AADIVAVRAM - Others

శయనేషు రంభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీ, రాధలది పెద్దలు చేసిన పెళ్లి. అంటే అరేంజ్డ్ మ్యారేజీ అన్నమాట. గోపీకి హైదరాబాద్‌లో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. మనిషి హ్యాండ్‌సమ్‌గా వుండి ఆకర్షిస్తుంటాడు. మితభాషి. అలాగని ఆలోచనలకేమీ తక్కువ లేదండోయ్. రాధ బాపూ బొమ్మలాగా, ముళ్లపూడి సీతలాగా, సన్నగా, తెల్లగా వెడల్పాంటి నుదురుతో, కంటికి కాటుక అందం తెచ్చిందో, కాటుకకి కన్ను అందం తెచ్చిందో తేల్చుకోమని చెప్పినట్లు, పూలతో విరబూసిన మొక్కను చూసి చూపరులకు కలిగే ఆహ్లాదం లాంటిది కలిగిస్తూ ఉంటుంది. దీనికి తోడు వ్యక్తిత్వం ముఖంలో ఎలా ప్రస్ఫుటిస్తుందంటే, కాలేజీలో చదువుకునే రోజుల్లో కూడా తుంటరి మగపిల్లలు ఆమె జోలికి వెళ్లటానికి భయపడేవారు. ఆమెలోని చిలిపితనం చూడగలిగింది ఒకరిద్దరు స్నేహితురాళ్లు మాత్రమే. పెళ్లిచూపులలో ఒకరినొకరు ఎంత ఇష్టపడ్డారంటే, కాఫీ కూడా పూర్తిగా త్రాగకముందే, గోపీ తండ్రితో చెప్పేశాడు. ముహూర్తాలు తొందరలో పెట్టించేయమని. అదీ చెవిలో కాదు. తలవంచుకుని కూర్చున్న రాధకు వినపడేలా, నువ్వేమంటావు అని అన్నట్లు ఆమె వంక చూస్తూ. ముసిముసి నవ్వులు చాలవా, ఇంకా అడగాలా అన్నట్లు రాధ చూసిన చూపు గోపీ ఒక్కడే చూశాడు. సరే పెద్దలు మాట్లాడుకున్నారు. కట్నాల గురించి, కానుకల గురించి, అత్తగారు, ఆడపడుచు లాంఛనాల గురించి కాదండోయ్. పెళ్లిచూపులకు వెళ్లే ముందరే చెప్పేశాడు గోపీ తన నాన్నగారికి, అమ్మకి మన వైపు నుంచి ఏ విధమైన డిమాండ్లు లేవు. పెళ్లి ఖర్చు మొత్తం సగం, సగం చిల్లర పైసలతో సహా. దీనికి వొప్పుకుంటేనే చూపులకు వెళ్లటం, వెళ్లకముందే ఆడపిల్ల వారికి చెప్పి, వారికీ అంగీకారమైతేనే చూపులకి వస్తామని కబురు చేయమని.
మియాబీబీ రాజీతో క్యా కరేగా ఖాజీ అన్నట్లు. ఇహ ఆలస్యమెందుకు, అదే రోజు తాంబూలాలు మార్చుకుని లగ్నపత్రిక వ్రాసుకున్నారు. విఘ్నేశ్వర పూజ అప్పుడు ప్రక్కన కూర్చున్న రాధను సెల్‌ఫోన్ నెంబరు అడిగాడు గోపీ. నాకు ముందరే తెలుసు, మీరు ఈ పని చేస్తారని అన్నట్లు నంబరు వ్రాసిన చిన్న కాగితం అందించింది రాధ. ఫర్వాలేదు. ఫాస్ట్ గర్లే, పల్లెటూరిలో వుంటున్నా అనుకున్నాడు గోపీ. సోషల్ మీడియా ప్రభావమని కూడా అనుకున్నాడనుకోండి. కొడుకు తొందర గ్రహించిన గోపీ తండ్రి ‘ఏం ఫర్వాలేదు. కావలసిన ఏర్పాట్లు ఈ రోజుల్లో తేలిగ్గానే చేసుకోవచ్చు.
