Others

మరచిపోలేని మేలట్టూరు భాగవత కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేలట్టూరు అంటే భాగవత మేళ గుర్తుకు వస్తుంది. ఐదు శతాబ్దాలుగా నిరంతరాయంగా సాగుతున్న తెలుగు కళా వారసత్వ యాత్ర. త్యాగరాజస్వామి సమాధి ఉండే తిరువయ్యూరుకు ఐదారు కిలోమీటర్ల దూరంలో వుండే చిన్న గ్రామం మేలట్టూరు. ప్రతి నరసింహ జయంతికి అక్కడ ఒక వారం పాటు తెలుగు నాట్య నాటకాలు రాత్రులంతా ప్రతిధ్వనిస్తాయి. మేలట్టూరులో ఈ వారంపాటు మేలట్టూరు వెంకట్రామశాస్ర్తీ రచించిన 12 నాట్య నాటకాలలో కొన్ని వేస్తారు. కానీ ఈ మేలట్టూరు చుట్టుప్రక్కల ఉండే ఊళ్ళల్లో కూడా నరసింహ జయంతి రోజున రాత్రంతా ప్రహ్లాద చరిత్ర నాటకం వేస్తారు. మేలట్టూరు శాస్తబ్రద్ధంగా విద్యుచ్ఛక్తి కాంతులు లేకుండా అరటి బోదెలమీద ఆముదపు దీపాలుంచి, ఆ వెలుగులలో రాత్రంతా ప్రహ్లాద చరిత్ర ప్రదర్శిస్తారు. ఇందులో పూర్తి శాస్ర్తియమైన కర్ణాటక సంగీతం, శుద్ధమైన నాట్యం, మేలైననాటకం కలగలసి ఉంటాయి.
ఇప్పటికీ స్ర్తిలు నటించడం లేదు, కేవలం పురుషులే స్ర్తి పాత్రలు కూడా ధరిస్తారు. నోరు కదిపితే శాస్ర్తియ సంగీతం, అడుగు కదిపితే వంద శాతం నాట్యం- నటనకు ఎక్కడా.... ఉండదు. ఇదే మేలట్టూరు భాగవత మేళ.
నాకు మాత్రం మేలట్టూరు అంటే మిత్రుడు మహాలింగం! ప్రస్తుతం ఆయన 66 సంవత్సరాల యువకుడు. మాది ఐదేళ్ళ స్నేహం. 2015 నుంచి 2016 దాకా నేను మద్రాసు ఆకాశవాణి ఉద్యోగం చేశాను. తమిళ ప్రాంతంలో ఎంతో లోతుగా, విస్తృతంగా తెలుగు వాసనలు వినబడతాయి, కనబడతాయి. 2013లో మండలి బుద్ధప్రసాద్ బృందంగా మేలట్టూరు, తిరువయ్యూరుతో సహా కొన్ని ప్రాంతాలు తిరిగాం. ఆ సమయంలో తొలిసారి మహాలింగంగారిని కలిశాం. 2014 ఉగాది మద్రాసు ఆకాశవాణి తెలుగు విభాగం కోసం ఆకాశవాణి ప్రాంగణంలో ప్రహ్లాద చరిత్రం ప్రదర్శింపజేశాం. 2015, 2016 నరసింహ జయంతి కార్యక్రమాలకు వెళ్లి, మూడు రోజులపాటు అక్కడి తెలుగు కళోత్సాహాలు చవిచూశాం. 2017 నరసింహ జయంతికి తెలుగు ప్రాంతాలలో 12 ఆకాశవాణి కేంద్రాల ద్వారా రెండు గంటలపాటు ప్రహ్లాద చరిత్రం నల్లి కుప్పుస్వామి స్నేహహస్తం తోడ్పాటుతో ప్రసారమైంది. ఈ సంవత్సరం అక్కడి వేడుకలకు శనివారం సాయంకాలం హాజరుకావాల్సి ఉండింది. కొన్ని కారణాలవల్ల సాధ్యం కాలేదు. కానీ నా మనసు అక్కడే ఉంది. అందుకే ఈ వ్యాసం.
