Others

హక్కుల ఉల్లం‘ఘనులే’ వాటికై ఇల్లెక్కారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయన్మార్ మిలటరీ నుంచి 75 మంది బాల సైనికులను ఐక్యరాజ్యసమితి విముక్తి చేసిందని ఓ వార్త ఇటీవల వెలుగు చూసింది. ‘సమితి’లోని మానవ హక్కుల అధికారుల చొరవతో ఈ విడుదల జరిగింది. సైన్యంలో బాలల నియామకం దారుణమని నాగరిక సమాజం భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష తీవ్రవాద గ్రూపుల్లో బాలలను సైనిక కార్యకలాపాల్లోకి తీసుకుంటున్న వైనాన్ని తరచూ ఐరాస ఖండిస్తూనే ఉంది. అయినా ఎక్కడా ఆగడం లేదు. నిరంతరం బాలబాలికలను సైనిక కార్యక్రమాల్లో నిస్సిగ్గుగా ఉపయోగిస్తూనే ఉన్నారు. భారత్ విషయానికొస్తే మావోయిస్టులు పెద్దసంఖ్యలో బాలలను సైనిక కార్యక్రమాల్లో పనులు చేయిస్తున్నారు, ఆయుధ శిక్షణ ఇస్తున్నారు. దశాబ్దాలుగా ఇది కొనసాగుతున్నా మానవ హక్కుల కోసం ఆందోళనలు చేసే మావోయిస్టులు, వారి అనుబంధ హక్కుల సంఘాలు, రచయిల సంఘాలు ఈ చర్యను పట్టించుకోవడం లేదు.
ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరిగిందన్న అభియోగంపై ఇటీవల కొందరు పౌర హక్కుల సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో అనేక సంస్థలు, సంఘాలు కల్లోలం సృష్టించాయి. సభలు, సమావేశాలు నిర్వహించి, ఇంటర్వ్యూలు ఇచ్చి మేధావుల, హక్కుల సంఘాల నేతల హక్కులను ప్రభుత్వం హరిస్తూ అక్రమంగా అరెస్టులు చేస్తోందని చిన్నపాటి సునామీని సృష్టించాయి. మావోయిస్టులు బాలల హక్కులను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నా పల్లెత్తు మాట అనకుండా ‘హక్కుల నేతలు’ వెనకేసుకొస్తున్నారు. వారికి మద్దతు పలుకుతున్నారు. తమదాకా వస్తే ఒక న్యాయం, ఆదివాసీ బాలల విషయానికొస్తే మరో న్యాయం.. ఇదెలా సమర్ధనీయం?
ఐరాసతో పాటు అనేక అంతర్జాతీయ హక్కుల పరిరక్షణ సంస్థలు బాలల హక్కులను కాపాడాలని ఎప్పటికప్పుడు పిలుపునిస్తూ వివిధ వామపక్ష తీవ్రవాద సంస్థల్లో, పార్టీల్లో పనిచేస్తున్న బాలలకు విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. పత్రికలు, మీడియా ద్వారా అవగాహనను, చైతన్యాన్ని కల్పిస్తున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులన్న సంగతి మిగతావారికన్నా విపులంగా తెలిసినప్పటికీ పౌర హక్కుల సంఘాల నాయకులు గాని, ప్రస్తుతం ‘గృహ నిర్బంధం’లో ఉన్న ‘మేధావులు’గాని ఎప్పుడూ మావోల ‘చెర’లోని బాలల గూర్చి, బాల గెరిల్లాల గూర్చి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇది పూర్తిగా ద్వంద్వ విధానం. వారు చెప్పే మాటలకు, చేతలకు మధ్య వ్యత్యాసాన్ని ఇది వివరిస్తున్నది. కొంతకాలం క్రితం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ అడవుల్లోని మలాజ్‌ఖండ్ ప్రాంతంలో మావోయిస్టులు బాలల సైనిక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి అపహరించి తెచ్చిన బాలలకు భారీఎత్తున శిక్షణ ఇచ్చారు. మానవ హక్కులు మావోలకు, వారి సానుభూతిపరులకు మాత్రమే ఉంటాయా? అశేష ప్రజానీకానికి, పిల్లలకు ఉండవా? వారి గూర్చి ఎప్పుడూ మాట్లాడని మేధావులు, హక్కుల నాయకులు, కవులు,కళాకారులు- తమవారు అరెస్టు అయితేనే రాజ్యాంగంలోని కీలకమైన సెక్షన్లు, ప్రాథమిక హక్కులు పొంగుకొస్తాయి. ఇది హర్షించదగ్గ అంశమేనా?