ముందుటి కాలంలోలా కాకుండా అప్పడాలు వడియాలు పెట్టుకోవాలి లాంటి అవసరాలు లేవు. మీరు ఇంటి దగ్గరే చక్కని పల్లెటూరి వాతావరణంలోనే చేస్తామంటున్నారు కాబట్టి హాలు దొరుకుతుందో లేదో అన్న నిర్బంధమూ లేదు. కాకపోతే మేము నాలుగు రోజులు ముందే వస్తాం, కాలుష్యం లేని పల్లెటూరి జీవనాన్ని, మీ పొలాల్ని, తోటల్నీ చూడటానికి, మీ కభ్యంతరం లేకపోతే. పెళ్లికొడుకు మాత్రం ఒకరోజు ముందర వస్తాడు. ఇహపోతే శుభలేఖలు పోస్ట్ చేయాలి అన్నది పెద్ద ఆటంకం కాదు. అది పోస్ట్ చేసినా, ఆ విషయం వాళ్లకి ఫోన్ చేసి చెప్పి, కార్డు ఫొటో వాట్సప్‌లో పంపించవచ్చు. ఇంతవరకూ మీకు అంగీకారమైతే, ముందుకు సాగుదాం అంటూ; కాబోయే వియ్యంకుల వంక చూసారు. కల్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగవంటారు. శుభస్య శీఘ్రం అన్నారు వాళ్లు. ముహూర్తం ఖాయమయ్యింది.
ఆ రోజు హైదరాబాద్‌కు తిరిగి వస్తూ, దారి మధ్యలోంచి ఎస్‌ఎంఎస్ ఇచ్చాడు రాధ నంబర్‌కు. ‘హలో, హౌ ఆర్ యూ’ అంటూ ‘ఓకే’ అన్న సమాధానం వచ్చింది. మరునాడు ఇంకో రెండు మెస్సేజెస్ ఇచ్చాడు కానీ, ఏం జవాబు రాలేదు. ఇది కాదు పని అని తీరిగ్గా వున్నప్పుడు కాల్ చేశాడు. అవతలి నుంచి కాబోయే మామగారు జవాబిచ్చారు ‘ఎవరండీ’ అంటూ. మొదట్లో ఖంగుతిన్నా, తేరుకుని ‘నేనండీ, మామగారూ, గోపీని. ఈ ఫోన్ మీ దగ్గర ఉంది’ అంటూ ఆగిపోయాడు. ‘్ఫన్ నాదే బాబు. ఏవో రెండు మూడు మెస్సేజెస్ వచ్చాయి. ఈ నంబరు నుంచి. నీదా బాబూ ఈ నంబరు. ఎవరో అనుకుని ఎదురు జవాబు ఇవ్వలేదు. ఇది మీ నంబరు అని నాకు తెలియదు. ఏమీ అనుకోకు నాయనా’ అన్నారు. గోపీకి అర్థమయింది. తనను ఏడిపించటానికే రాధ తన తండ్రి నంబరు ఇచ్చిందని. ఫాస్ట్ అనుకున్నాడు ఇంతకు ముందు. వెరీ నైస్ బిగినింగ్ అనుకున్నాడు, ఇప్పుడు. ‘్ఫర్వాలేదు. ఈ చిలిపితనం వుంటే ముందర వున్న సంసార జీవితం కూడా సరదాగానే ఉంటుంది’ అనుకున్నాడు. మామగారి దగ్గర నుంచి రాధ నంబరు తీసుకున్నాడు. మరునాడు రాధ నంబరుకు ఫోన్ చేశాడు. కావాలనే ఒకరోజు ఆగాడు. ఎందుకంటే, మామగారు వెళ్లి ఇంట్లో ఎట్లాగూ చెప్తారు. తను ఫోన్ చేసిన విషయం. రాధకీ తెలిసిపోతుంది. ఆ తరువాత ఆమె ప్రతిచర్య ఎలా వుంటుందో తెలుసుకోవచ్చనే జాప్యం చేశాడు. రాధ ఫోన్ ఎత్తి, అంతకు ముందు ఏమీ జరగనట్లుగా, ‘హలో, బాగున్నారా’ అంది. బాగానే ఉంది. సరదాగానే గడుస్తోంది అనుకున్నాడు గోపీ. ‘అవునూ, మీ నాన్నగారి నంబరు పొరపాటున ఇచ్చి వుంటావు’ అన్నాడు. ‘లేదు. కావాలనే. నాన్నగారికి తెలియాలిగా మీరు ఉత్సాహపడుతున్నారని.’
