డైలీ సీరియల్

వాతాపి, ఇల్వలులు - 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం మణిమతి అనే నగరంలో ఇల్వలుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతని తమ్ముడు వాతాపి. వారిద్దరూ ప్రహ్లాదుని గోత్రానికి చెందినవారు.
ఒకసారి ఇల్వలుడు ఒక తాపస బ్రాహ్మణుని తనకు ఇంద్రునితో సమానుడైన పుత్రుని అనుగ్రహించమని కోరాడు. కాని ఆ తాపసి అతని కోర్కెను మన్నించలేదు. దానితో ఆగ్రహించిన ఇల్వలుడు బ్రాహ్మణులను త్మ్ముని సహాయంతో నాశనం చేయసాగాడు. అతను తన మాయతో వాతాపిని మేకగా చేసి, దాన్ని చంపి మాంసం వండి బ్రాహ్మణునికి పెట్టేవాడు. తర్వాత ‘‘వాతాపీ బయటకు రా’’ అని పిలిచేవాడు. స్వేచ్ఛానుసారం రూపం ధరించగల శక్తి ఉన్న వాతాపి మేక మాంసం ఆరగించిన బ్రాహ్మణుని కడుపును చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇలా ఇల్వలుడు తన పగ సాధించేవాడు. చనిపోయన బ్రాహ్మణుని వండుకుని అన్నదమ్ములు ఆరగించేవారు.
ఆ సమయంలోనే మహర్షి అయన అగస్త్యుడు ఒక గోతిలో అధోముఖంగా వ్రేలాడే తన పితరులను చూశాడు. కారణం అడుగగా వారిలా సమాధానమిచ్చారు. ‘‘నీవు బ్రహ్మచారిగా ఉండి సంతానాన్ని పొందలేకపోవడం వలన మేమిలా వ్రేలాడుతున్నామొ. నీవు వివాహం చేసుకొని సంతానాన్ని పొందితే మాకు ఉత్తమగతులు లభిస్తాయ’.
అప్పుడు అగస్త్యుడు వారి కోరికను తీర్చెదనని మాట ఇచ్చెను. తగిన పుత్రులను ఇచ్చే యోగ్యత గల స్ర్తి కోసం అతడు వెతికాడు. కాని అటువంటి స్ర్తీ దొరుకలేదు. అప్పుడు అగస్త్యుడు ఒక్కొక్క ప్రాణియొక్క ఉత్తమ అవయవాన్ని ఒకచోట చేర్చి అతి సుందరమైన కన్యను తన తపశ్శక్తితో సృష్టి చేశాడు. అదే సమయంలో విదర్భరాజు సంతానం కోసం తపస్సు చేయగా అగస్త్యుడు ఈ సుందర కన్యను అతనికి సమర్పించాడు. రాజు ఆ కన్య గురించి అందరి పండితులకు చెప్పగా వారంతా వచ్చి ఆమెకు లోపాముద్ర అన్న పేరు పెట్టారు. లోపాముద్ర వందమంది పరిచారికలతో ఎంతో వైభవంగా పెరిగి యవ్వనవతి అయంది. అగస్త్యుని వల్ల భయం చేత ఎవ్వరూ ఆమెను వరించడానికి సాహసించలేదు. తండ్రి ఈమెను ఎవరికి ఇచ్చి వివాహం చేయాలి అని ఆలోచించసాగాడు.
ఆ సమయంలో ఆగస్త్యుడు అక్కడికి వచ్చి రాజుతో ఇలా అడిగాడు ‘‘సంతానం కోసం నాకు వివాహం మీద కోరిక కలిగింది. మీ కన్యకను వివాహం చేసుకుంటాను. నాకు లోపాముద్రను ఇవ్వండి’’.
ఋషి మాటలు విన్న రాజు చైతన్యం కోల్పోయాడు. ఏమీ చెప్పలేకపోయాడు. తిరస్కరిస్తే ఋషి ఎక్కడ శపిస్తాడో అని భయపడి భార్యవద్దకు పోయ ఇలా అడిగాడు ‘‘అగస్త్య మహర్షి గొప్ప తపశ్శాలి. కోపం వస్తే మనల్ని శాపాగ్నిలో భస్మం చేస్తాడు’’.
