AADIVAVRAM - Others

మమీ మిస్టరీ వీడింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈజిప్షియన్లు పునర్జన్మలను నమ్ముతారు. మరణం తరువాత ఆత్మ ఉండటానికి ఓ దేశం కావాలని వారు భావిస్తారు. అందుకే చనిపోయిన తరువాత కూడా మమీల రూపంలో శరీరాన్ని భద్రపరచడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇలా చేయడమనేది ఓ పెద్ద మిస్టరీనే.. ప్రపంచంలోని ఎన్నో మిస్టరీల్లో మమీల తయారీ ఒకటి. ఇప్పుడిప్పుడే ఆ చిక్కుముడి వీడుతోంది. ప్రాచీన ఈజిప్ట్‌లో శవాలు కుళ్లిపోకుండా ఉండేందుకు వాడిన పద్ధతులేంటో తెలుస్తున్నాయి. ఇటీవలే శాస్తవ్రేత్తలు ఓ మమీపై క్షుణ్ణంగా అధ్యయనం జరిపి దాన్ని భద్రపరిచేందుకు ఉపయోగించిన పదార్థాల జాబితాను కనుగొన్నారు. దీనికోసం క్రీస్తుపూర్వం 3,700 నుంచి 3,500 మధ్య కాలానికి చెందిన ఓ మమీపై వివిధ దశల్లో ఫోరెన్సిక్ రసాయన పరీక్షలు జరిపారు. ఆ వివరాలను ఆర్కియలాజికల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఆ అధ్యయనంలో పాలుపంచుకున్న డాక్టర్ స్టెఫెన్ బక్లీ మాట్లాడుతూ, నాలుగు వేల ఏళ్లపాటు ఈజిప్ట్ మమీల తయారీ ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన పదార్థాల గుట్టును తాము కనిపెట్టినట్టు చెప్పారు. శాస్తవ్రేత్తల ప్రకారం మమ్మిఫికేషన్ (మమీల తయారీ) కోసం ఉపయోగించిన పదార్థాలు
ఓ మొక్క నుంచి సేకరించిన నూనె (దీన్ని పరిశోధకులు నువ్వుల నూనెగా భావిస్తున్నారు)
బుల్ష్రెస్ అనే మొక్క నుంచి తయారుచేసిన తైలం
తుమ్మ చెట్టు నుంచి సేకరించిన సహజసిద్ధ జిగురు
దేవదారు వృక్షం నుంచి సేకరించిన జిగురు
వీటన్నింటినీ కలపడం ద్వారా ఆ పదార్థానికి బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి వస్తుందని, దాని సాయంతో శరీరం కుళ్లిపోకుండా ఏళ్ల తరబడి కాపాడి ఉంటారని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. యోర్క్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ బక్లీ, ఆయన సహోద్యోగులు కలిసి మమీపై కనిపించిన ప్రతి పదార్థానికి చెందిన ‘కెమికల్ ఫింగర్ ప్రింట్’ను సేకరించాక ఈ ఫలితాలను వెల్లడించారు.
ఇటలీలోని ఈజిప్షియన్ మ్యూజియంలో ఉన్న మమీని వీళ్లు తమ పరిశోధన కోసం ఎంచుకున్నారు. మమీల కెమిస్ట్రీ గుట్టును ఇప్పటిదాకా ఏ పరిశోధనా పూర్తిస్థాయిలో విప్పిన దాఖలాలు లేవు అని డాక్టర్ బక్లీ చెప్పారు.