2015 నరసింహ జయంతికి వెళ్లినపుడు ఇతర గ్రామాలలో ప్రహ్లాద చరిత్రం మేళను కొన్ని చూశాం- తెల్లవారుజాము ప్రాంతాలలో. మేలట్టూరులో సంగీతం, నాట్యం ప్రధానంగా ఉంటే ఇతర చోట్ల సంభాషణలు ప్రధానంగా ఉంటాయి. అసలు ఈ ప్రదర్శన నుంచి దాదాపు ప్రణాళిక తీసుకుని భక్తప్రహ్లాద సినిమాను నిర్మించారేమోనని నాకు అనిపించింది. సరే, మహాలింగం దగ్గరకు వద్దాం. మహాలింగం నాల్గవతరం వ్యక్తి. తండ్రి, తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా ఈ తెలుగు కళను అంటిపెట్టుకుని ప్రదర్శింపజేస్తున్నాడు. ప్రతిసారి ఖర్చుపెట్టి చేయించడం తర్వాత ఆ ఖర్చును పూడ్చడం- ఇదీ ఆయన పని. ఆయన వయసు 66 కాగా, 56 సంవత్సరాలుగా ఈ కళలో తలమునకలుగా ఉన్నారు. తొలుత రెండు సం.లు బాలప్రహ్లాదుడిగా వేశారు. తర్వాత రెండేళ్ళు ప్రధాన ప్రహ్లాదుడిగా రక్తికట్టించారు. పిమ్మట 21 సం.లు స్ర్తి పాత్రలు ధరించారు. అటు పిమ్మట ప్రధాన పురుష పాత్రలతో వెలుగొందుతున్నారు. ఆయన స్ర్తి వేషం వేస్తే స్ర్తి అనే భావిస్తారు. పురుష పాత్ర వస్తే కూడా అలానే రక్తికట్టిస్తారు. వీటికి మించి ఒక తపస్సులా ఈ ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. కాలం మారడంతో కొత్తతరం వారు బ్యాంకులు, కళాశాలలు, వైద్యం, ఐటి సంబంధమైన ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా వీరంతా ప్రహ్లాద జయంతికి మేలట్టూరు వచ్చి ఈ ప్రదర్శనలో మహదానందాన్ని పొందుతారు.
ప్రదర్శన సమయంలో బయటి ప్రాంతాలవారు వెడితే వారి వసతి ఏర్పాటుతోపాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తారు. చివర వీరికి విరాళం ఇస్తే ఆనందంగా స్వీకరిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, తిరుమల తిరుపతి దేవస్థానం వంటి సంస్థలు ఈ ప్రదర్శనకు సహకరిస్తున్నారు. మండలి బుద్ధప్రసాద్, కె.వి.రమణాచారి వంటి పెద్దలు తోడ్పాటు ఇవ్వడం అభినందనీయం. తిరుపతిలోనూ, గోదావరి పుష్కర సమయంలోనూ, యాదగిరి గుట్టలోనూ ఈ ప్రదర్శనలు ఇటీవలకాలంలో జరిగాయి. ఆ మేరకు తెలుగు ప్రాంతాలలో మనం మరచిపోయిన కళ మరలా ప్రాచుర్యంలోకి వచ్చిందని గర్వించాలి.
1550 ప్రాంతాలలో చెవ్వప్ప నాయకుని కుమారుడు అచ్యుతరాయలు మేలట్టూరులో 500 తెలుగు బ్రాహ్మణ భాగవతులకు ఇళ్లు, పొలం, బావులు వసతి కల్పించి ఈ కళకోసం పాటుపడమని కోరారు. అందువల్లనే మేలట్టూరుకు అచ్యుతాపురం, అచ్యుతాబ్ది అని ఇతర పేర్లు ఉన్నాయి. నారాయణతీర్థులు, మేలట్టూరు వీరభద్రయ్య, పచ్చిమిరియం ఆది అప్పయ్య ఈ ఊరివారే! నారాయణ తీర్థుల శిష్యులు మేలట్టూరు గోపాలకృష్ణయ్య. వీరి కుమారుడే త్యాగయ్య సమకాలికుడయిన మేలట్టూరు వెంకట్రాయ శాస్ర్తీ.
ఈ మేలట్టూరు వెంకట్రాయశాస్ర్తీగారు ప్రహ్లాద చరిత్రం, రుక్మిణీ కళ్యాణం, మార్కండేయ చరిత్ర, సీతాకళ్యాణం, కృష్ణజననం లేదా కంస వథ, హరిశ్చంద్ర నాటకం, ఉషా పరిణయం, ధ్రువచరిత్రం, పార్వతీ పరిణయం, హరిహర లీలా విలాసం, శివరాత్రి నాటకం- మొత్తం 11 నాట్య నాటకాలు రచించారు. ఇవి తెలుగులో రచింపబడినా ప్రదర్శించేవారికి క్రమంగా తెలుగు చదవడం, రాయడం తగ్గిపోయింది. దాంతో ఈ నాట్య నాటకాలు తమిళంలోనో లేదా గ్రంథ లిపిలోనో తాటాకులు ఎక్కాయి. తమిళంవాళ్ళు సంస్కృతం చదవడానికి వీలుగా గ్రంథ లిపిని రూపొందించుకున్నారు. ఇది భాష కాదు, కేవలం లిపి! దీనివల్ల సంప్రదాయంగా కంఠస్థం చేసి, తమిళ ఉచ్ఛారణ ఛాయతో తెలుగు సాగేది. అంతే అసలు ప్రతి ఏమిటనేది కూడా అప్పుడప్పుడు సందేహమే! నటేశం అయ్యర్ ఆరేడు దశాబ్దాల క్రితం తమిళంలో, గ్రంథ లిపిలో భద్రపరచాడు. ఇంతవరకు ఇది రెండు కుటుంబాల ఆస్తిగానే పరిగణించారు. అయితే మహాలింగం మరింత మందికి అందాలి, ఏది ప్రామాణికమో తెలియజెప్పాలని వెంకట్రాయ శాస్ర్తీ రచనలు క్రమంగా ప్రదర్శిస్తున్నాడు. పుస్తకంలో ఒకవైపు దేవనాగరి, మరోవైపు తెలుగులో చూడవచ్చు.
2016 ప్రహ్లాద చరిత్రం, 2017లో మార్కండేయ చరిత్రం, సీతాకళ్యాణం ప్రచురించారు మహాలింగం. మరికొన్ని కూడా వెలుగు చూడబోతున్నాయి. నిజానికి ఇలా ప్రచురించడం మహాలింగం ప్రజాస్వామిక దృష్టికి తార్కాణం. తెలుగుమీద, తెలుగు కళలమీద మనకు సరైన అభిమానం లేకపోయినా మహాలింగం వంటివాడు జీవిత కృషిగా ఈ కళ కోసం పాటుపడటమే కాదు, మరింత ఎక్కువమందికి చేరాలని ప్రయత్నిస్తున్నారు. భరతనాట్యం బీజప్రాయంగా ఈ కళారూపం నుంచే మొదలైందని అంటారు. నిజానికి ఇది నూటికి వెయ్యి శాతం శాస్ర్తియ కళ. కానీ మన ప్రభుత్వాలు దీనిని క్లాసికల్ ఆర్ట్ ఫామ్‌ఘా గుర్తించలేదు. పెద్ద ఎత్తున ఈ ప్రదర్శనలు డెమోన్‌స్ట్రేషన్‌తోసాగితే ఈ కళారూపం మరింత బోధపడుతుంది, ప్రచారంలోకి వస్తుంది. ఈ దిశగా మనం ఆలోచించాలి, ప్రణాళికలు వేసి మహాలింగం వంటివారికి స్నేహహస్తం ఇవ్వాలి. ఇది తెలుగు గర్వపడే సందర్భం.

-డా. నాగసూరి వేణుగోపాల్ 9440732393