పర్యాటకం

కోరిన వారికి కొంగుబంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగము, మోక్షము రెండునూ కోరుకున్నవారికి లభింపచేయు స్వామి శ్రీ ఆంజనేయస్వామి.
అట్టి దివ్య మహిమాన్వితుడైన శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజించే సుదినమే హనుమజ్జయంతి. మంగళవారం, శనివారం ఆంజనేయునికి ప్రీతికరాలు. వైశాఖ బహుళ దశమి, పూర్వాబాద్ర నక్షత్రం వైధృతి యోగంలో ఆ స్వామి జన్మించినట్లు ‘‘పరాశర సంహిత’’లో కలదు.
సప్త చిరంజీవులలో ఒకరైన హనుమదుపాసన అత్యంత అత్యద్భుత దివ్య ఫలితాలను ప్రసాదిస్తుందనటంలో సందేహం లేదు. స్మరణ మాత్ర సంతుష్టుడైన ఆ స్వామిని నమ్మి కొల్చిన వారికి కొంగు బంగారం. ఈ కలికాలంలో సంభవించే సర్వ కష్టనష్ట నివారణలకు వినాయకుని, ఆంజనేయుని ఆరాధన అత్యంత శ్రేష్టమని దానర్ధం. అంతేకాక మంత్ర శాస్త్రప్రకారం మానవ, జంతు ఆకృతులు కలగలిపిన దేవతామూర్తులు శ్రీఘ్ర అనుగ్రహ ప్రదాతలు. వినాయకుడు, ఆంజనేయుడు, నృసింహుడు, వరాహుడు మొదలగు దేవతామూర్తులు ఈ కోవలోని వారే. నియమనిష్టలు హనుమదారాధనకు అత్యంత ముఖ్యం.
అటువంటి పరమపవిత్రమైన ఆంజనేయస్వామి క్షేత్రంలో ప్రముఖమైనది గుంటూరు జిల్లా అమరావతి క్షేత్రంలో ప్రథమ పంచారామాధీశుని కోవెలకు అతి సమీపంలోగల శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి దేవస్థానం. నూట ఒక్క సంవత్సరం క్రితం నిర్మించిన అతి పురాతన దివ్య మహిమల స్వామి ఈ ప్రసన్నాంజనేయుడు. ఈ దేవాలయానికి ఉత్తరంగా పరమ పవిత్రమైన కృష్ణానదీ ప్రవాహం, చక్కని స్నానఘాట్ ఉన్నాయి. పూర్వం దీన్ని మెట్లరేవు అనేవారు. పురాణం బండరేవు అనికూడా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఆంజనేయుని గుడి ఘాట్‌గా పిలుస్తున్నారు.
ఈ దేవాలయానికి తూర్పుగా కొద్ది దూరంలో సాయిబాబా మందిరం, మరికొద్ది దూరంలో శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామివారి దివ్య దేవాలయం ఆ ప్రక్కన సమీపంలో చింతామణి పార్స్వనాథ్ దేవాలయం కలవు. శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారికి పడమరగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 125 అడుగల ధ్యానబుద్ధ విగ్రహం కలదు. ఇక్కడే 2006లో ‘కాలచక్ర మహాసభలు’ జరిగాయి.
ప్రసన్నాంజనేయ దేవస్థాన చరిత్ర... 1915 ప్రాంతంలో పీసపాటి సుబ్బయ్యశాస్ర్తీగారనే పండితుడు ఉండేవారు. ఆయనే్న చిట్టిపంతులు అనేవారు. ఆయన ఆంజనేయస్వామిని తన గురువుగా తలిచేవారు. ఒకసారి ఆ చిట్టిపంతులు గుర్రంపై వెళ్ళుతుంటే గాలికి ఎగిరి ఒక రేకు పలక ఆయన చేతికి వచ్చింది. అందులో ఆంజనేయస్వామి చిత్రం, యంత్రము రచించబడి ఉన్నాయి. ఆ తరువాత చిట్టిపంతులకు కలలో ఆంజనేయస్వామి కనిపించి నాకు గుడికట్టు అని ఆదేశించారట. ఆ ఆంజనేయస్వామి ఆదేశం ప్రకారం నదీ తీరంలో తనకున్న కొద్దిపాటి స్థలంలో వనరులమేరకు కొద్దిపాటి దేవాలయం కట్టాడు సుబ్బయ్యశాస్తిగారు. దీనినే చిట్టిపంతులుగారి ఆంజనేయుని గుడి అని, పీసపాటి వారి ఆంజనేయుని గుడి అని అనేవారు.
ఆంజనేయుని సరసన కాశీవిశే్వశ్వరుడు.. శ్రీ పీసపాటి సుబ్బయ్యశాస్ర్తీగారు కాశీక్షేత్రం నుంచి ఓసారి రెండు శివలింగాలు తెచ్చి ఆంజనేయునికి ఉత్తరంగా ఓ గూడు లాంటిది కలుగుచేసి శాస్త్రోక్తంగా వాటిని ప్రతిష్ఠించారు. అదే కాశీవిశే్వశ్వర లింగంగా పూజలందుకొంటుంది. నాటినుంచి నదిలో చట్టుమీద కూడా ఓ శివలింగాన్ని ఉంచారాయన. ఆ శివలింగ సమీపంలోనే పండితులైన శాస్ర్తీగారు అప్పుడప్పుడు పురాణ ప్రవచనం చేసేవారు. అందుకే అది ‘పురాణబండ’ అయింది.
ప్రస్తుతం దేవాలయ ముఖ మంటపం నాలుగు అడుగుల ఎత్తు పెరిగి విమాన నిర్మాణం జరిగి, ఉత్తర ద్వార నిర్మాణం జరిగి, సుందరమైన ముఖ ద్వారం అమర్చారు. విశే్వశ్వరాలయం ధ్వజస్థంభం నుండి వటవృక్షం దగ్గర ఉపాలయం నిర్మించబడి, వటవృక్ష వేదికపై సుబ్రమణ్య ప్రతిష్ట జరిగింది. ఆలయం వెనుక యతీశ్వరులకు బస కలుగచేసే సౌకర్యవంతమైన గది నిర్మాణం జరిగింది. ఆలయ గాలిగోపురంపై సుందరమైన చిత్తరువులు, స్వామివారి వాహనం ఒంటె కన్నులను కట్టేస్తాయి.
శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి దేవస్థానంలో ప్రతి మంగళ, శనివారములు, ప్రతి పూర్వాభాద్ర నక్షత్రాన, హనుమజ్జయంతి, హనుమత్వ్రత ప్రత్యేక పూజలు జరుగుతాయి. విశేష అలంకారాలు, సింధూర, తమలపాకుల పూజలు అత్యంత వైభవోపేతంగా, కన్నుల పండువగా జరుగుతాయి.

- పీసపాటి నాగేశ్వరశర్మ