Others

ఆత్రేయ పాటలపై ఆమూలాగ్ర పరిశీలన (బుక్ రివ్యూ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పాడుతా తీయగా’ (ఆత్రేయ నూట పదార్లు)
రచన: డా. పైడిపాల
పుటలు: 230, వెల: రూ.150/-
ప్రతులకు: డా.పి.యస్.రెడ్డి , 11-20, కొంకాపల్లి
అమలాపురం- 533201, ఫోన్: 99891-06162
నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ హైదరాబాద్-27, ఫోన్: 040 - 24652387

*** **************
కాళిదాసు - మల్లినాథసూరి, షేక్స్‌పియర్ -ఎ.సి.బ్రాడ్లే, జాన్సన్-బాస్వెల్.. ఈ అనుబంధ క్రమంలో ఆధునికకాలంలో సినీగేయ సాహిత్య విమర్శ విషయంలో ఆచార్య ఆత్రేయ -పైడిపాల జంటను కూడా పేర్కొనవచ్చు. పైడిపాల రాసిన ‘ఆత్రేయ నాటకాలు - పూర్వాపరాలు’ (ఎం.్ఫల్ సిద్ధాంత వ్యాసం) అనే పుస్తకాన్ని చూసి ముచ్చటపడి దానికి ముందుమాట రాస్తూ- ‘ఆత్రేయ నాటకాలమీద పరిశోధన చేసిన మీరు డిగ్రీ పొందుదామనుకున్నారు. కాని మీ పరిశోధనవల్ల నాకు డిగ్రీ లభించింది’ అని ఆత్రేయ స్వయంగా మెచ్చుకోవడం దీనికి సాక్ష్యం. ఆత్రేయ రచనలపై నిరంతర పరిశోధన, కృషి చేస్తున్న డా. పైడిపాల తాజా పుస్తకం ‘పాడుతా తీయగా’ (ఆత్రేయ నూటపదార్లు).
‘పాడుతా తీయగా’ అనగానే యస్.పి.బాలసుబ్రహ్మణ్యం వారం వారం టీవీలో సమర్పిస్తున్న సినీ సంగీత కార్యక్రమం అందరికీ గుర్తొస్తుంది. ఇది ఆ కార్యక్రమానికి సంబంధించిన పాటల పుస్తకంగా కొందరు పొరబడే అవకాశం వుంది. కాని ఇది ఆత్రేయ ‘మూగమనసులు’ చిత్రానికి రాసిన ఆణిముత్యాల వంటి పాటలలో ఒకటైన ‘పాడుతా తీయగా సల్లగా..’ అనే పాట పల్లవి నుంచి తీసుకొన్న మకుటం. ఆత్రేయ రచించిన 1500పైగా సినిమా పాటలనుంచి 116 పాటల పూర్తి పాఠాలను, సుమారు మరో 116 పాటల సమాచారాన్ని 16 విభాగాలలో విశే్లషణాత్మకంగా పొందుపరిచి పైడిపాల ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఆత్రేయ సాహితి సహ సంపాదకునిగా పాటల మూడు సంపుటాల కోసం అప్పట్లో 1100 పాటల్ని మాత్రమే సేకరించి ప్రచురించగా- ఇప్పుడు పైడిపాల మిగిలిన 400 పాటల్ని కూడా సేకరించి మొత్తం పాటల నుంచి ఆయా విభాగాల కనుగుణంగా 116 పాటల్ని ఎంపిక చేసి ప్రచురించడంతో పాటు ఆత్రేయ పాటలు రాసిన 485 చిత్రాల జాబితాను కూడా ఇవ్వడం ఈ పుస్తక రూపకల్పన వెనుక రచయిత శ్రద్ధ, శ్రమ అవగతమవుతాయి.
ఇది కేవలం ఆత్రేయ 116 పాటల సంకలనం మాత్రమే అనుకుంటే పొరపాటు! అలా అనుకుంటే వ్యాపార ధోరణిలో తామరతంపరగా ప్రచురిస్తున్న సినీ గేయాల సంకలనాలకు, దీనికి తేడా ఏమంటుంది? వాటితో ఏ మాత్రం పోలికలేని ఈ పుస్తకంలో ఎన్నో ప్రత్యేకతలూ, విశిష్టతలూ వున్నాయి. వాటిలో ముందుగా పేర్కొనదగింది శీర్షికల విభజన. ఆత్రేయ పాటల్ని 16 శీర్షికలుగా విభజించి, విషయ సూచికకు ‘ఆత్రేయుని (చంద్రుని) షోడశ కళలు’ అని నామకరణం చెయ్యడం సాహితీ ప్రియుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఆపైన శీర్షికలకు ‘ఉన్నట్టే వున్నా అనే వూగిసలాటలో.’, ‘అనుబంధాలు -స్నేహ సుగంధాలు’, ‘వలపులతోటలు - వయసు పాటలు’, ‘ముద్దు ముద్దు పాటలు - మురిపాల మూటలు’, ‘తత్త్వాలూ - ముత్యాలు’, ‘తర్జుమాల ఖర్జూరాలు’ వంటి అందమైన అర్థవంతమైన పేర్లు పెట్టడం అందర్నీ ఆకట్టుకుంటున్నది. ఈ నూట పదహారు పాటలూ ఏ ఏ పుటల్లో వున్నాయో ముందుగానే అకారాది క్రమంలో ఇచ్చిన సినిమాల జాబితా ద్వారా తెలియజేసిన పద్ధతి సినీ సంగీత ప్రియులకు కరతలామలకంగా వుంటుంది.