పరిశోధన
ఈ మమీల తయారీ ‘రెసిపీ’ని కనిపెట్టే పని డాక్టర్ బక్లీ చాలా సంవత్సరాల క్రితమే మొదలుపెట్టారు. దీనికోసం ఆయన మొదట ఇంగ్లండ్‌లోని బోల్టన్ మ్యూజియంలో ఉన్న మమీలను చుట్టడానికి ఉపయోగించిన వస్త్రం నుంచి కొన్ని రసాయనాలు వెలికితీసి వాటిని విశే్లషించారు. ఇప్పటిదాకా అందరూ క్రీస్తుపూర్వం 2,600 కాలంలో మమీల తయారీ ప్రక్రియ మొదలైనట్టు భావిస్తున్నారు. కానీ ఈ మమీ తయారీకి ఉపయోగించిన వస్త్రం అంతకంటే పురాతనమైనదని, అంటే.. క్రీస్తు పూర్వం 4000 నాటిదని బక్లీ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే శవాలను కుళ్లిపోకుండా జాగ్రత్త పరిచే ప్రక్రియ కూడా చాలా ముందే మొదలై ఉంటుందని ఆయన అన్నారు. దీనితో ఇటలీ మ్యూజియంలో ఉన్న అత్యంత పురాతన మమీలలో ఒకదానిపై మరింత లోతుగా పరిశోధనలు జరపాలని డాక్టర్ బక్లీ బృందం నిర్ణయించుకుంది. ఆ మమీ దొరికినప్పటి నుంచీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రత్యేక పూతలూ దానిపై వేయలేదు. అందుకే ఈ మమీనే తమ అధ్యయనానికి సరైనదని వాళ్లు భావించారు. ఆ మమీ నుంచి సేకరించిన పదార్థాలపై జరిపిన పరిశోధన ద్వారా శరీరం కుళ్లిపోకుండా కాపాడే లేహ్యాన్ని ప్రాచీన ఈజిప్షియన్లు ఎలా తయారు చేసుకుంటారనే దానిపై తామొక అంచనాకు వచ్చినట్లు బక్లీ తెలిపారు.
‘ఇప్పటి వరకు అత్యంత పురాతన మమీల గురించి ఉన్న విజ్ఞానాన్ని ఈ పరిశోధన ఎన్నో రెట్లు ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ మమీకి సంబంధించి కూడా చాలా విషయాలు తెలిశాయి. రసాయన విశే్లషణ, జన్యు పరిశోధన, రేడియో కార్బన్ డేటింగ్, మమీపై ఉన్న వస్త్రాల పరిశోధన వంటి అనేక పరీక్షల ఫలితాను విశే్లషించడం ద్వారా ఈ మమీ క్రీస్తు పూర్వం 3,600 కాలానికి చెంది ఇరవై - ముప్ఫై సంవత్సరాల యువకుడిదని మేము నిర్ధారించాం’ అని సిడ్నీలోని మాక్వెరీ యూనివర్శిటీకి చెందిన ఈజిప్షియన్ పరిశోధకురాలు డాక్టర్ జానాజోన్స్ చెప్పారు. ఇప్పటివరకు అందరూ అనుకుంటున్న దానికంటే చాలాముందు నుంచే ఈజిప్షియన్లు శవాలను భద్రపరిచేవారని, శవాలు కుళ్లిపోకుండా కాపాడే పూతకోసం ఈజిప్షియన్లు ఉపయోగించిన పదార్థాల రహస్యాలు కూడా ఈ పరిశోధన ద్వారా తెలిశాయి. శరీరానికి పరిమళ ద్రవ్యాల పూత వేయడం అన్నది మమీల తయారీలో ఓ భాగం మాత్రమే. దీనిలో మరెన్నో దశలు ఉన్నాయి. అవేంటంటే..
* శరీరంలోని అవయవాలను తొలగించడం. ముందుగా మెదడును తొలగించడం. దీనికోసం ‘విస్కింగ్’ అనే పద్ధతి ద్వారా మెదడును ద్రవరూపంలోకి మార్చి శరీరం నుంచి వేరు చేస్తారని అందరూ అనుకుంటున్నారు.
* తేమను తొలగించడానికి శరీరాన్ని సహజమైన ఉప్పులో ఉంచడం.
* శరీరంపై బాక్టీరియా పెరగకుండా, ఉన్న బాక్టీరియాను చంపడానికి పరిమళ ద్రవ్యాలపూతను పట్టించడం..
* ప్రత్యేకమైన నారతో శరీరాన్ని పూర్తిగా చుట్టేయడం.. వంటి దశలు ముఖ్యమైనవి.

సూర్యదేవర. -ఉమా మహేశ్వరి