AADIVAVRAM - Others

శిల్పకళా వైభవానికి సాక్ష్యం.. ఒంటిమిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు పాలకుల నిరాదరణకు గురైన ఒంటిమిట్ట రామాయలం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో నిర్వహించేది. రాష్ట్ర విభజన ఫలితంగా భద్రాద్రి తెలంగాణ ప్రాంతానికి చెందడంతో, ఏపీ ప్రభుత్వం సీతారాముల కల్యాణాన్ని కడప జిల్లా ఒంటిమిట్టలో గత కొనే్నళ్లుగా నిర్వహిస్తోంది.

అపురూప శిల్పకళతో శోభిల్లే ఒంటిమిట్ట రామాయలయం చిరకాలంగా నిర్లక్ష్యానికి గురికాగా, 2015 తర్వాత ఈ పురాతన ఆలయానికి మహర్దశ పట్టింది. ఇపుడు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా రామనవమి వేడుకలకు ఒంటిమిట్ట వస్తున్నారు. ఒంటిమిట్టలో రాములవారి ఆలయాన్ని 1356లో విజయనగర చక్రవర్తి బుక్కరాయలు నిర్మించాడు. ఆయన హయాంలోనే బ్రహ్మోత్సవాలు జరిపే ఆనవాయితీ ఇక్కడ మొదలైంది.
పౌరాణిక గాథ
ఒంటిమిట్ట ఆలయానికి సంబంధించి ఓ పౌరాణిక గాథ జనపదుల్లో విన్పిస్తోంది. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా ఇక్కడ పర్ణశాల నిర్మించుకుని కొన్ని దినాలు నివసించాడు. ఆ కాలంలో చుట్టూ కనుచూపుమేరలో నీటి జాడ కనిపించకపోవడంతో దాహార్తి తీర్చమని సీతాదేవి రాముడిని కోరింది. రాముడు భూమిలోకి బాణం సంధించగా- నేల నుండి నీటిబుగ్గ పుట్టింది. ఆ నీటి బుగ్గే చిన్న కొలనుగా ఏర్పడి ‘రామతీర్థం’గా ఇప్పటికీ పిలువబడుతోంది. ఆ తర్వాత సీతను రావణుడు అపహరించడంతో- సుగ్రీవుని ఆదేశాలతో వానరులు తలోదిక్కుకు పోయి సీత జాడ కోసం అనే్వషించారు. జాంబవంతుడు, హనుమంతుడు ఉన్న బృందం ఒంటిమిట్టకు చేరుకుంది. ఇక్కడ రాముడు సీతాలక్ష్మణులు నివసించిన గుహలో జాంబవంతుడు నిద్రించగా, జాంబవంతుడికి కలలో శ్రీరామ సీతాలక్ష్మణులు కన్పించారు. జాంబవంతుడు అక్కడే ఉన్న ఏకశిలపై ఆ ముగ్గురి చిత్రాలను గీసి పూజలు చేశాడు. ఇదే నేటి ఒంటిమిట్ట ఆలయం అని పౌరాణిక గాధ.
చారిత్రక నేపథ్యం
క్రీ.శ.1336లో తమ గురువైన విద్యారణ్యులస్వామి సూచనలతో హరిహర, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1344లో బుక్కరాయల సోదరుడు కంపరాయలు ఉదయగిరిని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. కంపరాయలు రాజ్యపరిధిలో ఒంటిమిట్ట వుండేది. ఆయన ఒకరోజు ఒంటిమిట్ట దిశగా వేటకు వచ్చాడు. అప్పట్లో ఒంటిమిట్ట బోయల ప్రాబల్యంలో ఉండేది. అటవీ సంపదను కాపాడుకుంటూ, దానితో జీవనం చేస్తూ చక్రవర్తులకు బోయలు కప్పం కట్టేవారు. అటుగా వచ్చిన కంపరాయలకు వీరు ఆతిథ్యం ఇచ్చారు. రామతీర్థం కొలనులోని నీటిని రుచిచూసిన కంపరాయలు ఆ రుచికి పరవశుడై, బోయలకు బహుమానాలు ఇచ్చాడు. ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలని ఆ బోయలు కోరగా, దేవాలయానికి కంపరాయలు పునాది వేశాడు. కొండల నడుమ చెరువు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఈ విషయాలు ఒంటిమిట్ట కైఫీయత్తులలో లిఖించబడి ఉన్నాయి.
ఆ తర్వాత 1356 ప్రాంతంలో తమ గురువైన విద్యారణ్యస్వామివారి సూచనతో హరహరరాయలు గర్భగుడిని పూర్తి చేసి, సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించాడు. శ్రీరామనవమి మొదలుకుని చైత్రమాసం శుక్ల చతుర్థశి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించి, చతుర్థశి నాడు రాత్రి సీతారాముల కల్యాణం జరపడం ఆనవాయితీగా మారింది.