‘గుడ్, మరిహ మనిద్దరం ప్రొసీడ్ అయిపోవచ్చన్నమాట’
‘అలా ఏం లేదు మానవా ఆగు. గాంధర్వం వద్దండీ, ఇన్ని రోజులు లేనిది ఇంకొక్క పది రోజులు ఆగలేమా? ఇప్పుడే కబుర్లు అన్నీ చెప్పేసుకుంటే తర్వాత ఏం చెప్పుకుంటాము?’
‘అప్పుడు కబుర్లు వుండవు. కార్యాలే వుంటాయి’ చిలిపిగా అన్నాడు.
‘అప్పటి సంగతి అప్పుడు కానీ, అప్పటిదాకా ఆగుదాం, ప్లీజ్’ అంది.
‘ఓకే, సీయూ’ అన్నాడు గోపీ పొడిగించకుండా.
పది రోజులూ గిర్రున తిరిగాయి. పెళ్లి చాలా సరదాగా, ఏ విధమైన మాట పట్టింపులు లేకుండా జరిగింది. ఏ విషయంలోనూ ఎవరికీ మనస్సు నొచ్చుకోవాల్సిన అవసరం రాలేదు. గోపీ రాధలు మాత్రం ఎవరూ గమనించట్లేదనుకున్నప్పుడు వారి చిలిపి పనులు వారు చేసుకున్నారు.
పార్ట్-2
పాల గ్లాసుతోపాటు లోపలికి రమణి రాగానే బయట నుంచి తలుపులు వేశారు ఎవరో. తలుపుకివతలే ఆగిపోయింది ఆమె. రెండు నిమిషాలు ఆమె వైపే తదేకంగా చూసిన రావు, ఇహ లాభం లేదనుకుని తనే మంచం మీద నుంచి లేచి ఆమె వద్దకు వెళ్లి, పాలగ్లాసు ఒక చేతితో తీసుకుని రెండవ చేతితో ఆమెను పట్టుకుని మంచం దగ్గరికి వచ్చాడు. గ్లాసు అందుబాటులో వున్న టేబుల్ మీద పెట్టి, ఆమెను రెండు చేతులతో సున్నితంగా నెట్టి మంచం మీద కూర్చోబెట్టాడు. అప్పటికీ తల ఎత్తి అతని వంక చూడలేదు ఆమె. ‘నీకూ నాకూ ఆర్నెల్ల పరిచయం వుంది. ఇద్దరం సినిమాలకూ, షికార్లకూ వెళ్లాము. ఒకరికొకరం నచ్చి, పెద్దల నొప్పించి పెళ్లి చేసుకున్నాము. ఇంత జరిగినాక కూడా ఏంటిరా రమణి ఇవాళ కొత్తగా ఈ సిగ్గు. నీ సిగ్గు బాగానే వుంది కానీ కొంచెం వింతగా కూడా ఉంది. ఇప్పటిదాకా నీలో ఇంత సింగారం నే చూడలేదు సుమా! మామూలుకన్నా అందంగా కనిపిస్తున్నావు’ అన్నాడు రావు.
‘నేను నేనే. ఇవాళ కొత్తగా కనిపించటం ఏమిటి? నువ్వే నన్ను కొత్తగా కళ్లు విప్పార్చుకుని మరీ చూస్తున్నావు’
‘ఎన్ని రోజుల నుంచి ఈ గడియ కోసం ఎదురు చూస్తున్నానో నీకేం తెలుసు? ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత తిప్పినా, ఎంత బతిమాలినా ఇప్పటిదాకా ఒక్క ముద్దు కూడా పెట్టలేదాయె నువ్వు. మరింకేం చెయ్యను, ఇప్పుడైనా ఆ ముద్దు కోసం ఎదురుచూడటం తప్ప’ అంటూ మెల్లగా మంచం కింద వైపు వేలాడుతున్న ఆమె కాళ్లను మంచం మీద పెట్టి, ఆమె వీపు మెత్తల మీద ఆనుకునేలా చేస్తూ అన్నాడు.
‘అదేంటి? నా కాళ్లు నువ్వు పట్టుకుంటున్నావు. అత్తగారు చూసారంటే, ‘చూసావే? నా కొడుకుని అప్పుడే ఎట్లా మార్చేసిందో ఈ కొత్త కోడలని’ తిట్టిపోసుకుంటారు’.
‘ఎవరి కాళ్లు, ఎవరి చేతులు ఎక్కడెక్కడా తగలకుండా నువ్వూ నేను ఈ భూమి మీదకి రాగలిగేము కానీ, అసలు మీ వాళ్లు నేను చెప్పింది ఏ మాత్రం వినకుండా, ఈ కార్యక్రమం మా ఇంట్లోనే జరగాలని పట్టుబట్టి కొంచెం ఇబ్బందికరంగా చేసారు మన పని. చూడు సినిమాలలో లాగా పాటలు పాడుకోవడానికి అవకాశం లేకపోయింది మనకు.’
‘ఆహా ఆ కార్యక్రమం కూడా ఆలోచించారా, అయినా నాకు పాట పాడటం చేతకాదులే కానీ, నువ్వేం చెప్పావేమిటి మా వాళ్లకు?’
‘మా స్నేహితుడిది పెంట్‌హౌస్ ఒకటి ఉంది, పనె్నండు అంతస్తుల మీద. చాలామటుకు గ్లాసుతో ఉంటుంది. అంత ఎత్తులో ఇంకే బంగళా లేదు చుట్టుపక్కల, ఒక బటన్ వొత్తితే పైకప్పు కూడా షాపుల షట్టరులాగా తెరచుకుని ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తుంటాయి. అక్కడ ఏర్పాటు చేసుకుంటా అన్నాను. వింటేనా? అమ్మో, నా కూతురు అక్కడ నుంచి పడిపోతేనో, భయపడిపోవచ్చు చిన్నపిల్ల అంటూ ఒప్పుకోలేదు. చిన్నపిల్ల అట చిన్నపిల్ల. వాళ్లకేం తెలుసు నీవు వాళ్లకి ఒక చిన్న మనవడినో, మనవరాలినో అందించటానికి రెడీగా వున్నావని’ ఎక్కిరిస్తూ అన్నాడు రావు.
‘ఏదో తోటలో మామిడి చెట్టు కిందో, వేపచెట్టు కిందో ఏర్పాటు చేయమని అన్నారని విన్నాను’
‘పెంట్‌హౌస్ వద్దంటే, అక్కడ అన్నాను. గాలికి రాలితే మామిడి పండు తినొచ్చు. వేపచెట్టు గాలి ఆరోగ్యానికి మంచిది అన్న కారణాలు చెప్పినా వినలేదు.’
‘బాగానే వుంది మీ తంతు. అది కాదు బాబాయ్, ఇలా పెళ్లికాకముందే అక్కడ, ఇక్కడ అని మీరడిగితే మీ రసికత్వం, మీ భావుకతా చూసి అసలు ఈ అబ్బాయి వద్దు, మా అమ్మాయిని ఎన్ని ఇబ్బందులు పెడతాడో అని వెనక్కు తగ్గవచ్చన్న ఆలోచన రాలేదా మీకు?’
