో పోలిస్తే పుస్తక ప్రియుల తాకిడి తగ్గిందనేది అక్షరసత్యం. ప్రచురణ అవుతున్న పుస్తకాల్లో సింహభాగం అంతర్జాలంలో ఉచితంగా లభిస్తుండటంతో డబ్బులు వెచ్చించడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపలేకపోయారు. ఏది ఏమైనా విజయవాడ పుస్తక మహోత్సవం గత 29 ఏళ్లుగా దేశం నలుమూలలకు కూడా ఒక ప్రేరణగా నిలుస్తూ వస్తోంది. దేశం నలుమూలల నుండి ప్రముఖ పబ్లిషింగ్ సంస్థల నుండి లక్షల సంఖ్యలో పుస్తకాలు ఇక్కడ కొలువుతీరుతున్నాయి. ఒక్కసారి గతంలోకి వెళితే నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొలిసారిగా 1989 సెప్టెంబర్‌లో పెద్దఎత్తున పుస్తక మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆ సమయంలో ఎ రామ్మోహనరావు అధ్యక్షుడుగా, ఐ అక్కేశ్వరరావు ఉపాధ్యక్షుడుగా, డి అశోక్‌కుమార్ కార్యదర్శిగా, పిఆర్ కోటేశ్వరరావు కోశాధికారిగా, మరో 9మంది వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఏర్పడిన విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీలో దేశవ్యాప్త పుస్తక ప్రచురణ రంగం నుండి మరో 40మంది సభ్యులుగా చేరారు. ఆపై 1991 జనవరి 5 నుండి 15వరకూ ద్వితీయ పుస్తక మహోత్సవం జరిగింది. నాడు 84 స్టాల్స్ ఏర్పడ్డాయి. 1992 జనవరి 10 - 20 తేదీల మధ్య 114 స్టాల్స్‌తో మూడవ పుస్తక మహోత్సవం జరిగింది. ఇక 1993నుండి ఏటా జనవరి 1 -11 తేదీల మధ్యలో ఈ పుస్తక సంబరాలు ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నాయి. మధ్యలో 4వ తేదీ నగర వీధుల్లో పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతూ వస్తుంది.
అక్షరదాహం తీర్చుతుంది
ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తక ప్రియుల అక్షర దాహం తీర్చేది ఇలాంటి పుస్తకాల సంబరాలే. ఎందుకంటే సమస్త పుస్తకాలు మన కళ్ల ఎదుటే సాక్షాత్కరిస్తుంటాయి. పైగా ఒకే చోట అందరినీ కలుసుకోవడం మన అదృష్టం. ఎవరికి ఎలాంటి పుస్తకం కావాలన్నా లభించేది ఈ ఒక్కచోటే. ఇది ఉంది.. అది లేదు అన్న మాటే లేదు. సమస్త పుస్తకాలు ఇక్కడే కొలువుతీరుతుంటాయి. అందుకేనేమో ఎందరో పుస్తక ప్రియులు, విద్యార్ధులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులు తమకు అవసరమయ్యే పుస్తకం కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. కొందరి అవసరం.. మరి కొందరిది జిజ్ఞాస. వివిధ భాషలోని సాహిత్యం కోసం కొందరు...ఆధ్యాత్మికం, ఆరోగ్యం కోసం మరికొందరైతే ముఖ్యంగా మహిళలు వంటల పుస్తకాల కోసం అనే్వషిస్తుంటారు. ఘుమఘుమలాడే వంటకాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అయితే రుచికరమైన అన్ని వంటలను అందరూ చేసుకోలేరు. అందుకే తెలుసుకొని చేసుకోవాలనుకునే వారు వివిధ రకాల వంటల తయారీ పుస్తకాల పట్ల ఆసక్తి చూపుతుంటారు.
* పుస్తక పఠనం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అందరూ చెబుతారు. మనిషికి వివేకం, వివేచన, విచక్షణ శక్తి వస్తుందంటారు. సరే కాల్పనిక సాహిత్యాన్ని చదివేవారు మిగతా పుస్తకాలు చదివేవారికన్నా ఉత్తములుగా తయారవుతారన్నది ఓ అధ్యయనంలో తేలింది. కింగ్‌స్టన్ యూనివర్శిటీ 2017నాటి అధ్యయనం ప్రకారం వాస్తవిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, తమ మనసులోని భావాలను సూటిగా, చక్కగా వివరించడం, సమాజానికి ప్రయోజనం కలిగించేలా వ్యవహరించడంలో మిగతావారికన్నా వీరు మెరుగ్గా ఉంటారన్నది అంచనా. మతిమరుపునకు కారణమయ్యే అల్జీమర్స్, డెమిన్షియా వంటి సమస్యలకు పుస్తక పఠనం అనేది ఓ ఔషధం. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో పుస్తక పఠనం మొదటి స్థానంలో ఉంది. ఒత్తిడిని తగ్గించడంలో పుస్తక పఠనం వల్ల 68 శాతం మంది లబ్దిపొందితే సంగీతం వినడం వినడం వల్ల 63 శాతం మంది ఒత్తిడి నుంచి బయటపడుతున్నారు. రోజుకు అరగంటపాటు పుస్తకం చదవడం అలవాటైతే వారి జీవితకాలంలో 23 నెలల ఆయుర్దాయం పెరుగుతుందని సోషల్ సైన్స్ మెడిసన్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది.

