Others

సాధికారిక చారిత్రక పరిశోధనా పాత్రికేయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాం కాలం నాటి విశేషాలు కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాల వివరాలు కానీ, వివిధ కాలాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలు కానీ తెలియాలంటే వెంటనే మనసులో మెదిలే పేరు జి.వెంకటరామారావు గారిది. ఆయన వృత్తిరీత్యా పాఠశాల అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు. కానీ- ప్రవృత్తిరీత్యా జర్నలిస్టు, ఇప్పటి జర్నలిస్టులకు అవకాశం లేని ఉర్దూ పాండిత్యం ఆయనకు ప్రధాన ఆయుధమైంది. చిన్నతనమంతా ఉర్దూలోనే చదువుకోవడం, చనిపోయేదాకా హైదరాబాద్‌లోని గౌలీపురాలోనే నివసించడంతో ఉర్దూ ఆయనకు కరతలామలకమైంది. మహ్మదీయ విద్యార్థులను మించి ఉర్దూలో మంచి మార్కులు తెచ్చుకునేవారు. ‘ఎ గావ్ కా రాజా హోష్యార్ హై’ (గ్రామం నుంచి వచ్చినా తెలివైనవాడే) అని సోదర విద్యార్థులకు అసూయ గొల్పేవారు. ఉర్దూవల్ల నిజాం రికార్డ్స్, ఉర్దూపత్రికలు, నివేదికలు సులువుగా చదువుకునే అవకాశం వచ్చింది. ఇంగ్లీషు సరేసరి. ఆయా కాలాల్లో సంభవించిన ప్రధాన సంఘటనల వివరాలు, తారీఖులు, గణాంకాలు రాసిపెట్టుకునే అలవాటు ఉండడం ఆయనకు తరువాతి కాలంలో ఎంతో ఉపయోగపడింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని మాదాపురం గ్రామంలో ఫిబ్రవరి 14-2-1933న వెంకట రామారావు జన్మించారు. (రికార్డుల్లో 14-2-1935గా నమోదైంది). హైదరాబాద్ పాతబస్తీలోని రిఫాయె ఆమ్ ‘వస్తానియా’ (మాధ్యమిక పాఠశాల)లో ఐదవ తరగతి, ముఫాదిల్ ఆనాం ‘‘్ఫఖాన్య’’ (ఉన్నత పాఠశాల) పదవ తరగతి 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. చాదర్‌ఘాట్ కాలేజీలో ఆర్థిక, వాణిజ్య, భూగోళ శాస్త్రాలు అంశాలుగా 1951లో ఇంటర్ పూర్తిచేసారు. అప్పుడే ప్రాంతీయ భాషగా తెలుగును ప్రవేశపెట్టారు. కళాశాల వార్షికోత్సవ సంచికలో ‘ద్రోహి’ అనే కథ రాసి అందరి మన్ననలు పొందారు. ఆ విధంగా తన రచనా వ్యాసంగానికి కథా రచనతో శ్రీకారం చుట్టారు. ‘పరిష్కారం’ పేరిట ఓ కథా సంకలనం వేసారు. తర్వాత ఉద్యోగంలోకి ప్రవేశించారు. ఇంటర్ ముగిసిన ఆరేళ్లకు ప్రైవేటుగా బి.ఏ, బి.ఇడి చేసారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా, జిల్లా ఉప విద్యాశాఖాధికారిగా తెలంగాణ అంతటా తిరిగారు.
ఏ ఊళ్లో ఉద్యోగం చేస్తే ఆ ఊళ్లోనే నివసించారు. హెడ్‌మాస్టర్‌గా క్రమశిక్షణ నెలకొల్పారు. పాఠశాలల అభివృద్ధికి తోడ్పడ్డారు. గ్రామస్థుల, విద్యార్థుల హృదయాల్లో నిలిచిపోయారు. 38 ఏళ్ల సర్వీసుతో 1993లో హుందాగా రిటైరయ్యారు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మధ్యతరగతి సాదాసీదా జీవితం. ఇది వెంకట రామారావు జీవన పార్శ్వం. ఇక రచనా పార్శ్వానికి వస్తే- అరగంటలో ఆయుర్దాయం ముగిసే వార్తా రచన కాదు, కనపడ్డ ప్రతి దానిమీద వ్యాసం వండే ప్రవృత్తి ఆయనది కాదు. ఒకనాటి ప్రసిద్ధ జర్నలిస్టు జి.కృష్ణ గారన్నట్లు జి.వెంకటరామారావు రాష్ట్ర ఆవేదనలను గుప్తంగా వుంచుకుని రాస్తుంటారు. అది ఒకనాడు నిజాం రాష్ట్రంలో దేశ సేవానిరతులు అవలంబించిన సంయమన పద్ధతి. ఆ సంయమనం, నిజాయతీ, తటస్థవైఖరి, సమాచారంలో ప్రామాణికతాదృష్టి ఆయన రచనల్లో నిండుగా వున్నాయి. అందువల్లనే జి.ఎస్.వరదాచారి, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎ.బి.కె.ప్రసాద్, గోరాశాస్ర్తీ, నండూరి రామ్మోహనరావు లాంటి లబ్ధ ప్రతిష్టులైన సంపాదకుల అందరికీ విశ్వసనీయులయ్యారు. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం మొదలైన అన్ని దినపత్రికల్లో దాదాపు 2వేల వ్యాసాలు ప్రచురితాలయ్యాయి. డజనుకుపైగా పుస్తకాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రధాన ఘట్టాలు, ఆంధ్రదేశ చరిత్ర- ఆధునికయుగం, భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు, తెలంగాణ విద్యా సాంస్కృతిక రంగాల చరిత్ర, తెలంగాణ చరిత్ర, ప్రధానిగా పి.వి, తెలుగు ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చరిత్ర లాంటి ప్రామాణిక గ్రంథాలు రచించారు.
