AADIVAVRAM - Others

వేట - ఒక పులి..వంద తుపాకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పులి..వంద తుపాకులు. ప్రత్యేక కెమేరాలు..ఆధునిక డ్రోన్‌లు..ఇదేదో సినిమా స్క్రిప్ట్ కాదు. ఓ ఆడపులిని పట్టుకునేందుకు నెలల తరబడి సాగిన ‘మహా’వేట. పులుల్ని రక్షించండి మొర్రో అంటూ సంరక్షణ కార్యకర్తలు వాదిస్తూంటే..ఓ పులిని పట్టుబెట్టడానికి చట్టపరంగా జరిగిన ప్రయత్నమిది. ఇది మామూలు పులి కాదు. జంతువుల మాంసం తింటుంది. మనిషి రక్తం తాగుతుంది. ఇందుకోసం చుట్టూ జంతువులున్నా పట్టించుకోదు. మనిషి మెడను పట్టుకుని ఈడ్చుకు పోతుంది. ఇంత భయానకమైన పులి తెలివితక్కువదేమీ కాదు. రెండేళ్ల పాటు హంటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. చివరికి అబ్సెషన్ అనే ఓ లోషన్ సువాసనకు లోబడి బయటికొచ్చి తూటాకు బలైపోయింది. పులిని చంపకుండా మత్తు ఇచ్చి సజీవంగానే పట్టుకునేందుకు చివరి వరకూ జరిగిన ప్రయత్నం విఫలమైంది..అంతిమంగా యవత్మాల్ అడవుల పులి రాణి కథ ఓ తూటాతో ముగిసింది.
ఇది ఓ పులికథ. నెలల తరబడి వందలాది మంది వేటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టిన ఓ ఆడపులి ‘ఆవని’ కథ. ఐదేళ్లు కూడా లేకుండానే 13మందిని భక్షించేసింది. మానవ రక్తం రుచిమరిగి మాటువేసి మరీ పంజా విసిరి మహారాష్టల్రోని యవత్మాల్ ప్రాంత వాసులకు నిద్రాహారాలు లేకుండా చేసింది. మానవ రక్తదాహంతో పాటు ఎంతటి వేటగాళ్లనైనా కన్నుగప్పి తృటిలో తప్పించుకొనే నేర్పు గలిగిన ఈ ఆడపులి తనను తాను రక్షించుకుంటూ పది నెలలు వయసు కలిగిన ఇద్దరు పిల్లల్ని కాపాడుకుంటూ మనుగడ సాగించి అంతిమంగా ఓ హైదరాబాద్ వేటగాడి తూటాకు బలైంది. సాధ్యమైతే సజీవంగా పట్టుకునేందుకు అనివార్య పరిస్థితుల్లోనే చంపేందుకు అధికారులు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. మనం పులుల గురించి విన్నాం..కథల్లో వాటి క్రూరత్వాన్నీ తెలుసుకున్నాం. కల అనుకున్న కథే మహరాష్టల్రోని యవత్మాల్ వాసుల పాలిట మరణశాసనమైంది. మధ్య భారతం అడవుల్లో రాజసంగా తిరుగుతూ..కనిపించిన వారిని కనిపించినట్టుగా 13మందిని మట్టుబెడుతూ వచ్చిన ఆ క్రూర మృగం అంతమైనా..అందుకు అధికారులు, గ్రామస్తులు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. రెండేళ్ల పాటు రాత్రింబవళ్లు ఈ పులి కోసం పహారా కాయాల్సి వచ్చింది. అయినా అది అంతు చిక్కలేదు. అధికారుల ఎత్తులకు పైఎత్తు వేస్తూ తప్పించుకుంది. మనిషి మాంసం, రక్తం మరిగిన పులి కాబట్టి చివరికి కొన్ని చోట్ల ఇలా రక్తాన్ని కూడా ఎరగా వేసినా ఫలించలేదు. ఇలా తమను మట్టుబెడుతున్న పులిని చంపాల్సిందేనని గ్రామస్తులు భావించారు. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా అంతరించిపోతున్న పులుల్ని చంపకూడదన్న శాసనం ఉన్నా..ఇలా కబళించేస్తున్న పులిని చంపక తప్పలేదు. అందుకు సుప్రీం కోర్టు కూడా మినహాయింపునిచ్చింది. దాంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ ఆవని పేరుతో టైగర్-1గా పేర్కొనే ఈ పులిని సజీవంగా పట్టుకునేందుకు..తప్పనిసరైతే చంపేసేందుకూ సిద్ధమయ్యారు. మధ్య మహారాష్ట్ర అడవుల్లో ఈ పులి జాడ కోసం వెతకని ఆనవాలు లేదు. పాదాలను బట్టి, చెట్లపై దాని గోళ్ల గీతల్ని బట్టి ఇలా ఊహకందిన అన్ని మార్గాల్లోనూ ఈ పులి జాడ కోసం అనే్వషించారు. కీకారణ్యంలో ఇది ఎక్కడ నక్కి ఉంటుందో తెలుసుకునేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. వందలాది ప్రత్యేక రిమోట్ కెమేరాలతో అటవీ ప్రాంతంలో నెలల తరబడి నిఘా వేశారు. జాడ కనిపిస్తే తూటాతో మట్టుబెట్టేసే షార్ప్ షూటర్లూ సీన్‌లోకి వచ్చారు. ఓ పులి కోసం నెలల తరబడి ఇంత భారీ ఏర్పాట్లతో వేట సాగడం అన్నది ఇటీవలి కాలంలో ఎన్నడూ జరగలేదనడం అతిశయోక్తి ఏమీ కాదు. ఒక పులిని చంపడానికి ఇంత మంది, ఇన్ని నెలల పాటు భారీ ఖర్చుతో శ్రమించాల్సి ఉంటుందా? అన్న ప్రశ్న సహజం. అయితే ఇద్దరు పిల్లల ఈ ఆడపులి మనిషిని చంపడం ఎంత బాగా తెలుసో తనను పట్టుకోవడానికి వారు వేసే ఎత్తులూ అంతే బాగా తెలుసు. అందుకే అనే్వషణ బృందానికి కొద్ది దూరం నుంచే అది అతి సునాయాసంగా ఎన్నో సార్లు తప్పించుకు పోగలిగింది. తనను పట్టు కోవడానికి..తన ఉనికి తెలిస్తే చుట్టుముట్టేసేందుకు గట్టి ప్రయత్నమే జరుగుతోందని పసిగట్టిందో ఏమో..ఇన్ని నెలలూ తప్పించుకోగలిగింది. ‘మా ప్రయత్నాల వైఫల్యం వల్లే ఆ పులి మరింత తెలివి నేర్చుకుంది. తెలివిగా తప్పించుకోవడమూ తెలుసుకుంది’ అని పులుల్ని పట్టుకోవడంలో ఆరితేరిన నవాబ్ షఫత్ అలీ ఖాన్ అన్నారంటే ఈ పులి మామూలు రకం కాదన్నది తెలిసిపోతోంది. మరి ఇంత తెలివైన పులిని ఎలా పట్టుకున్నట్టు? కాదు..మనిషిని మించిన తెలివిని ప్రదర్శించిన ఈ పులి ఎలా పట్టుబడిపోయినట్టు? ఇది చాలా ఆసక్తి కలిగించే విషయం. ఒక రకంగా చెప్పాలంటే హంటర్లు తమ మేథకు పదును పెట్టి పులిని పట్టుకోవడం ఎలా అన్న ఓ స్క్రిప్ట్‌నే తయారు చేశారు. ఎంత పులికైనా దాని బలహీనత దానిది. కొన్ని రకాల సువాసనలను అది ఆస్వాదిస్తుంది. ఈ విషయం తెలుసుకున్నారు. నెలల తలబడి వెతికినా పులి దొరక్క పోవడంతో పులిని రప్పించుకోవడమెలా అన్న దానిపై అధికారులు దృష్టి పెట్టారు. 90 దశకంలో అమిత ప్రజాదరణ పొందిన అబ్సెషన్ అనే అద్భుతమైన వాసన కలిగిన లోషన్‌ను వినియోగించారు. ఇందులో ఉండే సివెటోన్ అనే మూలకం ఎంత పులినైనా ఇట్టే అకట్టుకుంటుంది. దీని వాసన ఎక్కడున్నా దాన్ని ఆస్వాదించనిదే పులులకూ నిద్ర పట్టదన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఎక్కడైతే ఈ మూలకాన్ని జల్లుతారో..