‘వచ్చింది. కానీ వాళ్లు సంతోషిస్తారని అనుకున్నాను. అబ్బ, మా అమ్మాయిని ఎన్ని రకాలుగా సుఖపెట్టాలని ఆలోచిస్తున్నాడో అని. ఒకవేళ వాళ్లు భయపడి వెనక్కు తగ్గినా నువ్వున్నావన్న ధైర్యంగా వుందిగా. నన్ను తప్ప ఇంకెవరినీ నువ్వు పెళ్లి చేసుకోనని మొండికేస్తావు అన్న నమ్మకం వుందిగా.’ ఇంతలో తలుపు శబ్దం చేశారెవరో బయటి నుంచి. ఉలిక్కిపడ్డారిద్దరూ.
మధ్యాహ్నం ఇద్దరూ ఏకాంతంగా వున్న సమయంలో గోపాలం కొన్ని కాగితాలు ఒక కవర్లో పెట్టి రాధకిచ్చాడు. తీరిక చేసుకుని సాయంత్రం లోపల చదువు అని షరతు మరీ పెట్టి. సరే అని చదువుతున్న రాధ, అబ్బ ఈ పెద్దవాళ్లింతే, కాని సమయంలో డిస్టర్బ్ చేస్తారు అనుకుంటుండగా, ఈసారి మళ్లా తలుపు కొట్టారెవరో. ఎవరికీ తెలియకూడదు, అని తలుపు గడియ వేసుకుని కథ చదువుకుంటున్న రాధకు జ్ఞానోదయమయింది. కథలోనే కాదు, తన గది తలుపు కూడా ఎవరో తడుతున్నారని.
మంచం మీద బోర్లా పడుకుని మోకాళ్ల దగ్గర కాళ్లు ఎత్తుకుని కథ చదువుకుంటున్న రాధ మంచం దిగక తప్పలేదు.
గోపాలం వ్రాసిన కథలో రమణి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కానీ, రాధ వాళ్లు మాత్రం గోపాలం అడగకుండానే తోటలో ఏర్పాటు చేశారు వారి శోభనానికి. మనసులోనే వెరీగుడ్ అనుకున్నారిద్దరూ. సాయంత్రం సుమారు నాలుగు అవుతుండగా విపరీతమైన కడుపునొప్పి వచ్చింది రాధకు. అందరూ కంగారుపడ్డారు. ఊరులో ఉన్న ఆర్‌ఎంపి డాక్టర్‌కి కబురు చేస్తే వచ్చి చూసినాయన, ఏమీ లేదు. సరిగ్గా నిద్ర లేకపోవటం, వేళకి ఆహారం లేకపోవటం, ఈ రెంటికీ తోడు మానసిక ఒత్తిడి, వీటి వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల ఈ నొప్పి. ఈ మాత్రలు రెండు నాలుగు గంటల వ్యవధిలో వెయ్యండి. తగ్గిపోతుంది. రేపు వేరే మాత్రలు ఇస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు.

కారణం చిన్నదే అయినా కంగారుపడ్డారు పెద్దవాళ్లు. రాధ నొప్పి రాత్రికి మళ్లా వస్తే. ఇబ్బందే కదా! రాధ తల్లి మాత్రం ‘ఏమీ ఫరవాలేదు. ఇక్కడిదాకా వచ్చి, ఇన్ని ఏర్పాట్లు చేసి, ఇప్పుడు రద్దు చేసుకుంటే అబ్బాయి మనస్సు కలత చెందవచ్చు. అదీకాక ఇప్పుడు కాకపోతే, మళ్లీ తొందరలో మంచి ముహూర్తాలు కూడా లేవు. వారం రోజుల్లో అమ్మాయిని కాపురానికి కూడా పంపాలి. అబ్బాయి పెళ్లయినాక కూడా చెయ్యి కాల్చుకోవటం, లేక బయట చిరుతిండి తింటం ఎందుకూ’ అని చెప్తుండగానే, గోపాలం, సున్నిత స్వరంతోనే ‘లేదండి, నాకేమీ తొందరలేదు. బాధ కూడా లేదు. ఇవాళ కాకపోతే ఇంకో రోజు. తనకు ముందు స్వస్థత చిక్కనీయండి’ అంటూ అదే చివరి నిర్ణయమన్నట్లు, ఇహ వాదన వద్దన్నట్లు అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. ఇది విన్న రాధ ‘అబ్బో, నా మొగుడు ఎంత మంచివాడో’ అని సంతోషించింది.