ఇలా భార్యతో చెప్పి బాధపడుతున్న తండ్రితో లోపాముద్ర ఇలా అన్నది ‘‘తండ్రీ! నాకోసం మీరు దుఃఖించవద్దు. నన్ను మహర్షికి ఇచ్చి వివాహం చేయండి. నాద్వారా మీకు రక్షణ దొరుకుతుంది’’. కుమార్తె మాటలతో తృప్తి చెంది రాజు ఆమెను మహర్షికిచ్చి కన్యాదానం చేశాడు.
వివాహం అవగానే లోపాముద్రని, ఆమె ధరించిన విలువైన వస్త్రాలను, ఆభరణాలను తీసివేసి తాపసులు ధరించే వస్త్రాల్ని ధరించమని ఆదేశించాడు. లోపాముద్ర భర్తకు అనుగుణంగా నారచీరలు, మృగ చర్మాలు ధరించి అతనితో సమానంగా వ్రతాచారాలు పాటించసాగింది. అగస్త్యుడు తిరిగి తపస్సులో నిమగ్నుడైనాడు. లోపాముద్ర తన పాతివ్రత్యంతో సేవలతో భక్తితో అతన్ని ప్రసన్నుని చేసుకోసాగింది. ఈ విధంగా వారి జీవితం కొంతకాలం సాగింది. ఒక రోజు రుతుస్నాత అయన భార్యని మహర్షి చూశాడు. ఆమె పట్ల ప్రసన్నుడై ఆమెతో సమాగమాన్ని కోరుకున్నాడు. అప్పుడు ఎంతో వినయంతో లోపాముద్ర ఇట్లు అన్నది. ‘‘స్వామీ! సంసారార్థం భర్త భార్యను చేరటం లోకాచారం కాని నేను మీ పట్ల స్నేహం, భక్తి ఎలా ఉన్నాయో వాటికి సమంగా మీరు నా కోర్కెను తీర్చాలి. నేను రాజమందిరంలో ఎంతోమంది పరిచారికలు సేవలు చేస్తూ ఉండగా, చక్కటి వస్త్రాలు, ఆభరణాలు ధరించాను. మెత్తటి పరుపుల మీద శయనించాను. అలాటి శయ్యమీద మంచి వస్త్రాలు ధరించి మీరు నాతో సంసారం చేయాలని నా కోరిక. అంతేకాని చిరిగిన వస్త్రాలతో దర్భశయ్య మీద నేను సంగమాన్ని ఇష్టపడను. తాపసుల ఈ ఆభరణాలు సంభోగం చేత మలినమగుట నాకిష్టం లేదు.
ఈ మాటలు విన్న అగస్త్యుడు ఇలా అన్నాడు - ‘‘నీ తండ్రి ఇంట ఉన్న రాజభోగం ఇక్కడ లేదు’’.
‘‘మీరు తలచుకుంటే మీ తపశ్శక్తి చేత వాటినంతా క్షణంలో సమకూర్చగలరు’’ అని లోపా ముద్ర బదులుపల్కింది.
దానికి మహర్షి ఇలా అన్నాడు - ‘‘ఆ మాట సత్యమే. కాని ఈ క్షణిక సుఖాల కోసం నా తపస్సును వృధా చేయుట నాకిష్టం లేదు. నా తపస్సు నశించకుండా ఇంకేదైనా ఉపాయం చెప్పు’’.
లోపాముద్ర అన్నది - ‘‘అలాటి రాజభోగాలు ఉంటే నేను మీతో కలవడానికి ఇష్టపడతాను. అలాగే మీ ధర్మ లోపాలని ఇష్టపడను. కనుక మీరే యోచన చేయండి’’.
అగస్త్యుడు ఆలోచించి భోగాలకి కావాల్సిన ధనాన్ని ఎవరినైనా అడిగి తెస్తానని చెప్పి వెళ్ళాడు. అతను ముందుగా శ్రుతర్వుడనే రాజు వద్దకు వెళ్ళాడు. రాజు అతన్ని చక్కగా గౌరవించి అతనికి ఏమి కావాలో అడిగాడు. మహర్షి తాను ధనం కోసం రాజు దగ్గరకు వచ్చానని చెప్పగా అతను తన ఆదాయ వ్యయాల పట్టికను చూపాడు. అవి రెండు సమానంగా ఉండటంతో అందులోంచి కొంచెం తీసుకున్నా ఇతరులను కష్టం వస్తుందని తీసుకోలేదు. రాజు అతన్ని ఇంకొకరాజు దగ్గరకు తీసుకొని వెళ్ళగా అక్కడా ఇదే స్థితి. అప్పుడు ఆ రాజులిద్దరు అగస్త్యుని త్రసదస్యుని దగ్గరకు ధనార్థం తీసుకొని వెళ్ళగా అక్కడా ఇదే పరిస్థితి. కాని ఆ రాజు వారికో సలహా చెప్పాడు - ‘‘ఇల్వలుడు అనే దానవుని దగ్గర చాలా ధనం ఉంది. మనం అందరం అతని దగ్గరకు పోయ అడుగుదాము’’. వారంతా కలసి ఇల్వలుని దగ్గరకు వెళ్ళారు.
