Others

అనంత పద్య జ్యోతిర్మండలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రంథం: అనంతపద్యం
(అనంతపురం జిల్లా పద్య సాహిత్య వికాసం)
రచన: డా: అమళ్ళదినె్న వేంకట రమణప్రసాద్,
793 పుటలు; వెల: రూ.900లు;
ప్రతులకు
రచయిత, 3/696, రామాలయం దగ్గర,
సోమనాథనగర్, అనంతపురం- 505004,
నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాదు-27
*
‘‘ఆలయాలపైన/ అలమసీదులపైన/ చెర్చిపైన చేరి సేద దీరు/
పావురాలకేది పరమత ద్వేషంబు/ మలిన పడెను మనిషి
మతముకతన’’ - అంటూ పరమత ద్వేషాన్నీ;
‘‘ఎవడా సూర్యుడు? వెల్గునిచ్చు నిరతం బేడంబముల్ పల్కడే/
ఎవడీ వాయువు? జీవమిచ్చెడి ఘనుం డేస్వార్థముల్ తాల్పడే/
అవురా ఎన్ని అబద్ధముల్ పలికి మాయల్ పన్ని జీవించు దా/
నవుడై మానవుడీభువిన్ పరుల నానా సౌఖ్యముల్ దోచెడన్’’
- అని మానవ దోపిడీ స్వభావాన్నీ నిరసించే షేక్ మహమ్మద్ ముస్త్ఫా వంటి కవులు రచనలు భద్రపరచాలా? అక్కరలేదా? ఇట్టి విశిష్ట కవుల జీవిత చరిత్రాంశాలు భద్రపరచాలా అక్కరలేదా? అంటే సహృదయులైన ఎవరైనా అవసరమే అంటారు. ఇటువంటి కవులు ఎందరో ఉన్న అనంతపుర మండలంకి చెందిన పద్యకవుల బహువిధ పద్య రత్నాలను మధించి సేకరించి వారి చరిత్రలు స్వీకరించి, చక్కని విశే్లషణతో ‘అనంత పద్యం’అనే ఉద్గ్రంధాన్ని సాహిత్యశ్రమజీవి, పండితుడు, కవి లోతులు తెలిసినవారు అయిన డాక్టర్ అమళ్ళదినె్న వెంకటరమణ ప్రసాద్ సంధానపరచారు. కరవుతీరా పద్యాల పంటల్ని పండించింది, ఆయా కాలాల్లో అనంతపురం జిల్లా. సి.వి.సుబ్బన్న, మాడుగుల నాగఫణి వంటి వారిచే పద్య రచనలకు ప్రశంసలు పొందిన, కవి, మృచ్ఛకటికం వంటి వానిపై పరిశోదనలు చేసిన అమళ్ళదినె్న ఈ గ్రంథ నిర్మాణానికి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అరవై ఆరుమంది పెన్నిధుల వంటివారి నుండి గ్రంథ నిధులు సేకరించుకున్నారు. 219 గ్రంథాలను సద్వినియోగ పరచుకున్నారు. 350 మంది అనంతపురం జిల్లా కవులలో ప్రాచీన ఆధునిక కవులు, కావ్య కవులు, అవధాన కవులు, సమయ సందర్భ రచనోన్ముఖ కవులు ఉన్నారు. రచయిత గ్రంథాదిని రాసుకున్న ప్రస్తావన చూస్తేనే అమళ్ళదినె్న వారి ఉన్నత విస్తృత పరిశోధనా పరిధులు తేటతెల్లమవుతాయి. ఇది ఉత్త సేకరణ కాదు ఉత్తమ సేకరణ రచనాధిషణత్వంతో పరిమళించిన సేకరణ.
ప్రచోదన పేర శ్రీ బేతవోలు రామబ్రహ్మం రాసిన ముందుమాటలు ముందు చూపుతో రాసినవి. వారాశించినట్లుగా ‘‘ఈ గ్రంథం ఒజ్జబంతిగా తెలుగు రాష్ట్రాలు రెండింటా అన్ని జిల్లాలకు పద్య కవితా చరిత్రలు రూపొందాలి. మిగతా సాహితీ ప్రక్రియలకూ వెలువడాలి.’’
