Others

తెలంగాణ అద్దంలో మావోల రూపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మావోయిస్టుల హడావుడి ఉంటుందని ప్రచారం జరిగినా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వోటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు పొందిన 13 నియోజకవర్గాలలోనూ పోలింగ్ ప్రశాంతంగా జరగడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలి సరిహద్దుల్లోని ప్రాంతాల్లో మావోయిస్టుల అలజడి ఉంటుందని ఊహించి గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్ద మిడిసిలేరు ప్రాంతంలో మావోయిస్టులు గందరగోళం సృష్టించాలని మందుపాతర పేల్చేందుకు చేసిన ప్రయత్నం భగ్నమైంది. ఒక వ్యక్తిని ఈ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద 69 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు ప్రకటించారు.
గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 76 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్కడ కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మావోయిస్టులు తమ సర్వశక్తుల్ని కూడదీసుకుని ‘బూటకపు ఎన్నికల బహిష్కరణ’కు పిలుపునిచ్చినా ప్రజల నుంచి స్పందన కరువైంది. ఎంత భయోత్పాతం సృష్టించినా, ‘్ఫత్వా’ జారీచేసినా, బ్యానర్లు కట్టినా, కరపత్రాలు పంచినా, మందుపాతరలు పేల్చినా ప్రజల సంకల్పం చెక్కు చెదరలేదు. మావోయిస్టుల కంచుకోటలుగా భావించే సుకుమా, బీజాపూర్ తదితర జిల్లాల్లోనూ భారీగా పోలింగ్ జరిగింది. తెలంగాణలో అదే పరిస్థితి పునరావృతమైంది. దీన్నిబట్టి ఏం అర్థమవుతుంది?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు బ్రహ్మాస్త్రం. ఆ అస్త్రం సామాన్యుడి చేతిలో ఉంది. దాన్ని ఉపయోగించడం పరమధర్మంగా ప్రజలు భావిస్తున్నారు. దీన్ని మావోయిస్టులు గుర్తించకపోతే ఎలా? అటువైపు చూసేందుకు నిరాకరిస్తూ పిడివాదంతో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి అభాసుపాలు కావడమెందుకు? ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందంటే మావోయిస్టుల పరువుపోయినట్టే కదా? వారి పలుకుబడికి గండి పడినట్టే కదా?
ప్రపంచంలోని 192 దేశాలలో 124 దేశాలు ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నాయి. అంటే ప్రపంచంలోని మెజార్టీ ప్రజలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పట్టం గడుతున్నారు. దీన్ని చూసేందుకు నిరాకరిస్తూ సుదీర్ఘకాల సాయుధ పోరాటం ద్వారానే ‘రాజ్యాధికారం’ చేతికందుతుందని విశ్వసించి అందుకనుగుణంగా ప్రణాళికలు రచించి ఆచరణలో పెడితే ఒనగూరే ప్రయోజనమేమిటి? హళ్ళికి హళ్ళి, సున్నాకు సున్నా మాత్రమేనని గత 70 ఏళ్ల చరిత్ర చాటి చెబుతోంది.
స్వాతంత్య్రానికి పూర్వం కూడా ఇదే భావజాలంతో కమ్యూనిస్టులు దేశంలో కొన్ని చోట్ల సాయుధ పోరాటాలు చేశారు. కాని ఎక్కడా విజయం సాధించలేదు. తెలంగాణల రైతాంగ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున చేసినా అది నిజాంను గద్దె దించేంత వరకు ఉపయోగపడింది తప్ప కమ్యూనిస్టులు ఆశించిన ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యాం’ కల సాకారం కాలేదు. ఇతర ప్రాంతాల, దేశాల సంఘీభావం ఉన్నప్పటికీ ప్రజల ప్రధాన ఆకాంక్ష నిజాం ప్రభువును గద్దె దింపడమే. దాన్ని గుర్తించడంలో అప్పటి కమ్యూనిస్టులు విఫలమయ్యారు. తెలంగాణ విమోచన అనంతరం నల్లమల అడవుల్లో గెరిల్లా దళాలను ఏర్పాటు చేసినా, పల్లెల్లో ప్రచారం నిర్వహించినా, సిద్ధాంత చర్చలు కొనసాగించినా అంతిమంగా ప్రజల భాగస్వామ్యం కొరవడటం, ప్రపంచ పరిస్థితులు అనూహ్యంగా మారడంతో పోరాటాన్ని విరమించుకుని ‘‘వాళ్ళు’’ ప్రజాస్వామ్యంలోకి వచ్చారు. తమవంతు పాత్రను నిర్వహిస్తున్నారు.