దండకారణ్యంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పి.ఎల్.జి.ఎ)లో, దాని అనుబంధ సంఘాలలో ఎందరో మైనర్లు ‘ఆయుధ భాష’ మాట్లాడుతున్నారు. వారికి అక్షరాలు, అంకెలు గూర్చిన విద్యనుగాక గెరిల్లా యుద్ధతంత్ర పాఠాలు చెబుతున్నారు. వారిలో దేశ వ్యతిరేక ద్వేషం నింపుతున్నారు. విషం కక్కేలా చేస్తున్నారు. చేతిలో ఎ.కె.47 ఆయుధాలు పెట్టి, యూనిఫాం ధరింపజేసి పది, పనె్నండేళ్ళ పిల్లలకు ఆయుధ భాష నేర్పిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో పహాడ్‌సింగ్ అనే కరడుగట్టిన మావోయిస్టు నాయకుడు దళ కమాండర్ ఆధ్వర్యంలో బాలల బతుకులను ఛిద్రం చేసిన ఆనవాళ్లు వెలుగుచూశాయి. అనేక పాఠశాలల యూనిఫాం దుస్తులు ఆ క్యాంపుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటా ఎంతోమంది బాలలను మావోలు బలవంతంగా రిక్రూట్ చేసుకుంటున్నారు. బాలల తల్లిదండ్రులు ప్రతిఘటిస్తే వారిని తుపాకులతో బెదిరించిన సంఘటనలు కోకొల్లలు. సర్కారీ బడుల నుంచి బాలలను బలవంతంగా తమ క్యాంపులకు తరలించిన సందర్భాలున్నాయి. బాలల హక్కుల పట్ల మావోలకు, మానవ హక్కుల సంఘాల నేతలకు గల ‘గౌరవం’ ఇది.
తమ హక్కులకు భంగం కలుగుతోందని సుప్రీం కోర్టుకు ఎక్కేవారు తమ నాయకుల (మావోల) ఆధ్వర్యంలో జరుగుతున్న బాలల హక్కుల ఉల్లంఘన గూర్చి ఒక్క పత్రికా ప్రకటనైనా ఇచ్చారా? ఈ ద్వంద్వ నీతివల్ల వారి నిజాయితీ ఎలాంటిదో తేటతెల్లమవుతోంది. మాటల గారడీ, పదాల నైపుణ్యంతో బోల్తాకొట్టిస్తూ తమకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకునే విద్యాధికులు, మేధావులు, అధ్యయన వేత్తలు, హక్కుల నాయకులు తమ పెరట్లో జరుగుతున్న దారుణాలను కూడా ఎండగట్టాలి కదా?
హక్కుల పరిరక్షణ, జీవించే హక్కు గూర్చి మాట్లాడేవారు- మావోల చేతుల్లో అన్యాయంగా మరణిస్తున్న ఆదివాసీల, అమాయకుల, జవాన్ల ‘జీవించే హక్కు’ గురించి ఆలోచన చేయాలి కదా? మావోయిస్టు సిద్ధాంతాలను సమర్ధించేవారే మానవులా? మిగతావారు కాదా?.. హక్కుల నేతలకు ఇతరులెవరూ మానవుల్లా కనిపించడం లేదు. ఇంత వివక్షతో వ్యవహారాలు నడిపే ‘పెద్ద మనుషుల’ గొంతులు ప్రపంచానికి, కోర్టులకు వినిపించేలా ‘అరిచే’ ముందు తమవారి చేతిలో ‘బందీ’గా ఉన్నవారి గూర్చి అధ్యయనం చేయాలి కదా? ‘జల్, జంగల్, జమీన్’ లాంటి అందమైన పదబంధాలతో నినాదాలు రూపొందించి వాటి చుట్టూ ఉద్యమాలు నిర్మిస్తూ దేశంలో కల్లోలం సృష్టిస్తూ ఆదివాసుల హక్కులను హరిస్తూ, వారి ఆవాసాలను ఆయుధాలతో కలుషితం చేస్తూ, ఆయుధ శిక్షణ పేరిట కాలుష్యానికి పాల్పడుతూ ఉంటే పల్లెత్తి ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం ‘మర్యాద’నేనా?
బాలలైతే కొరియర్లుగా, శత్రువుల నుంచి రక్షణగా పనికొస్తారన్న ఉద్దేశంతో, ఏ పని చెబితే ఆ పని ఎదురు ప్రశ్నలు వేయకుండా నిర్వహిస్తారన్న ‘దుర్బుద్ధి’తో పిల్లలను ‘రెడ్ ఆర్మీ’లోకి చేర్చుకోవడం దారుణం కాదా? వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. మావోయిస్టు నాయకులను కాపాడే మానవ బాంబులుగానూ ఉపయోగిస్తున్నారు. బీహార్, ఝార్ఖండ్‌లలోనూ ఇలాంటి క్యాంపులున్నాయి. ఐక్యరాజ్యసమితి లాంటి అధికారిక సంస్థలు దీన్ని నిరసిస్తున్నా, మానవ నాగరికత, ఇంగితం సైతం బాలల చేత ఆయుధాలను ఉపయోగింపచేయరాదని చెబుతున్నప్పటికీ ఆ మర్యాదలను, మంచిని పట్టించుకోకుండా, నియమాలను బేఖాతరుచేస్తూ తమ సైన్యం సంఖ్య ఎలా పెరుగుతుందా?అన్న ‘్ధ్యస’తో పనిచేస్తే ప్రపంచం మావోయిస్టులకు నీరాజనాలు పలుకుతుందా?
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువమంది బాలలు, మైనర్లు మావోయిస్టు పార్టీలోనే ఉన్నారని తేలింది. ఇంత పెద్దఎత్తున హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ పైకి తమ హక్కులకు భంగం కలుగుతోందని గొంతు చించుకోవడంలో ఏమైనా అర్థం ఉందా? ప్రముఖ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఆచార్యులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు నిశ్శబ్దంగా ఉండటంవల్ల వారి వ్యక్తిత్వ సమగ్రతపై ప్రశ్నార్థకం నిలుస్తోంది. చిన్నచిన్న విషయాలనే పెద్ద సమస్యలుగా చిత్రించేవారు బాలల హక్కుల ఉల్లంఘనకు తమ ముక్కు కిందనే మావోయిస్టులు పాల్పడుతూ ఉంటే- అసలు అలాంటిదేమీ తమ దృష్టికి రాలేదన్నంత అమాయకంగా ప్రవర్తించడం వారికే చెల్లుతోంది. అరుంధతీ రాయ్, గౌతమ్ నవలఖా లాంటి మేధావులు దండకారణ్యంలోని గెరిల్లాల కార్యక్రమాలను పరిశీలించి, బాల గెరిల్లాలతో ఫొటోలు దిగి వారి ధైర్యానికి మూర్చనలు పోయి, ‘లాల్ సలామ్’ పలికారే తప్ప బాలలు యుద్ధశిక్షణా కేంద్రంలో కాదు పాఠశాలలో ఉండాలని చెప్పిన పాపాన పోలేదు. ఢిల్లీకి చెందిన అనేకమంది ఆచార్యులు, మావోల మద్దతుదారులు ఛత్తీస్‌గఢ్‌లోని ‘కిల్లింగ్ ఫీల్డ్స్’ని దర్శించి అక్కడి ప్రజలను, బాలబాలికలను మావోలకు సహకరించాలని చెబుతూ ఉన్నారు. ఇది పరమ పవిత్రమైన కార్యంగా వారికి ‘నూరి’పోస్తున్నారు. గంభీరమైన ఉపన్యాసాలు చేస్తున్నారు. కవితలు చదువుతున్నారు. దీంతో తమ ‘జన్మ’ ధన్యమవుతోందన్న భావనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివాసీల హక్కుల హననం, వారి బాలల హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతున్నదో పరిశీలించడం లేదు. అలాంటివి తమ దృష్టికి వచ్చినా వాటిని తొక్కిపెట్టి వారి వీరత్వం ముందు అవి అల్పమైన అంశాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇదీ వారి హక్కుల చైతన్యం.. మేధ.. ప్రతభ!
ఈ రకమైన మానసిక స్థితిలో ‘అర్బన్ నక్సల్స్’ భూమ్యాకాశాలు దద్దరిల్లేలా ప్రచారం చేస్తూ ప్రభుత్వం తమనే ‘గృహనిర్బంధం’లో పెడుతుందా? అని ‘అసహనం’ వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా మావోయిస్టుల చేతిలో ఆదివాసీలు, వారి పిల్లలు ‘బందీలు’గా, తుపాకుల భయంతో బిక్కుబిక్కుమని బతుకు వెళ్ళదీస్తున్న ‘దృశ్యం’ వారి దృష్టికి రాకపోడం దారుణం గాక ఏమవుతుంది?
మానవ హక్కులను బేఖాతరు చేసేవారే హక్కుల కోసం ఇల్లెక్కి రచ్చరచ్చ చేసేవారు మన మధ్యనే కనిపిస్తున్నారు. వారంతా ‘గౌరవనీయ’ వృత్తుల్లో కొనసాగుతూ ద్వంద్వనీతికి పాల్పడటం గమనార్హం! అలాంటి వారిని ఎలా గౌరవించాలి?

-వుప్పల నరసింహం 99857 81799