Others

అసమానతలపై గళమెత్తిన ధార్మిక విప్లవకారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు కులం పేరుతో సామాజిక అసమానతలు బలంగా ఉన్న కేరళ ముఖచిత్రాన్ని మార్చివేసిన ఘనత సద్గురు నారాయణ గురు, చట్టాంబి స్వామి వంటి ధార్మిక మహాపురుషులకు దక్కింది. అదే మార్గంలో తెలుగునాట సామాజిక, ధార్మిక సమానతను నిర్మించటంలో విశేషకృషి చేసినవారు నారాయణ గురు శిష్యులైన సద్గురు మలయాళ స్వామివారు. కేరళలోని గురువాయూరు సమీపంలోని ఎన్గండ్యూరులో 27 మార్చి 1885లో మలయాళ స్వామిగా ప్రసిద్ధి చెందిన వేలప్ప కరియప్ప, నొట్టియమ్మలకు జన్మించారు. చిన్నప్పటి నుంచే భగవత్ పూజ, భజన, ధ్యానం నిత్యకృత్యాలైనా ఆయన చదువులో ముందుండేవాడు. పసితనంలో ఆయన ఒక బోయవాడు రెండు పక్షులను అమ్ముతుండగా చూసి, వాటిని కొని ఆ పక్షులను ఎగరవేసి స్వేచ్ఛ కల్పించాడు. శ్రీ నారాయణ గురు శిష్యుడైన శ్రీ సిద్ధలింగస్వామి పెరింగోట్కరలో ప్రారంభించిన శ్రీ నారాయణ ఆశ్రమంలో విద్యాభ్యాసం కోసం చేరాడు. అనేక ఆధ్యాత్మిక విద్యలను పొంది, శివలింగ గురుస్వామివద్ద మంత్రోపదేశం పొందారు. శ్రీ నారాయణ గురుదేవుని సందర్శించి వారి ఆశీర్వాదాలను పొందారు. 18వ ఏటనే కాలినడకన పర్యటించి దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించారు. బ్రహ్మకపాల తీర్థం చేరినపుడు- ‘లోకంలో సమస్త ప్రాణులు పరబ్రహ్మగోత్రం నుండే ఉద్భవించాయి, నేను వదిలే తర్పణం ప్రాణికోటికంతటికీ చెందాలి’-అంటూ తర్పణం వదిలారు. దేశ పర్యటనానంతరం తిరిగి కేరళ వచ్చి శ్రీ నారాయణ గురు, శివలింగస్వాములను దర్శించి వారి ఆశీస్సులను పొందారు. ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరి 1913 డిసెంబరులో తిరుమల చేరారు.
దేశవ్యాప్త పర్యటనలో వారు పలు విషయాలను అధ్యయనం చేసి, ‘విద్యావిజ్ఞానాలు అందుబాటులో లేని కారణంగా చాలామంది ప్రజలు పశుప్రాయులుగా జీవిస్తున్నారు. గుణకర్మలపై ఆధారపడిన వర్ణవ్యవస్థ జన్మతో ముడివడిన కుల వ్యవస్థగా మారిపోయింది. గుణవంతులైనా తక్కువ కులం వారికి సమాజంలో సముచిత స్థానం లేదు. స్వరాజ్య ఉద్యమం కొనసాగుతున్నా దాని ప్రాముఖ్యాన్ని జనం గుర్తించలేదు. ఆధ్యాత్మికత ఆధారంగానే స్వారాజ్యం సిద్ధిస్తుంది. ప్రాచీనులు అందించిన వేద విజ్ఞానాన్ని ప్రజలందరికీ లౌకిక విద్యతోపాటు అందించాలి. అప్పుడే స్వరాజ్యం ఏర్పడుతుంది’ అనే స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు.
తిరుమలలో 12 ఏళ్లపాటు కఠోర తపస్సు చేశారు. ఒక జిజ్ఞాసువు- ‘మీరు దేనికోసం తపస్సు చేస్తున్నారు?’ అని అడగ్గా, ‘ఈశ్వర దర్శనం కోసం తపస్సు చేయటం లేదు, ముక్తి పట్ల నాకు కోరిక లేదు, భగవంతుని పట్ల అవిచ్ఛిన్నమైన భక్తి ప్రజలందరకు కలగాలని తద్వారా అందరిలో అజ్ఞానం తొలగిపోయి సుఖం లభించాలని తపస్సు చేస్తున్నా.. ఈ పని సాధించటానికి నాకు పునర్జన్మ కావాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఇదే నా జీవితాశయం’ అని సమాధానం ఇచ్చారు. తిరుమలలో ఉండగానే స్ర్తిలకు, శూద్రులకు, అస్పృశ్య వర్గాలకు బ్రహ్మవిద్య పొందే అధికారం ఉందని తెలియజేస్తూ సప్రమాణంగా 1919 డిసెంబరులో ‘శుష్క వేదాంతమో భాస్కరం’ గ్రంథాన్ని వ్రాశారు. హిందూ సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలను, దురాచారాలను ఖండించారు. అందరికీ ప్రాచీన విద్యను అందించక పోవటమే మన దేశ బానిసత్వానికి, పతనానికి కారణం అని ఆనాడే పేర్కొన్నారు. బ్రహ్మ సాక్షాత్కారం పొందాక, సామాజిక మార్పును సాధించటానికి తిరుమల నుండి శిష్యులతో తిరుపతి-శ్రీకాళహస్తి మధ్యగల ఏర్పేడు- కాశీబుగ్గకు 3 జూన్ 1926లో చేరారు.
అక్కడే వ్యాసాశ్రమం ప్రారంభమైంది. జంతుబలి ఇచ్చే ఆచారాలను ప్రజలకు నచ్చచెప్పి మానిపించారు. అనేకమంది రోగపీడితులకు తీర్థం, విభూతి ద్వారా రోగ విముక్తులను చేశారు. 1927లో ‘యదార్థ భారతి’ పత్రికను ప్రారంభించారు. 1926లో ‘సనాతన ధర్మపరిపాలన సేవా సమాజం’ సంస్థను ప్రారంభించారు. మలయాళ స్వామి పేరుతో అందరికీ పరిచితులై అనేక చోట్ల వేదాంత సభలను నిర్వహించారు. ఆ సభలకు మహిళలు, నిమ్నవర్గాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేవారు. వారందరికీ అర్థమయ్యే భాషలో సనాతన ధర్మ వివరాలను అందజేసేవారు. సనాతన ధర్మసందేశాన్ని కుల భేదాలకు అతీతంగా అందరికీ అందించిన ధార్మిక విప్లవకారుడు సద్గురు మలయాళ స్వామి. కొన్నాళ్లకు ‘సనాతన వేదాంత జ్ఞానసభలు’గా ఈ సభలు రూపొందాయి. ఒకపూట మహిళలే సభ నిర్వహించే నూతన పద్ధతిని వారు ప్రారంభించారు.
