Others

పెరటి చెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందుకు
పనికొస్తుంది!
*
కొత్త శీర్షిక ప్రారంభం
*
‘అమంత్ర మక్షరం నాస్తి మూల మనౌషధం’
అయోగ్యః పురుషో నాస్త. యోజకస్తత్ర దుర్లభః’ - ఇది చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న సునాషితం. స్థూలంగా అర్థమిది. ‘మంత్రానికి పనికిరాని అక్షరం లేదు; మందుకు పనికిరాని మొక్క లేదు. మనుషుల్లో అయోగ్యులంటూ ఉండరు. ఎటొచ్చీ, పైన చెప్పుకున్న వాటినన్నింటినీ సమర్థంగా ఉపయోగించుకోగల వ్యక్తి దొరకడమే కష్టం.’
ఈ మంచిమాట ఎవరు చెప్పారో నాకెప్పుడూ పట్టలేదు కానీ, అందులోని అంతరార్థం మెదడుకి బాగా పట్టేసింది. ఇటీవల, తెలుగు భాష విషయంలో మనవాళ్ల వైఖరి నాకు బొత్తిగా కిట్టకుండా పోయింది. 2017-18 విద్యా సంవత్సరంలో ఇంగ్లిష్ మాధ్యమంగా చదివే ప్రాథమిక విద్యార్థుల సంఖ్య ఆరు కోట్లకు దాటిందని పత్రికలు వెల్లడించాయి. అంతకు ముందటి సంవత్సరం లెక్కలతో పోలిస్తే, ఇది నూరు శాతం ‘అభివృద్ధి’. ఇక, రెండు మూడు నెలల్లో మొదలు కాబోయే విద్యాసంవత్సరం లెక్కలు ఇంకెలా వుంటాయో మరి! ఈ పరిణామాల్ని చూస్తుంటే, రెండు తెలుగు సామెతలు గుర్తుకొస్తున్నాయి. అవి ‘పెరటి చెట్టు మందుకు పనికిరాదు’ - ‘పొరుగింటి పుల్లకూర రుచి’. దేశంలో ఎక్కడ చూసినా - కాస్త అటూ ఇటూగా - ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి వెర్రితలలు వేస్తోందనిపిస్తోంది. ఈ వ్యంగ్యోక్తులు సామాజిక వాస్తవానికి ఎంత చేరువగా వున్నా, అవి నాకెందుకో నచ్చలేదు. మొక్కల మధ్యనయినా, మనుషుల మధ్యనయినా వివక్ష చూపించడం నాకెప్పుడూ కిట్టదు. అందుకే, మందుకు పనికిరాని మొక్కలేదనే సుభాషితానే్న నేను ప్రామాణికంగా పరిగణిస్తాను. ఎటొచ్చీ, వాటిని ‘సమర్థంగా’ వినియోగించగల నేర్పు మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఎల్లెప్పుడూ దుర్లభంగానే ఉండొచ్చు. అది వేరే విషయం. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి. పనికిరాని భాషలూ, పనికిరాని చదువులూ లేనేలేవనే నా నమ్మకం. నన్నడిగితే, ఇతర భాషల్ని చదువుకునే వాళ్లు కూడా మాతృభాష మాధ్యమంగానే ఆ పని చేస్తే, మరింత తేలిగ్గా, సమర్థంగా ఆ భాష నేర్చుకోవచ్చని నా నమ్మకం. సందర్భం వచ్చింది కనక చెప్తున్నా - నేనూ ఓ చిన్నసైజు ‘యాంగ్లోఫిల్’నే. కానీ, ఇంగ్లిష్ మీద నాకున్న ప్రేమ, నా తెలుగు అభిమానానికి ఎప్పుడూ అడ్డు రాలేదు. కన్నతల్లి మీద ప్రేమ కన్నబిడ్డని ప్రేమించడానికి అడ్డమొస్తుందా? అసలు ఎందుకు రావాలన్నదే నా ప్రశ్న!
