AADIVAVRAM - Others

కానరాని పిల్లల విల్లంబు ధారణలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుగయుగాలుగా, తరతరాలుగా అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న క్షీరధార హైందవ సంస్కృతి. ఆ పాల వెల్లువలో పెల్లుబికిన మీగడ తరగలైన హైందవ సనాతన, ప్రాచీన సంప్రదాయాలు క్రమేపీ కనుమరుగవుతున్నాయి. పురాణేతిహాస, రుతుపరమైన, మత ప్రమేయ యుక్త, శీతోష్ణస్థితి, స్థానిక పరిస్థితుల సంబంధమైనవిగా పెక్కు సాంప్రదాయాలు అనాదిగా ఆచరించ బడుతున్నాయి. అప్రాచ్య, పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం కారణంగా హైందవ సనాతన ఆచారాలు ఒక్కొక్కటిగా అదృశ్యమవుతున్నాయి. అలాంటి వాటిల్లో ‘‘ఉపాధ్యాయ వారోత్సవ’’ సంప్రదాయం ముఖ్యమైనది. బడిపిల్లలు దసరా సెలవులలో విల్లంబులు ధరించి, గిలకలు పట్టి, ఇంటింటికీ తిరిగి ‘‘గురుదక్షిణ’’ కోరడమే ‘‘ఉపాధ్యాయ వారోత్సవ’’ కార్యక్రమం. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు విల్లంబులు ధరించి వెళ్ళడం నేపథ్యంగా తమ గురువును తోడ్కొని, విద్యార్థులు చేతుల్లో రంగు బాణాలు ధరించి, దసరా పద్యాలు పాడడం, తమతమ ఇల్లిల్లూ తిరిగి తమ ఆయుధాలకు నివేదన తెమ్మంటూ, పప్పు బెల్లాలిమ్మంటూ, తమను విద్యావంతులను చేస్తున్న గురువులకు కట్నకానులకలను ఇమ్మంటూ, అదే పాటగా, అదే ఆటగా గ్రామమంతా సందడితో ఎక్కడ కన్నా చిన్నారులే, ఎక్కడ విన్నా జయజయధ్వనాలే వినిపించేవి. పూర్వం విలువిద్య నేర్చుకునే పిల్లలు తాము నేర్చిన విద్యను దసరా నవరాత్రులలో ప్రదర్శించేవారు. అలనాటి ప్రదర్శనాచార క్రమం రానురాను తొమ్మిది రోజులలో గిలకలు చేతబట్టుకుని, తమ గురువులకు బహుమానాలు, తమకు పప్పు బెల్లాలూ సంపాదించే అలవాటు ఆచరణలోకి వచ్చినట్లు చెపుతారు. ఆ అలవాటు ఇప్పుడు వెనుకబాటు అయింది. ‘‘పరగనాశ్వియుజ శుక్ల పక్షమందు తెరగొప్ప దీవించ వస్తిమిట మేము, శ్రీరస్తు విజయోస్తు దీర్ఘాయురస్తు, ధన కనక వస్తు వాహన సిద్ధిరస్తు, బాలకుల దీవనలు బ్రహ్మదీవెనలు, భూమిలోపల లేని భోగములు కల్గి ధనధాన్యములు కల్గి అంటూ శుభాకాంక్షలు తెలపడం.... ఘనముగా కట్నములు గ్రక్కున ఇచ్చి, సెలవియ్యుడీ మాకు శీఘ్రముగాను, పట్టు పచ్చడమిచ్చి పదిమాడలిచ్చి, గట్టి శాలువలిచ్చి కడియంబుల్చి, అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు, కొబ్బర కురిడీలు కుండ బెల్లాలు అంటూ ఈయవలసిన వాటిని ఏకరువు పెడు తారు...ఏదయా మీదయా మామీద లేదా? ఇంత సేపుంచుట ఇది మీకు తగునా? దసరాకు వస్తిమని విసవిసలు పడక, రేపురా మాపురా మళ్ళి రమ్మనక, చేతిలో లేదనిక ఇవ్వలేమనక, ఇప్పుడే లేదనక అప్పివ్వరనక, ఇరుగుపొరుగువారు ఇస్తారు సుమ్మి, శీఘ్రముగ పంపుడీ శ్రీమంతులార అంటూ ఇవ్వడంలో జాప్యం చేయవద్దనీ, వాయిదాలు వేయవద్దనీ మృదువుగా మర్యాదగా వేడుకుంటారు...పలుమార్లు మిమ్మెపుడు అడుగంగ రాము, అల్లుండ్రవలె గాదు అలిగి మిమ్మడుగ, చెల్లెండ్ర వలెగాదు చెలగి మిమ్మడుగ, అల దొమ్మరులముగాము ఆడి మిమ్మడుగ, మంత్ర తంత్రముగాదు మాయచే నడుగ, బలవంతులముగాము బలముచే నడుగ, నిలువు జీతముగాదు నిలిచి మిమ్మడుగ అంటూ గడుసుగా చెపుతారు...పావలా బాడైతె పట్టేదిలేదు, అర్ధరూపాయయైతే అంటేది లేదు, ఒక్క రూపాయైతే ఒప్పేది లేదు, అయ్య వారికి చాలు ఐదు వరహాలనని, కనీస గురు దక్షిణను పేర్కొంటారు...అలా గురు దక్షిణను రాబట్టి జయ విజరుూభవ, దిగ్విజరుూభవ అంటూ బాలల దీవెనలు బ్రహ్మదీవెనలుగా’’ వర్ణిస్తూ భరతవాక్యం పలుకుతారు. ఎల్లపుడూ చదువులో నిమగ్నమవుతూండే పిల్లలు శరన్నవరాత్రులలో ఆటవిడుపుగా, గురుదక్షిణలు పొందే సంబరాల కార్యక్రమంగా ఆశ్వయుజ పాడ్యమి మొదలు విజయ దశిమిదాకా నాడు కనిపించిన పిల్లల విల్లు, అంబుల ధారణలు, వినిపించిన సాంప్రదాయ పద్యాలు నేడు ఆధునికత మాటున పూర్తిగా కనుమరుగైనాయి.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494