Others

ఆవిష్కరణల క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది విభిన్నమైన విద్యార్థులతో కళకళలాడుతూ ఉంటుంది. కొందరు పిల్లలు ప్రశ్న అడిగిన వెంటనే సరైన సమాధానం ఇస్తారు. ఉపాధ్యాయుడు ఈ సమాధానం ఎలా వచ్చిందంటాడు. విద్యార్థి తనకు తెల్వదంటాడు. ‘ప్రశ్న అడిగారు.. నాకు తోచింది చెప్పాన’న్నది విద్యార్థి సమాధానం. వీళ్లనే ‘గిఫ్టెడ్ చిల్డ్రన్’ అంటారు. మరొక విద్యార్థినడిగితే ఆ విద్యార్థి చెప్పిందే కరెక్టే కదా సార్? అంటాడు. నీకెట్లా తెలుసునని అని ఉపాధ్యాయుడు అడుగుతాడు. ఆ విద్యార్థి తర్కబద్ధంగా సమాధానం చెబుతాడు. ఇలా తర్కబద్ధంగానే మరో విద్యార్థి సమాధానం చెబుతాడు. ఈ రకమైన విద్యార్థిని బ్రైట్ చైల్డ్ అంటారు. మొదటి విద్యార్థికి ఫలితం తెలుసు, కారణం తెలియదు. రెండో విద్యార్థికి ప్రాసెస్‌తో పాటు కారణం కూడా తెలుసు. ఇద్దరూ తెలివిగలవాళ్లే. ఒకరు గిఫ్టెడ్, మరొకరు బ్రైట్ చైల్డ్. మొదటి విద్యార్థి ప్రాసెస్ తెల్వకుండా సమాధానం చెప్పగలిగాడు. అది అతనికిచ్చిన కుటుంబ నేపథ్య ఫలితం. రెండో విద్యార్థి ఆలోచన వెనుక శ్రమ ఉన్నది. తరగతి గదిలో కారణం తెల్వకుండా చెప్పే విద్యార్థికి దాని పూర్వపు బ్యాక్‌గ్రౌండ్ చెప్పాలి. తరగతి గదిలో ప్రాసెస్, ఫలితం తెల్సిన విద్యార్థే ఆ విషయాన్ని డెవలప్ చేయగలుగుతాడు. ప్రాసెస్ తెల్వకుండా ఫలితమే ప్రధానమనుకుంటే గాలిలో వేలాడే పతంగిలా ఉంటారు. తరగతి గదికి శోభనిచ్చేది ఈ రెండోరకం పిల్లలే. ఈ విద్యార్థి తన జ్ఞానాన్ని కొత్త ఆవిష్కరణలకు ఉపయోగిస్తాడు.
విద్యార్థి మార్కులనుబట్టి తరగతి గదిని అంచనా వేయకూడదు. దాని వెనుక ఉన్న శ్రమను కూడా పరీక్షించుకోవాలి. రెండో రకం విద్యార్థుల జ్ఞానమే తరగతి గది ఎదుగుదలకు మూలం. అప్పుడే ఆ తరగతి ఇన్నోవేట్ క్లాస్ (ఆవిష్కరణల తరగతి) అవుతుంది. ఆవిష్కరణల తరగతికి తర్కబద్ధమైన జ్ఞానమే ప్రధానం.
తరగతి గది ఒక భావన..
తల్లిదండ్రులు తరగతి గది పోషకులు కాదు. వారు భాగస్వాములు. తల్లిదండ్రులను ఫలితాల్లోనే భాగస్వాములను చేస్తాం. అప్పుడు తల్లిదండ్రులు వినియోగదారులు అవుతారు. ఫలితాలు చెబితే- తల్లిదండ్రులను సంతోష పెట్టటం లేదా దుఃఖపెట్టటమో అవుతుంది. కానీ ప్రాసెస్‌లో భాగస్వామిని చేస్తే ఆ తల్లిదండ్రులు చిరకాలం తరగతి గదికి అండగా నిలుచుంటారు. ఇప్పటికీ నేను తెల్లవారు జామున వాకింగ్ చేస్తున్నప్పుడు కొందరు తల్లిదండ్రులు కూడా పిల్లలను తీసుకుని వచ్చేవారు. నలుగురు తల్లిదండ్రులు కూర్చుని తరగతి గదిలో జరిగే కార్యక్రమాన్ని చర్చించేవారు. ఉదయం 10 గంటలకు తరగతి ప్రారంభం కాగానే ఒక మహిళ వచ్చి- ‘సారూ.. నువ్వు ఏదో క్యాలిక్యులస్ చెబుతావట. నా కొడుక్కి ఆ లెక్కలు అర్థం కాలేదని చెప్పాడు. మీరిచ్చిన హోంవర్క్ చేస్తున్నప్పుడు మా అబ్బాయి ఉల్లాసంగా చేశాడా? తికమకపడుతూ చేశాడా? లేక బాధపడుతూ చేశాడా? అన్న దాన్ని నేను గమనించగలను’ అని చెప్పింది. ‘నీకు లెక్కలు రావుగదా?’ అన్నాను. ‘నాకు లెక్కలు రావాల్సిన అవసరం లేదు. మా పిల్లవాడి ముఖవర్చస్సు నాకు అర్థం అయ్యేలా చేస్తుంది. అదే భాగస్వామ్యం.’ అన్నదామె.
10 ప్రశ్నలు ఒకేనాడిస్తే ఎలాచేస్తారని ఒక తల్లి వచ్చి అడిగేది. అవి అన్నీ చేయటానికి కాదు ఒక గంటలో ఎన్ని ప్రశ్నలు ఉల్లాసంగా చేయగలుగుతాడని పరిశీలించేందుకు టీచర్ ఇస్తాడు. విద్యార్థి శక్తిని పరీక్షించాలి. కొత్త ప్రశ్నను ఎదుర్కొనే శక్తిని పరీక్షించటం. దానికోసం 10 ప్రశ్నలిచ్చారని చెప్పాను.
పరీక్షలో సమాధానాన్ని రాయటమే ప్రధానం కాదు. కొత్త ప్రశ్నను ఎదుర్కోగలరని తెలుసుకోగలగాలి. ఇలాంటి విషయాలు విద్యార్థిలో ఉన్నట్లయితే అధ్యయనంలో జరిగే మార్పులు తెలుస్తాయి. అధ్యయనంలో వారు భాగస్వాములు అవుతారు. చిన్న పిల్లలను ఏదో ఒక హాస్టల్‌లో వేస్తే ఫలితాల్లో తల్లిదండ్రులు భాగస్వాములవుతారు. చిన్నప్పుడు స్కూలులెవల్లో తల్లిదండ్రులు విద్యలో భాగస్వామి అంటే ప్రాసెస్‌లో భాగస్వామి అవుతున్నట్లే. 12వ తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రులతో ఉండటమే శ్రేష్ఠం. తరగతి గది పిల్లలను స్కూలుకాగానే వదిలి పెట్టదు. అది పిల్లలతోనే నడుస్తుంది. విద్యార్థితో తోడై నడిచేది, స్నేహితుడై వెంట ఉండేది తరగతి గది. విద్యార్థిలో అంతర్లీనమై వెంబడించేదే తరగతి గది. తరగతి గది అనేది ఒక ప్రదేశం కాదు. అది ఒక భావన.

-చుక్కా రామయ్య