అక్కడికి పులులు రావడం ఆ వాసనను ఆస్వాదిస్తూ దాని చుట్టూ కొన్ని నిముషాలు దొర్లుతాయన్న సంగతినీ గ్రహించారు. పట్టుకునే మార్గం దొరికినప్పుడు వదులుకుంటారా? ఈ టైగ్రస్‌ను పట్టుకునేందుకు ఇదే మార్గమనుకున్నారు. గత నెల్లోనే ఇందుకు శ్రీకారం చుట్టారు. ఈ పులి సంచరించిన అడవుల్లో చెట్లపైనా, పొదలపైనా, ఇతర ప్రాంతాల్లోనూ దీన్ని వెదజల్లారు. ఎక్కడున్నా ఈ వాసన బలహీనతకు పులి బయటికి వస్తుందన్న నమ్మకంతో కాపుకాచారు. ఆ రోజు రానే వచ్చింది. పులి పట్టుబడటం, గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరిసే సమయం ఆసన్నమైంది. కొన్ని గంటల తర్వాత ఓ ఆడపులి రోడ్డుపైకి రావడాన్ని స్థానికులు గమనించారు. దానితో వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. క్షణాల్లో రంగంలోకి దిగిన అధికారులు సమీపంలోని క్షేత్రాలన్నింటినీ ఖాళీ చేయించారు. అప్పటికే అధికారులకు సహకరిస్తున్న షఫత్ అలీఖాన్ కుమారుడు అస్ఘర్ కూడా హంటర్ కావడంతో కొందరు రేంజర్లతో రంగంలోకి దిగాడు. చిన్న జీపులో దాన్ని వెంబడించారు. పొదల్లో పరుగెడుతున్న పులిని దాని చారల్ని బట్టి గుర్తించారు. ఇది మనుషుల్ని మట్టుబెడుతూ వచ్చిన టి-1 పులేనని గ్రహించారు. ఓ రేంజర్ తూటా పేల్చాడు. దాంతో పులి వెనక్కి తిరిగింది. పెద్దగా గాండ్రిస్తూ ఎదురుదాడికి దిగింది. ఓపెన్ జీపుపై పడింది. దాంతో ఆత్మ రక్షణార్థం అస్గర్ ఖాన్ శక్తివంతమైన రైఫిల్ పేల్చాడు. ఆ బులెట్ దాని కడుపులోకి దిగింది. అక్కడికక్కడే చనిపోయింది. మత్తు ద్వారా పులిని సజీవంగా పట్టుకోవడానికి ప్రయత్నించి ఉంటే మరింత మంది చనిపోయి ఉండేవారేనన్న అస్గర్ మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు.
రక్తం మరిగింది!
ఈ ఆడపులికి జంతువులను వేటాడటం ఇష్టం ఉండదు. కేవలం మనుషుల్నే చంపుతుంది. కారణం వారి రక్తం రుచిమరగడమే. చుట్టూ పశుగణాలు ఉన్నా..వాటినేమి చేయదు. వాటిని కాస్తున్న మనిషినే పట్టుకుంటుంది. ఇందుకు రౌత్ అనే బాధితుడి ఉదంతమే నిదర్శనం. పశువుల మధ్య ఉన్న అతడ్ని మెడపట్టుకుని ఈడ్చుకెళ్లి మరీ ఆ పులి చంపేసి రక్తదాహం తీర్చుకుంది. అంతకు ముందు ఓ పశువుల కాపరినీ అలాగే చంపేసింది. చంపడం కంటే మనుషుల రక్తం తాగడమే దీనికి చాలా ఇష్టమని నిపుణులు నిర్థారిస్తున్నారు.
మరి పులి పిల్లల సంగతి?
తల్లి మనిషి రక్తం రుచి మరిగింది. మరి దాని పిల్లలు ఊరికే ఉంటాయా? ఐదేళ్లకే టైగర్-1 13మందిని బలిగొంటే ఈ పిల్లలు పెద్దయ్యేలోగా ఎంత మందిని తినేస్తాయన్న భయం జనంలో పట్టుకుంది. ఈ పిల్ల పులులు కూడా తల్లి చవిచూసిన మనుషుల రక్తం తాగే పెరిగి ఉంటాయన్న అనుమానాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తల్లి చనిపోయిన ప్రదేశంలోనే రెండు పులులూ ఓ కొండను ఎక్కడం తాము చూశామని జనం చెప్పడం..కథ ఇంకా ముగియలేదన్న అర్థమేనా అన్న అనుమానానికి ఆస్కారం ఇస్తోంది.
ఇది ప్రభుత్వ హత్యే!
వన్యప్రాణుల సంరక్షణ చట్టం మనకు ఉంది. అయితే వీటిని ఇష్టారాజ్యంగా చంపేసేవారిని శిక్షించడం, జనారణ్యంలో వీటికి ఆవాస భద్రత కల్పించడం ఈ చట్టం ఉద్దేశం. అందుకే ఎన్నో సంరక్షణ కేంద్రాలు వెలిశాయి. చట్టం మాట ఎలా ఉన్నా పులి అమాంతం జనం మీద పడి చంపేస్తుంటే..ఏమి చేస్తారు. టైగర్-1ను చంపేయడాన్ని వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు నిరసిస్తున్నారు. దాన్ని సజీవంగా పట్టుకోవాలనీ డిమాండ్ చేశారు. ‘ఓటులేని, నోరులేని ఓ మూగజీవిని ప్రభుత్వం హత్య చేసింది’ అని సరితా సుబ్రమణ్యం అనే వన్యప్రాణి కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని మనిషిని తినేసే జంతువుగా పేర్కొనడాన్ని ఆమె తప్పుబడుతున్నారు. తమ పిల్లల్ని, తన ప్రాంతాన్ని రక్షించుకునేందుకు ఓ తల్లి ఏమి చేస్తుందో ఈ పులీ అదే చేసిందనీ చెబుతున్నారు. ఈ పులిని కాల్చండని సుప్రీం కోర్టు ఎప్పుడైతే అనుమతి ఇచ్చిందో..దాన్ని రక్షించాలంటూ..వదిలేయాలంటూ ఆన్‌లైన్‌లో పిటిషన్లూ వెల్లువెత్తాయి.
30శాతం పులులు బయటే!
అడవులు హరించుకు పోవడంతో దేశంలోని 30శాతం పులులు బయటే జీవిస్తున్నాయి. అంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ఉన్నవి లెక్కకు చాలా తక్కువేనన్న మాట. తాజాగా మరణించిన టైగర్-1 ఎప్పుడూ ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో లేదు. అడవుల్లోనూ, పొదల్లోనే జీవనం సాగింది. ఆ క్రమంలోనే జంతువులు రక్తం కంటె కూడా ఇది మనుషుల రక్తానికే అలవాటు పడింది.

ఎంత క్రూరమృగమైనా దాని జీవితం దానిది. ప్రకృతి సహజమైన అలవాట్లు దానివి. మనది జీవకారుణ్య సమాజం. ఎంతటి క్రూర జంతువునైనా రక్షించి దాని సంతతిని పెంచాలేగానీ అంతం చేయకూడదన్నది మన ఆశయం. తాజాగా 13 మంది ప్రాణాలు బలిగొన్న ఆడపులి అవని విషయంలోనూ ఇదే రకమైన కనికర భావం సర్వత్రా వ్యక్తమైంది. జంతువులకు సహజసిద్ధ ఆవాసాలు కనుమరుగై పోతున్న తరుణంలో అవి ఎక్కడి పోవాలో ఎక్కడ బతకాలో ఎక్కడ మనుగడ సాగించాలో అంతుపట్టని అయోమయంలో పడిపోయాయ. అందుకే అడవుల్లో చెట్లు కనుమరుగై కావడం సర్వత్రా మానవ ఆవాసాలు అవతరించటంతో వీటికి కూడా అడపాదడపా జనం మధ్యే సంచరించక తప్పని అనివార్య పరిస్థితి త లెత్తింది. దేశంలో ఎన్నో వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిల్లో మనుగడ సాగిస్తున్న జంతుజాలం అతితక్కువేనన్నది వాస్తవం. అవని మాదిరిగానే ఎన్నో పులులు ఈ అవనిపై తమ ఆవాసాన్ని వెతుక్కుంటూ మనుగడ సాగిస్తున్నాయ. సుప్రీంకోర్టు ఈ క్రూర మృగాన్ని కాల్చేయాలని అనుమతి ఇవ్వటం.. మరోపక్క మహరాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మానవ భక్షక వన్యమృగాన్ని మట్టుబెట్టాలని సంకల్పించటంతో మూగ జీవాల రక్షణోద్యమం మొదలైంది. అవనిని అంతం చేయకూడదని మత్తు ఇవ్వటం ద్వారా దాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించాలన్న డిమాండ్ మొదలైంది. తాజాగా కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఇదే అంశంపై స్పందించటంతోపాటు ఈ ఆడపులిని అంతం చేయడాన్ని అత్యంత హేయమైన చర్యగానూ అభివర్ణించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే ధోరణి విడనాడి ముందస్తుగానే ఈ రకమైన జంతుజాలాన్ని గుర్తించి వాటికి అనువైన ప్రదేశాలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బి.రాజేశ్వరప్రసాద్