Others

సృష్టి రహస్యము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాస్యుని నుండి నిరక్షరాస్యుని వరకు జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు నేనెవరు? నేనెందుకు ఈ భూమిపై ఉన్నాను? ఈ కనబడే సృష్టి అంతా ఏమిటి? అనే ప్రశ్నలతో అయోమయానికి గురికాక తప్పదు. అత్యంత అద్భుతమైన ఈ సృష్టి కార్యక్రమాన్ని దాని యొక్క రహస్యాన్ని వివరించిన మన సనాతన వేద వాఙ్మయం అజరామరం. ఈ భూమిమీద జీవి ఆవిర్భావమును ఆవిష్కరించిన ఘనత మన వేదభూమికే దక్కింది.
పరమశివుని ఆజ్ఞప్రకారం హిరణ్యగర్భుడు సృష్టి కార్యానికి నాంది పలికి నారాయణ రూపమైన మహిమాన్విత జలమును తీసుకొని ఉద్యుక్తుడవ్వగా, ఆ జలరాశియందు పంచ విషయ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచప్రాణములు, పంచభూతములు, అంతఃకరణ చతుష్టయములు అను ఇరువది నాలుగు తత్త్వములతో గూడిన ఒక అద్భుతమైన, చిత్రమైన అండాకారము గోచరించెను. కానీ ఆ ఆకారమునందు జీవన చైతన్యము లేదు. అంత బ్రహ్మాండ అండ రహస్యము శోధించుటకు మరియు చైతన్యపరచుటకు తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమైనాడు. బ్రహ్మ కోరిక మేరకు ఆ అండమునందు విష్ణువు ప్రవేశించి జీవ చైతన్యమును కలిగించినాడు. ఆ మహాచైతన్యమునకు త్రిగుణములను జతచేసి తమోగుణ ప్రధానమైన వృక్షములను సృజించాడు. దానితో సంతృప్తిపడక రజోగుణ ప్రధానమైన పశుపక్ష్యాదులను సృజించాడు. అది కూడా తృప్తినివ్వక సత్త్వ గుణ ప్రధానమైన దేవగణమును సృష్టించాడు. అది కూడా పద్మసంభవునికి మోదము చేకూరక త్రిగుణములతో కూడిన మానవులను సృష్టిచేశాడు. అటు తరువాత త్రిగుణాత్మకమైన ప్రకృతినుండి సమిష్టి జ్ఞానము, సూక్ష్మజ్ఞానము, పాంచభౌతిక జ్ఞానము కలిగిన లక్షల జీవజాతులు జనించినవి.
అటుపిమ్మట నవమ సృష్టికార్యముగా మహావైరాగ్య సంపన్నులైన సనక సనందనాది మహర్షులను సృష్టించాడు. కాని సృష్టి వైచిత్రి, ఈ ఋషిపుంగవులు సృష్టికర్తనే తిరస్కరించారు. అంత బ్రహ్మ తిరిగి విష్ణువుకొరకు తపమాచరించాడు. విష్ణుదర్శనమైన బ్రహ్మ తనకు మోదమైన సృష్టికార్యాన్ని తిరిగి చేపట్టాడు.
శబ్దస్పర్శ రూప రసగంధములనుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను స్థూలములను సృజించాడు. కనురెప్పపాటైన లిప్తనుండి యుగము వరకు కాలమును సృష్టించాడు. ఇక ఆ కాల మహిమ నుండి స్థావర జంగములు, జనన మరణాలు గల ప్రాణులు సృజించబడినవి. ఋషులైన మరీచి, భృగువు, అంగిరసుడు, పులహుడు, పులస్త్యుడు, వశిష్టుడు, క్రతువు, అత్రి, దక్షుడు, నారదుడు, కర్దముడు మొదలైనవారు బ్రహ్మ వివిధ అంగములనుండి జనించినారు. అంత బ్రహ్మ మహాసంకల్పమయిన ధర్మమును సృష్టించి వారికి దత్తము చేశారు. అంత వారు ధర్మస్వరూపులైనారు. అదే కాలమందు అనేకమంది దేవదానవులు జనించారు.మహాకాలాంతరములో సృష్టి కొనసాగుచుండగా బ్రహ్మ తన దేహమును భేదము లేకుండానే రెండు రూపాలుగా మార్చివేశాడు. ఒకరు స్వాయంభువ మనువు, మరొకరు శతరూప. తిరిగి వారి సంపర్కమునుండి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు, ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనే కుమార్తెలు ఉద్భవించారు. అక్కడినుండి దేవగణములోని రుచికి ఆకూతిని, కర్దమునికి దేవహూతిని, దక్షునికి ప్రసూతిని వివాహమనే ప్రక్రియ ద్వారా ఒకటి చేశాడు. వీరికి కల్గిన సంతానమే భూలోకమంతా వ్యాప్తి చెందింది. వారి వారసులే నేటి మానవజాతి. వీరికి జనించిన అనేకమంది వారి వారి అద్భుత శక్తులకు తగిన రీతిలో వివిధ లోకాలను చేరి నేటికీ తమ తమ జాతులను వృద్ధి చేస్తూ ఉన్నారని మన సనాతన వాఙ్మయమునందు ప్రకటించబడినది.
ఈ విధముగా కాలమనే అద్భుతమును సృష్టించిన బ్రహ్మ ఒకప్రక్క, స్థితిని కలిగిస్తున్న విష్ణువు మరోప్రక్క ఉండగా వీరికి అతీతమైన పరమశివుడు ఈ సృష్టిస్థితులను కాలానుగుణంగా లయము చేసి తిరిగి బ్రహ్మను సృష్టిస్తుండడం ఒక మహాద్భుతము కాక మరేమిటి? అటువంటి సృష్టి రహస్యాన్ని మనకందించిన మన సనాతన వాఙ్మయమునకు ఈ సృష్టిలో ఏదీ సాటిలేదని శ్లాఘించుచూ, భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మరింత శోధించి సచ్చిదానందమును పొందడమే మోక్షము. ఏకమే అనేకమైన పరమాతమను స్మరించడమే ముక్తికి మార్గము.

- వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు