Others

ఆస్తీకోపాఖ్యానము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం జరత్కారుడు అనే తపస్వి అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఆహార నియమాలను పాటిస్తూ తీవ్రమైన తపస్సు చేస్తూ, తీర్థయాత్రలను చేస్తూ ఉండేవాడు. అలా అతను దేశం అంతా తిరిగాడు. వ్రతాలను ఆచరిస్తూ, లౌకిక సుఖాలను త్యజించి గాలినే ఆహారంగా స్వీకరించి దేశాటన చేశాడు. ఆ విధంగా తిరుగుతూ ఉన్న జరత్కారుడు ఒక గుంటలో ఉన్న ఒక పెద్ద వృక్షం పై నించి తలక్రిందులుగా వ్రేలాడుతున్న తన తాత ముత్తాతలను చూచాడు.
ఆ వృక్షానికి ఒకే వేరు మిగిలి ఉంది. తక్కిన వేళ్లను ఒక ఎలుక కొరికి వేసింది. ఆ పితరులు కృశించి పోయి ఉన్నారు. వారు ఆ క్రింద గుంటలో ఎప్పుడైనా పడిపోవచ్చును.
వారు ఎవరో తెలియని జరత్కారుడు వారి దీనస్థితిని చూసి కలత చెంది వారిని ఇలా ప్రశ్నించాడు -
‘‘మీరు ఎవరు? ఎందుకు ఇలా తలక్రిందులుగా వ్రేలాడుతున్నారు? ఈ ఒక్క వేరును కూడా ఎలుక కొరికితే మీరు ఈ గుంటలోకి పడిపోతారు కదా! ఇలాంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా దుఃఖం కలుగుతున్నది. నేను మిమ్మల్ని ఎలా సంతోష పెట్టగలను? నా తపస్సులో కొంతభాగం మీకు ధారపోసి మీ కష్టాన్ని పోగొట్టనా? కనుక నేను మీకు ఏ విధంగా సహాయపడాలో దయచేసి చెప్పండి’’.
అతని మాటలను ఆ పితరులు విని ఇలా సమాధానం చెప్పారు. - ‘‘నాయనా మేము యాయావర వంశము వారము. ఒక్కో గ్రామంలో ఒక్కరోజు మాత్రమే ఉండి ఇంకొక గ్రామానికి వెళ్తాము. కఠినమైన వ్రతాలను ఆచరిస్తూ తిరుగుతూ ఉంటాము. అటువంటి మాకు మా సంతానం నశిస్తూ ఉండడం వలన ఉత్తమ గతులను పొందలేకపోతున్నాము. అథోగతికి పోతున్నాము. మా వంశంలో జరత్కారుడు అనే అభాగ్యుడు పుట్టాడు. అతను కఠిన తపస్సుతో మోక్షాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి సంతానంపైన ఇచ్ఛ లేకపోవడం చేత ఇంతవరకు వివాహం చేసుకోలేదు. అందువల్ల మా వంశం వృద్ధి చెందడం లేదు. నశిస్తున్నది. ఈ కారణంగా ఈ గుంటలో పడి ఇలా వ్రేలాడుతున్నాము. జరత్కారునికి సంతానం లేకపోతే మేమంతా ఖచ్చితంగా నరకానికి పోతాము. అనాథులుగా మిగులుతాము. నీవు ఎవరవు? మా స్థితిని చూసి ఎందుకు విచారిస్తున్నావు? పైగా నీవు వృద్ధుడవు, బ్రహ్మచారివి. ఈ వృక్షానికి ఒకే ఒక్క వేరు మిగిలింది. అంటే మా వంశంలో ఒకే ఒక్కడు మిగిలాడు. మా దురదృష్టం వలన అతను కూడా వివాహం చేసుకోలేదు. బ్రహ్మచారిగా మిగిలాడు. అందువలన మేము ఇలా గుంటలో పడి వ్రేలాడుతున్నాము. అతనితో ఈ విధంగా చెప్పు ‘మీ పితరులు అనాథుల్లాగా చెట్టుకు వేలాడుతున్నారు. వారిని సనాథులుగా చేయాలంటే నీవు వివాహం చేసుకొని పుత్రులను పొందాలి. మా వంశంలో మిగిలిన ఒకే ఒక్క వేరు నీవే. దాన్ని కూడా కాలుడు సగం కొరికేశాడు. ఆ ఎలుక ఎవరో కాదు, కాలుడే. నీవు మూర్ఖంగా వివాహం చేసుకోక బ్రహ్మచారిగా మిగిలిపోతే ఆ ఒక్కవేరు కూడా తెగిపోతుంది. మేము ఈ గుంటలో పడిపతే కాలుడు మమ్మల్ని నరకానికి తీసుకుపోతాడు. తపస్సు కాని యజ్ఞం కాని ఏ ఇతర సాధనం కాని సంతానంతో సమానం కావు.’’
వారి పలుకులు విన్న జరత్కారుడు ‘‘మహానుభావులారా? మీరంతా పితరులు అని తెలుసుకున్నాను. నేనే ఆ జరత్కారుడను. ఇప్పుడు నేను ఏమి చేయాలో నాకు చెప్పండి’’ అని అన్నాడు. వారు అతన్ని వివాహం చేసుకొని సంతనాన్ని పొందుమన్నారు. దానివలన తాము ఉత్తమగతులు పొందెదమని పలికారు. పుత్రులు ఉన్నవారు పొందే లోకాలను అపుత్రులు ఎంత తపస్సు చేసినా పొందలేరు అని చెప్పి మరల ఇలా అన్నారు. ‘‘కనుక నీవు వివాహం చేసుకొని సంతానం పొంది, మమ్ము ఊర్ధ్వలోకాలకు పంపించు. ఇదే నీవు మాకోసం చేయవలసిన సత్కర్మ’’.
అప్పుడు జరత్కారుడు వారితో ఇలా అన్నాడు. ‘‘పితరులారా! నాకు ఐహిక భోగాలపై ఏ కోరికా లేదు. కాని మీ కోసం తప్పక వివాహం చేసుకుంటాను. ఒక నిబంధనకు లోబడి వివాహం చేసుకుంటాను. నా పేరే గల కన్యక దొరికితే తప్పక భిక్షగా స్వీకరిస్తాను. కాని దరిద్రుడు వృద్ధుడు అయిన నాకు ఎవడు కన్యనిస్తారు? అలాంటి కన్య దొరక్కపోతే చేసుకోను. అలా లభించే భార్య యందు జన్మించే కుమారుడు మిమ్మల్ని తప్పక ఉద్ధరిస్తాడు. కనుక మీరు ప్రశాంతంగా ఉండండి’’.
జరత్కారుడు అటువంటి కన్య కోసం ఎన్నో దేశాలు తిరిగాడు. కాని అతనికి కావలసిన కన్య దొరకలేదు. అప్పుడు అతను అరణ్యానికి పోయి తన పితరులను ఒకసారి స్మరించుకొని, కళ్లు మూసుకొని తన పేరే గల కన్య వివాహార్థం లభించేటట్లు చేయమని ప్రార్థించాడు.
అదే సమయంలో నాగరాజైన వాసుకి జరత్కారువు అనే పేరు గల తన చెల్లెలితో అక్కడికి వచ్చి అతనితో ఇలా అన్నాడు ‘‘మహానుభావా! ఈ నా చెల్లెలి పేరు కూడా జరత్కారువే. కనుక ఆమెను స్వీకరించు’’. జరత్కారుడు వాసుకితో ఇలా అన్నాడు ‘‘ఓ నాగరాజా! ఈమె పోషణ భారాన్ని నేను వహించను. ఎందుకంటే అది నా నియమం. ఇంకా ఆమె ఎన్నడు నాకు ఇష్టం లేని పని చేయరాదు. అలా చేస్తే నేను ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోతాను.’’
నాగరాజు అతనితో చెల్లెలి పోషణ భారాన్ని తానే వహిస్తానని, అలాగే తన చెల్లెలు జరత్కారుని మాట జవదాటదని హామి ఇచ్చాడు. అలా మాట తీసుకొని జరత్కారుడు వారితో కలసి వాసుకి యొక్క భవనానికి వెళ్లి శాస్త్రప్రకారం ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను తన ఇంటికి తీసుకొని పోయి ఆమెతో నివసించసాడు. జరత్కారువు కూడా భర్త వివాహానికి పూర్వం పెట్టిన షరతులను గుర్తుంచుకొని దానికి అనుగుణంగా పతిసేవ చేస్తున్నది. కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. అగ్నితో సమానమైన తేజస్సు కల శిశువు ఆమె గర్భంలో పెరుగుతున్నాడు.
(ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి