Others

వృద్ధులకేం కావాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడూ సంసారాల్లోనూ, జీవితకాలలోనూ ఏదో ఒక సమస్య వున్నట్టే దేశానికీ ఏదో ఒక సమస్య వుంటూనే వుంటుంది. ఆ సమస్యని ఎలా అధిగమించాలి? అనే ఆరాటం, అందుకు తగ్గ పోరాటం జరుగుతూనే వుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సంభవించిన అనేక సమస్యలు, యుద్ధంలో చనిపోయినవారి కుటుంబాల స్థితిగతులు, వితంతువులు, పసివారు, ఆలనా పాలనా లేని కుటుంబాలు ఎన్నో!
వాళ్ల సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఇళ్లూ, బళ్లూ ఇలా అనేక సమస్యలని ఎదుర్కొన్నారు. సమగ్రమైన సత్ఫలితాలనే సాధించారు. ఆ ఆరోగ్య సాధనలో, చాలా మటుకు శిశువు మరణాలను, బాలారిష్టాలను, మహిళాభివృద్ధిని చాలామటుకు చక్కదిద్దారనే చెప్పొచ్చు.
ఆ సత్ఫలితాల ప్రభావంతో అనేక ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, మందులు సేవిస్తూ ఆరోగ్యాన్ని సరిదిద్దుకోగలిగాము. దాంతో అకాల మరణాలు, దీర్ఘవ్యాధులూ చాలాముటుకు సమసిపోయాయి. జీవితకాలం పెరిగింది. ప్రతి సగటు మనిషీ, ఎనభై, తొంభై ఏళ్లు హాయిగా జీవించగలుగుతున్నాడు. మారుతున్న కాల ప్రవాహంలో కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. విద్యావంతులైన ప్రతివారూ, ఉద్యోగరీత్యా, దేశపు సరిహద్దులు దాటి ఖండాంతరాలకు వెళ్లిపోతున్నారు. దాంతో వయస్సు మళ్లిన దంపతులకు, ఒంటరిగా వున్నవారికీ, కుటుంబ సభ్యులకు దూరం కావలసి వస్తున్నది. దానికితోడు, జనాభాని అరికట్టే భాగంలో న్యూక్లియర్ కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది.
అంతేకాదు, చదువులు, ఉద్యోగాలూ వల్ల, ఒక్కొక్కరు ఒక్కోచోట ఉండడం, తరచుగా కలుసుకోకపోవడంతో, బంధువులకూ, బంధుత్వాలకు దూరమవవలసి వస్తోంది. అభిమానాలు అంతరించిపోతున్నాయన్న దిగులు ప్రతివారీలోనూ నాటుకుపోతూన్నది. వృద్ధాప్యంలో పలకరించేవారు లేక, వృద్ధాశ్రమాల్లో కాలం గడుపుతూ జీవం లేని వాళ్లలా వుంటున్నారు చాలామంది. దానికితోడు పిల్లల్లోనూ ఒక రకమైన అపోహ పెరిగిపోయింది. అమ్మా నాన్నలకు వాళ్లకు సరిపోయేంత డబ్బు పంపించేస్తే వాళ్లు హాయిగానే ఉంటారన్న భావం పెరిగిపోయింది. తిండికీ, బట్టకీ లోటు లేకపోయినా, వారు ఆనందంగా వుంటున్నారా లేదా అని ఆలోచించేవారు కరువవుతున్నారు.
మనిషికి కావలసింది ప్రాథమికంగా కూడు, గుడ్డా, గూడూ కావచ్చు కానీ మనసుకది చాలదు. దానికింకేదో కావాలి? ఏమిటది? ‘నా..’ అని పలికే తనవారు, తన రక్తసంబంధీకులు, వారి ఆప్యాయతలు, ఆనందాలు. మనుమలు, మనవరాండ్రతో అచ్చట్లూ ముచ్చట్లూ, ఆటలూ, పాటలు. అవి పూర్తిగా దూరమైపోతున్నాయి. వృద్ధులలో ఆ తృప్తి కనబడక అసంతృప్తి, అభద్రతాభావం పెరిగిపోతోంది. పెరిగిన జీవితకాలం, పెరుగుతూన్న అసంతృప్తితో వారు రగిలిపోతున్నారు. వారికి కావలసినది ‘మా యిల్లు, మా పిల్లలు’ అనే సంతృప్తి. దాన్ని స్వంత మనుషులు తప్ప ఎవరూ తీర్చలేరు. అసలు పిల్లలు కూడా ఆలోచించాలి. అత్తమామలూ, తల్లిదండ్రులూ వాళ్ల మెడకి గుదిబండలు అనుకోకూడదు. ముదిమిలో వాళ్లు చెప్పే వారి జీవితానుభవాలు, కథలు, చిన్నపిల్లలమీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. వారి ప్రేమకోసం కలవరించే పిల్లలు, ఆ వృద్ధులు చెప్పే కథలతో ఎన్నో విషయాలు గ్రహిస్తారు.
వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తారు. వాళ్ల మనస్సులు విచ్చుకుంటాయి. మనసుల్లో తేనె ఊటలు ప్రవహిస్తాయి. ఉద్వేగాలు, ఉద్రేకాలూ, పగలూ, ప్రతీకారాలూ తగ్గుతాయి. బామ్మలు, అమ్మమ్మలూ, తాతయ్యల కబుర్లే వారికి దేవాలయాల్లో సంకీర్తనల్లా పనిచేస్తాయి. అమ్మ ఒడి, నాన్న చెప్పే మంచి చెడులూ ధైర్యాన్నిస్తాయి. అవి కోల్పోవడంవల్లే నేడు అవినీతి అభద్రతా అత్యాచారాలూ పెరిగిపోతున్నాయి. కన్నవారికీ, దేశానికీ కూడా కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి.
కుటుంబాలను దూరంగా పెట్టి, స్నేహితులకోసం పాకులాడే వ్యక్తులను చూస్తే నవ్వొస్తుంది, బాధ కలుగుతుంది. ఇది కేవలం వృద్ధుల సమస్యే కాదు, రేపటి పౌరుల, నేటి చిన్నారుల సమస్య కూడా! కలిసి వుంటే కలదు సుఖం- కొన్ని ఇబ్బందులు ఉండొచ్చుగాక, సర్దుకుపోయే మనస్తత్వం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఇంటికి క్షేమం, దేశానికి సౌభాగ్యం.
ఆలోచించండి...

--శారదా అశోకవర్థన్