*మనదేశంలో పుస్తక ప్రచురణ వ్యాపారం ఏటా 26,060 కోట్ల మేరకు ఉంటుంది. ప్రపంచంలో ఆరవ అతిపెద్ద పుస్తక ప్రచురణ దేశం మనది. ఇంగ్లీషు పుస్తక ప్రచురణలో మనం రెండో స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో పుస్తక ప్రచురణ రంగం ద్వారా 814,000 మంది ప్రత్యక్షంగా జీవిస్తున్నారు. భారత్‌లో వీరి సంఖ్య 69,709 మంది. ఏటా రెండు లక్షల కొత్త పుస్తకాలు ప్రచురితమవుతుంటాయని ఒక అంచనా. రచయితలు ప్రచురణకోసం ఇచ్చే పుస్తకాల్లో దాదాపు 95 శాతం ప్రచురణకర్తలు తిరస్కరణకు గురవుతుంటాయంటే నమ్మాలి.

సాధారణంగా ఏ కార్యక్రమం అయినా నిర్వహణలో లోపాలు ఉండకపోవు. అయితే ఆర్ధిక సహాయం కంటే నిలబడి పనిచేసే వ్యక్తులు అవసరం చాలా ఉంది. ప్రాంత, పరిధుల ప్రభావం లేకుండా తెలుగువారందరినీ విజ్ఞానం వైపు నడిపించే సాహితీ యుద్ధంగా ఇలాంటి పుస్తక మహోత్సవాలు ఆదర్శంగా నిలుస్తాయి. అన్నింటికీ మించి వర్తమాన రచయితలకు వేదికగా నిలుస్తుంది. సాహిత్యం పట్ల విద్యార్థులను, యువకులను చైతన్యం వంతం చేస్తూ ఆధ్యాత్మికం నుంచి ఆది, భౌతికం వరకూ అన్ని పుస్తకాలు లభించే ఏకైక వేదికగా నిలుస్తుంది.
-సి.రాఘవాచారి, పాత్రికేయుడు

ఎక్కడ పుస్తక మహోత్సవం జరిగినా ఆయా జిల్లాల నలుమూలల నుండి పాఠశాల, కళాశాల విద్యార్ధులు తరలివచ్చేలా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. అలాగే రచయితలతో ముఖాముఖి ఏర్పాటు చేసి వారిలో పఠనాసక్తిని కల్గించాలి.
-పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

పుస్తకాల ప్రదర్శన వల్ల రచయితలు, సంపాదనపరులు డబ్బు ఉన్నవారికే మేలు జరుగుతుందన్న అపోహలను తొలగించాలి. వాస్తవానికి కొనుగోలు శక్తి లేని వారిలోనూ ఎందరికో పుస్తకాలపై ఆశక్తి లేకపోలేదు. అలాంటి వారిలో ఎందరో రచయితలు, పుస్తక ప్రియులు కూడా ఉన్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం తగినంత రాయితీతో వారికి అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా తెల్లకార్డుదారులకు 50 శాతం రాయితీతో పుస్తకాలు అందించగలిగితే వారిలో పఠనాసక్తి పెంచవచ్చు. ఐడి కార్డు చూపితే విద్యార్థులకు కూడా రాయితీ అందించాలి.
-డాక్టర్ గుమ్మా సాంబశివరావు

-నిమ్మరాజు చలపతిరావు విజయవాడ