Others

మాదక ద్రవ్యాలను తరిమికొడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాదక ద్రవ్యాలు శారీరక, మానసిక రుగ్మతలను కలిగించడమేకాక, సమాజంలో నైతిక విలువలను దారుణంగా దిగజారుస్తున్నాయి. ఈ మహమ్మారి నుంచి మానవాళిని కాపాడేందుకు ఏటా జూన్ 26న ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం’ పాటిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ డిసెంబర్ 7, 1987న ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. ‘డ్రగ్స్’ వినియోగం, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని ఐరాస విజ్ఞప్తి చేసింది. హెరాయిన్, స్పీడ్, ఎక్‌స్టసీ, కొకైన్, మారిజువానా, కెట్టమైన్, డామా హైడ్రాక్సీ బుటెరేట్ తదితర మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమైనవి. ప్రపంచ వ్యాప్తంగా 15 ఏళ్ల నుండి 70 ఏళ్ళ వయస్సు గల వారిలో 30 కోట్ల మంది గత నాలుగేళ్లలో ఒక్కసారైనా ఏదో ఒక మాదకద్రవ్యాన్ని ఉపయోగించిన వారేనన్నది ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
ప్రపంచ జనాభాలో సుమారు పదిశాతం మంది మాదక ద్రవ్యాలకు బానిసలై ఉన్నారు. ఏటా 200 నుండి 300 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతోంది. మాదక ద్రవ్యాల వ్యాపారం వల్ల సంపాదిస్తున్న డబ్బు ఆసియా, ఆఫ్రికా దేశాలలో తిరుగుబాట్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ’ వెల్లడించింది. అఫ్గానిస్తాన్‌లో ‘పాపి’ (నల్లమందు) విస్తారంగా పండిస్తారు. దీనివల్ల వచ్చే డబ్బుతో తాలిబన్ ఉగ్రవాదులు బలపడుతున్నారు. పాక్ గూఢచారి సంస్థ, ఆ దేశ సైన్యం, మాఫియా ముఠాలు ఏకమై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నాయి. దీని ద్వారా వచ్చే డబ్బును జమ్ము-కశ్మీర్ రాష్ట్రంలో టెర్రరిజాన్ని పెంచి పోషించడానికి ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మన దేశంలో సుమారు 15 కోట్ల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. కొకైన్ వ్యాపారం భారత్‌లో బాగా సాగుతోంది. కొకైన్ ఒక్కో గ్రాము సుమారు ఇరవై వేల రూపాయల ధర ఉంటుందట. మన దేశంలో ఏటా 200 కిలోల కొకైన్‌ను వినియోగిస్తున్నారని ఓ అంచనా.
కాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ గత సంవత్సరం డ్రగ్స్ వినియోగం పెరిగినట్లు, నగరాలలో పట్టణాలలో కొందరు ముఠాలుగా ఏర్పడి కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కొన్ని ఘటనల్లో నేరగాళ్లు పట్టుబడినా, వీటి రవాణా, వినియోగం ఆగడం లేదు. మత్తులో ముంచెత్తే డ్రగ్స్ టీనేజ్ కుర్రకారును ఆగమాగం చేస్తున్నాయి. దీని బారిన పడినవారు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగానే గడుపుతూ మృత్యువుకు చేరువవుతారు. డ్రగ్స్‌కి అలవాటుపడ్డవారు సామాజిక సంబంధాలను కోల్పోతుంటారని, సన్నిహితులకు దూరంగా గడుపుతారని, కోపంగా ఉంటూ తరచూ ఉద్రేకానికి గురవుతూ వారిలో వారే మాట్లాడుకుంటారని వైద్యులు చెబుతున్నారు.
డ్రగ్స్‌లో కూడా అనేక రకాలుంటాయి. ముక్కు ద్వారా పీల్చేవి, నోటితో తీసుకునేవి, ఇంజెక్షన్ల రూపంలో తీసుకునేవి, పొగ పీల్చేవి వంటివి ఉన్నాయి. గతంలో తెలంగాణ ప్రాంతంలో కొందరు గంజాయిని పండించి ఆర్థికంగా ఎదిగారు. ఏజెన్సీ ప్రాంతాల్లో, గుట్టలపై గంజాయిని అంతరపంటగా వేసేవారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో గంజాయి పంట తెలంగాణ నుంచి దాదాపు తుడిచిపెట్టుకపోయింది. అయితే, ఇతర ప్రాంతాల నుంచి దీనిని దిగుమతి చేస్తున్నారు. సిగరెట్లలో గంజాయిని పెట్టుకుని దమ్ము పీల్చడాన్ని కొందరు యువకులు గొప్పగా చెప్పుకుంటారు. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ వినియోగం పెరుగుతూనే ఉంది. బాలివుడ్, టాలీవుడ్ నటులు ఈ డ్రగ్స్ దందాలో భాగస్వాములవుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముంబై పేలుళ్ల తర్వాత పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ‘మాఫియా డాన్’’ దావూద్ ఇబ్రహీంను అమెరికా ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ప్రకటించింది. అయినా దావూద్ ముఠా మన దేశంలో డ్రగ్స్ వ్యాపారాన్ని నడిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో చాపకింద నీరులా డ్రగ్స్ వ్యాపారం విస్తరించింది.
డ్రగ్స్‌కి బానిసలైన వారు అవి ఒక్కసారి దొరకకపోతే హత్యలు, ఆత్మహత్యలకు వెనకాడరు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి. కాలేజీలలో, పాఠశాలల్లో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆరా తీయాలి. పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా సిగరెట్లు, బీడీలు, గుట్కాలు తీసుకునేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఇదే రీతిలో మత్తు పదార్థాల విక్రయాలు పెరుగుతున్నాయి. 1985లో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు కనీసం పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (న్యూఢిల్లీ)ను 17-03-1986న ఏర్పాటుచేశారు. ‘మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పొరాడుదాం.. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించుకుందాం’ అని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాల్సిన తరుణమిదే...
*
(నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం)

-కామిడి సతీష్‌రెడ్డి 98484 45134