1936-40 మధ్య కాలంలో కోస్తాంధ్రలో గోరా నాయకత్వంలో నాస్తిక ఉద్యమం, ‘కవిరాజు’ నాయకత్వంలో సనాతన ధర్మ వ్యితిరేక ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ వ్యతిరేక ఉద్యమం బలంగా జరుగుతుండేవి. వీరందరూ మలయాళ స్వామి సభలను ప్రతిఘటించటానికి విఫలయత్నాలు చేశారు. అనేకమంది చివరకు వీరి శిష్యులైనారు. సంస్కృతం బ్రాహ్మణుల భాషకాదు. ఈ భాష అందరికీ అందాలని 1928లో తన వ్యాసాశ్రమంలో సంస్కృత విద్యాలయాన్ని ప్రారంభించారు. ఋషులు అందించిన జ్ఞానాన్ని, భగవద్గీత, ఉపనిషత్తులు, యోగదర్శనము వంటి గ్రంథాలను పాఠ్యాంశాలుగా 1940 నవంబరులో ‘బ్రహ్మవిద్యా పాఠశాల’ను, 1958లో కన్యా గురుకులాన్ని ప్రారంభించారు. 2 ఫిబ్రవరి 1936లో సన్యాస దీక్షను స్వీకరించి శ్రీ అసంగానందగిరిగా పేరును పొందారు. అయితే మలయాళస్వామి అనేపేరే అందరికీ సుపరిచితమైనది. తెలుగు సీమలో అనేకచోట్ల వ్యాసాశ్రమాలకు అనుబంధంగా ఎన్నో ఆశ్రమాలు స్థాపించబడ్డాయి. వీటి ద్వారా ఆయన శిష్యులు సనాతన ధర్మప్రచారాన్ని అన్ని కులాల వారికీ అందించారు.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించిన సందర్భంగా ఆయన సందేశమిస్తూ- ‘స్వరాజ్యం లభించాక అందరూ ఉత్సవాలు చేసుకోవటం సరైనదే.. వర్ణాశ్రమ ధర్మాల పేరిట కొన్ని కులాలవారికే శాస్త్ర పఠనం, అస్తశ్రస్తధ్రరించే అధికారము కల్పించటం వంటి చెడ్డ నియమాల వల్లనే మన దేశం స్వాతంత్య్రాన్ని కోల్పోయింది. శస్తమ్రు, శాస్తమ్రు హిందువులలోని అన్ని కులాల వారికి అందుబాటులో ఉంచాలి. ఇది నేటి బాధ్యత’ అని సందేశమిచ్చారు. 1945లో భగవద్గీతపై విపుల వ్యాఖ్యానం వ్రాశారు. ఎన్నో గ్రంథాలను తెలుగులో అనువాదం చేయించారు. 1959లో అస్పృశ్యతా నివారణ ప్రచార సంఘం నేతలు తనను కలిసినపుడు- ‘సవర్ణ హిందువులు కులానికి కాక గుణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిమ్న కులస్థులని పిలుస్తున్న వారి పట్ల ఆత్మీయతతో వ్యవహరించాలి. హిందూ మతంలో గోమాంస భక్షణ దోషంగా భావించబడుతున్నందున అస్పృశ్య వర్గాల ప్రజలు మద్యపానం, గోమాంస భక్షణ మానాలి’’ అని సందేశమిచ్చారు. ‘నేటి మనుస్మృతిలో కుల అసమానతలను సమర్ధించే ధర్మవ్యతిరేక శ్లోకాలు కనిపిస్తున్నవి. ఇవి పరమ హానికరమైనవి. శ్రీ దయానందసర్వతి స్పష్టీకరించినట్లు కొద్దిమంది క్రూర స్వభావులు చేర్చిన ఈ శ్లోకాలను తొలగించాలి’ అంటూ మనుస్మృతి సంస్కరణ ఆవశ్యకతను స్పష్టంగా ఆనాడే పేర్కొన్నారు.
మహిళల ఘోషా పద్ధతిని కూడా మలయాళ స్వామి వ్యతిరేకించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. భర్తను కోల్పోయిన స్ర్తికి పునర్వివాహం చేయటం ధర్మసమ్మతమేనని పేర్కొన్నారు. వరకట్నం వంటి దురాచారాలను మానుకోవాలని చెప్పారు. హిందూ సమాజంలో అనేక సంస్కృరణలను చేసిన మలయాళ స్వామి 12 జూలై 1962లో మహాసమాధిని పొందారు. మలయాళ స్వామి వారి ఉపదేశాలను మనం ఆచరించి చూపటమే ఆయనకు నిజమైన నివాళి కాగలదు.

- కె.శ్యామ్‌ప్రసాద్ సెల్: 94409 01360