ఇల్వలునికి వారి రాక గురించి తెలిసింది. అతను ఎదురువెళ్ళి వారిని తీసుకొని వచ్చి పూజించాడు. తర్వాత అతను తన తమ్ముని మేకగా మార్చి, చంపి మాంసం వండి వారికి పెట్టగా ఆ రాజర్షులు బిత్తరపోయారు. అప్పుడు ఆ మహర్షి వారితో ‘‘మీరు చింతించకండి, ఆ మాంసాన్ని నేను ఆరగిస్తాను’’ అని పలికాడు. ఇల్వలుడు వడ్డిస్తూ ఉంటే మహర్షి మొత్తం మాంసాన్ని ఆరగించాడు. భోజనం తర్వాత ఇల్వలుడు వాతాపిని బయటకు రమ్మని పిలవసాగాడు. ఆ సమయాన అగస్త్యుడు అథో రంధ్రం నుంచి అపానవాయువు వదిలాడు. ఇల్వలుడు వాతాపిని ఎన్నిసార్లు రమ్మని పిలిచినా అతను పొట్ట చించుకుని రాకపోయే సరికి ఆశ్చర్యపోయాడు. అప్పుడు నవ్వుతూ అగస్త్యుడు ఇలా అన్నాడు - ‘‘ఇంకెక్కడి వాతాపి! అతను ఎప్పుడో జీర్ణమైపోయాడు. ఇక రాడు’’.
ఈ విషయం తెలిసికొని ఇల్వలుడు దీనవదనంతో మహర్షి పాదాలపైబడి శరణువేడాడు. వారికేమి కావాలో అది ఇచ్చెదనని చెప్పాడు. అగస్త్యుడు అతనితో ఇలా అన్నాడు. నాకు ఒక బంగారు రథం రెండు గుర్రాలు ఇవ్వు. వీరికి పదివేల గోవులు రెండు రెండింతలు బంగారం ఇవ్వు. ఇల్వలుడు అలాగే ఇచ్చి వారు వెనుతిరిగి వెళ్తూ ఉంటె చంపడానికి ప్రయత్నించాడు. కాని అగస్త్యుడు అతన్ని ఒక హుంకారంతో భస్మం చేశాడు. అగస్త్య మహర్షి ఆ ధనంతో లోపాముద్ర కోరినవన్నీ సమకూర్చాడు. లోపాముద్ర ఆ వైభోగానికి సంతోషించి ఇలా అంది. ‘మీ సామర్ధ్యంతో నా కోరికలన్నీ తీర్చారు. నా నుంచి తేజస్సంపన్నుడు అయన పుత్రుని పొందండి.’’
అప్పుడు మహర్షి ఆమెను ఇలా అడిగాడు - ‘‘నీ గర్భం నుంచి వేయమంది కాని వందమంది కాని పుత్రులు పుడితే వారు ఎంతో సమర్ధులైన పదిమందితో సమానం. అలాంటి పదిమంది ఒక్కడితో సమానం. ఎంతమంది కావాలో కోరుకో’’. అప్పుడు లోపాముద్ర సద్గుణ సంపన్నుడైన ఒక్క పుత్రుని కోరింది. సమాగమం తర్వాత మహర్షి మరల తపస్సుకు వెళ్ళిపోయాడు. లోపాముద్ర ఏడు సంవత్సరాలు గర్భాన్ని ధరించి తేజస్వి అయన పుత్రుని కనింది. అతను పుట్టుకతోనే వేద వేదాంగాలని అభ్యసించాడు. అతని పేరు ధృఢస్యువు. మహర్షికి సంతానం కలుగడం చేత అతని పితరులకు ఉత్తమ గతులు ప్రాప్తించాయ.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి