AADIVAVRAM - Others

‘శూన్యం’లో పరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది... ఓ విహంగమో, విమానమో
చేసిన విన్యాసం కాదు...
నేలపైన కాదు, నింగిపైన కాదు...
శూన్యంలో తేలియాడుతూ
‘పరుగుల వీరుడు’ చేసిన మాయాజాలం ఇది...

‘జమైకా చిరుత’గా జగమెరిగిన ‘స్టార్ స్ప్రింటర్’ ఉసేన్ బోల్ట్ పరుగులు తీయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. అయితే- ఈసారి ఆయన పరుగు సాగింది నేలపైన కాదు, ఆకాశంలో అంతకన్నా కాదు..
‘సున్నా గురుత్వాకర్షణ’ (జీరో గ్రావిటీ) వాతావరణంలో పరుగులు తీసి ‘ఔరా’ అనిపించుకున్నాడు. కొద్దిరోజుల క్రితం ఫ్రాన్స్‌లో ‘ఎయిర్‌బస్ ఏ-310’ విమానంలో బోల్ట్ ఈ సాహసం చేశాడు. ‘జీహెచ్ ముమ్మ్’ అనే ఓ షాంపైన్ (మద్యం) కంపెనీ ఆధ్వర్యంలో ‘జీరో గ్రావిటీ’ కోసం ఆ విమానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫ్రెంచ్ వ్యోమగామి జీన్ ఫ్రాంకోరుూస్, ‘నోవేస్పేస్’ సంస్థ సీఈఓ ఆక్టేవ్ డి గల్లెతో కలసి 32 ఏళ్ల బోల్ట్ పరుగులు తీశాడు. ‘జీరో గ్రావిటీ’లో సంచరించడం వ్యోమగాములకు మాత్రమే తెలిసిన విద్య. ఇందులో ఎలాంటి ప్రవేశం లేకున్నా ప్రత్యేక విమానంలో గాలిలో తేలియాడుతూ బోల్ట్ అటూ ఇటూ మెరుపు వేగంతో పరుగులు తీశాడు. ముగ్గురు పాల్గొన్న ఈ విన్యాసంలో ప్రథముడిగా నిలిచాడు.
పరుగు పందెంలో ఎనిమిది సార్లు ఒలింపిక్ బంగారు పతకాలను సాధించిన బోల్ట్ ఈసారి సరదాగా ‘జీరో గ్రావిటీ’ వాతావరణంలో కదలాడుతూ సరదాగా సందడి చేసినా- అది కూడా ఓ రికార్డుగా సంచలనం సృష్టించింది. శాస్ర్తియ పరిశోధనలకు ‘సున్నా గురుత్వాకర్షణ’ విమానాలను వాడుతుంటారు. కఠోర శిక్షణ తీసుకున్నవారు మాత్రమే ఈ తరహా విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ‘జీరో స్పేస్’ సాంకేతికత తెలిసిన ఇద్దరితో అదే వాతావరణంలో సరదాగా జరిగిన ‘రేస్’లో బోల్ట్ సత్తా చాటడం వ్యోమగాములను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. శరీరం ఒక్కసారి బరువును కోల్పోయినట్టు అనిపించినా బోల్ట్ ‘సున్నా గురుత్వాకర్షణ’లో పరుగెత్తేందుకు ఏ మాత్రం జంకలేదు. ఈ రేస్‌లో పాల్గొన్న మిగతా ఇద్దరు సుశిక్షితులు కావడంతో వారు ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు. ‘జీరో గ్రావిటీ’లో ప్రవేశించాక మొదట కాస్త ఇబ్బందిగా అనిపించినా, ధైరాన్ని కూడదీసుకుని పరుగు మొదలుపెట్టానని, ఆ తర్వాత ఒత్తిడి అదృశ్యమైందని బోల్ట్ తన అనుభవాన్ని ఉద్వేగంతో వివరించాడు. విమానంలో మూడు రౌండ్లు అటూ ఇటూ గాల్లో తేలుతూ, తూలుతూ పరుగు తీశాక- నిజంగా ఇదో గొప్ప అనుభూతి అనిపించినట్టు అతను తెలిపాడు. తనకు తొలి అనుభవమే అయినప్పటికీ, ఎలాంటి తొట్రుపాటు లేకుండా పరుగు పందెంలో మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టేశాడు. ఈ సాహసంతో నేలపైనే కాదు, గాలిలో కూడా తనతో ఎవరూ పరుగెత్తలేరని బోల్ట్ చాటి చెప్పాడు. అంతర్జాతీయ పోటీలకు గత ఏడాది విరమణ ప్రకటించినప్పటికీ, బోల్ట్ ప్రస్తుతం ఫుట్‌బాల్ క్రీడలో సాధన చేస్తున్నాడు. ఈ ఏడాది జూలైలో ఆస్ట్రేలియన్ సాకర్ క్లబ్‌లో చేరాక సరికొత్త క్రీడాజీవితాన్ని ప్రారంభించాడు. కాగా, ‘జీరో గ్రావిటీలో పరుగుపందెం’ వంటి సాహస కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ‘అంతరిక్ష పర్యాటకం’ పట్ల ఆదరణ పెరుగుతుందని ‘జీహెచ్ ముమ్మ్’ చెబుతోంది. తాము తయారు చేస్తున్న ‘షాంపైన్’ను ‘అంతరిక్ష సరిహద్దుల్లో’నూ ఆస్వాదించవచ్చని భరోసా ఇస్తూ ఆ సంస్థ వాణిజ్య ప్రచారం చేస్తోంది.

-ఎస్.ఎన్.ఉమామహేశ్వరి