సంపాదకీయం

కార్మికుల సొమ్ముతో అధికారుల సోకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు వైద్యసేవలు అందించేందుకు ప్రభు త్వం ‘కార్మికరాజ్య బీమా సంస్థ’ (ఇ.ఎస్.ఐ.కార్పొరేషన్)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పలు ఆసుపత్రుల్లో ప్రభుత్వరంగ, ప్రభుత్వేతర కర్మాగారాల్లోని కార్మికులకు వైద్యసేవలందించాలి. ప్రతి కార్మికుడి వేతనం నుండి వందకు రూపాయి డెబ్బయి అయిదు పైసలు, యాజమాన్యం నాలుగు రూపాయల డెబ్బయి అయిదు పైసలు వెరసి ఆరురూపాయల ఏభై పైసలు సంస్థకు జమ అవుతుంటాయి. ఏపీలోని విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతిల్లోని ప్రధాన ఆసుపత్రులు, 176 ఆరోగ్య కేంద్రాలకు ప్రతి నెలా కోట్లాది రూపాయలు ఇఎస్‌ఐ సంస్థ నుంచి జమ అవుతాయి. ఇంత సొమ్ము చెల్లిస్తున్నా, సంబంధిత ఆస్పత్రుల్లో మందులు, సిబ్బంది, వైద్యులు లేక అవస్థలు తప్పవు. రెండు, మూడు రకాల మందులనే ఏ రోగానికైనా ఇస్తారు. ఈ విషయమై ప్రశ్నిస్తే మరో ఆసుపత్రికెళ్లి చూపించుకోమని ఓ లేఖ చేతిలోపెట్టి వదిలించుకుంటారు.
అత్యవసర కేసుపై ఎవరైనా ఈ కేంద్రాలకు వెళితే సరైన సమాధానం లభించదు. ‘ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?’ అని రోగితో వచ్చిన వారు ప్రశ్నిస్తే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి రిఫర్ చేయటం ఆనవాయితీగా మారింది. అక్కడ పేరు నమోదు చేయించుకుని గంటల తరబడి ఎదురుచూస్తే- ‘ఇఎస్‌ఐ మాకు బకాయిలు చెల్లించని కారణంగా వైద్యసేవలు నిలిపివేశాం’ అన్న సమాధానం వినిపిస్తుంది. కార్మికుల వేతనాల్లో నుంచి ఏటా భారీగా నిధులు చెల్లిస్తున్నా ఫలితం లేదు. ఇంట్లో వస్తువులో, భార్య మెడలో పుస్తెలో అమ్ముకుని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటేనే కాని కార్మికుల కష్టాలు తీరవు. రాజమహేంద్రవరంలో ఇఎస్‌ఐ ఆసుపత్రిని 35 ఏళ్ల క్రితం ప్రారంభించారు. కాలగతిలో సమీప ప్రాంతాల్లో పరిశ్రమలు పెరగడంతో కార్మికుల సంఖ్య పెరిగింది. ఆస్పత్రి భవనం కాల పరిమితి ముగియటంతో సగభాగం ఇపుడు నిరుపయోగంగా ఉంది. ఈ ఆస్పత్రిలో వందమంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 45మంది మాత్రమే ఉన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది, వాచ్‌మెన్, డ్రస్సర్స్, ఆయాలు, కింది స్థాయి సిబ్బంది అసలే లేరు. రోగులకు ఇక్కడి సిబ్బంది న్యాయం చేయలేని దుస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి మిగతా ఇఎస్‌ఐ ఆస్పత్రుల్లోనూ నెలకొంది. ఇఎస్‌ఐ ఆస్పత్రులకు రావాలంటేనే కార్మికులు విముఖత చూపుతున్నారు.
కార్మికులు చెల్లిస్తున్న సొమ్మును ఉన్నతాధికారుల రాజభోగాలకు, విలాసవంతమైన సౌకర్యాలకు వెచ్చిస్తున్నారు. ఆస్పత్రుల్లోని మంచాలపై పరుపులు, దుప్పట్లు, దిండ్లు, ఇతర కనీస సౌకర్యాలు లేకున్నా అధికారులు మాత్రం ఏసీ గదుల నుండి ఆదేశాలిస్తుంటారు. ఇఎస్‌ఐ సంస్థను పోషించే కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. ఇఎస్‌ఐ ఆస్పత్రుల దయనీయ స్థితిపై పాలకులు దృష్టిసారించవలసి ఉంది. కార్మికులు జమచేసే ప్రతి రూపాయిని వారి ఆరోగ్య సేవలకు వెచ్చించవలసి ఉంది. తగినంత మంది సిబ్బందిని నియమించటం, సౌకర్యాలను మెరుగుపరచడం ప్రభుత్వ కర్తవ్యం. పడకల సంఖ్య పెంచడం, రోగులకు పౌష్ఠికాహారం, మందుల ఖర్చును తిరిగి చెల్లించడంపై తగిన ఆదేశాలు ఇవ్వాలి. ఇఎస్‌ఐ ఆస్పత్రుల ఆవిర్భావం వెనుక లక్ష్యాన్ని పాలకులు ఇకనైనా గుర్తించి, కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలి.

- యర్రమోతు ధర్మరాజు 94402 63849