అప్పటి తెలంగాణ విమోచన సందర్భంలోని పరిస్థితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడుతున్నారు. సాయుధ పోరాటాన్ని తిరస్కరిస్తున్నారు. అందుకే ఛత్తీస్‌గఢ్‌లో, తెలంగాణలో ప్రజలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అటవీ ప్రాంతాల్లో వాగులు -వంకలు దాటి వచ్చి మరీ ఓటు వేసిన గిరిజనులున్నారు. ఈ పరిణామాల్ని మావోయిస్టులు పట్టించుకోకపోవడం విడ్డూరం.
1948లో తెలంగాణలో ఆగిపోయిన సాయుధ పోరాటాన్ని మావోయిస్టులమైన తాము కొనసాగిస్తున్నామని గొప్పలు పోవడం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. 70 ఏళ్ళ క్రితం ఆగిపోయిన పోరాటానికి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తామని ముందుకు రావడం, అవే పాత ఆలోచనలకు పదును పెడతామని ఆవేశపడటం విచిత్రం గాక ఏమవుతుంది? ఈ 70 ఏళ్ళలో ఎన్నో కొత్త తరాలొచ్చాయి. సామాజిక పరిస్థితులు సమూలంగా మారాయి. ప్రపంచం పూర్తిగా మారింది. ఈ కీలకమైన పరిణామాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ముతక ధోరణిలో ‘ఆగిన పోరాటా’న్ని సజీవంగా నిలుపుతామని అరణ్యాలలో ఆయుధాలతో సంచరిస్తే ‘‘అధికారం’’ హస్తగతం అవుతుందా? కాదు.. కానే కాదు అని స్పష్టాతి స్పష్టంగా చరిత్ర చాటిచెబుతున్నా, అనేక సందర్భాలలో ప్రజలు తమ మనోభావాలను ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రకటించినా పట్టించుకోకుండా వితండవాదనలతో పోరాటాలవైపే మొగ్గు చూపితే అది ప్రజాశ్రేయస్సు ఎలా అవుతుంది?
మన పొరుగున ఉన్న హిమాలయ దేశమైన నేపాల్‌లో అక్కడి మావోయిస్టులు భారతదేశ మావోయిస్టుల కన్నా తీక్షణంగా పోరాటాలు జరిపినా, తమ శక్తికి మించి ప్రయత్నం చేసినా ప్రపంచ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని గ్రహించి, వాస్తవాలను గుర్తించి సిద్ధాంతాల కన్నా ప్రజా సంక్షేమం కీలకమని, మారిన పరిస్థితుల కనుగుణంగా సిద్ధాంతాల్లో మార్పు చేసుకుని ముందుకు సాగాలన్న తత్వం బోధపడగా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఆలింగనం చేసుకుని అధికారంలోకి వచ్చారు. మన పొరుగున జరిగిన పరిణామాలను సైతం పట్టించుకోకుండా, ప్రపంచ మార్పుల్ని పసిగట్టకుండా ఏడెనిమిది దశాబ్దాల క్రితం నాటి విశే్లషణల దుమ్ము దులిపి కొత్త విశే్లషణలని భ్రమిసి అటుగా అడుగులు వేస్తే ప్రపంచం వారి పాదాకాంత్రమవదు. నాల్గవ పారిశ్రామిక విప్లవం ప్రపంచ మంతటా విస్తరిస్తున్న కాలంలో కృత్రిమ మేధకు ఎనలేని ఆదరణ కనిపిస్తున్న సందర్భంలో డిజిటల్ ఎకానమీ పెరుగుతూ ప్రజల్ని సూదంటురాయిలా ఆకర్షిస్తున్న వేళ ‘‘రెండు వర్గాల సిద్ధాంతం’’ అందరినీ ఇంకా ఆకర్షిస్తుందనుకోవడం వెర్రితనం తప్ప మరొకటి కాదు.