అంతకుముందు విద్యారణ్యస్వామి, బుక్కరాయలు, కాశీ రామేశ్వర యాత్రలో కాశీ నుండి రామేశ్వరానికి వచ్చే దారిలో గోదావరి ఒడ్డున ఇసుకపల్లె నుండి నాలుగు విగ్రహాలు తీసుకువచ్చారు. వీటిలో ఒక విగ్రహాన్ని గండికోటలో, రెండవ విగ్రహాన్ని పామిడిలో, మూడవ విగ్రహాన్ని గుత్తిలో, నాల్గవదైన శ్రీ సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహాన్ని ఒంటిమిట్టలో ప్రతిష్ఠించారు. విజయనగర రాజులతో ప్రారంభమైన దేవాలయ నిర్మాణం ఆ తర్వాత చోళ, మట్లిరాజుల హయాంలో పూర్తిగా ఇప్పుడున్న ప్రహరీ, గోపురాల నిర్మాణం పూర్తిచేసుకుంది. ఈ విషయం బ్రాకెన్ బరీ రాసిన కడప మాన్యువల్ (1875) లో వుంది. గండికోటలోని ఒక శాసనానికి ఇంగ్లీషు అనువాదంగా కడప మాన్యువల్‌లో ఈ విషయాలు ఉన్నాయి.
రాత్రి పూటే కల్యాణం..
రాత్రిపూట కల్యాణం జరపడం అపచారమనే వాదన ఒకటి 2015 నాటి చర్చల్లో బయటకు వచ్చింది. ప్రాచీన దేవాలయాల్లో చూస్తే- మిథిలలో సీతారాములకు శుక్లపక్ష చతుర్థశి, ఉత్తరాభద్ర నక్షత్రంలోనే కల్యాణం జరుగుతోందని, ఆ తర్వాత వచ్చిన ఆధునిక దేవాలయాలలో శ్రీరాముడు పుట్టిన రోజైన శుక్లపక్ష నవమినాడు వివాహాలు జరపడం ఆనవాయితీగా పెట్టుకున్నారనే వాదనను కొందరు పండితులు వినిపించారు. చైత్రమాసం , శుక్లపక్షం, చతుర్థశి, ఉత్తరాభద్ర నక్షత్రం ముహూర్తాన్ని వశిష్టుడు నిర్ణయించి శ్రీసీతారాముల కల్యాణం జరిపాడని వాల్మీకి రామాయణం చెబుతోంది. ఒంటిమిట్టలో కూడా అదే రోజున కల్యాణం జరుగుతోంది. ఇక రాత్రి వేళల్లో కల్యాణం జరగడం అపచారమనుకుంటే , ఇప్పుడు రాత్రి వేళల్లో జరుగుతున్న వివాహాలన్నీ అపచారాలే అవుతాయనే వాదన ఇక్కడి పండితులు వినిపించారు. బుక్కరాయలు ఒంటిమిట్టలో విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత, వేదాలకు భాష్యం రాసిన విద్యారణ్యమహర్షి సూచన ప్రకారమే నవమి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై చతుర్దశి నాడు ఒంటిమిట్టలో కల్యాణం జరుగుతోంది. అదే ఆనవాయితీగా మారింది. ప్రాచీన దేవాలయాల్లో ఎక్కడైనా ఇదే ఆనవాయితీ ఉంటుందని ఇక్కడి పండితులు అంటున్నారు.
ఆంజనేయుడు ఎందుకు లేడు?
ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయంలో శ్రీరాముడు సీతాలక్ష్మణుల విగ్రహాలు ఒకే శిలలో చెక్కబడ్డాయి గానీ, ఆంజనేయుడి విగ్రహం లేదు. ఆధునిక దేవాలయాల్లో హనుమంతుడు తప్పనిసరిగా రాముడి పాదాల దగ్గర కూర్చుని ఉంటాడు. దీనికి పండితులు చెప్పే భాష్యం - రాముడు నివశించేది వైకుంఠమని హనుమంతుడు భావించాడు. దాసుడైన తాను వైకుంఠం ఇవతల ఉండి తన ఇష్టదైవానికి సేవ చేసుకుంటానని విన్నవించుకున్నాడు. ఆ ప్రకారమే ప్రాచీన రామాలయాల్లో హనుమంతుడు ద్వారం బయటే ఉంటాడని పండితులు అంటున్నారు. తిరుపతిలో కూడా రామాలయంలో ఆంజనేయుడు ఉండడని, రామాలయానికి ఎదురుగా దారికి అటువైపు ఆంజనేయుడి గుడి ఉందని ఉదాహరణ చూపుతున్నారు.
అభివృద్ధి సంగతేమిటి?
2015లో అప్పటి దేవదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ఒంటిమిట్ట దేవాలయాన్ని సందర్శించి, పలు అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒంటిమిట్టలో అధికారికంగా సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. సోమశిల బ్యాక్‌వాటర్ నుండి ఒంటిమిట్ట చెరువుకు పైపులైన్ ద్వారా నీటిని అందించాలన్న ప్రతిపాదించారు. ఈ చెరువుకు నీరందించే పైపులైన్ పనులు రూ.33కోట్లతో పూర్తయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ ఆలయాన్ని అప్పగించినా ఎలాంటి ఫలితం లేదు.

-పాలగిరి విశ్వప్రసాదరెడ్డి