పార్ట్-3
వారం రోజులు గడిచాయి. రాధ కాపురానికి వెళ్లే రోజు తనతో ఎవరూ తోడు రానక్కరలేదని చెప్పినా ఆమె తల్లి వినలేదు. ‘మీ ఏకాంతానికి నేను అడ్డు రాను. కేవలం మూడు రోజులు ఉండి, దైనందిక జీవనానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి తిరిగి వచ్చేస్తాను’ అని అంటూ కూతురితోపాటు బయలుదేరింది. బస్సు హయత్‌నగర్ దగ్గరకు రాగానే భర్తకు కాల్ చేసింది రాధ. వనస్థలిపురంలో వాళ్లను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు గోపాలం. ఎనిమిదిన్నర వరకు సెలవు దొరకలేదు. ఆఫీసుకు వెళ్లక తప్పదు. సాయంత్రం తొందరగానే వస్తాను అంటూ వెళ్లాడు. సాయంత్రం వస్తూ వస్తూ కొన్ని పూలు, చిరుతిండ్లూ తీసుకుని వచ్చిన గోపాలానికి రాధ ఎదురు వచ్చింది. శుభశకునం అనుకున్నాడు అతను. రెండు రోజులు వుండి అత్తగారు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ రెండు రోజులూ తల్లి వున్న గదిలోనే తననీ పడుకోమన్నాడు గోపాలం. చిన్న అపార్ట్‌మెంట్. ఎక్కువ ప్రైవసీ ఉండదని. ఆమె పెట్టెబేడా సర్దుకుని సిద్ధమవుతుండగా మూలకు చేరింది రాధ. ఇంకో మూడు రోజులు అని గోపాలానికి మూడు వేళ్లూ చూపిస్తూ.
తప్పేదేముంది. అయినా ఈ పాత పద్ధతులు, ఈ చాదస్తాలు అని అనుకోకుండా వుండలేకపోయాడు. వారికి శారీరక నొప్పులూ, బాధలూ వుండవచ్చు. ఒప్పుకోవాలి కానీ, ఈ అంటరానితనం, మూలన కూర్చోవాలన్న నిబద్దన అతనికి నచ్చని విషయం. ఏదైతే ఏమి. రెండు రోజులు అని వచ్చిన అత్తగారు పూర్తిగా వారం వుండక తప్పలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న గోపాలం సర్దుకుపోవటం తప్పలేదు.
ఎనిమిదో రోజు ఆఫీసు నుంచి ఆత్రంగా ఇంటికి వచ్చాడతను. ఇహ ఇంకేం అడ్డులేదు అనుకుంటూ. హుషారుగా ఈల వేసుకుంటూ. ఆ రోజు రాత్రి భోజనాలయినాక అతను తలుపులూ, కిటికీలు వేస్తూండగా రాధ అడిగింది. ‘ఏమండీ, మీరేమీ అనుకోకపోతే, కోపం తెచ్చుకోనంటే నాదొక రిక్వెస్టు’ అంటూ గోముగా. ఆమె దగ్గరికి నడిచి నడుము చుట్టూ చేయివేసి, ఆమె కళ్లలోకి చూస్తూ ఏమిటీ అన్నట్లు కళ్లు ఎగరవేశాడు. ‘ఎందుకు, కారణమేమిటీ అని అడగకుండా మీరు ఒక పది రోజులు ఓపిక పట్టగలరా? ప్లీజ్! ఆ తరువాత ఇహ అడ్డంకి ఉండదు. ప్రామిస్’ అంది రాధ.