ప్రతి ప్రకరణానికి ముందు ప్రామాణికమైన ఉపోద్ఘాతాలున్నాయి. వాటిలోని అంశాలతో ఆత్రేయ జీవితంలోని సంఘటనలనూ, ఆయన నమ్మిన సిద్ధాంతాలనూ, మనోభావాలను చక్కగా ముడివేశారు. ప్రతి గీతానికి ఆయా సినిమాల్లోని సందర్భ సన్నివేశాలను, పూర్వాపరాలను, భావ వైశిష్ట్యాలను విసిగించకుండా క్లుప్తంగా రాసిన పద్ధతి బావుంది. పాటలు కాని, వివరణలు కాని పునరుక్తం కాకుండా జాగ్రత్తపడ్డం ప్రశంసనీయం. ఆత్రేయ శైలిలాగే ఈ రచన కూడా సరళంగా వుండి చదవడం మొదలుపెడితే ఏకబిగిని చదివించడం ఈ పుస్తకంలోని సుగుణం. ఇక ప్రతి అధ్యాయానికి చివరిలో రాసిన కొసమెరుపులూ, మన(సు)లోని మాటలూ, ఆత్రేయ చమక్కులూ- ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణలు. అన్నీ ఆకట్టుకుంటాయి. కొన్ని అధ్యాయాలకు ముగింపులో 116 పాటల్లో చేరని మరికొన్ని ఆత్రేయ పల్లవులనూ, ఆత్రేయ చేత ప్రభావితులైన తర్వాతి కవుల పాటల పల్లవులనూ ఇవ్వడం- విస్తృతమైన ఆత్రేయత్వాన్ని తెలియజేయడమే!
ఆత్రేయ అందిరికీ తెలిసింది మన‘సు’ కవిగానే! కాని ‘పాడుతా తీయగా’లో ఆత్రేయ విశ్వరూపాన్ని, బహుముఖ ప్రజ్ఞను పైడిపాల అనితర సాధ్యంగా ఆవిష్కరించారు. మనోజ్ఞంగా విశే్లషించారు. ఆత్రేయ మీద లోకంలో వున్న అపవాదాలను సహేతుకంగా ఖండించారు. అలాగని ఆత్రేయ మీద దురభిమానాన్ని ప్రదర్శించి ఆయనను భుజాలకెత్తుకోకపోవడం ఈ రచనలోని నిష్పాక్షికతకు, సత్యనిష్ఠకు నిదర్శనం. ఆత్రేయ మణిపూసలనదగ్గ మాతృగీతాలనెందుకు రాశారు? మనసు పాటల నేపథ్యమేమిటి? వీణ పాటల వెనుక కథ ఏమిటి? తెలుగు చిత్రాల్లో మనసు పాటలతో పాటు వాన పాటలకు ముద్దు పాటలకు కూడా ఆత్రేయ ఆద్యులా? ‘ప్రియురాలు ఎంత కఠినం’ అని ఆత్రేయ ఎందుకన్నారు? కణ్ణదాసన్ వంటి ప్రతిభావంతులైన పరభాషా కవుల మీద కూడా ఆత్రేయ నీడ వుందా? వంటి ఆసక్తికరమైన అనేక ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానాలు లభిస్తాయి. ఒకమాటలో చెబితే రంధ్రానే్వషకులకు తప్ప సహృదయ విమర్శకులకు ఈ పుస్తకంలో ఎక్కడా అచ్చుతప్పులతో సహా దోషాలు, లోపాలు కనిపించవు.
ఆత్రేయ పాటల వల్లనే విజయవంతమైన చిత్ర మాలికతో ముఖపత్రమూ, ఆత్రేయ కిష్టమైన నటీనటులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, నిర్మాతల ఛాయాచిత్రాలతో వెనుక అట్ట అందగించాయి. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ, వరప్రసాదరెడ్డి గార్ల ముందు మాటలు, అట్టవెనుక బాలు ఆశీస్సులు- అతిశయోక్తులు లేకుండా సంక్షిప్తంగా వున్నాయి.
ఆత్రేయ గురించి ఆయన కంటే తనకే ఆ లోతుపాతులు ఎక్కువగా తెలుసునన్నట్టుగా ఆత్మవిశ్వాసంతో ఈ పుస్తకాన్ని రచించిన డా.పైడిపాల, ఇంత మంచి పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చిన రసజ్ఞులు డా.వరప్రసాదరెడ్డి అభినందనీయులు. ఇది కొనదగిన, దాచుకొన వలసిన విలువైన పుస్తకమని వేరే చెప్పాలా?

-ఎం.డి.అబ్దుల్