Others

గాన గంధర్వుడు- ఏయం రాజా ( వెండి వెలుగులు- 5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంధర్వ గానం ఏయం రాజా సొంతం. శ్రోతల వీనుల్లో నేటికీ ఆయన పాటలోని ప్రతిపదం ప్రతిధ్వనిస్తుంది. మైమరపిస్తూ మాధుర్యంతో పాడిన ఆ గాత్రం అమరత్వం పొందింది. మనల్ని ఆనంద డోలికల్లో ఊగిసలాడించిన గాయకుడు స్వర్గీయ ఏయం రాజా. ‘శిశిర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణి’ అన్న ఆర్యోక్తి ఆయనకు అక్షరాలా వర్తిస్తుంది. తన కమ్మని కంఠంతో, లలిత సంగీత గానంతో, సంగీత విద్వాంసులను, పామర శ్రోతల్ని ఏకకాలంలో మంత్రముగ్ధుల్ని చేసేది రాజా గానం.
‘సంసారం’ (1951) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రాజా, సుమారు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ భాషల్లో వేలాది పాటలు పాడి, రసజ్ఞుల హృదయాలను మధుర గాత్రంతో అలరింపచేశారు.
ఆయన ప్రతి పాటా శ్రోతలను ఉర్రూతలూగించింది. హిట్‌సాంగ్ అయ్యంది. ఆయన మధుర గాత్రం అందించిన చిత్రాలన్నీ ఘన విజయాలు అందుకున్నాయ. ‘మిస్సమ్మ’ (పాత) చిత్రానికి రాజా పాడిన ప్రతి పాట అత్యంత ప్రజాదరణ పొందింది. అందుకు గొంతులోని సౌకుమారత్వం, లాలిత్యం, మృదుత్వం, మార్దవం ఇవన్నీ కారణాలే. సెలయేటి హోరులా కాకుండా సరళరేఖలా సాగిపోయే ఆయన గానామృతధార శ్రోతలను ఆదమరిచేలా చేస్తుందనడంలో అతిశయోక్తిలేదు.
రాజా పాడిన ప్రతి పాట ఓ ఆణిముత్యమై ప్రత్యేకతను సంతరించుకుంది. శ్రోతలను అన్ని వేళల్లోను, అన్ని కాలాల్లోను, రసడోలికల్లో ఊగించిన రాజా కంఠం అనితరసాధ్యం. ‘పక్కింటి అమ్మాయి’ (రేలంగి, అంజలి) చిత్రంలో రాజా నటించి పాటలు పాడారు. నటనలోనూ ఆయనకు ప్రవేశం ఉందనడానికి ఇదొక నిదర్శనం. రాజా కేవలం గాయకుడు నటుడే కాదు. సంగీత దర్శకుడు కూడ. రాజా సంగీత దర్శకుడిగా పనిచేసిన చిత్రాలన్నింటిలోనూ నేటికీ ప్రేక్షకులు మరువలేని, మరుపురాని, మరువనీయని చిత్రం ‘పెళ్ళికానుక’ (పాత). ఆయన భార్య జిక్కి. ఆయనతో కలిసి పాటలు పాడారు. ‘పులకించని మది పులకించు’ పాట ఇందుకు ఉదాహరణ.
జీవితంలో యవ్వనం మూణ్ణాళ్ళ ముచ్చటైనా, ఆ యవ్వనంలో ఉండగా రాజా పాడిన పాటలు శాశ్వత స్థానం పొందాయి. ‘సిరిమల్లె సొగసు’ పాట (పుట్టినిల్లు- మెట్టినిల్లు) రాజా పాడిన చివరి పాట. తర్వాత తెలుగు చిత్రాల్లో పాడే అవకాశం రాజాకు రాలేదు అనటంకంటే నిర్మాతలు ఇవ్వలేదు అంటే బావుంటుందేమో!
రాజా పాడిన మనం మరువలేని పాటలు కొన్నింటిలో ‘మూగదైన ఏమిలే నగుమోమే చాలులే’ (అప్పుచేసి పప్పుకూడు), ‘బృందావన మది అందరిది’, ‘కావాలంటే ఇస్తాలే’ (మిస్సమ్మ), ‘చూడుమదే చెలియా’, ‘పాలించరా రంగా’ (విప్రనారాయణ), ‘రావోయి చందమామ’, ‘ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే’, ‘తెలుసుకొనవె యువత’, (మిస్సమ్మ), ‘చల్లనిరాజా ఓ చందమామ’ (ఇలవేల్పు), ‘సుందరాంగులను చూసిన వేళల’, ‘చేయిచేయి కలుపరాదె హాయిహాయిగా’ (అప్పుచేసి పప్పుకూడు), ‘వాడుక మరిచెదవేలా’, ‘ఆడేపాడే పసివాడ’ (పెళ్ళికానుక) ఉన్నాయి. ఏదేమైనా వినసొంపైన గాత్రం రాజాది.
1989 ఏప్రిల్ 8న తిరునల్వేలిలోని వల్లియూర్ స్టేషన్‌లో రైలు ప్రమాదంలో రాజా దుర్మరణం చెందారు. ఆయన గాత్ర మధురానుభూతుల్ని మనకు మిగిల్చి అమరుడయ్యాడు.

-డా.దేశిరాజు లక్ష్మీనరసింహారావు