కవుల నిర్మాణ చాతుర్యాలు, భావనాకాంతులు, చమత్కారాల వెలుగులు, వర్ణనావైశారద్యాలు, పొగడికలు, తెగడికలు, మానవ స్వభావాలు, అనుభూతులు, అతి తక్కువగా రొడ్డకొట్టుడు పద్యాలు, రసవత్తర పద్యాలు.. ఇవన్నీ దర్శనమిచ్చాయి ఈ పెద్ద పొత్తంలో.
స్వాభిమాన సంకేతాలుగా చరిత్రావసరాలుగా వచ్చిన సాహితీ గ్రంథాలలో ఈ గ్రంథానికి ఓ విశిష్ట స్థానం వుంటుంది. గ్రంథాల ద్వారా పేరుగొన్న జిల్లా కవులు ఎలాగూ చరిత్రలతో కనబడతారు. అలాకాక పేరుపొందవలసీ పొందని కవుల పద్యాలు, వారి చరితలు ఇవ్వడంలో శ్రీ వెంకటరమణ ప్రసాద్ తూకంరాళ్ళు చెప్పుకోతగ్గది.
మంచి పద్యాలను ఎంచి ఇవ్వడంలో అమళ్ళదినె్న కున్న కవితా హృదయానికి పుట్టపర్తివారి పెనుగొండ లక్ష్మిలో నుండి ఇచ్చిన
‘‘ఉలి చేరాలకు చక్కిలింత లిడి, ఆయుష్ప్రాణముల్వోయు శి/
ల్పుల మాధుర్య కళాప్రపంచముల యంబునె్జందె, పాతాళమున్/
గలసెన్ పూర్వ కవిత్వ వాసనలు, నుగ్గైపోయెనాంధ్రావనీ/
తల మంబా/ ఇకలేన, ఆంధ్రులకు రక్తంబందు మాహాత్మ్యముల్/
- అనే పద్యమే సాక్ష్యం.
తెలుగు సాహిత్యంలో విమర్శకునిగానే ప్రసిద్ధిపొందిన ఆర్.ఎస్.సుదర్శనం ఒక భావుకతగల కవిగా ఎంత గొప్పవాడో ఈ పుస్తకం విప్పి చెబుతుంది. ఇటువంటి సాహిత్యవసరాలను కనిపెట్టి రచనా భద్రపేటికలో భద్రపరచడం వంటివి ఈ గ్రంథంలో చాలా దృశ్యమానమవుతాయి.
అనంతపురం జిల్లాలో పుట్టినవారినే కాక, నివసించిన వారిని కూడా గ్రహించడంవల్ల ఈ మండల పద్య జ్యోతిర్మండల కాంతులు విస్తరిల్లాయి
ఆ పాలపుంతలో గాడేపల్లి కుక్కుటేశ్వరరావు ఒకరు ఆయన చేసిన సుకవిస్తుతి శాశ్వత కీర్తిదాయకం.
‘‘నన్నయభట్టు లేకున్నచో రాజ రా/జనరేంద్రుకీర్తి కృష్ణార్పణమ్ము/
తిక్కయజ్వయెలేక తెనుగున మనుమసి/ స్ధినృపాలు పేరుసోదెకును రాదు/
శ్రీనాథసుకవి లేడేని వీరారెడ్డి/ అవచితిప్పయ్య విప్సన్నసున్న/
అలసానివారు లేరా కృష్ణరాయని/ ప్రతిభకు కవిలెదస్తమ్రులె దిక్కు/
చచ్చి దుమ్మైన నృపతుల చావనీక/ దుమ్ముపైనిన్ని అమృత బిందు
వులు చినికి/ తిరిగి బ్రతికించి జగతి సుస్థిరులజేసె/ సుకవియను
మేటి ఐంద్రజాలికుడొకండు’’
- ఈ పద్యాన్ని ఇచ్చి ‘ఆంధ్ర కవిపుంగవుల గుంపులో ఈ ఒక్క పద్యం చాలు కవిగారిని గుర్తుపట్టి నమస్కరించడానికి అన్నారు.
‘‘క్షామములెన్ని వచ్చిన రసజ్ఞత మాత్రము చావలేదు జ్ఞా/
నామృత వృష్టికిన్ కొరత నంద దనంత పురంబు చూడుడీ’’
ఈ వాక్యాల్ని శాశ్వతంగా సార్థకం చేశారు ఈ గ్రంథం ద్వారా.
ఈ గ్రంథం అనంతపద్య జ్యోతిర్మండలమే. వెలుగులు అఖండమే.

- సన్నిధానం నరసింహశర్మ