Others

ఛిద్రం చేస్తున్న వలసలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరువు కాటకాలవల్ల బ్రతుకులు బరువై పరువు తీసుకుంటున్న వ్యవస్థలో అణగారిన ప్రజలు బ్రతుకీడుస్తున్న అభాగ్యులెందరో మన సమాజంలో ఉన్నారు. వర్షాలు పడక, నాళ్ళు లేక ఎండిపోయిన పంట పొలాలను చూసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారెందరో? పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులు తీర్చలేక, షాపుకారు దగ్గర తెచ్చిన అప్పులకే సరిపోక ఉన్న కాస్త పొలాన్ని భార్యలమీద నగలను తెగనమ్మినా అప్పులు తీరక పరువు పోతుందని కుటుంబమంతా పురుగుల మందులు త్రాగి చనిపోతున్నారు బీద ప్రజలు. ఉన్నదంతా అమ్ముకొని ఊర్లో ఉండాలంటే నామోషీగా అనిపించి పట్టణాలకు వలస వెళ్తున్నవారి పరిస్థితులు అనేకం. కొంతమంది కుటుంబాలతో కలిసి వెళ్లి మురికివాడల్లో బ్రతుకుతూ ఇంటిల్లిపాది తలా ఒక పనికి వెళ్ళడం, వచ్చిన డబ్బులతో పూట గడవడం పరిపాటైంది. అలా సంపాదించిన దాంట్లోనుండి ఇంటి యజమానికి కల్లు తాగడానికి కొంత కావాలి. జీవితం ఎంత అగాధంలో వున్నప్పటికీ మద్యానికి బానిస అవుతున్నారు.
కొంతమంది పట్టణాలకు వలసలు వెళ్తే మరికొంతమంది రాష్ట్రాలు, దేశాలు కూడా దాటి బ్రతుకుతెరువుకోసం వలసపోతున్నారు. పట్టణాలకు వలసపోయేవారి పరిస్థితి కొంతవరకు నయమే. కానీ పెళ్లి అయ్యి ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టగానే డబ్బు సంపాదించాలని ఊర్లో చేసిన అప్పులను తీర్చడానికి భార్యాపిల్లలను వదిలి గల్ఫ్ లాంటి దేశాలకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి కూడా అప్పులు చేయాల్సిందే. ఇంటి దగ్గర వున్న బంగారాన్ని, భూమిని తాకట్టు పెట్టో, తెగనమ్మో విదేశాలకు వెళ్లాల్సి వుంటుంది. నాల్గు రోజులు తల్లిదండ్రులను, భార్యాపిల్లలను వదిలి వుంటేనే చాలా బాధనిపిస్తుంది. అలాంటిది ఎంతకాలం విదేశాల్లో ఉండాల్సి వస్తుందో, మళ్లీ ఎప్పుడు వస్తామో, అసలు వస్తామో రామో కూడా తెలియని పరిస్థితుల్లో పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లాల్సి వస్తోంది. ఇంకొక విషయమేమిటంటే అక్కడ చేసే పనులు కూర్చొని చేసేవి కావు. ఎందుకంటే చదువుకున్న వారు కాకపోవడంవల్ల ఒళ్ళు వంచి కష్టపడాల్సిందే. గృహ నిర్మాణ పనులు, రోడ్డుపనులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేసేటప్పుడు అక్కడ ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఊహించలేము. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత చట్టపరమైన ఇబ్బందులు, సమస్యలు చాలా ఎదురవుతాయి. వీటిని తట్టుకోవడం చాలా కష్టం. అక్కడి వాతావరణానికి, అక్కడ వుండే ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఎన్నో అవస్థలు పడవలసి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు ఒకటా రెండా? చెప్పలేము. ఏదేమైనా నరకమే ఇలాంటి వలసలు. వారు ప్రతినెలా పంపిస్తున్న డబ్బులతో ఊర్లో వున్నవారి మంచి చెడ్డలు, పిల్లల చదువులు సాగిపోతుంటాయి. కానీ ఏ చిన్న కష్టమొచ్చినా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే దిక్కు మాత్రం ఉండదు. వలసపోయినవారికి ఏం జరిగినా, చచ్చినా దిక్కులేని శవం కంటే ఘోరం. వలస వెళ్లినవారు అక్కడే చనిపోతే ఆ శవాన్ని కూడా ఊరికి తీసుకొచ్చే పరిస్థితికానీ, అవకాశం కానీ ఉండదు. నూటికి నూరు శాతం మంది సంతోషంగా వుండనివారే వారిలో. ఎవ్వరికీ సుఖ సంతోషాలు ఉండవు.
ఇదంతా ఒకటయితే ఈమధ్యకాలంలో వలసపోయినవారి కుటుంబాల్లో చెప్పుకోలేనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఆర్థిక సమస్యలలో ఉన్నవారి కుటుంబాన్ని, వారి సమస్యలను తీర్చడానికి వచ్చి వారి భార్యలను నెమ్మదిగా లొంగదీసుకుంటున్నారు ఊర్లో ఉండే ధనికులు, దుర్మార్గులు. కోరికలతో, ఆర్థిక సమస్యలతో మరికొంతమంది ఆడవారు వారికి లొంగిపోతున్నారు.
కరువు, అక్రమ సంబంధాలు, పరువుకోసం ప్రాకులాడటం- ఇవన్నీ వలసలకు దారి చూపిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ప్రజలు వలసపోకుండా పరిశ్రమలు, కర్మాగారాలు, అభివృద్ధి పథకాలు చేసి పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాల్సి వుంది. అప్పుడే పరువు ఆత్మహత్యలు, వలసలు, భార్యల చేతుల్లో భర్తల మరణాలు తగ్గిపోతాయి. చిన్న చిన్న జీవితాలు ఛిద్రం కాకుండా ఉంటాయి.

-శ్రీనివాస్ పర్వతాల