‘ఓకే సమస్య లేదు. నేను ఆగగలను. మనస్ఫూర్తిగా’ అన్నాడు గోపాలం.
పార్ట్-4
ఆ రోజు గోపాలం ఆఫీసుకి వెళ్లబోతుంటే, ‘ఏమండీ ఈ రోజు కొంచెం తొందరగా వస్తారా ఇంటికి’ అని అడిగింది. సరే అన్నాడతను. వచ్చేటప్పుడు పూలూ పండ్లూ ఏమీ తేవద్దు అంది. అర్థం కాలేదు అతనికి. తొందరగా రమ్మంది, పూలు, పళ్లూ వద్దంది. ఏమిటో అనుకుంటూనే వెళ్లాడు.
సాయంత్రం అయిదవుతుండగా ఇంటికి వచ్చిన అతనికి, మామూలుగానే కనిపించింది ఇల్లంతా. అతనికి కాఫీ ఇచ్చి, త్రాగినాక స్నానం చేసి రమ్మంది ఆమె. ఆ రోజు ఏది ఏమైనా ఆమెను ఏ ప్రశ్నా అడగకుండా ఏమి జరుగుతుందో చూద్దామని అతను అనుకున్నాడు. స్నానం చేసి రాగానే మంచం మీద తెల్లని పైజామా, లాల్చీ రెడీ. అతను బట్టలు మార్చుకుని రెడీ అయ్యేలోపల ఆమె తయారయి వచ్చింది. రోజూ కంటే అందంగా కనిపించందతనికి. బయటకు వచ్చి, తలుపులు తాళాలు వేసినాక ‘కారు కీస్’ అంటూ చేయి చాపింది. ‘ఓకే’ అంటూ అందిచ్చాడతను. కారు తిన్నగా వెళ్లి ఆబిడ్స్‌లో ప్యాలెస్ హైట్స్ ముందర ఆగింది. ఆమె ముందర, అతను వెనకాల, వాళ్లను ఎంతో సాదరంగా ఆహ్వానించి ప్రత్యేకంగా అమర్చిన టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు స్టీవార్డు. ఎప్పుడు ఏమి చేసి, ఏమేమి ఏర్పాట్లు చేసిందో కానీ, నోరు మెదపకుండా అతనికి ఇష్టమయిన డిన్నర్ రెడీ. భోజనాలయినాయి. కారు ఆమె డ్రైవింగ్‌లోనే శామీర్‌పేట చెరువు దగ్గర సుమారు 9-9.30 అవుతోంది. పూర్ణిమ ఆనాడు. తెల్లని వెనె్నల. ఒక్క మబ్బులేదు ఆకాశంలో. కారు ఆగగానే, ఒకరెవరో వచ్చి వారిని తీసుకెళ్లి ఒక దగ్గర ఆగి, ఆమెకు కీస్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఎక్కడా మాటలు లేవు. అంతా యాంత్రికంగా సాగిపోతోంది. ఆమె బోటులోకి నడిచింది. వెనకాలతను. అతనికి ఒక క్యాబిన్ చూపించి ఆమె బోటు స్టార్ట్ చేసింది. బోటు చెరువు మధ్యలో ఆగింది. ఈ లోపల ఆమె చూపించిన క్యాబిన్‌లోకి వెళ్లిన గోపాలం, ఏర్పాట్లు చూసి షాక్ తిన్నాడు.
ఇంతలో అక్కడకు చేరిన రాధ అంది, ‘ఇప్పుడు చెప్పండి మిగతా రమణి కథ’ అంటూ నవ్వింది.

-నండూరి రామచంద్రరావు.. 9949188444