Others

వెండి వెలుగులు..... మహాకవి శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20వ శతాబ్ద పూర్వార్ధంలో కన్ను తెరచి మూడు దశాబ్దాలపాటు సాహిత్య వ్యవసాయం సాగించి తెలుగు సారస్వత ప్రియులకు ప్రాతఃస్మరణీయులైన మేరుగిరి శిఖర సద్యనుడు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ ఆయన పూర్తి పేరుకు హ్రస్వాక్షరాలు. గంధర్వ లోకాల్లో ఊహల తూగుటుయ్యాలల్లో అప్సరసల నులివెచ్చని కౌగిళ్ళలో సొక్కిసోలిపోతున్న తెలుగు కవిత్వాన్ని నేలకుదించి, అభ్యుదయ పధాన నడిపించిన కవిశ్రేష్టుడు, కవి పుంగవుడు, కవి సార్వభౌముడు, కవులలో ఉత్తముడు, ఆధునిక సాహిత్య యుగకర్త శ్రీశ్రీ. 1910 జనవరి 2న విశాఖపట్నంలో జన్మించారు. ‘ప్రకృతిశాస్త్రం’ ప్రత్యేక పాఠ్యాంశంగా అభ్యసించారు. సంస్కృతం, ఆంధ్ర (తెలుగు), ఆంగ్లం, ఫ్రెంచి, తమిళం భాషాసాహిత్యాలను చదివారు. విశాఖపట్నంలో టీచరుగా, ఆంధ్రప్రభలో సబ్-ఎడిటరుగా, ‘ఆనందవాణి’ పత్రికలోను, ఆకాశవాణిలోను, భారతీయ సేవా వైద్య విభాగంలోను ఉద్యోగాలు చేశారు. 1930 ప్రాంతంలో శ్రీశ్రీ భావగీతాలు వ్రాశారు. ఆ గీతాలు ‘ప్రభవ’ అనే పుస్తక రూపాన వెలువడ్డాయి.
పతితులు, భ్రష్టులు, బాధాసర్పద్రష్టులు, పరిచ్యుతులు బహిష్కృతులు, తిరస్కృతుల కొరకు కలంపట్టిన శ్రీశ్రీ శ్రామిక లోకపు సౌభాగ్యానికి, కార్మికలోక కళ్యాణానికి కంకణం కట్టుకుని వ్రాసిన కవితలే, ‘మహాప్రస్థానం’గా అచ్చయ్యాయ. ఆయన కలం విచ్చుకత్తిలా విజృంభించి, కవిత ప్రభంజనంలా హోరెత్తి, పద్యాలు త్రాచుల్లాగా, రేచుక్కల్లాగా చెలరేగి, తెలుగు సాహిత్య సేవా వాహనిని విప్లవ పధాన నడిపాయి. ఉప్పెనలా ఉవ్వెత్తున లేచిన ఆయన కవిత్వ కెరటాల ధాటికి పాతరోజులు, పాత మర్యాదలు, పాత సంప్రదాయాలు, పాత పద్ధతులు, పాత విలువలు కవనరంగాన తుడిచిపెట్టుకుపోయాయి.
‘శ్రీశ్రీ కవిత్వాన్ని తూచటానికి తనవద్ద రాళ్ళులేవు’ అన్నారు గుడిపాటి వేంకటాచలం. మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటం శ్రీశ్రీకే చేతనౌ’ననీ అన్నారు. అప్పటికీ ఇప్పటికీ ‘మహాప్రస్థానమే’ అభ్యుదయ కవితకు మానిఫెస్టో. తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు చింతన శ్రీశ్రీతోనే ప్రారంభమైంది. అక్షర పరబ్రహ్మను సాక్షాత్కరించుకున్న మహాతపస్వి శ్రీశ్రీ. అక్షరాన్ని అణ్వస్త్రాయుధంగా మలిచిన సాహిత్య వైజ్ఞానికుడు, క్రొత్త క్రొంగొత్త పదాల సృష్టికర్త శ్రీశ్రీ. ‘ఖడ్గసృష్టి’, ‘మరోప్రస్థానం’ ఆయన వ్రాసిన (అ)ఖండ కావ్యాలు. ఆయన నాటకాలూ వ్రాశారు. శ్రీశ్రీ కలం నుండి జాలువారిన కవితలు, గేయాలులాగే ఆయన వ్రాసిన సినిమా మాటలు కూడ ఆయనను ప్రజాకవి, మహాకవిని చేశాయి. ఆయన రచనలు ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
శ్రీశ్రీ ఎక్కువగా ప్రజలు మాట్లాడుకునే వ్యవహారిక భాషలోనే రచనలు చేశారు. అలాగని గ్రాంధిక భాషను నిర్లక్ష్యం చేయలేదు. ఆ భాషలో తన పాండిత్యాన్ని ‘వాగ్దానం’లో శ్రీ సీతారామకల్యాణ హరికథా రచనలో చూపారు. ఆ రచన ఆ చిత్రంలో నవరస భరితంగా సాగి సన్నివేశాన్ని రక్తి కట్టించి, పామరుల్ని సైతం మెప్పించింది. ఈ పాట రచనకు ఆయనకున్న సంగీత పరిజ్ఞానమూ ఉపయోగపడింది.
శ్రీశ్రీ ఎక్కువగా విప్లవ గీతాలు వ్రాశారు. ఆయన తన భావాల్లో అభ్యుదయ వాదాన్ని, విప్లవ పంధాను చూపేవారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంకోసం వ్రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాట రచనకు ఉత్తమ గీత రచయితగా 1975లోనే జాతీయ అవార్డు వచ్చింది. శ్రీశ్రీ తన రచనల్లో నాస్తిక వాదానికి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చినా, ఆస్తిక వాదాన్నీ వీడలేదు. ఎన్నో పౌరాణిక చిత్రాలకు శ్రీశ్రీ మాటలు, పాటలు వ్రాశారు. ‘శ్రీరామభక్త హనుమాన్’ చిత్రానికి మాటలు వ్రాశారు. ఆస్తిక వాదంపై చాలా పాటలు వ్రాసి ఆస్తికులనే విస్మయపరిచారు. ‘వాగ్దానం’లోని శ్రీ సీతారామకల్యాణ హరికథ, ‘యమగోల’ చిత్రంలోని ‘సమరానికి నేడే ప్రారంభం’ అనే పాట, ‘నర్తనశాల’లోని ‘ఎవ్వరికోసం ఈ మందహాసం’ పాటలు ఇందుకు కొన్ని ఉదాహరణలు. అలాగే ‘కురుక్షేత్రం’ చిత్రంలోని టైటిల్ సాంగ్.

(మిగతా వచ్చే వారం)

-డా.దేశిరాజు లక్ష్మీనరసింహారావు