Others

నేటి నట తరానికి స్ఫూర్తి...విశ్వనాథ శాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతతరం రంగస్థల పౌరాణిక నటులు 83ఏళ్ళ ధర్మపురి వాసి ‘‘నట కిరీటి’’ రొట్టె విశ్వనాథ శాస్ర్తీ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సంబంధిత 2017 ఏడాదికి కీర్తి పురస్కారానికి ఎంపికైనారు. సాంస్కృతిక వికాసం అంతగా లేని రోజుల్లో ...జన సామాన్యానికి, గ్రామీణ ప్రజానీకానికి జానపద కళారూపాలే ప్రధాన వినోద సాధనాలుగా ఉన్న కాలంలో, దృశ్యకావ్య పరంపరకు మెరుగులు దిద్ది, సాంప్రదాయ నాటకరంగానికి వెలుగు బాట చూపిన వైతాళికులు ధర్మపురి క్షేత్రానికి చెందిన రొట్టె విశ్వనాథ శాస్ర్తీ. రంగస్థల నటునిగా, ప్రయోక్తగా, దర్శకునిగా, రచయితగా, కవిగా, పౌరాణికునిగా, సాంఘిక సేవా తత్పరునిగా, దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు ఆంతరంగికునిగా, రాష్టప్రతితో కూడి, ముఖ్యమంత్రులు, శృంగేరీ పీఠాధీశ్వరులు, ఇతర ప్రముఖులచే సన్మానితులై లబ్దప్రతిష్ఠులైనారాయన.
పౌరాణికులు, తెలంగాణలో శిష్య పరంపరను కలిగి శ్రీనృసింహ పీఠ నిర్వాహకులైన రొట్టె చంద్రశేఖర్ శాస్ర్తీ, పరమ పావని యమునమ్మలకు తొలి సంతానంగా 1936 మార్చి 17న ధర్మపురిలో జన్మించారు విశ్వనాధుడు. తెలంగాణలో మెట్టమొదటిదై 80వసంతాలు పూర్తి చేసుకున్న ధర్మపురి లక్ష్మీ నరసింహ నాట్యమండలి వ్యవస్థాపకులలో ఒకరైన తండ్రి చంద్రశేఖర శాస్ర్తీ నుండి అనువంశిక కళాత్మకతను సంతరించుకుని, 14ఏట ముఖానికి రంగు పులుముకుని లవకుశ, భక్త ప్రహ్లాద, తులాభారం, చింతామణి, వీర కాపయ, వీర పాండ్య కట్టబొమ్మన ఒక్కటేమిటి, వందలాది నాటకాలలో శ్రీకృష్ణ, ధుర్యోదన, గయుడు, బిల్వమంగళుడు తదితర పాత్రలకు జీవం పోసారాయన. 1959లో శాస్ర్తీ నటనకు మంత్రముగ్ధులైన పి.వి.నరసింహారావు, శాస్ర్తీని ‘‘నటరత్న’’ బిరుదుతో సన్మానించారు. పరమ పూజ్యులు శృంగగిరి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామిచే ఉత్తమ పౌరాణికులుగా సన్మానం పొందారు. కుర్తాళం పీక్షాధిపతిచే ‘‘వైదికాగమాలంకార’’ బిరుదు నొందారు.
1995లో ఢిల్లీలో ఆగమశాస్త్రం భక్తి అంశంపై ప్రసంగించి శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీచే సన్మానితులైనారు. 1999 మార్చి 18న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రవీంద్ర భారతిలో సన్మానించారు. 1968లో దివాకర్ల వెంకటావధాని ‘‘అపర పీసపాటి’’ బిరుదాంచితుల గావించారు. ఈలపాట రఘురామయ్య, శాస్ర్తీచే పౌరాణిక పద్యాలను చదివించుకుని, సన్మానించారు. ఆంధ్ర నాటక అకాడమీ కార్యదర్శి ఎ.ఆర్.కృష్ణ, శాస్ర్తీ పద్య పఠనా నైపుణ్యాన్ని కొనియాడారు. 2007లో తెలుగు నాటక రంగ దినోత్సవ సందర్భంగా కరీంనగర్ కలెక్టర్‌చే సన్మానించ బడినారు. 1963లో ఆంధ్రప్రభ, అనంతరం సారస్వత జ్యోతి, జయంతి, గౌతమి, దేవాదాయ శాఖ వారి ఆరాధన పత్రికలకు పలు వ్యాసాలు రాసారు.
నాటి నిజామాబాద్ ఎంపీ రాంగోపాల్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్ళి, రాష్టప్రతి భవన్‌లో ఫక్రొద్దీన్ అలీ అహమ్మద్ చెంత, దేశ ప్రథమ పౌరుని కోరికపై, శ్రీకృష్ణ రాయబారంలోని పద్యాలను రాగ శ్రావ్యయుక్తంగా గానం చేసి, ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కృష్ణుడు రాయబారిగా చూపిన సామ దాన బేధ దండోపాయాలను వివరించగా, రాష్టప్రతి మంత్రముగ్ధులై, తమకు చేసిన సన్మానాన్ని, అభినందించిన తీరును ఆజన్మాంతం గుర్తుంచు కుంటామంటారు శాస్ర్తీ. గత ఏప్రిల్‌లో సహస్ర చంద్ర దర్శన (అశీతి) మహోత్సవాన్ని జరుపుకున్న వృద్ధ నటులు, బహుముఖ ప్రజ్ఞులు శాస్ర్తీకి తెలుగు యునివర్సిటీ పురస్కారం రావడం పట్ల అభిమానులు, శిష్యులు హర్షం వ్యక్త పరుస్తున్నారు.
విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఎస్.వీ.సత్యనారాయణ అధ్యక్షతన నిపుణుల కమిటీ శాస్ర్తీ సేవలను గుర్తించి, ఉత్తమ నటులుగా ఎంపిక చేయగా, త్వరలో పురస్కార ప్రదానం చేయనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య ప్రకటించారు.

-- సంగనభట్ల రామకిష్టయ్య