తెలంగాణలో గాని, ఛత్తీస్‌గఢ్‌లోగాని, బీజింగ్‌లో గాని, కాలిఫోర్నియాలోని సిలికాన్ సిటీలోగాని ప్రతిభ ఎవరికుంటే వారు అందలమెక్కుతున్నారు. నైపుణ్యం ఎవరి చెంత ఉంటే వారు దూసుకుపోతున్నారు. నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఉండి కృషి చేసేవారికి కోట్ల రూపాయలు కురుస్తున్నాయి. ఆ నైపుణ్యం,ప్రతిభ, ఆవిష్కరణల గుణం దళితుడికున్నాయా? గిరిజనుడికున్నాయా? బీసీకి ఉన్నాయా? అని పట్టించుకోకుండా ‘పట్టం’ కడుతున్నారు. ఈ అవకాశాన్ని అంది పుచ్చుకునేందుకు నేటి ప్రపంచ యువతరం పోటీ పడుతోంది. తమతమ శక్తి సామర్థ్యాల మేరకు పనిచేసి విజయం సాధించి తమదైన ముద్రను వేస్తున్నారు. మానవాళికి ఉపయోగపడుతున్నారు. ఈ ప్రక్రియకు అడ్డుకట్టవేసి కార్మిక-కర్షక నియంతృత్వ పాలన తీసుకొస్తామని మావోలు విధ్వంసం-హింసకు పాల్పడితే అదెలా ఆమోదయోగ్య మనిపించుకుంటుంది?
అసలు కార్మికుల-కర్షకుల ‘నిర్వచనం’ పూర్తిగా మారిపోయిందన్న స్పృహ లేకుండా, యంత్రాలు-రోబోలు కృత్రిమ మేధ ఆధారంగా వివిధ రంగాలలో పనిచేస్తూ చరిత్ర సృష్టిస్తూ దాన్ని తిరగతోడలేనంతగా ‘ఇర్రివర్సబుల్’ అన్న భావన అందరిలో కలిగిన వేళ కార్మిక - కర్షక శ్రేయోరాజ్యం అన్న పదబంధం తన పరిమళాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రాసంగికత లేకుండా పోయింది. వర్గాలు కాదు ప్రజలున్నారు. జ్ఞానముంది. విజ్ఞానం ఆధారంగా కొత్తదారులు ఏర్పడుతున్నాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులే నూతన ఆవిష్కరణలతో, ‘అప్లికేషన్స్’తో కాలంతో పోటీపడుతూ ప్రజాజీవనాన్ని సులభతరం-సరళతరం చేస్తున్నారు. పలువురి మన్ననలు అందుకుంటున్నారు. దీన్ని పూర్తిగా ‘నెగేట్’ చేస్తూ ఆయుధాలు పట్టి, మందుపాతరలు పేల్చి, శతాబ్దంన్నర క్రితపు సిద్ధాంతం బూజుదులిపి పారవశ్యంతో మూర్చనలు పోతూ మావోయిస్టులు బూటకపు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తే దాని ఫలితం ఎలా ఉందో తెలంగాణ అద్దంలో కనిపిస్తోంది. ఈ అద్దంలో మావోయిస్టులు ఇప్పటికైనా తమ రూపాన్ని నిశితంగా చూసుకుంటే, తమని తాము సరిద్దుకుంటే సాధారణ ప్రజల జీవితాలు పెరుగుపడతాయి. ప్రజల కొత్త తరాలు మరింత సాధికారతతో జీవించేందుకు అవకాశమేర్పడుతుంది. అందరు కోరుకునేది ఇదే కదా?

-వుప్పల నరసింహం 99857 81799