1965లో రాసిన ‘మన చరిత్ర-సంస్కృతి- రాజకీయాలు’ అనే పుస్తకంలో ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి సత్వరం చర్యలు తీసుకోకుంటే రాష్ట్రం ఎన్ని ఖండాలైనా కావచ్చు. అయినా వౌలిక సమస్యలు మాత్రం తీరవన్నారు. అర్ధ శతాబ్దం కిందట వారు అన్నమాటలు నేటికీ ప్రామాణికతను కలిగివున్నాయి. తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎన్నో వివరాలతో ఎన్నోచోట్ల ఖండించారు. జవహర్‌లాల్ నెహ్రూ నుండి మన్మోహన్‌సింగ్ దాకా ప్రధాన మంత్రుల సంకీర్ణ ప్రభుత్వాల పరిణామాలను, పూర్వాపరాలను భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు అనే గ్రంథంలో చర్చించారు. జనతాపార్టీ హయాంలో ప్రధానమంత్రి అయిన మొరార్జీదేశాయి నిరాడంబర జీవితం. స్ఫూర్తి ప్రదమైందన్నారు. మొరార్జీ చాదస్తపు మొండితనం జనతాపార్టీ పతనానికి హేతువులని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి దేవగౌడ 14 కోట్ల రూపాయల ప్రభుత్వ వ్యయంతో 17మార్లు తన సొంత రాష్టమ్రైన కర్ణాటకను సందర్శించారు. బెంగళూరు వాసులే ఆయనను కర్ణాటక ప్రధాని అని ఎద్దేవా చేసారంటే పరిస్థితిని తేలికగా అర్థం చేసుకోవచ్చునన్నారు వెంకట రామారావు. ఇలా ఒక్కొక్క ప్రధానమంత్రి గురించి, వారి చుట్టూ వున్న అనుకూల, అననుకూల స్థితిగతులను నిష్పాక్షిక ధోరణిలో వ్యాఖ్యానించారు.
పాలకవర్గంలోని అసమ్మతివర్గమే ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహించడం నీలం సంజీవరెడ్డి కాలం నుండే మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏనాడూ ఏక నాయకత్వం లేదు. ప్రతి సందర్భంలోను ప్రత్యర్ధి ఉండడం, ఆ ప్రత్యర్ధి కూడా ప్రముఖుడుగా పరిగణించబడడం మన రాజకీయ చైతన్యానికొక నిదర్శనం. పరువుగా, హుందాగా, ఆత్మ సంతృప్తితో పదవీ విరమణ చేసే అవకాశం కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఏనాడు ఇవ్వలేదు అని వెంకట రామారావు నిర్మొహమాటమైన విశే్లషణ వాస్తవమేనని అందరూ అంగీకరిస్తారు. మండలి బుద్ధప్రసాద్ అభ్యర్ధ మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చరిత్రను 480 పుటల్లో బృహద్గ్రంథంగా రచించారు. అప్పాజోస్యుల-విష్ణ్భుట్ల ఫౌండేషన్ వారు ప్రచురించిన, ఒక చేతితో మోయలేని బృహద్గ్రంథమైన ‘పీవీ నరసింహారావు ప్రతిభా వైజయంతి’ సంచికలో సగం బరువు వెంకట రామారావుగారిదే.
పులిజాల రంగారావు, నూకల రామచంద్రారెడ్డి, జె.వి.నరసింగరావు, విజయభాస్కరరెడ్డి, స్వామి రామానందతీర్థ, ఉన్నవ వెంకటరామయ్య, ఉన్నవ రాజగోపాలకృష్ణయ్యల జీవిత చరిత్రలను కూడ వెంకట రామారావు రాసారు. ఇటీవలి కాలంలో తెలంగాణ సారస్వత పరిషత్ తరఫున వెంకట రామారావు రాసిన తెలంగాణ చరిత్ర అచిర కాలంలో రెండు ముద్రణలు పొందింది. తెలుగు అకాడమీ ప్రచురించిన ‘తెలంగాణ ప్రముఖులు’ కూడ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. వివిధ ప్రత్యేక సంచికల్లో వారి వ్యాసాలు అసంఖ్యాకంగా వున్నాయి. అవన్నీ గ్రంథ రూపంలో రావాల్సి వుంది. ఇంత చేసినా వెంకట రామారావుకి 2013లో తెలుగు భాషా దినోత్సవం నాడు అప్పటి ముఖ్యమంత్రి పదివేల రూపాయలు నగదు, జ్ఞాపిక, శాలువతో సత్కారమే పెద్దది కావడం శోచనీయం.
ఈ నాలుగేళ్లలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, మరెప్పుడైనా ఒక మంచి సత్కారం లభించి వుంటే ఆ జీవునికి కాస్త తృప్తి కలిగేది. ఏదిమైనా జర్నలిస్టులకు, విద్యార్థులకు వెంకట రామారావు గ్రంథాలు ఎప్పుడూ ప్రామాణికాలే. భవిష్యత్తులో వారి గ్రంథాలకు మరింత విలువ పెరిగేవే తప్ప కాలదోషం పట్టనివి. ఈవిధంగా వెంకట రామారావు చిరస్మరణీయులు. వారు నాకు పెదనాన్న వరస అవుతారు. వారు నా రచనా వ్యాసంగాన్ని ఎంతో ప్రోత్సహించారు. వారికి నా అశ్రు నివాళి.
జి.వెంకట రామారావు
జననం: 14-2-1933 అస్తమయం: 11-2-2018

-ఆచార్య వెలుదండ నిత్యానందరావు, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం