Others

కఠోర నియమాలు .. రంజాన్ దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిం సోదరులకు పరమ పవిత్రమైన రంజాన్ నెల సందర్భంగా నెల రోజులపాటు నిర్వహించనున్న దీక్షలు మే 17నుండి ప్రారంభించి, జూన్ 16న రంజాన్ పండుగ వరకు కొనసాగనున్నాయి. దివ్య ఖురాన్ అవతరించిన రంజాన్ నెలలో పరమ పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాసదీక్షా కంకణులైన ధార్మికులు, భక్తిశ్రద్దలతో అన్ని అలవాట్లకు దూరంగా ఉంటూ, నెల రోజుల దీక్షలో నిమగ్నమై ఉంటారు. మహమ్మదీయుల మతానుసారం సంవత్సరంలో 9వ నెల రంజాన్. రంజాన్ పండగ పేరుకాదు, నెలపేరు. రంజాన్‌లోనే దివ్య ఖురాన్ - శరీఫ్ అవతరించింది.
‘రంజ్’ అనగా కాలుట (జ్వలించుట). ఉపవాసము చేయుటచే మనుషులు చేయు పాపము కాలిపోవునని భావము. నెల అంతయూ ఉదయంనుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి, రోజా పాటిస్తూ, రోజుకు 5సార్లు నమాజ్ పఠిస్తూ, మసీదులలో ఎక్కువ సమయం గడుపుతారు. ఐదు సార్లు చేసే నమాజులు - ఫజర్ (సూర్యోదయమునకు పూర్వము), జుహర్ (మద్యాహ్నం తర్వాత), అసర్ (సూర్యాస్తమయానికి పూర్వము), మగరిబ్ (సూర్యాస్తతమయానికి ముందు, చీకటి పడ్డాక), ఇషా (అర్ధరాత్రికి ముందు) చేయాల్సిన నమాజులు.
ఈనెలలో రాత్రి చేయు ప్రత్యేక ప్రార్థనను ‘తరావీహ్’ అంటారు. నెలలో కురాన్‌ను పూర్తిగ పఠిస్తారు. ముస్లింలు ఐదు సిద్ధాంతాలను విశ్వసించి, పాటిస్తారు. అల్లాను, ఆయన దూతను హృదయ పూర్వకముగా విశ్వసించటం, రోజూ ఐదుసార్లు నమాజు పఠించడం, పూర్తిగా ఉపవాస దీక్షను పాటించడం, బీదలకు దానము చేయటం, మక్కాయాత్ర చేయటం ప్రధాన సిద్ధాంతాలు. రోజాలో ఉండగా ఉమ్మిని మింగరాదు. బీడీ, సిగరెట్ లాంటివి కాల్చరాదు. మద్యం సేవించరాదు. మందులు తీసుకొనరాదు. చాడీలు చెప్పుట, ఇతరులను దుర్భాష లాడుట, అబద్దములు చెప్పుట, చెడు పనులు చేయుట నిషిద్ధాలు. వీటిని పాటించనిచో, అల్లాహ్ దృష్టిలో తాను చేసిన వ్రతముకు విలువ ఉండదు. బీదలకు సాయం చేసి, వారినుండి దీవనలు పొందాలి. సూర్యోదయానికి ముందు తినే ఆహారాన్ని ‘సహరీ’ అంటారు.
సూర్యాస్తమయం తర్వాత ఖర్జూరపు పండుగాని, ఇతర ఫలాలను తీసుకోవడాన్ని ‘అఫ్తారీ’ అంటారు. రంజాన్ నెలలో చివరి పది రోజులలో ఒక రాత్రిని న్యాయపురాత్రి (శబ్-ఎ-కదర్) అంటారు. సాధారణంగా ఇది 27వ రాత్రిగా భావిస్తారు. ఈఒక్క రాత్రి 1000 నెలలకంటే పవిత్రమైనదిగా భావించబడుతుంది. సంవత్సరంలో చేసిన పాపాలన్నింటికీ ఖుదా న్యాయం చెప్పడం జరుగుతుందని భావన. 29లేదా 30వ రోజు ఆకాశంలో చంద్ర దర్శనం చేసుకుంటారు. మరుసటి రోజు ఈద్ జరుపు కుంటారు. నిజానికి ఈరోజు 10నెల శవ్వాల్‌కు మొదటిరోజు. ఈద్ అసలు పేరు ఈద్-ఉల్-్ఫతర్. ఫితర్ అంటే దానము. ముందురోజు ధాన్యములు దానం చేస్తారు. చంద్ర దర్శనానంతరం చిన్నవారు, పెద్దలకు నమస్కరిస్తారు. ఆశీస్సులు పొందుతారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈద్‌నాడు స్నానానంతరం నూతన వస్త్రాలను ధరిస్తారు. పురుషులు మసీదుకు, ఈద్‌గాహ్‌కు వెళ్ళి, చిన్న పెద్ద, ధనిక పేద, తరతమ భేదాలు లేక వరుసలో నిలబడి నమాజు పఠిస్తారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇళ్ళలో పాయసం తదితర పిండి వంటలు భుజిస్తారు. స్నేహితులకు, బంధువులకు కట్న కానుకలను సమర్పించు కుంటారు. రంజాన్ మాసం భక్తిశ్రద్దలకు, పవిత్రతకు, నియమాలకు ప్రతీక. ఏకాగ్రతతో ఆత్మసాక్షాత్కారార్ధమై, పాపములు తొలుగుటకు, లౌకిక విషయాలను పక్కనపెట్టి, పారమార్థిక విషయాలపై దృష్టి సాధించేందుకు కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది.

- సంగనభట్ల రామకిష్టయ్య, 9440595494