తెలుగుల జీవితాల్లో - ముఖ్యంగా చదువుసంధ్యల్లో - తెలుగు భాష మరుగున పడిపోవడం హఠాత్తుగా జరిగిందేం కాదు. అర్ధ శతాబ్దంపాటు ఎదురులేకుండా సాగిన పరిణామాల ఫలితమిది. మార్కుల యావతో ఇది ప్రత్యక్షంగా ముడిపడి ఉంది. ‘సెకండ్ లాంగ్వేజ్’గా తెలుగు తీసుకోవడంకన్నా సంస్కృతం, హిందీ, ఫ్రెంచ్, జర్మన్ లాంటి వేరే భాషలు తీసుకుంటే ఎక్కువ మార్కులొస్తాయని సాక్షాత్తూ విద్యాలయాలే నూరిపోసిన విషయం అందరికీ తెలిసిందే. విద్యారంగంలో ప్రతి అయిదేళ్లనూ ఓ తరంగా లెక్కిస్తారు. అంటే, దాదాపు పది తరాల విద్యార్థులు అయిదారేళ్ల వయసు నుంచీ పరాయి భాషలో చదువుకున్న దాని పర్యవసానంగా - లేదా, తెలుగు భాషా సాహిత్యాలను చదువుకోని కారణంగా - తెలుగు సంస్కృతి మన జీవితాల్లోంచి క్రమంగా పక్కకు తప్పుకుపోతూ వచ్చింది. మన భాష గురించీ, మన సాహిత్యం గురించీ, మన సంస్కృతి గురించీ, ఒక్క ముక్కలో చెప్తే మన ఉనికి గురించి - మనమే మాట్లాడుకోకపోతే, ఎవరికి పడుతుంది? బుద్ధుడు చెప్పిన మాటొకటి ఉంది ‘మన ప్రేమకు పాత్రంకాగల అర్హత, అందరికన్నా మనకే ఎక్కువ వుంది!’. ఆయన ఈ మాటలు తెలుగులో చెప్పకపోయినా, తెలుగుల కోసమే చెప్పాడనిపిస్తుంది. ఈ ఆలోచన వచ్చిన తర్వాత, మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనిపించింది. కాస్తో కూస్తో చదువుకున్న వాళ్లందరికీ, ఎంతో కొంత తెలిసిన విషయాలే ఇవి. ఇది, తెలుగ్ఘు భాషా సాహిత్యాలకు సంబంధించిన ప్రాథమిక - చారిత్రిక సమాచారం మాత్రమే! కావాలనే, ఈ కాలమ్‌కి ‘పెరటి చెట్టు’ అనే పేరుంచాను.
మూడున్నర దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా గడిపినందువల్లనేమో, నాకు ఏ విషయాన్నయినా ‘ఫైవ్ డబ్ల్యూస్ అండ్ వన్ ఎచ్’ అనే నేపథ్యంలోనే చూడడం అలవాటయింది. ఆ చూపు ఎలా ఉంటుందో కాస్త వివరించనివ్వండి. ‘ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు, ఎందుకు, ఎలా?’ అనే ఆరు ప్రశ్నలకూ జవాబులు దొరికితే ఆ విషయం గురించి మనకి పరిపూర్ణమయిన సమాచారం దొరుకుతుందని - జర్నలిజంలో ఓనమాలు దిద్దించినప్పుడు - మా గురువులు మాకు నేర్పించారు. అది వొంటబట్టి, వొదిలిపెట్టడం లేదు. ఏదో సామెత చెప్పినట్లు, అలవాట్లు అంత తేలిగ్గా వొదిలిపెట్టవు మరి! ఇక్కడ నేను తెలుగు సాహిత్యం ఎక్కడ, ఎప్పుడు, ఎవరి ద్వారా, ఎలా, ఎందుకు మొదలయి ఏయే దారుల్లో పయనిస్తూ వచ్చిందో స్థూలంగా ప్రస్తావిస్తాను. సిద్ధాంత పత్రాల కోసం, విశ్వవిద్యాలయానికి సమర్పించే సందర్భంగా చేసే పరిశోధన లాంటిది కాదు కానీ, ఈ ప్రశ్నలకి సమాధానాలు కనుక్కునేందుకు నా పరిశోధన నేనూ చేసుకున్నాను. ఆ క్రమంలో నాకు దొరికిన సమాధానాలు మీ ముందుంచుతాను. పరిశోధన రంగంలో నిశ్చల నిశ్చితాలయిన విషయాలుండవని విజ్ఞులకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవేళ అలాంటిది ఏదయినా ఉంటే అది ఈ సూత్రం ఒక్కటే!

-మందలపర్తి కిషోర్.. 8179691822