Others

గద్దర్ ‘యూ టర్న్’ రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలను జయప్రదం చేయాలని కోరుతూ పత్రికలకు గద్దర్ ఒక ప్రకటన జారీ చేశారు. భైంసా, కామారెడ్డి, హైదరాబాద్‌లలో రాహుల్ సభలను ప్రజలు విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిన్న మొన్నటివరకూ మావోయిస్టుల ‘వౌత్ పీస్’గా వ్యవహరించిన గద్దర్ ఇప్పుడు రాజకీయంగా ‘యూ టర్న్’ తీసుకున్నారు. దీనికి కారణం ‘పుత్ర వాత్సల్యం’. బంధాలకు- అనుబంధాలకు, మమకారానికి- వాత్సల్యాలకు దూరంగా ప్రజల ‘విముక్తి’కోసం సాయుధ పోరాటం చేయాలని పాటలు పాడి, నృత్యాలు చేసి యువకుల్ని ఉసిగొల్పిన గద్దర్ ఇప్పుడు ఇలా కొత్త అవతారం ఎత్తాడు. దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో రాజకీయాలు చేసి, తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక ప్రదర్శనలిచ్చి, ‘తెలంగాణ ప్రజాఫ్రంట్’ను ఏర్పాటుచేసి కాంగ్రెస్ పార్టీపైన, పాలకులపైన కత్తికట్టిన గద్దర్ పాటలకు, మాటలకు ఉత్తేజితులై ఎందరో అమరులయ్యారు. విప్లవ పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో కన్నుమూసిన అమరుల ఆత్మలు ఇప్పుడు తప్పక క్షోభిస్తాయి!
తన కొడుకు సూర్యకిరణ్‌కు కాంగ్రెస్ టిక్కెట్ తెచ్చుకునేందుకు గద్దర్ ఇంతగా దిగజారిపోవాలా? అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. ఏ నినాదాలు చేసి, ఏ పాటలు పాడి పౌరుషం తెచ్చుకుని వీరులు ప్రాణాలు అర్పిస్తే చివరికి మిగిలింది ఏమిటి? గద్దర్ యూ టర్న్ రాజకీయం. ఇది ఆహ్వానించదగ్గదా? ఆమోదించదగ్గదా? ఎందరెందరో ఆత్మ బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గద్దర్ వత్తాసుగా నిలవడం ఎంత దారుణం?
ఇటీవల భార్య విమల, కొడుకు సూర్యకిరణ్‌తో ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అతని తల్లి సోనియాను కలిసి తన కుమారుడికి టిక్కెట్ కోసం గద్దర్ పైరవీ చేశాడు. ఇదా గద్దర్ సంస్కారం? ఏ పార్టీనైతే పాతరేయాలని ఊగిపోతూ ఉద్యమించాడో, ఏ పార్టీ అయితే బలిదానాలకు కారణమైందో- ఆ పార్టీముందు మోకరిల్లడం ఎంత దిగజారుడుతనమో ఆయనకు తెలియకపోయినా ఇతరులకు స్పష్టంగా తెలుస్తోంది. బూర్జువా పార్టీలని ఇంతకాలం ఎద్దేవా చేస్తూ, ప్రజల్లో వాటి పట్ల ఏహ్యభావం పెంపొందించి అంతిమంగా అదే బూర్జువా పార్టీముందు సాష్టాంగ పడటం ఏ విలువలకీ ప్రస్థానం? అన్న ప్రశ్న తలెత్తుతుంది కదా? విప్లవ రాజకీయాలు నడిపేవారిలో ఎంతటి కుహనా విప్లవవాదులు ఉంటారో గద్దర్ నిరూపించాడు. విలువలకు పాతరేసి, కీర్తి కండూతి కోసం, నైతిక విలువలను సైతం దగ్ధం చేసి నిస్సిగ్గుగా రాహుల్ సభలను విజయవంతం చేయాలని కోరడం ఎంతటి దిగజారుడు తనమో ఇట్టే తెలుస్తోంది. ఇలాంటి ఊసరవెల్లి స్వభావం గల వ్యక్తి ప్రజాగాయకుడు ఎలా అవుతాడు? ‘ప్రజాయుద్ధనౌక’ ఎలా అవుతాడు? అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. పుత్రవాత్సల్యంతో ఒకప్పటి శత్రువుతో చేతులు కలిపిన వ్యక్తి ప్రజాసంక్షేమం కోరే ప్రజాగాయకుడెలా అవుతాడు? ఇది కోటి రూకల ప్రశ్న!
గతంలో జన నాట్యమండలిలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారానికి ఎవరైనా ఆహ్వానిస్తే- విప్లవ రాజకీయాలు బోధించి ఎన్నికల బహిష్కరణ నినాదం వినిపించిన గద్దర్ ఇప్పుడు లౌకిక పార్టీ కాంగ్రెస్‌ను గెలిపించాలని పాటలు, పద్యాలు పాడి ‘తుపాకీ రాముడి’ అవతారం ఎత్తితే ఏ వెలుగులకీ ప్రయాణం? అని ఎవరో ఒకరు ప్రశ్నిస్తారన్న వెరపుకూడా లేకుండా, మతిలేని రీతిలో మాట్లాడితే ఏమిటి ప్రయోజనం? పుత్రవాత్సల్యం మనిషిని ఇంత గుడ్డివానిగా మారుస్తుందా? పైగా ప్రతిపక్ష పార్టీలన్నీ తనను బతిమాలితే సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించడం చూస్తే- వయసు పైబడి చెబుతున్న మాటల్లానే ఉన్నాయి తప్ప స్పృహ ఉండి చేసిన ప్రకటనలా లేదు.
