Others

కర్తవ్యం..... (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది ఆడియన్స్ దృష్టిలో సినిమా ఓ వినోదం. ఒకింత రొమాన్స్. ఒక ఐటెంసాంగ్. రెండు డ్యూయెట్లు. నాలుగు ఫైట్లు. కాని ‘కర్తవ్యం’ సినిమాలో ఇవేవీ ఉండవు. విదేశీ చిత్రంలాగ ఒక సంఘటన, అది జరగడానికి దారితీసిన పరిస్థితులు, తగిన పరిష్కారం మాత్రమే మనకు కనిపిస్తుంది. తమిళం నుంచి డబ్బింగ్ అయిన ‘కర్తవ్యం’లో నిరుపేద కూలీనాలీ ఉండే కుగ్రామంలో ఒక చిన్నపిల్ల బోరుబావిలో పడిపోతుంది. ఆ పిల్లను రక్షించడానికి ఒక కలెక్టర్ చేసే ప్రయత్నాలు, ఎదురయ్యే ఆటంకాలు, ప్రజాందోళన, ఆగ్రహావేశాలు, అధికారుల అలసత్వం, టీవీ చానల్స్ విన్యాసాలు, స్టూడియోలో హాయిగా కూచుని ఏమీ తెలియకుండానే చిన్నపిల్లను రక్షించలేని ప్రభుత్వంపై విమర్శలు, ఉన్నతాధికారి కలెక్టర్‌ని మందలిస్తూ రుసరుసలాడటం, ఆ ప్రాంత ఎమ్మెల్యే వీరంగం- ఇన్ని ఒత్తిళ్లమధ్య సంయమనం కోల్పోకుండా మృదువుగానే అయినా స్థిరంగా జవాబులు చెబుతూ చిన్నపిల్లను రక్షించడానికి కలెక్టర్ పడే తపన -అన్నీ హృదయాలను కదిలించే దృశ్యాలే కనిపిస్తాయి. ఏమాత్రం పట్టుసడలకుండా బిగువైన స్క్రీన్‌ప్లేతో చక్కగా తీసిన మంచి చిత్రం ‘కర్తవ్యం’. మేకప్‌లేకుండా అతి సహజంగా కనిపించే అంతమంది బీదా బిక్కీ జనంమధ్య మనకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి నయనతార! కలెక్టర్‌గా ఆమె సింపుల్‌గా కనిపిస్తూనే డిగ్నిఫైడ్‌గా కర్తవ్యం నెరవేర్చే అధికారిగా గొప్పగా నటించింది. తమిళంలో విజయవంతమైందో లేదోగానీ తెలుగు చిత్రాన్ని ఎవరూ చూడనే లేదు. చిత్రానికి థియేటర్లలో ఆదరణ లభించకపోవడంతో, విడుదలైన కొద్దిరోజులకే టీవీ చానెల్స్‌లో వచ్చేసింది. అలా సినిమా చూసి కదిలిపోయాను. మనోళ్లు ఇలాంటి చిత్రాలు తియ్యరు, తియ్యలేరు. అంతర్జాతీయస్థాయిలో ఉన్న ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి అవార్డులు రాకపోతే అవార్డు కమిటీనే నిందించాల్సి ఉంటుంది. సామాజిక దృక్పథం కలిగిన ఒక సంఘటన చుట్టూ అల్లుకున్న చిత్రాన్ని మానవత్వం ఉన్నవారు, మానవత్వాన్ని గౌరవించేవారు తప్పక చూడాలి. నయనతార కర్తవ్యం నాకు నచ్చిన చిత్రం.

-సుబ్బలక్ష్మి పట్నాయక్, కాకినాడ