గద్దర్ గొప్ప ప్రజానాయకుడు. ఉత్తమ విలువలకు ప్రాణంపెట్టే వాడు, జీవితంలో ఎవరూ చేయలేనన్ని త్యాగాలు చేశాడని ప్రజలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తాడట! ఇది ఎంతటి హాస్యాస్పదంగా ఉందో ఆయనకు తెలియకపోయినా, ఆయన సమీప వ్యక్తులకైనా తెలిసుండాలి కదా? పుత్రవాత్సల్యంతో ‘యూ టర్న్’ తీసుకున్న స్వార్థపరుడిని ప్రతిపక్షాలు,ప్రజలు బతిమాలి- బామాలి... కోరితే ఎన్నికల గోదాలోకి దిగుతాడట!
మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడే బలవంతపు చందాల ద్వారా పాఠశాలను నిర్మించి తన సహచరుడు వరవరరావు తదితరుల ఆగ్రహానికి గురై ఆ పార్టీనుంచి బహిష్కరణకు గురైన గద్దర్ వ్యక్తిత్వంపై, క్రమశిక్షణపై, సమగ్రతపై పెద్ద ప్రశ్నార్థకమే నిలుస్తోంది. పాటలు, పద్యాలు పాడి- తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కార్పెట్ కిందకు ఊడ్చేసి గొప్ప త్యాగధనుడిలా పోజులు కొట్టినంతమాత్రాన గత చరిత్ర అంతా పుటం పెట్టిన బంగారంలా మెరిసిపోదు. గద్దర్ నిజమైన విప్లవకారుడు కాదని ఆయన పార్టీనే పేర్కొన్నది. విప్లవ రాజకీయాలకు గద్దర్‌ను పరిచయం చేసిన బి.నరసింగరావు సైతం కుహనా విప్లవకారుడే. ఆయన దారిలోనే ఆ ‘దొర’ల దారిలోనే ఇప్పుడు గద్దర్ రహదారి చేసుకుని ప్రయాణిస్తున్నాడు. ఇదా ప్రజాగాయకుడి, ప్రజానాయకుడి, ప్రజాకళాకారుడి ప్రాశస్త్యం?
ఒక తరాన్ని అంధకారంలోకి నెట్టి, సాయుధ పోరాటం వినా మరో మార్గం లేదని, ‘అన్నలు...కూనలు...బిడ్డలు...అడవితల్లి అందాలు, ఆయుధాలు..’ అంటూ పలవరించి చివరికి కాంగ్రెస్ అధిష్ఠానం అడుగులకు మడుగులొత్తే పాత్రలో ఇమిడిపోతే ఎలా? అంకితభావం, ప్రజల పట్ల గౌరవం, విముక్తి ఆలోచన గురివింద గింజ మాదిరేనని నిరూపించిన గద్దర్ ఎలా గౌరవనీయుడవుతాడు? ఆయన మాట-పాట-ఆట ఎలా ఆలకించయోగ్యమవుతాయి?
గతంలో చెప్పిన విషయాలనన్నింటినీ గ్రహణం పట్టేలాచేస్తూ ఇప్పుడు ఓట్ల విప్లవం తీసుకొస్తానని ఓ పుస్తకం పట్టుకుని గద్దర్ తిరుగుతున్నాడు. భారత రాజ్యాంగంపై ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నాడు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రజలకు సాయుధ పోరాటాన్ని ప్రబోధించి, ఓటును బహిష్కరించమని, పార్లమెంటు ఒక పందులదొడ్డి అని పరుషంగా మాట్లాడి- ఇప్పుడు ఆ పందుల దొడ్డిపై మనసు పారేసుకుంటూ అందులో ప్రవేశం కోసం ఓటు విప్లవం సృష్టిస్తాననడం ప్రగల్భాలు పలకడం తప్ప మరొకటి కాదు.
వర్తమానంలో తానొక అపర అంబేద్కర్ అవతారమన్న పద్ధతిలోనూ ఆయన పోజులిస్తున్నాడు. అంత ‘సీన్’ గద్దర్‌కు లేదని ఆయనను చిరకాలంగా పరిశీలిస్తున్న వారికి తెలుసు. తనకు దక్కిన కీర్తి, పేరుప్రతిష్టలు కాపాడుకుంటే చాలు. ఇంకా మతిలేని మాటలు చెబితే- ఫూలే, అంబేద్కర్ అడుగుజాడల్లో కాదుకదా, మరింతగా అవమానాలపాలవుతాడు. స్వార్థంతో దిగజారే వ్యక్తి, వైరుధ్యాల నడుమ జీవించే మనిషి మహనీయుడెలా అవుతాడు? స్వార్థం కోసం పది మందిని ఉపయోగించుకుంటూ ముందుకు కదిలితే కాలం సరైన ‘తీర్పు’ను ప్రకటించదా? ప్రపంచం ఇంకా ఆయన మాటల మాయలో స్పృహతప్పి ఉంటుందా? ఎన్నటికీ అలా జరగదు. ఆయన నిజ స్వరూపం బయటకొచ్చింది. ప్రజలు పరాకుగా ఉంటారనుకోవడం పొరపాటు.

-వుప్పల నరసింహం 99857 81799